Pages

Friday, December 23, 2011

సోరియాటిక్ ఆర్థరైటిస్‌కు మేలైన చికిత్స

దీర్ఘకాలిక వ్యాధి అయిన సొరియాసిస్‌కు శాస్త్రీయ చికిత్స చేయించుకోకుంటే ఇది మరింత జటిలమై సొరియాటిక్ ఆర్థరైటిస్‌గా రూపాంతరం చెందుతుంది. మానసికంగా, శారీరకంగా రోగి జీవనశైలిని నియంత్రిస్తున్న సొరియాసిస్‌కు సొంత వైద్యం చేస్తే దుష్ఫలితాలు వస్తాయి. సొరియాటిక్ ఆర్థరైటిస్‌కు హోమియోలో మెరుగైన చికిత్స ఉందంటున్నారు సీనియర్ హోమియో వైద్యులు డాక్టర్ శ్రీకర్ మనూ.

సొరియాటిక్ ఆర్థరైటిస్ వ్యాధి బారిన పడిన వారి దైనందిన జీవితం దుర్భరంగా వుంటుంది. చర్మం ఎర్రబడటం, దురద, మంటతో పాటు చర్మం పొలుసులుగా రాలటం సొరియాసిస్ లక్షణాలు. ఈ లక్షణాలతోపాటు కీళ్లవాపు, నొప్పి, బిగుసుకుపోవటం వంటి లక్షణాలు తోడైనపుడు 'సొరియాటిక్ ఆర్థరైటిస్'గా గుర్తించవచ్చు. సొరియాసిస్ రోగుల్లో పదిశాతం మందిలో సొరియాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తాయి.

ఈ సమస్య స్త్రీ,పురుష భేదం లేకుండా వయసు పెరుగుతున్న కొద్దీ వస్తుంది. 40 నుంచి 50 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుందని అధ్యయనంలో తేలింది. 80 శాతం మంది సొరియాసిస్ వ్యాధి సోకిన తరువాత ఆర్థరైటిస్ సమస్యకు గురవుతున్నారు. 15 శాతం మందిలో ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత సొరియాసిస్ బారిన పడటం కనిపిస్తుంది.

కారణాలు

జన్యువులు, వాతావరణం, రోగనిరోధక వ్యవస్థ, మానసిక కారణాలు, వాడుతున్న మందుల దుష్ప్రభావం వంటి కారణాల వల్ల సొరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది. సొరియాటిక్ ఆర్థరైటిస్ సమస్య తో బాధపడుతున్న వారిలో 50 శాతం మందిలో హెచ్ఎల్ఎ-బి27 జీన్స్ ప్రభావం వల్ల ఈ సమస్య వస్తున్నదని తేలింది. రోగనిరోధక వ్యవస్థలోని హెల్పర్ టీ కణాల సంఖ్య తగ్గటం కూడా ఈ వ్యాధి రావటానికి ఒక కారణమని తాజా పరిశోధనలు చెపుతున్నాయి.

ముఖ్య లక్షణాలు

కీళ్ల నొప్పి, వాపు లేదా బిగుసుకు పోవటం ఈ వ్యాధి లక్షణం. కీళ్లపై ఉన్న చర్మం ఎర్ర బడటం, వేడిగా అనిపించటం, కీళ్లు ముఖ్యంగా చేతులు, కాళ్లు వంకర పోవటం వంటి మార్పులు వస్తాయి. చేతులు, కాలి గోర్లలో మార్పులు రావటం, వాపుతో నిర్మాణ మార్పులు వస్తాయి. కీళ్ల చుట్టూ ఉన్న నరాల్లో సొరియాటిక్ ఆర్థరైటిస్ ప్రభావం వల్ల కండరాలు, ఊపిరితిత్తులు, నడుములోని రక్తనాళాల్లో కూడా మార్పులు సంభవిస్తాయి.

దీనివల్ల ఛాతినొప్పి, గుండె సమస్యలు తలెత్తవచ్చు. శరీరాన్ని కాపాడే రోగ నిరోధక కణాలు శరీరంలోని ముఖ్య అవయములపైన దుష్ప్రభావం చూపటం వల్ల ఈ లక్షణాలు మొదలవుతాయి. కేసు హిస్టరీతో పాటు శారీరక పరీక్షలు, రక్తపరీక్షలు, ఎక్స్‌రే వంటివి చేయటం ద్వారా సొరియాటిక్ ఆర్థరైటిస్‌ను నిర్ధారించవచ్చు. ఇవే కాకుండా హెచ్ఎల్ఎ బి-27, సీటీ, ఎంఆర్ఐ వంటి పరీక్షలు కూడా కొన్నిసందర్భాల్లో చేయాల్సి రావచ్చు.

అపోహలు

సొరియాసిస్ లేదా సొరియాటిక్ ఆర్థరైటిస్ గాని అంటువ్యాధులు కావు. రోగితో సహజీవనం చేయటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగవు. పరిశుభ్రత లేని కారణంగా సొరియాసిస్ రావటం అనేది కేవలం అపోహ మాత్రమే. జన్యుపరంగా వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్, మానసిక ఆందోళన, చర్మానికి గాయం, హార్మోన్‌ల ప్రభావం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావం వంటి ప్రేరేపకాలు తోడైనపుడు ఈ వ్యాధి రావచ్చు. సొరియాటిక్ ఆర్థరైటిస్ కేవలం చర్మానికి, కీళ్లకు సంబంధించిన వ్యాధి కాదు.

సరైన చికిత్స చేయించుకోలేక పోయినపుడు ప్రాణాంతకంగా కూడా మారే దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి నిర్ధారణ అంత సులభం కాదు. ఒక్కో సారి మిగిలిన చర్మవ్యాధులు అంటే డర్మటైటీస్, గజ్జి లేదా ఎలర్జీ వంటి వాటితో తప్పుడు నిర్ధారణ చేస్తారు. సొరియాసిస్ లేదా ఆర్థరైటిస్‌కు చికిత్స లేదనటం కేవలం అపోహ మాత్రమే. మనిషి జన్యు నిర్మాణ వ్యవస్థను బలోపేతం చేసి, ఎలాంటి లోపాన్ని అయినా సరిచేయగలిగిన ఏకైక చికిత్సా విధానం హోమియోపతి. హోమియోపతి వైద్యం ద్వారా ఇలాంటి రుగ్మతల నుంచి సంపూర్ణ విముక్తి పొందే అవకాశముంది.

మేలైన హోమియో వైద్యం

ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చికిత్స చేయటం హోమియో వైద్యుల అదనపు బలం. సొరియాసిస్ చికిత్సలో హోమియో వైద్యుడు ఎలాంటి తైలాలు, పైపూతలు లేకుండా కేవలం మందులతో నయం చేయవచ్చు. మార్పులు మనిషి జన్యు నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం, శారీరక పరిశ్రమ చేయటం, పౌష్టికాహారం తీసుకోవటం లాంటివి చాలా ముఖ్యం.

హోమియో మందులు కీళ్లపై దాడి చేస్తున్న కణాలను నియంత్రించే జన్యువుల సంకేతాలను సరిచేయటం ద్వారా చికిత్సా విధానం ఆరంభమవుతుంది. తద్వారా శరీర అవయవాల్లో జరిగే జీవనక్రియల్లో సమతౌల్యం ఏర్పరచటం వల్ల వ్యాధిని సమూలంగా తగ్గించే వీలుంటుంది. ఈ చి కిత్సా విధానంలో వ్యాధి తిరగబెట్టే ప్రసక్తే వుండదు. దీనికోసం రోగి సహకారం అత్యంత ముఖ్యం.

సొరియాసిస్ లేదా సొరియాటిక్ ఆర్థరైటిస్ గాని అంటువ్యాధులు కావు. రోగితో సహజీవనం చేయటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగవు. పరిశుభ్రత లేని కారణంగా సొరియాసిస్ రావటం అనేది కేవలం అపోహ మాత్రమే.జన్యుపరంగా వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్, మానసిక ఆందోళన, చర్మానికి గాయం, హార్మోన్‌ల ప్రభావం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావం వంటి ప్రేరేపకాలు తోడైనపుడు ఈ వ్యాధి రావచ్చు.
- డాక్టర్ శ్రీకర్ మను
ఫౌండర్ ఆఫ్ డా.మనూస్
హోమియోపతి,
ఫోన్స్: 9032 108 108
9030339999

ఆత్మజ్ఞానం..క్రియాయోగం

ఆత్మజ్ఞానం..క్రియాయోగం

మనిషి ఆత్మజ్ఞాన సాధన కోసం చేసేదే క్రియాయోగం. పతంజలి మహ ర్షి తన యోగ శాస్త్రంలో చెప్పిన క్రియా యోగం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కర్మయోగం సంధానం చేసి క్రియాయోగంగా ప్రపంచానికి అందించారు శ్యామాచరణ లాహిరి. ఆయన శిష్యులలో అతి ముఖ్యులు, క్రియాయోగాన్ని విశ్వవ్యాపితం చేయడానికి కృషి చేస్తున్న డాక్టర్ అశోక్ కుమార్ చటర్జీ 79వ జన్మదినం నేడు. 
ఆ సందర్భంగా క్రియాయోగదర్శనం...
ప్రాణమే భగవంతుడని, దానినే ఈశ్వరుడు, విష్ణువు, శివుడు, అల్లా, జీసస్ ఇలా అనేక నామాలతో పిలవడం జరుగుతోందని తపస్సంపన్నులైన మన మహర్షులు, యోగులు చెబుతారు. అదే అనంత సృష్టిని ధరిస్తోంది. ఈ ప్రాణమే దేహంలో శ్వాస రూపంలో చంచలంగా ఉంది. దాన్ని స్థిరం చేసే విధానమే క్రియా యోగం. బయట శ్వాసని బయటే విడిచిపెట్టి దేహంలో ఉండే ప్రాణ, అపాన వాయువులతో చేసే అంతర్ముఖ ప్రాణాయామమే ఈ క్రియా యోగం. క్రియా యోగ సాధన వల్ల కేవలకుంభక స్థితిని పొందడం ద్వారా సమస్తమైన ప్రాపంచిక చంచలత్వం నశించి ప్రాణం, అంతర్ముఖం చెంది, స్థిర ప్రాణంగా అనగా కర్మాతీత, గుణాతీత, ఇచ్ఛారహిత నిర్గుణ పరబ్రహ్మని పొందడం జరుగుతుంది. ఇది ప్రాణ సాధన.

ఈశ్వరప్రాప్తికి మార్గం ఆత్మజ్ఞాన సంపన్నులైన మునులు, ఋషులు, యోగ పురుషులతో సనాతన భారతదేశం ఈ అనంత విశ్వంలో ధార్మిక జగత్తుకి రాజధానిగా నేటికీ విరాజిల్లుతోంది. సంసార బంధనాలలో చిక్కుకున్న బాధాతప్తహృదయులకు ఈశ్వరప్రాప్తి పొందే సహజమైన, సత్యమైన యోగసాధనను సంప్రాప్తింపచేయటానికి భగవానుడు 1828 సెప్టెంబర్ 30న యోగిరాజ శ్యామచరణ లాహిరి అవతారంలో జన్మించారు. బెంగాల్ నదియా జిల్లాలోని ఘుర్ని గ్రామంలో జన్మించిన లాహిరి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. తన మూడవ ఏటి నుంచే ధ్యానలోకంలోకి అడుగిడిన లాహిరి మెడ దాకా ఇసుక కప్పుకుని ధ్యానం చేసేవారు. ఆయన ఐదవ ఏట వరదలు వచ్చి పూర్వీకుల గృహం కొట్టుకుపోగా కుటుంబం వారణాసికి వలసవెళ్లింది. ఆయన జీవితకాలంలో ఎక్కువభాగం వారణాసిలోనే గడిపారు.

శ్యామాచరణులు వేదం, ఉపనిషత్తులు వంటి శాస్త్రాలతోపాటు ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేశారు. ఉదరపోషణార్థం బెంగాలీ, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషలు నేర్చుకొని మిలటరీ ఇంజనీరింగ్ వర్క్స్‌లో గుమాస్తాగా చేరారు. వేతనం సరిపడనంతగా లేకపోవడం వలన కుటుంబ ఖర్చుల కోసం ట్యూషన్లు కూడా చెప్పేవారు. ఐదుగురు సంతానం కలిగి, అన్నదమ్ముల గృహకలహాల నడుమ జీవిక సాగిస్తూ యోగులు, సాధువులు, మహాత్ముల తపోభూమిగా, దేవభూమిగా ప్రసిద్ధిగాంచిన హిమాలయాలలో తపస్సు సాగిస్తున్న శ్రీకృష్ణ భగవాన్ స్వరూపులైన బాబాజీ వద్ద క్రియాయోగ దీక్షను పొందారు శ్యామాచరణులు.

వారి ఆజ్ఞమేరకు గృహస్థు యోగ్యతతో గృహస్థాశ్రమంలోనే ఉంటూ కఠోర యోగ సాధన చేసి కొత్తకొత్త ఎత్తులను అనాయాసంగా దాటుతూ, సాధనలో ఉచ్ఛతమ స్థితిని పొంది, సరళము, నిరాడంబరమైన, అతి స్వల్ప సమయంలో ఫలమిచ్చే క్రియాయోగ సాధనని సంసారులకు ఇవ్వడం ఆరంభించారు. కాశీలో నడిచే విశ్వనాథునిగా పేరుగాంచిన శ్రీత్రైలింగస్వామి వారి ప్రేమను, ప్రశంసలు, ఆదరాభిమానాలను లాహిరి మహాశయులు పొందగలిగారు.

దైవంతో సంభాషణ కుల, మత, జాతి, పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, ఆత్మజ్ఞాన పిపాసులందరికీ క్రియాయోగ దీక్షని శ్యామాచరణులు అందచేశారు.'నీవు ఎవరికి చెందవు..అలాగే నీకూ ఎవరూ చెందరు. ఏదో ఒకరోజు హఠాత్తుగా ఈ లోకంలోని సమస్తాన్ని త్యజించవలసి వస్తుంది. ఇప్పటి నుంచే దైవంతో సాన్నిహిత్యాన్ని పొందు. క్రియోయోగం ద్వారా దైవంతో సంభాషించు. సత్యం నీకు గోచరిస్తుంది. ధ్యానం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకో. జీవితంలో నీకు ఎదురయ్యే అన్ని చిక్కు ప్రశ్నలకు ధ్యానంలో సమాధానాలు లభిస్తాయి' అని శ్యామాచరణులు తన శిష్యులకు ఉద్బోధించేవారు.

షిరిడీ సాయినాథుడు కూడా లాహిరి మహాశయుల వద్ద క్రియా యోగ దీక్షను పొందినట్లుగా లాహిరి వారి రహస్య డైరీల ద్వారా తెలియవచ్చింది. 1895 సెప్టెంబర్ 26న తాను ఇక ఈ లోకాన్ని విడిచే సమయం ఆసన్నమైందని లాహిరి మహాశయులు తన శిష్యులు కొందరికి తెలియచేశారు. 'నేను నా స్వగృహానికి వెళుతున్నాను. నా గురించి చింతించకండి. నేను తిరిగి జన్మిస్తాను' అని చెప్పి మహాసమాధిలోకి ప్రవేశించారు శ్యామాచరణులు. హరిద్వార్‌లోని కేశవ ఆశ్రమంలో లాహిరి మహాశయులవారి సమాధిని దర్శించవచ్చు.

ఒకే పృథ్వి-ఒకే ధర్మం క్రియా యోగాన్ని పునఃస్థాపించిన శ్యామాచరణ లాహిరి శిష్యులలో ముఖ్యులు డాక్టర్ అశోక్‌కుమార్ చటర్జీ. లాహిరి మనుమడు స్వర్గీయ సత్యాచరణ లాహిరి వద్ద క్రియాయోగంలోని ఉత్తమ దశలన్నీ పొంది, అతి స్వల్ప కాలంలో మహోన్నత స్థితిని పొంది, ప్రపంచ క్రియా యోగాచార్యులుగా ఖ్యాతి గడించారు ఆయన. 1997 ఏప్రిల్ 27న ఫ్రాన్స్ దేశంలోని హ్యూగన్ పట్టణంలో టిబెట్ ఆధ్మాత్మిక గురువు దలైలామా ఆధ్వర్యంలో జరిగిన విశ్వధర్మ సమ్మేళనంలో మన దేశం నుంచి సనాతన ధర్మపు ఏకైక ప్రతినిధిగా చటర్జీ ఒక్కరికే ఆహ్వానం దక్కడం ఆయన కీర్తికి నిదర్శనం. ఆ సమ్మేళనానికి హాజరైన చటర్జీ 'రండి..అందరం కలిసి ఈ బహు ధర్మాల అస్థిత్వాన్ని మరచి, విభేదాలను విడనాడి ఒకే భగవంతుడు, ఒకే పృథ్వి, ఒకే ధర్మం, ఒకే మనిషి అనే సత్యాన్ని స్వీకరిద్దాం' అంటూ ఉత్తేజభరితంగా చేసిన ప్రసంగానికి అన్ని దేశాల మత ప్రతినిధులతోపాటు దలైలామా నుంచి కూడా ప్రశంసలు లభించాయి.

క్రియా యోగ రాజధాని నేడు కొందరు గురువులుగా చలామణి అవుతూ లాహిరి మహాశయులు అందించిన క్రియాయోగాన్ని రకరకాలుగా మార్పు చేసి, ఆ మహనీయుని పేరును దుర్వినియోగపరుస్తున్నారు. ఈ పరిస్థితులలో లాహిరి మహాశయులు అందించిన క్రియాయోగాన్ని యథాతధంగా అందించడానికి చటర్జీ దీక్షాబద్ధులై నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ చటర్జీ కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలో గల కాకద్వీపంలో విశ్వానికంతటికీ క్రియా యోగ రాజధానిని నిర్మించారు. అలాగే ప్రధాన కేంద్రంగా లాహిరి మహాశయుల మందిరాన్ని నిర్మించి యోగిరాజ శ్యామచరణ సనాతన మిషన్‌ను స్థాపించారు. కుల, మత, దేశ తారతమ్యం లేకుండా ఆత్మ పిపాసులందరికీ క్రియాయోగ దీక్షను ప్రదానం చేస్తున్నారు డాక్టర్ చటర్జీ.

Monday, December 12, 2011

మానసిక వికాసానికి యోగా

dheera2 
ఆరోగ్య సంరక్షణకు సూక్ష్మ క్రియలు అధికంగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని మాలిన్యాన్ని తొలగించి, ఆయా అవయవాలకు వ్యాయామం కలుగజేసి, వాటి సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ సూక్ష్మ యోగ క్రియలను క్రింద కూర్చుని చేయాల్సి ఉంటుంది. క్రింద కూర్చోలేని వారు కుర్చీ మీద గాని లేక మంచం మీదగాని కూర్చొని చేయవచ్చు. కూర్చోలేకపోతే పడుకుని కూడా చేయవచ్చు. ఈ క్రియలు ఉదరం మీద ప్రభావాన్ని చూపుతాయి. కనుక భోజనం చేసిన తర్వాత వెంటనే చేయకూడదు. సూక్ష్మయోగ క్రియా ఏ అవయవానికి సంబంధించిందో ఆ అవయవం మీద మనస్సును కేంద్రీకరించడం అవసరం. ప్రతి క్రియ 30 నుంచి 60 సెకన్లు వరకు శక్తిని బట్టి చేయాల్సి ఉంటుంది.

యోగ ప్రార్థన క్రియ...
కూర్చొని రెండు చేతులు జోడించి, నమస్కారం చేస్తూ యోగ ప్రార్థన చేయాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు శ్వాస వదలాలి.
ప్రార్థన క్రియ వలన మనస్సుకు చంచలత్వం పోయి, స్థిరత్వం వస్తుంది. మనస్సులో ఏకాగ్రత కుదురుతుంది. హృదయ శుద్ధి కలుగుతుంది.

భస్ర్తిక క్రియ...
భస్ర్తిక క్రియలు నాలుగు రకాలు. ఇవి శ్వాస, ప్రశ్వాసల ద్వారా శరీర అవయవాలకు శుద్ధి కలిగించే క్రియలు. రెండు ముక్కుల ద్వారా వేగంగా శ్వాస వదలాలి, పీల్చాలి. ఇది భస్త్రిక క్రియ. కుడి ముక్కు రంధ్రం మూసి, ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని త్వర త్వరగా వదలాలి, పీల్చాలి.ఇది చంద్రాంగ భస్ర్తిక. ఎడమ ముక్కు రంధ్రం మూసి, కుడి ముక్కురంధ్రం ద్వారా గాలిని వేగంగా వదలాలి, పీల్చాలి. ఇది సూర్యాంగ భస్ర్తిక. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని వేగంగా వదలాలి, పీల్చాలి. వెంటనే కుడి ముక్కు రంధ్రం ద్వారా వేగంగా వదలాలి, పీల్చాలి. ఇది సుషుమ్నా భస్ర్తిక. పై క్రియల వల్ల శరీరంలోని మాలిన్యం పోతుంది. వివిధ అవయవాలకు శుద్ధి కలిగి, వాటికి చైతన్యం కలుగుతుంది.

శిరస్సుకు...
ప్రతి క్రియ 30 సెకన్‌లతో ప్రారంభించి, 60 సెకన్ల వరకు చేయాల్సి ఉంటుంది. ఈ క్రియలు చేస్తున్నప్పుడు గాలిని కంఠం దాటి, లోనికి పోనీయకూడదు. ఇందులో పలు క్రియలున్నాయి.

ఎ. కంఠశుద్ధి: కంఠశుద్ధి కోసం శిరస్సును తిన్నగా ఉంచి, ఎదురుగా చూస్తూ, శ్వాసను వేగంగా వదలాలి, పీల్చాలి.
బి. ఆత్మశుద్ధి వృద్ధి: ఆత్మశక్తిని పెంచేందుకు, భయం పోయేదానికి, శిరస్సును ఎత్తి, శిరస్సు వెనకుక వైపున గల శిఖాభాగం మీద మనస్సును కేంద్రీకరించి, వేగంగా శ్వాస పీల్చాలి, వదలాలి.
సి. జ్ఞాపక శక్తి వికాసం: జ్ఞాపకం లేదా స్మరణ శక్తిని పెంచేందుకు శిరస్సును సగం వంచి, వేగంగా శ్వాస వదలాలి. మనస్సును మాడు మీద కేంద్రీకరించాలి.
డి. మేధాశక్తి వికాసం: వెన్నెముకపై, మెడ కింద, భృకుటిపై మేధాశక్తిని పెంచడానికి శిరస్సును పూర్తిగా వంచి, కళ్లు మూసుకుని వేగంగా శ్వాస వదలాలి, పీల్చాలి.

టెన్షన్‌ తగ్గించే క్రియలు...
టెన్షన్‌ తగ్గాలంటే, కనుబొమలు పైకెత్తి, నుదురుపై ముడుతలు పడేట్లు చేసి, ఐదు సెకన్లు అలాగే ఉండాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి. శ్వాస సాధారణంగా ఉండాలి.

నేత్రశక్తి క్రియలు...
ఇవి మూడు రకాలు. అవి: 1. నేత్ర శాంతి కోసం చేసే క్రియలు, 2. నేత్ర శక్తి కోసం చేసే క్రియలు, 3. నేత్ర చంచలత్వాన్ని తగ్గించేందుకు చేసే క్రియలు. ఈ క్రియల్లో తలను కదపకూడదు. కళ్లను మాత్రమే తిప్పాలి. మనస్సును ఏకాగ్రత చేయడం అవసరం.

కళ్లకు శాంతిని కలిగించే క్రియలు...
ఇవి కనుగుడ్లను వేగంగా తిప్పే క్రియలు. రెండు చేతులు తిన్నగా ముం దుకు చాచి, పిడికిలి బిగించి, బొటనవేళ్లను నిలిపి రెండు ళ్లతో ఎడమ బొటనవేలిని, కుడి బొటనవేలిని వేగంగా చూడాలి. తర్వాత కుడి చేయి కుడివైపు ఉంచి, ఎడమ చేతిని, ఎడమవైపు కిందికి దింపి, పైబొటన వేలిని, కింది బొటన వేలిని వేగంగా చూడాలి. తర్వాత ఎడమ చేయి పైకి ఎడమవైపు ఉంచి, కుడి చేయి కిందికి కుడివైపుకు దింపి, రెండు బొటన వేళ్లను పైకి, కిందకు వేగంగా చూడాలి. తర్వాత ఒక బొటన వేలిని పైకి, మరో బొటన వేలిని కిందికి ఉంచి, వేగంగా చూడాలి. తర్వాత ఒక బొటన వేలిని భ్రుకుటికి ఎదురుగా ముక్కుకొసకు దగ్గరగా ఉంచి, మరో బొటనవేలిని ముందుకు చాచి, రెండింటిని ఒక దాని తర్వాత మరొక దాన్ని త్వరత్వరగా చూడాలి.

అనంతరం కుడిచేతిని తిన్నగా పక్కకు చాచి, బొటనవేలిని చూస్తూ, చేతిని గుం డ్రంగా పెద్ద సర్కిల్‌లో వేగంగా తిప్పాలి. మోచేతిని వంచకూడదు. ఎడమచేతిని కూడా తిన్నగా పక్కకు చాచి పైవిధంగా చేయాలి. రెండు రెప్పలను వేగంగా మూయాలి, తెరవాలి. పై క్రియలు పూర్తయిన వెంటనే రెండు అరచేతులు కలిపి బాగా రుద్దాలి. కొద్దిసేపుటికి వేడి కలుగుతుంది. రెండు కళ్లమీద రెండు అరచేతులను ఉంచాలి.