Pages

Saturday, May 19, 2012

గ్యాస్ట్రో ఎంటరాలజీలో చెయ్యి తిరిగిన ‘చల్లనయ్య’ - పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి


పెద్దవాళ్లు ఏమని దీవిస్తారు? నిండు నూరేళ్లు చల్లగా ఉండమనేగా!
డాక్టర్ నాగేశ్వరరెడ్డి వైద్యం కూడా పెద్దల దీవెనలాగే పని చేస్తుంది.
ఉదర బాధలు లేకుండా చేసి, జీవితాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది.
గ్యాస్ట్రో ఎంటరాలజీలో చెయ్యి తిరిగిన ఈ ‘చల్లనయ్య’ దగ్గరికి
‘కడుపు చేతపట్టుకుని’ మెలితిరిగిపోతూ రోజూ వందల మంది వస్తుంటారు.
ఒకసారి వచ్చి వెళ్లండని ఫారిన్ డాక్టర్‌ల నుండి
ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటాయి!


‘‘మా బాబే’’ అని పెద్దలు అందించే దీవెనలకు...
‘‘బతికించారు సార్’’ అని పెట్టే దండాలకైతే లెక్కే లేదు.
క్షణం తీరిక లేకుండా...
సెలబ్రిటీలకు, సామాన్యులకు
సమానంగా అందుబాటులో ఉంటూ...
ఇరవయ్యేళ్లకు పైగా భారతీయ వైద్యరంగానికి ఖ్యాతిని, ప్రఖ్యాతిని
ఆర్జించి పెడుతున్న ఈ డాక్టర్‌గారిలో ఇంత సంకల్పబలం ఎక్కడిది?


కర్తవ్యపు ఉరుకులు పరుగుల వేడిలో
ఈయన్ని చల్లగా ఉంచుతున్నదెవరు?


వైద్యో నారాయణో హరి అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం... వైద్యుడన్న మాటకు అసలు సిసలు నిర్వచనం అయిన పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి  

ఇన్నర్‌వ్యూ ఇది.

హాస్టల్ జీవితాన్ని చాలామంది ఇష్టపడరు. హాస్టల్‌ని జైలులా ఫీలవుతారు. కానీ హాస్టల్‌కి వెళ్లడం వల్లే నా జీవితం మలుపు తిరిగింది. అసలు ఇంట్లో అమ్మానాన్నల దగ్గర ఉండి చదువుకోవాల్సిన నేను, హాస్టల్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దాని వెనుక ఓ కథ ఉంది. ఆ కథలో హీరోని నేనే.


మాది చిత్తూరు జిల్లా, వీరనత్తోడ్. నాన్న దువ్వూరి భాస్కర్‌రెడ్డి పాథాలజీ ప్రొఫెసర్. తన వృత్తి కారణగా ఆయన పలుచోట్ల పని చేయడంతో నాకు మా సొంత ఊరితో పెద్దగా అనుబంధం లేదు.

నాన్న ఎక్కడ పనిచేస్తే, అదే మా ఊరు అన్నట్టుగా ఉండేది. నేను పెద్ద తెలివైనవాణ్నేం కాదు. మూడో తరగతి ఫెయిలయ్యాను కూడా. అల్లరిలో మాత్రం నేను నంబర్‌వన్!


చిన్నప్పుడు వైజాగ్‌లో ఉండేవాళ్లం. ఇద్దరు తమ్ముళ్లతో కలిసి చాలా అల్లరి చేసేవాణ్ని. ఏం చేయాలన్నా ఐడియా నాదే. పాపం వాళ్లు నన్ను ఫాలో అయ్యేవారంతే. ఓసారి మా తమ్ముణ్ని ఫ్రిజ్‌లో పెట్టేశాను. ఉక్కగా ఉందన్నాడు మరి! ఇంకోసారి మా వీధిలోకి గడ్డిబండి వచ్చింది. అది వీధి దాటేలోపు మొత్తం గడ్డంతా లాగి పారేశాం. పాపం, ఆయన మా అమ్మ (శారద) దగ్గరికి వచ్చి వాపోయాడు. మరోసారి ఇంటిముందున్న కారు గేర్లు మార్చి వదిలేశాను.


మా ఇల్లు ఎత్తుమీద ఉండేది. దాంతో కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. పెట్రోలు మండుతుందో లేదో చూడాలనిపించిందోసారి. సరే చూద్దామని షెడ్డులో పోసి అంటించా. పెద్ద పెద్ద మంటలు! నాన్నకు మామూలుగా కోపం రాలేదు. ఇక నిన్ను భరించలేను, ఆటో మెకానిక్ షెడ్డు పెట్టిస్తాను, రిపేర్లు చేసుకోమన్నారు. అయినా ఆ రేంజ్‌లో అల్లరి చేస్తే ఎవరు మాత్రం భరించగలరు!

అందుకే ఇక లాభం లేదని తీసుకొచ్చి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించేశారు. హాస్టల్ జీవితం ప్రారంభం! అయితే ఈనాటి ఈ జీవితానికి నాంది అక్కడే పడిందని చెప్పొచ్చు. అక్కడి ఉపాధ్యాయుల ప్రభావంతో నా ఆలోచనాధోరణి మారింది. చదువు ప్రాధాన్యత తెలిసి వచ్చింది. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోడానికి అవసరమైన అసలైన చదువు అప్పుడే మొదలయ్యింది.


ఐదేళ్లూ నేనే ఫస్ట్!


విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాను. ఆ సంవత్సరమే మెడిసిన్‌కి ప్రవేశ పరీక్ష పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేనా పరీక్ష రాసి పాసై, కర్నూలు మెడికల్ కాలేజీలో చేరాను. ఆ కాలేజీకి నాన్నే ప్రిన్సిపల్. మహా స్ట్రిక్టుగా ఉండేవారు.

మా కాలేజీలో చాలా చక్కని వాతావరణం ఉండేది. ఇంకా చెప్పాలంటే, అదో పల్లెటూరులా ఉండేది. ఎలాంటి భేదాలు, భేషజాలు ఉండేవి కాదు. ప్రొఫెసర్లలో చాలామంది సైకిల్‌మీదే కాలేజీకి వచ్చేవారు. దాంతో డాక్టర్ అంటే కారులో తిరగాలన్న ఆలోచనే మాకు కలిగేది కాదు. మెడికల్ కాలేజే అయినా రకరకాల ఆటల్లో కూడా ప్రోత్సహించేవారు. నాకు క్రీడల పట్ల ఆసక్తి చాలా ఎక్కువ. క్రికెట్, టెన్నిస్ టీములకి నేనే కెప్టెన్‌ని.


అలాగని చదువు పట్ల నిర్లక్ష్యం ఎప్పుడూ లేదు. ఐదేళ్లూ కాలేజ్ ఫస్ట్ వచ్చాను. అలాంటి అరుదైన, అందమైన వాతావరణంలో ఎంబీబీయస్ పూర్తయ్యింది. తర్వాత మద్రాస్ యూనివర్శిటీలో జనరల్ మెడిసిన్‌లో ఎండీ చేశాను. ఆ తర్వాత గ్యాస్ట్రో ఎంటరాలజీలో డీఎమ్ కోర్సు కోసం ఛండీగడ్‌లోని పీజీఐఎమ్‌ఈఆర్ యూనివర్సిటీలో చేరాను. నిజానికి అప్పట్లో కార్డియాలజీ కోర్సులంటే క్రేజ్!


కానీ నాకు ఎప్పుడూ ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనుండేది. అరుదైన అంశాలవైపే మనసు మొగ్గు చూపేది. అప్పుడే కొత్తగా ఎండోస్కోపీ టెక్నాలజీ రావడంతో గ్యాస్ట్రో ఎంటరాలజీలో నైపుణ్యం సాధించాలని డిసైడైపోయాను. అక్కడ ఆ బ్రాంచ్‌లో ఒకే ఒక్క సీటు ఉంది. అదృష్టం... ఆ ఒక్క సీటూ నాకే వచ్చింది.


అక్కడ రెండేళ్ల కోర్సు పూర్తయ్యాక హైదరాబాద్ నిమ్స్‌లో చేరాను. తర్వాత రెండేళ్లు గాంధీ మెడికల్ కాలేజీలో కూడా చేశాను. మళ్లీ నిమ్స్‌లో చేరాను. అక్కడ్నుంచి వచ్చేసి మెడినోవాలో చేరాను. కాస్త నిలదొక్కుకునేటప్పటికి విదేశీ యూనివర్సిటీల నుంచి అవకాశాలు రావడం మొదలయ్యింది. హార్వర్డ్ మెడికల్ కాలేజీ వారు కోటి రూపాయల జీతంతో జాబ్ ఆఫర్ చేశారు. కానీ నేను అంగీకరించలేదు. నా సేవలు మన దేశానికే అందాలన్నది నా కోరిక.


అప్పటికి మనదేశంలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో శిక్షణ పొందినవారుగానీ నైపుణ్యం ఉన్నవాళ్లు గానీ పెద్దగా లేరు. నా అవసరం ఇక్కడ ఎంతైనా ఉందనిపించింది. నేనిలా ఆలోచించడానికి కారణం ఓ రకంగా నాన్నే! ఆయన ఎప్పుడూ పేదల గురించి ఆలోచించేవారు. వారికి సేవలందించడమే లక్ష్యంగా భావించేవారు. ఆయన ప్రభావం నామీద చాలా ఉంది. ఆయనిచ్చిన ఆ స్ఫూర్తి విదేశాల్లో స్థిరపడాలన్న ఆలోచనను నాకు రానివ్వలేదు.


ధనికుల వైద్యుణ్ని కాను!


నేను ‘ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ’ పెట్టినప్పుడు చాలామంది అన్నారు- ‘ఎందుకీ ఆస్పత్రి పెట్టడం, దీనికి పెద్ద ప్రాముఖ్యత లేదు, రోగులు అంతగా రారు’ అని. అది నిజం కాదు. మన దేశంలో 1/3 వంతు మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి మంచి వైద్యం అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఆస్పత్రి పెట్టాను.

చాలామంది అనుకుంటారు మా హాస్పిటల్లో వైద్యం ఖరీదైనదని, సామాన్యుడికి అందుబాటులో ఉండదని! అది అపోహ మాత్రమే. ఇక్కడ వైద్యం ఖరీదైనదే. కానీ అది డబ్బున్నవాళ్లకి మాత్రమే అందడం లేదు. మా ఆస్పత్రిలో ధనవంతులకు ఎన్ని బెడ్స్ ఉన్నాయో, పేదవాళ్లకీ అన్నే ఉన్నాయి. ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుని వైద్యం చేస్తున్నానో, అంతమందికి ఉచితంగా కూడా చేస్తున్నాను. ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్లో కంటే మా దగ్గర ఎక్కుమంది పేద రోగులు ఉంటారంటే ఎవరూ నమ్మరు.


మా హాస్పిటల్లో ముప్ఫై శాతం చారిటీకే కేటాయించామని కూడా చాలామందికి తెలియదు. నిజానికి నాకింకా ఎక్కువే చేయాలనుంది. కానీ సంస్థ తరఫున అంతకంటే చేయడం కష్టం. జీతాలు ఇవ్వాలి, హాస్పిటల్ మెయింటెయిన్ చేయాలి, ఇంకా చాలా ఖర్చులుంటాయి కదా! అందుకే పూర్తిగా ఫ్రీగా చేయలేని పరిస్థితి. డబ్బు తీసుకుని వైద్యం చేయడం డాక్టర్‌గా నాకు బాధగానే ఉంటుంది. కానీ తప్పదు. ప్రభుత్వ సహాయం అందితే అది సాధ్యపడొచ్చు. ముఖ్యంగా రోగులకు ఇన్సూరెన్స్ ఇచ్చే పద్ధతిని ప్రభుత్వం ప్రారంభిస్తే, మరింతమందికి లబ్దిని చేకూర్చగలం!


అంతేకాదు, మన దేశంలో చాలామంది అల్సర్లు, నులిపురుగుల సమస్యలతో సతమత మవుతున్నారు. దానికి కారణం శుభ్రమైన నీరు, ఆహారం, పరిసరాలు లేకపోవడం!

అందుకే వాటిమీద అవగాహన కల్పించడానికే ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్‌ను స్థాపించాం.

మారుమూల గ్రామాలకు వెళ్లి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నాం. ఇంతవరకూ కోటిమందిని చేరగలిగాం. ఆంధ్రప్రదేశ్ అంతటా సేవలు అందించడానికి మరో పదేళ్లు పట్టొచ్చు. భువనగిరి (నల్లగొండ జిల్లా) దగ్గర్లో యాభై వేల జనాభా ఉన్న ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. దాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన పల్లెగా తీర్చి దిద్దాలనుకుంటున్నాం. ఇలా నా వరకూ నేను చేయగలిగినంత సేవ చేస్తున్నా!


వాళ్లలో నచ్చేది అదే!


ఓసారి హఠాత్తుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ నుంచి పిలుపు వచ్చింది... ఆయన భార్యకి సీరియస్‌గా ఉందని, చికిత్స చేయాలని! అక్కడి డాక్టర్లు లాభం లేదనడంతో చివరగా నన్ను సంప్రదించారు. నేను హైదరాబాద్ తీసుకు రమ్మన్నాను. కానీ ఆవిడ వచ్చే స్థితిలో లేరు. నేను అప్పటికప్పుడు వెళ్లలేను. దాంతో ఆయనే ఓ ప్రైవేట్ ఫ్లయిట్ పంపించారు.

అది చాలా మంచిదయ్యింది. ఎందుకంటే ఇంకాస్త లేటయినా ఆవిడ చనిపోయుండేవారు. చికిత్స తర్వాత చాలా త్వరగా కోలుకున్నారావిడ. దాంతో కృష్ణ చాలా ఆశ్చర్యపోయారు. తమ రాష్ట్రంలో ఆస్పత్రి పెట్టి సేవలు అందించమని కోరారు. కానీ నాకది ఇష్టం లేదు. మొదటి ప్రాధాన్యత నా రాష్ట్రానికే అని చెప్పాను. అర్థం చేసుకున్నారు. ‘మా ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ’ పెట్టినప్పుడు చాలా సహాయం చేశారు.


అంతకుముందు అమితాబ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. వెంటనే వచ్చి తన తండ్రిని చూడాలంటూ ఆయన ఐదారుసార్లు ఫోన్ చేశారు. ఎంతో బిజీగా ఉండటం వల్ల వెళ్లలేకపోయాను కానీ అన్నిసార్లు కాంటాక్ట్ చేయడంతో కాదనలేక వెళ్లాను. అసలు మొదట ఆయన డాక్టర్ కోసం అమెరికాకి ఫోన్ చేశారట. వాళ్లేమో మంచి డాక్టర్‌ని మీ దగ్గర పెట్టుకుని మాకు ఫోన్ చేశారేంటని అన్నారట. వాళ్ల ద్వారా నా గురించి తెలుసుకుని నాకు ఫోన్ చేశారాయన. ఆ సంఘటన తర్వాత ఆయన నాకు మంచి స్నేహితుడయ్యారు.


ఎం.ఎఫ్.హుస్సేన్ కూడా నా దగ్గర చికిత్స తీసుకున్నారు. ప్రతిగా ఆయన అభిమానంతో ఇచ్చిన పెద్ద పెయింటింగ్ నాకెంతో అపురూపం! ఆయన నన్నోసారి ముంబై పిలిచారు. నేను పెట్టబోయే కొత్త ఆస్పత్రి గోడల నిండా చిత్రాలు గీస్తానని చెప్పారు. దురదృష్టం! అలా జరగకముందే చనిపోయారు.


వీళ్లంతా గొప్పవాళ్లు. పేరు, డబ్బు, పరపతి ఉన్నవాళ్లు. అయినా తగ్గి ఉంటారు. గౌరవంగా ప్రవర్తిస్తారు. అభిమానంగా మాట్లాడతారు. ఎదిగేకొద్దీ ఒదగడమంటే ఏంటో వాళ్లను చూస్తే తెలుస్తుంది! నేనూ అలానే ఉండటానికి ప్రయత్నిస్తాను.


నా వరకూ నేను డాక్టర్‌కి మూడు లక్షణాలు తప్పకుండా ఉండాలని అను కుంటాను. హార్డ్‌వర్క్ (కష్టపడే తత్వం), హానెస్టీ (నిజాయితీ), హ్యుమిలిటీ (వినమ్రత). డాక్టర్ ప్రతిక్షణం వృత్తికి న్యాయం చేయడానికి కష్టపడాలి. చేసే పనిని నిజాయితీగా చేయాలి. అంతేకాదు, రోగుల విషయంలో వినమ్రతతో ఉండాలి. నేను డాక్టర్‌ని, నువ్వు రోగివి అన్నట్టుగా గర్వంగా ప్రవర్తించడం తగదు. ఈ మూడింటినీ నేనెప్పుడూ మిస్ కాను.


వీకెండ్ ఫాదర్‌ని!


డాక్టర్‌గా తెల్లకోటు వేసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకూ వైద్యం తప్ప మరో ప్రపంచమే లేకుండా బతుకుతున్నాను. ఈ ప్రపంచంలో ఏదైనా నాకు నా వృత్తి తర్వాతే. చివరికి నా కుటుంబం కూడా. నేను ఇంట్లో గడిపేది ఐదు గంటలు. రోజులో నిద్రపోయేది కేవలం నాలుగు గంటలు. మిగిలిన సమయమంతా రోగుల కోసమే. నా భార్య కూడా డాక్టరే కాబట్టి అర్థం చేసుకుంటుంది. నా కూతురు సంజన కూడా ఏనాడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు.

నేను ఇల్లు వదిలే సమయానికి తను లేచేది కాదు. నేను ఇంటికి వెళ్లేసరికి తను నిద్రపోయేది. వారాంతంలో మాత్రమే నన్ను చూసేది. దాంతో తనెప్పుడూ నన్ను ‘వీకెండ్ ఫాదర్’ అంటుండేది. నా బిజీ షెడ్యూల్స్ చూసి విసిగిపోయే తాను మెడిసిన్ చదవకూడదనుకుంది. ఇంజినీరింగ్ చేసింది. మరో ఇంజినీర్‌ని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడిపోయింది.


నాకు సెలవుల్లేవు. వీకెండ్స్ లేవు. పార్టీలు లేవు, సరదాలు లేవు. ముప్ఫయ్యేళ్లుగా ఒక్క సినిమా కూడా చూడ లేదు. అయినా కుటుంబాన్ని మిస్ అవు తున్నాననో, వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానో ఎప్పుడూ బాధపడలేదు. ఓ మంచి డాక్టర్‌ని అయినందుకు ఆనందపడుతున్నాను.


అది నా కల!


ఏదైనా పెద్ద జబ్బు చేయగానే విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలను కుంటారు చాలామంది. అక్కడైతేనే వైద్యం బాగుంటుందనుకుంటారు. కానీ అది కేవలం అపోహ. ఇక్కడ కూడా మనకు మంచి టెక్నాలజీ ఉంది. ప్రజ్ఞావంతులైన డాక్టర్లున్నారు. డాక్టర్ ఎక్కడైనా ఒక్కటే.

విధానాలు వేరుగా ఉంటాయి... అంతే! మన దేశంలో ఒక్క ఫోన్ చేస్తే పిజ్జా వచ్చేస్తుంది. కానీ అంబులెన్స్ మాత్రం రాదు. అదే విదేశాల్లో అయితే అంబులెన్స్ పిజ్జా కంటే ముందు వస్తుంది. ఇలాంటి కొన్ని తేడాలు తప్ప మన వైద్య విధానం విదేశీ వైద్యవిధానానికి ఏమాత్రం తీసిపోదు.

మా ఇన్‌స్టిట్యూట్‌నే తీసుకుంటే, విదేశాల నుంచి వచ్చిన ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అంటే మన దగ్గర విజ్ఞానం ఉందనే కదా! పదుల సంఖ్యలో డాక్టర్లు మా ఇన్‌స్టిట్యూట్‌లో నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు.

మాది టీమ్ వర్క్. అందరం కలసి కొత్త విధానాల కోసం శ్రమిస్తూ ఉంటారు. ఇటీవలే చర్మకణం నుంచి లివర్‌ని డెవలప్ చేసే విధానాన్ని కనుగొన్నాం. ఒకట్రెండు సంవత్సరాల్లో అది అందుబాటులోకి వస్తుంది. ఇంకా మరికొన్ని అంశాలపైనా ప్రయోగాలు చేస్తున్నాం. మరికొన్నేళ్లలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో మన దేశం మరింత అభివృద్ధి సాధించాలి. అది నా కల. దాన్ని నిజం చేయడానికి నా టీమ్ సహకారంతో అనుక్షణం శ్రమిస్తున్నాను.


పెద్దవాళ్లు ఒప్పుకోలేదు!


మద్రాస్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు క్యారల్ ఆన్‌తో పరిచయమయ్యింది. తను అప్పుడు డెర్మటాలజీలో పీజీ చేస్తోంది. ఎందుకో చెప్పలేను కానీ, తను నాకు చాలా నచ్చింది. తనకీ నేను నచ్చాను. తను పుట్టిందీ పెరిగిందీ మద్రాసులోనే. పైగా క్రిస్టియన్. మతాలు, సంప్రదాయాలు వేరుకావడంతో ఇరుపక్షాల పెద్దలూ ఒప్పుకోలేదు. మా ఇద్దరికీ మత విశ్వాసాలు లేవుకానీ పెద్దలను నొప్పించడం ఇష్టం లేక వాళ్లు ఒప్పుకునేవరకూ ఎదురుచూశాం. అందరూ ఓకే అన్నాకే ఒక్కటయ్యాం!
..............
మర్చిపోలేని అనుభవమది!


ఓసారి కర్నూలులో మెడికల్ క్యాంప్ జరుగుతోంది. ఆ విషయం తెలిసిన వైఎస్సార్ వెంటనే అక్కడికి వచ్చారు. అప్పటికి మేం అల్సర్ ఉన్న ఓ రోగికి ఎండోస్కోపీ సర్జరీ చేస్తున్నాం. ఆ పేషెంట్‌ని చూసి వైఎస్సార్- ‘నువ్వు రామిరెడ్డి’ కదా అన్నారు. అతను పులివెందులలో ఉండేవాడట. చాలాకాలం క్రితమే కర్నూలు వచ్చి స్థిరపడ్డాడట.

అయినా కూడా ఆయన గుర్తుపట్టి పలకరించడం చూసి ఆశ్చర్యపోయాను. అంతేకాదు, నేను ఎండోస్కోపీ మొదలుపెడుతుండగానే ఆయన- ‘అతనికి క్యాన్సర్ ఉన్నట్టుంది చూడండి’ అన్నారు. బయాప్సీ చేస్తే నిజంగానే క్యాన్సరని తేలింది. నేనెప్పటికీ మర్చిపోలేని అనుభవమది.


-సమీర నేలపూడి

ఫొటోలు: జి.అమర్

Friday, May 18, 2012

Thyroid Gland Problems ( థైరోయిడ్ సమస్యలు ).



ధైరాయిడ్‌ తీరుతెన్నులు : మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతితప్పడం వలన హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి గల స్పష్టమైన కారణాలు తెలియవు. కాని ఈ సమస్యలను ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సను అందించి పూర్తిగా నయం చేయవచ్చును . థైరాయిడ్‌ వచ్చినపుడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్‌ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును.

థైరాయిడ్‌:

థైరాయిడ్‌ గ్రంధి మెడ ప్రాంతంలో కంఠముడి (ఎడమ్స్‌ ఏపిల్‌) కింద ఉండే ఒక గ్రంధి. ఇది సీతాకోకచిలుక యొక్క రెక్క రూపంలో శ్వాస నాళానికి (ట్రెఖియా) యిరు పక్కలా ఉంటుంది.

థైరాయిడ్‌ గ్రంధి నుండి విడుదలయ్యే థైరాయిడ్‌ హార్మోన్‌ మన శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపి, మన శరీరం యొక్క పనులను నియంత్రించేందుకు సాయపడుతుంది. థైరాయిడ్‌ గ్రంధి పిట్యూటరీ అనబడే యింకొక గ్రంధి హైపోథేలమస్‌ అనే మెదడులోని భాగం శరీరంలోని థైరాయిడ్‌ హార్మోన్‌ మొత్తాన్ని నియంత్రించేందుకు కలిసి పని చేస్తాయి. ఉదాహరణకు దేహంలో తగినంత థైరాయిడ్‌ హార్మోను లేకపోతే పిట్యూటరీ గ్రంధి ఈ అవసరాన్ని గ్రహించి, థైరాయిడ్‌ని ఉత్తేజపరిచేందుకు థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (టి.ఎన్‌.హెచ్‌)ని విడుదల చేస్తుంది. అలాంటి టిఎన్‌హెచ్‌ సంకేతంతోనే థైరాయిడ్‌ గ్రంధి హార్మోన్‌ని ఉత్పత్తి చేసి రక్తంలోకి నేరుగా పంపుతుంది.

హైపర్‌ థైరాయిడ్‌జమ్‌:

ఈ రుగ్మత థైరాయిడ్‌ గ్రంధి మరీ ఎక్కువ హార్మోన్‌ని ఉత్పత్తి చేయడం వలన ఏర్పడుతుంది.

లక్షణాలు:

ఈ వ్యాధి వచ్చినప్పుడు గొంతు థైరాయిడ్‌ గ్రంధి (వాపు) పెద్దదవవచ్చు (గాయిటర్‌).

1. త్వరితమైన గుండెరేటు- నిముషానికి 100 కంటే ఎక్కువ. 2. నరాల బలహీనత, ఆదుర్దా, చికాకు. 3. చేతులు వణకడం. 4. చెమటలు పట్టడం. 5. మామూలుగా తింటున్నా బరువు కోల్పోవటం. 6. వేడి తట్టుకోలేక పోవటం.
7. జుట్టు ఊడిపోవటం 8. తరచూ విరేచనాలు. 9. కళ్ళు ముందుకు చొచ్చుకురావటం. 10. తరచూ రుతు శ్రావం.
11. సక్రమంగా లేని గుండె లయ

చికిత్స : ఇందులో వయసుబట్టి వైద్యం ఉంటుంది. చిన్న వయసులో ఉంటే యాంటి థైరాయిడ్‌ మందులు వాడుతారు. 45 ఏళ్ల లోపు ఉన్న వారిలో అవసరాన్ని బట్టి ఆపరేషన్‌ చేయాల్సిరావచ్చు. రేడియో థార్మికత ఇచ్చే వైద్యం బాగా ప్రాచుర్యం పొందింది. ఇదిసామాన్యంగా 45 ఏళ్లు పైవారికి ఇస్తారు. చికిత్స తీసుకునేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
propylthiouracil (PTU, AntiTyrox) and methimazole (Neomerkazole,MMI, Tapazole). Carbimazole (which is converted into MMI in the body) is available

మందులు స్పెసలిస్ట్ డాక్టర్ సలహా తో వాడాలి .

హైపోథైరాయిడిజం:

థైరాయిడ్‌ గ్రంధి మామూలుకన్నా తక్కువగా థైరా యిడ్‌ హార్మోన్స్‌ ఉత్పత్తి చేస్తున్న పðడు ఈ పరిస్థితి వస్తుంది.

లక్షణాలు:

1. అలసట, నీరసం. 2. నిద్రమత్తు. 3. ఏకాగ్రత కోల్పోవడం. 4. పెళుసైన పొడిజుట్టు, గోళ్ళు. 5. దురద పుట్టించే పొడి చర్మం. 6. ఉబ్బిన ముఖం. 7 మలబద్దకం. 8. శరీరం బరువెక్కడం. 9. తక్కువైన రుతుశ్రావం. 10. రక్తహీనత.

హైపోథైరాయిడిజంని నిర్ధారణ చేయడం ఎలా

డాక్టర్‌గారు గుర్తించగల ప్రత్యేక లక్షణాలు మరియు శారీరక చిహ్నాలు. థైరాయిడ్‌ వచ్చినపðడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్‌ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును.

టి.ఎన్‌.హెచ్‌. ( థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌/థైరో (టోపిన్‌) పరీక్ష. ఎక్కువగా ఉండును .

రక్తంలో పెరిగిన టి.ఎస్‌.హెచ్‌. స్థాయి. హైపో థైరాయిడ్‌జమ్‌ యొక్క ఖచ్చితమైన సూచిక.

థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి చేయడం కొద్దిగా తగ్గగానే ఈ పిట్యూటరీ హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువవుతుంది.

చికిత్స : ఈ సమస్య మందుల ద్వారానే నయమవుతుం ది. క్రమం తప్పకుండా రోజూ మందులు తీసుకోవాల్సి ఉం టుంది. ఇది కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్‌ని సంప్రదించి సరైన వైద్యం తీసుకుంటే పూర్తి ఉపశమనాన్ని పొందవచ్చు. పిల్ల ల్లో శారీరకంగా, మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్నవా రిలో వైద్యం వల్ల పూర్తిగా నయం కాకపోవచ్చు. పెద్ద వారిలో పూర్తిగా నయమవుతుంది. దీనికి థైరాక్షిన్‌ రిప్లేస్మెంట్ ట్రీట్మింట్ తీసుకోవాలి . లీవో థైరాక్షిన్‌ తగిన మోతాదులొ వాడాలి. డోసు ఎంత తీసుకోవాలో డాక్టర్ని సంప్రదించి వాడాలి .

రేడియం ఎబెలేషన్‌ సాదారణ ట్రీట్మెంట్ లో భాగమయిపోంది .
సర్జరీ కూడా కొన్ని చోట్ల చేస్తారు .

స్పెసలిస్ట్ లు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో స్పెసలిస్ట్ ని కలిసే తగిన ట్రీట్మింట్ ఎంచుకోవాలి .


గాయిటర్‌-goiter
థైరాయిడ్‌ గ్రంథి అసహజంగా పెరగడాన్ని గాయిటర్‌ అంటారు. ఇందులో రెండు రకాలుంటాయి. మొదటి రకం యుక్త వయసు సమయంలో పెరగడం. ఆ సమ యంలో థైరాయిడ్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పెరుగుతుంది. అప్పుడు గ్రంథి సాధారణంగా రెండు వైపులా పెరుగుతుంది. క్రమేణా కొద్ది రోజుల్లో యాధాస్థితికి వస్తుంది. ఇది సమస్య కాదు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. రెండవ రకంలో ఒక వైపు మాత్రమే గడ్డలాగా ఉండవచ్చు. రెండు వైపులా అసాధారణంగా పెరుగుతుంది. ఇలా తయారైనది థైరాయిడ్‌లో వచ్చిన శాశ్వత మార్పు. ఇది మామూలు స్థితికి రాదు. అందుకే దీనిని వైద్యం తప్పనిసరి అవుతుంది.
చికిత్స : ఇలా అసహజంగా పెరిగిందానికి శస్తచ్రికిత్స అవసరం అవుతుంది. గడ్డలు ఉన్న స్థాయి, ప్రాంతాన్ని, పరిమణాన్ని, సంఖ్యని బట్టి శస్తచ్రికిత్స ఆధారపడి ఉంటుంది. లోవెక్టమీ, హెమీ థైరాయిడ్‌ వెక్టమీ, సబ్‌టోటల్‌ వెక్టమీ అనే సర్జరీలు చేయాల్సి ఉంటుంది.

థైరాయిడ్‌ క్యాన్సర్‌ :
ఇది చాలా అరుదుగా వస్తుంది. సర్జరీయే దీనికి చికిత్స. ఇందులో థైరాయిడ్‌ గ్రంథిని పూర్తిగా తొలగిస్తారు. ఈ ఆపరేషన్‌ తరువాత రోగి అందరిలాగే నిండైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది


గర్భిణులు థైరాయిడ్‌ గురించి ఆలోచించండి!

థైరాయిడ్‌ సమస్యలతో బాధపడే గర్భిణులు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. థైరాక్సిన్‌ హార్మోన్‌ లోపిస్తే (హైపోథైరాయిడిజమ్‌) గర్భస్రావమయ్యే ముప్పు ఎక్కువని చాలామందికి తెలియదు. తగు చికిత్స తీసుకోకపోతే బరువు, రక్తపోటు పెరగటంతో పాటు ముందుగానే కాన్పు అయ్యే అవకాశమూ ఉంది. పుట్టిన పిల్లల్లోనూ బుద్ధి వికాసం అంతగా ఉండదు. మనదేశంలోని గర్భిణుల్లో హైపోథైరాయిడిజమ్‌ తరచుగానే కనిపిస్తున్నట్టు ఇటీవల ఢిల్లీలో చేసిన తాజా అధ్యయనంలో వెల్లడి కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుకే దీనిపై అవగాహన కలిగించేందుకు ఇండియన్‌ థైరాయిడ్‌ సొసైటీ(ఐటీఎస్‌) జనవరి నెలను 'థింక్‌ థైరాయిడ్‌ మంత్‌'గా పాటిస్తోంది. మనదేశంలో గర్భిణుల్లో 6.47 శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నట్టు తేలటం ఆందోళన కలిగిస్తోంది. పుట్టబోయే బిడ్డల క్షేమం కోసం గర్భిణులంతా థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలని (ఐటీఎస్‌) మెంబర్స్ చెబుతున్నారు. చాలామంది గర్భిణులు తాము తీసుకునే ఆహారం, రక్తపోటు, వ్యాయామం, డాక్టర్‌ వద్దకు వెళ్లటంపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు గానీ థైరాయిడ్‌ పరీక్షను అంతగా పట్టించుకోరు. పుట్టబోయే పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఈ పరీక్ష చేయించుకోవటం చాలా అవసరము .

థైరాయిడ్‌ వంటి సమస్యలుండే వారికి పోషకాహారము , 
Nutritive food for Thyroid patitients.

శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉన్నప్పుడే చకచకా పనులు చేసుకోగలం. అదే థైరాయిడ్‌ వంటి సమస్యలుంటే అది సాధ్యం కాదు. నిలువునా నిస్సత్తువ ఆవరించి.. పనిమీద దృష్టి నిలపలేం. థైరాయిడ్‌లో రెండు రకాల సమస్యలుంటాయి. అవి హైపర్‌ థైరాయిడిజమ్‌, హైపో థైరాయిడిజమ్‌. వారి వారి సమస్యను బట్టి ప్రత్యేక పోషకాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

పోషకాహారమే పరిష్కారం..
పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా కనిపించే సమస్య హైపర్‌థైరాయిడిజమ్‌. థైరాయిడ్‌ గ్రంథి మోతాదుకు మించి విడుదల చేసే థైరాక్సిన్‌ హార్మోన్‌ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు ఒళ్లంతా చెమటలు పట్టడం, వేడికి శరీరం తట్టుకోలేకపోవడం, వణుకు, ఆందోళన, బరువు తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, క్రమం లేని నెలసరి. ప్రతి రెండు వేల మంది గర్భిణుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భదారణ సమయంలో తగిన రక్తపరీక్షల సాయంతో సమస్యని కనిపెట్టవచ్చు.

ఇనుమే.. ఇంధనం

పోషకాహారంతో ఈ సమస్యకి చెక్‌పెట్టవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అయితే ఈ ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ సమస్య ఉన్నవారు త్వరగా బరువు కోల్పోతారు. కాబట్టి తగినన్ని మాంసకృత్తులు, విటమిన్లు తీసుకొంటూ సంపూర్ణ పోషకాహారంపై దృష్టి సారించాలి. బి విటమిన్లని పుష్కలంగా అందించే పాలు, పాల ఉత్పత్తులు, రాగిజావ, పిండిని పులియబెట్టి చేసే దోశ, ఇడ్లీలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అలాగే ఇనుము అధికంగా ఉండే పదార్థాలని ఆహారంలో చేర్చడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. ఇందుకోసం గుడ్లు, ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు, చికెన్‌, ఖర్జూరం, అంజీర పండ్లని తినాలి.

ఎప్పటికప్పుడు నిస్సత్తువగా అయిపోయే శరీరానికి బలాన్నివ్వాలంటే ఒకేసారి కాకుండా రోజులో ఎక్కువ సార్లు ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకోవాలి. పంచదార కలపని తాజా పండ్ల రసాన్ని తరచూ తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ గ్రంధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. సముద్ర చేపల్లో ఉండే మాంసకృత్తులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో గుడ్డు క్రమం తప్పకుండా తీసుకొంటే జీవక్రియలు సాఫీగా సాగుతాయి.

ఇక ఆహార పదార్థాలు వండటానికి ఉపయోగించే వంట నూనెల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆలివ్‌, రైస్‌బ్రాన్‌, పల్లీ, నువ్వల నూనెలు అయితే మేలు. ఇవి చర్మాన్నీ సంరక్షిస్తాయి. వారంలో రోజుకో రకం చొప్పున మితంగా గింజలు తినడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ట్రాన్స్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలకి దూరంగా ఉండాలి. అంటే నూనెలో బాగా వేయించిన పదార్థాలకి, బిస్కెట్లు, కేకులు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వంటి వాటికీ, అతిగా శుద్ధి చేసిన పదార్థాలకీ దూరం పాటించాలి. టీ, కాఫీ, శీతల పానీయాలని పూర్తిగా మానేయాలి. ఇవి జీవక్రియలని ప్రభావితం చేస్తాయి.

క్రూసీఫెరస్‌ రకం ఆహారపదార్థాలుగా పిలుచుకొనే క్యాబేజీ, క్యాలీఫ్లవర్లతో పాటు పియర్స్‌, పాలకూర, సోయాబీన్స్‌ని తినాలి. ఎందుకంటే ఇవి థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తిని అదుపులో ఉంచుతాయి.

పాలు, చేపలతో ఫలితాలు

విపరీతమైన ఆందోళన, చర్మం పొడిబారిపోవడం, మలబద్ధకం, ఒళ్లు నొప్పులు, కీళ్లు.. కండరాలు పట్టేసినట్టు ఉండటం, బరువు పెరిగిపోవడం, నెలసరి సమయంలో అధిక రోజులు రక్తస్రావం.. ఇవన్నీ హైపోథైరాయిడిజమ్‌ లక్షణాలు. థైరాక్సిన్‌ హార్మోన్‌ తక్కువ విడుదలవ్వడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. గర్భం ధరించాలనుకొనే మహిళలు ముందుగా థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే రక్తహీనత వంటి సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పాలు, చీజ్‌, మాంసం, చేపలు ఆప్రికాట్లు, ప్రూన్స్‌, ఖర్జూరం, గుడ్డులోని తెల్ల సొన వీటిని తినడం వల్ల ఐయోడిన్‌ పుష్కలంగా అందుతుంది. అలాగే అయొడిన్‌ తగు మోతాదులో ఉండే ఉప్పుని రోజూ అందేట్లు చూసుకోవాలి. శుద్ధిచేసిన ఆహార పదార్థాలకి బదులుగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే తృణధాన్యాలని తీసుకోవాలి. ముఖ్యంగా ఓట్లు, దంపుడు బియ్యం, జొన్నలు, రాగి వంటివి నెమ్మదిగా జీర్ణమయి అధిక బరువు సమస్యని తగ్గిస్తాయి. దాంతో పాటు కొవ్వునీ తగ్గిస్తాయి. ఇక శక్తిని పుంజుకోవడానికి నిత్యం పండ్లు, తాజా కాయగూరలు అధికంగా తీసుకోవాలి. గుడ్డులోని తెల్లసొన, చేపలు, మాంసం ఇవి మేలు రకం మాంసకృత్తులని అందిస్తాయి.

కొద్దికొద్దిగా.. ఎక్కువ సార్లు ఆహారం
క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, బ్రకోలీ, పాలకూర, పియర్స్‌, స్ట్రాబెర్రీలు.. వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి థైరాయిడ్‌ స్థాయులని మరింత ప్రభావితం చేస్తాయి. అలాగే పచ్చి వేరుసెనగలకీ దూరంగా ఉండాలి. ఉడకబెట్టినా, వండినా వాటి కొంత ప్రభావం తగ్గుతుంది. సోయాపదార్థాలు తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సోయా పదార్థాలకీ దూరంగా ఉండాలి. వెల్లుల్లిని కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అయొడిన్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకొనే కంటే ఆరుసార్లు కొద్దికొద్దిగా తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నవారిలో మలబద్ధకం చాలా సాధారణంగా కనిపించే సమస్య. పీచు అధికంగా ఉండే పదార్థాలని తినాలి. నీళ్లు అధికంగా తాగాలి. హైపోధైరాయిడ్‌ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకం సెలీనియం. ఇది చేపలు, మాంసంతో పాటు పుట్టగొడుగుల నుంచీ అందుతుంది. ఇటువంటి ఆహార జాగ్రత్తలు తీసుకొన్నట్టయితే సమస్యని పక్కకు నెట్టి హాయిగా ఉండొచ్చు. 
 
 -  Dr.Seshagirirao-MBBS,DOHM,DAc,MAMS

Friday, May 4, 2012

సొరియాసిస్‌కు సమూల చికిత్స

సొరియాసిస్ రావడానికి కారణాలేవైనా చికిత్స మాత్రం రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తూ వ్యాధి పునరావృతం కాకుండా చేయగలగాలి. సరిగ్గా హోమియో వైద్య విధానం ఈ విధంగానే ఉంటుందని అంటున్నారు డా.శ్రీకర్‌మను.

ప్రకృతి జీవనానికి ముఖ్య ఆధారం సూర్యరశ్మి. ప్రతీ జీవనక్రియలో సూర్యరశ్మి పాత్ర కీలకం. మానవుని శరీరంలో ఎముకలకు కావలసిన విటమిన్ డి ఉత్పత్తికీ అవసరం. వేసవిలో హఠాత్తుగా పెరుగుతున్న వేడి, తేమ కారణంగా శరీర నీటిశాతం తగ్గడం వల్ల రకరకాల అనారోగ్య లక్షణాలు ముఖ్యంగా చర్మసమస్యలు వచ్చిపడుతున్నాయి. అందులో సొరియాసిస్ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా జన్యుపరమైన కారణాల వల్ల స్త్రీలలో ఎక్కువగా సొరియాసిస్ కనిపించవచ్చు.

ఆరోగ్యవంతుల్లో చర్మం ఉపరితలం కింద కొత్తకణాలు నిరంతరం తయారవుతుంటాయి. సుమారు 24 నుంచి 30 రోజులకు ఇవి వెలుపలకు చేరుకుంటాయి. కాని సొరియాసిస్ బారినపడిన వారిలో ఈ వ్యాధి అదుపు తప్పి చర్మకణాలు, మూడు లేదా నాలుగు రోజులకే వేగంగా తయారయి వెలుపలకు చేరుకుంటాయి. ఈ కణాలకు పోషకాలు అందించే ప్రక్రియలో చర్మం మీద ఎర్రని పొర ఏర్పడటం, పొలుసులుగా మారి రాలటం జరుగుతుంది. సర ైన అవగాహన, జాగ్రత్తలేకుండా అందుబాటులో ఉన్న రకరకాల మందులు, షాంపూలు, పైపూతల ద్వారా తాత్కాలిక ఉపశమనంతో రాజీపడటం ద్వారా సమస్య మరింత జఠిలమవుతుంది.

లక్షణాలు: పొట్టు రాలటం, దురద, జుట్టు రాలడం వంటివి ప్రథమ లక్షణాలు. కొంతమందిలో చర్మంలో మంటలు, గోకిన కొద్దీ దురదలు పెరగడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. నోటి నుంచి ద్రవం కొంత మందిలో పొక్కులు రావడం, పొలుసులు కట్టడం చూస్తుంటాం. దీర్ఘకాలం చర్మంలో పగుళ్లు ఏర్పడటం, దళసరిగా మారటం జరుగుతుంది. శరీరంలో ఎక్కడైనా ప్రారంభమయ్యే ఈ లక్షణాలు కొంతమందిలో ఎక్కువగా తలలో మొదలయి జట్టు రాలడానికి ముఖ్యకారణంగా మారుతాయి.

కారణాలు: జన్యులోపాలకు కొన్ని రకాల ప్రేరేపిక అంశాలు తోడైనపుడు సొరియాసిస్ వంటి లక్షణాలుగా బయటపడుతాయి. వంశపారపర్యంగా రావడానికి అవకాశం ఉన్నా అదే కారణం కాదు. ప్రొటీన్స్, పౌష్ఠికాహార లోపం, కొన్ని రకాల సబ్బులు, డిటర్జెంట్‌ల వల్ల , హార్మోన్ల సమస్య వల్ల రక్తప్రసరణ తగ్గినపుడు శరీరకణాలకు అవసరమైన ఆహారం లభించకపోవడంతో పాటు జీవక్రియలో ఏర్పడిన వ్యర్థాల తొలగింపులో జాప్యం జరగడం, ఉబ్బరం, విరేచనాలు, ఫుడ్ అలర్జీ, తేన్పులు వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళన అధికమైనపుడు ఉత్పత్తియైన కార్టిసాల్ హార్మోన్ దుష్రభావం, వాతావరణ మార్పులకు శరీరం అలవాటు పడకపోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఇష్టానుసారంగా మందులు వాడటం వల్ల జీవరసాయనాల అసమతుల్యత వల్ల సొరియాసిస్ ప్రారంభమవుతుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు: సొరియాసిస్ అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి సోకదు. సొరియాసిస్ కేవలం చర్మానికి సంబంధించిన లక్షణం కాదు. బలహీనపడిన రోగనిరోధక వ్యవస్థ, చర్మంలో జీవరసాయన చర్యలలో ఏర్పడుతున్న అసమతుల్యతకు ముఖ్యసంకేతాలు. కేవలం ఆహార నియమాలు, జీవనశైలిలో మార్పులతో దీనిని తొలగించలేము. సొరియాసిస్ ఒకేరకమైన కారణం వల్ల అందరిలో రావటం జరగదు. ఏ ఇద్దరిలో కూడా జన్యుపరంగా సమానత్వం ఉండదు. ఈ వ్యాధికి సొంతవైద్యం పనికిరాదు.

సొంతవైద్యం వల్ల సమస్య మరింత ఎక్కువ కావటం, ఆర్థరైటిస్ వంటి వాటికి దారితీయడం జరుగుతుంది. ఒత్తిడి తగ్గించుకుంటూ సరియైన వ్యాయామాలు చేస్తూ, పౌష్ఠికాహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇస్నోఫిల్ కౌంట్, సీబీపీ, హార్మోనల్ అనాలసిస్ వంటి రక్తపరీక్షలతోపాటు స్కిన్ బయాప్సీ, స్కిన్ అలర్జీ పరీక్షలు చేయాలి. రోజూ ఉదయం, సాయంత్రం 10 నుంచి 20 నిమిషాల పాటు వ్యాధి తీవ్రత ఉన్న ప్రదేశంలో సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.

సమస్యలు: దీర్ఘకాలం పాటు ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే శరీరమంతటా వ్యాపించడం, జుట్టురాలడం, శరీరంలో నీటిశాతం తగ్గిపోవడం, ఆర్థరైటిస్, గుండె సమస్యలు, రక్తనాళాల సమస్యలకు దారితీయవచ్చు. చర్మంలో పగుళ్లు ఏర్పడటం, రంగుమారటం, దళసరిగా తయారవడం జరుగుతుంది.

హోమియో చికిత్స: సొరియాసిస్ బారినపడిన వారికి ఉపశమనం అందేలా చేయడంతో పాటు పునరావృతం కాకుండా చేయడం చికిత్స ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. వ్యాధి ఆధారిత ఇక్కట్లను తొలగించడం తద్వారా శాశ్వత పరిష్కారం లభించేలా చేయడం జరుగుతుంది.

హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. జన్యుపరమైన లోపాలను చక్కదిద్దడం, జీవరసాయనాల అసమతుల్యతలను తొలగించి రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా సమస్య పునరావృతాలను కూడా నియంత్రించడం జరుగుతుంది. చికిత్సా ఫలితాలు జన్యు తత్వం, సంబంధిత అసమతుల్యతను బట్టి మారుతుంటుంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన హోమియో వైద్యున్ని కలిసి తగిన చికిత్స తీసుకుంటే సొరియాసిస్ సమస్య సమూలంగా తొలగిపోతుంది.

- డా. శ్రీకర్ మను
ఫౌండర్ ఆఫ్ డా. మనూస్ హోమియోపతి,
ఫోన్ : 9032108108
9030 339 999