ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైద్య విధానం, భారతీయ సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం. ఇది కేవలం ఒక వైద్య విధానమే కాదు ప్రకృతితో సహకరిస్తూ, సహజీవనం చేయించే జీవన విధానం కూడా. చికిత్సను విస్మరించకుండానే వ్యాధి నిరోధకతను నొక్కి చెప్పే ఎనిమిది ప్రధాన శాఖలు కలిగిన విధానం ఆయుర్వేద.
అలోపతి వైద్యులలా లక్షణాలపై కాక మూల కారణంపై దృష్టిని కేంద్రీకరించే ఆయుర్వేదంలో చికిత్స కూడా వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది తప్ప కేవలం వ్యాధిని బట్టి మాత్రమే కాదు. అంతేకాదు కేవలం మందులు ఇవ్వడమే కాక ఆహారం, రోజువారీ కార్యక్రమాలు, పరిసరాలు, మానసిక ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని చేసే చికిత్సకు ప్రాధాన్యతను ఇస్తుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం సరైన జీవన విధానంతో కూడిన స్వీయ సంరక్షణను తెలిపే శాస్ర్తీయ విధానం. సాధారణ చికిత్సతో పాటుగా ఆయుర్వేదంలో ‘పంచకర్మ’ అనే ప్రత్యేక చికిత్సా పద్ధతి ఉన్నది. ఆయుర్వేద చికిత్సా శాస్త్రానికి ఈ పంచకర్మ పక్రియ కీలకమైన అంశమే కాదు ప్రాధమిక మూలం కూడా. శరీరంలోని పేరుకుపోయిన మలినాలను నిర్విషీకరణ (డీటాక్సిఫై) చేసి తిరిగి పుష్టిగా చేసేందుకు గల ప్రాచీన శాస్ర్తీయ పద్ధతే పంచకర్మ.
ఈ అయిదు పద్ధతులు:
1. వమనం (మూలికలను ఇవ్వడం ద్వారా పేరుకు పోయిన మలినాలను బయటకు వచ్చేలా చేయడం)
2. విరేచన: (మూలికలను ఇవ్వడం ద్వారా పొట్టలో పేరుకు పోయిన మలినాలను మలం ద్వారా బయటకు వచ్చేలా చేయడం)
3. వస్తి ( మందుల ద్వారా ఎనిమా)
4. నశ్య (ముక్కు ద్వారా మందులు ఇవ్వడం)
5. రక్త మోచన (శరీరంలో పేరుకుపోయిన మలిన రక్తాన్ని బయటకు పంపే ప్రక్రియ)
పంచకర్మ పద్ధతులు శరీర సహజ ప్రక్రియలను ప్రోత్సహిస్తూ అనవసరమైన మలినాలను, విషపదార్ధాలను తొలగిస్తాయి. ఆయురారోగ్యాల కోసం వాతావరణం మారినప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కర్మలు చేయించుకోవడం సంప్రదాయంగా వస్తున్నది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి లేదా శరీరంలో ఏర్పడిన రుగ్మతలను తొలగించుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చు. శుశ్రుతుడు వీటిని చికిత్సలో భాగంగా పరిగణించగా, చరకుడు పంచకర్మను ప్రత్యేక విభాగంగా పేర్కొన్నాడు.
ఈ ప్రక్రియలు మలినాల మూలాలను తాకి వాటిని తొలగిస్తాయి. అందుకే పంచకర్మ ప్రక్రియను 1. ఆరోగ్యం కాపాడుకునేందుకు 2. రోగ చికిత్స 3. పునఃశక్తిని పొందేందుకు చికిత్సకు ముందస్తు ప్రక్రియ అనే లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగిస్తారు.
పంచకర్మను మూడు దశలలో నిర్వహిస్తారు.
పూర్వ కర్మ: శరీరంలోని కణజాలంలో పేరుకుపోయిన మలినాలను, విషపదార్ధాలను తొలగించేందుకు ముందుకు అవి ఒక చోట చేరేలా సేకరిస్తారు.తదనంతర ప్రక్రియ ద్వారా వాటిని శరీరంలో నుంచి బయటకు వెళ్ళేలా చేస్తారు
ప్రధానకర్మ: (వమన తదిర ప్రాధమిక ప్రక్రియలు) ఈ ప్రక్రియలు శరీరాన్ని డీటాక్సిఫై చేసి, కణజాలాన్ని పరిపుష్టం చేస్తుంది.
పశ్చాత్ కర్మ: రోగి సాధారణ ఆరోగ్య స్థాయిని సాధించడానికి, జీర్ణ ప్రక్రియ మెరుగుపడటానికి అతడు/ఆమె ఆరోగ్య, శరీర తీరును బట్టి తగు ఆహార నియమాలు, మందులను ఇస్తారు. పంచకర్మలో అనుసరించే కొన్ని పద్ధతులు భౌతికంగా ఉన్న లోపాలను సరి చేయడమే కాక కణజాలాన్ని పరిపుష్టం చేసే ప్రత్యేకమైన భౌతిక చికిత్సలా ఉంటాయి. ఈ పద్ధతులు చికిత్స చేస్తున్న అంగాన్ని పరిపుష్టం, బలోపేతం చేయడమేకాక శరీరంలోని లోపాలను సరి చేసే, ఆయా అంగాల పనితీరు మెరుగుపరుస్తాయి.
చికిత్స చేస్తున్న అంగంలో రక్తసరఫరా, జీవప్రక్రియ కార్యకలాపాలు, వివిధ పద్ధతుల ద్వారా వేడిమిని ఉపయోగించి చర్మంలోని రంధ్రాలను తెరచి మసాజ్ చేయడం ద్వారా నిర్దేశిత అంగాలకు మందులను, పౌష్టిక పదార్ధాలను పంపడం, చర్మంలోని మలినాలను తొలగించడం ఈ ప్రక్రియలో చోటు చేసుకుంటుంది.ఆయుర్వేదంలోని పంచకర్మ థెరపీని అనేక లక్షణాలు కలిగిన సమగ్రమైన భౌతిక చికిత్సగా చెప్పుకోవచ్చు. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో వ్యాధి నిర్వహణలో కీలక పాత్ర పోషించే ప్రక్రియే పంచకర్మ.
- డా స్వాతి
ఎం.డి. (ఆయుర్వేద)
గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్,
రామచంద్రనివాస్ అపార్ట్‌మెంట్స్,
వెంగళరావ్‌నగర్, హైదరాబాద్
ఫోన్: 99082 53783
ఎం.డి. (ఆయుర్వేద)
గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్,
రామచంద్రనివాస్ అపార్ట్‌మెంట్స్,
వెంగళరావ్‌నగర్, హైదరాబాద్
ఫోన్: 99082 53783
No comments:
Post a Comment