Pages

Tuesday, December 28, 2010

పంచదార కళ్లు * డయాబెటిస్ వల్ల కంటిపై పడే ప్రభావాలు, వాటి లక్షణాలు, నివారణ, చికిత్స

చక్కెర నోటికి తీపి గానీ... కళ్లకు మాత్రం చేదే. చక్కెర వ్యాధి ప్రభావం ఎంత చేదుగా ఉంటుందో తెలిసిన విషయమే. అన్ని అవయవాలపై దుష్ర్పభావం చూపించే ఆ వ్యాధికి కన్ను మినహాయింపేమీ కాదు. అన్ని అవయవాల్లాగే కన్ను కూడా డయాబెటిస్‌కు ప్రభావితమవుతుంది. చక్కెరను నియంత్రించుకోకపోతే అది డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య మొదలు అనేక రుగ్మతలకు దారి తీయవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేస్తే చూపునే కోల్పోవాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు. అందుకే... చక్కెర వ్యాధి సూచనలు కనిపించగానే కంటిపై ఆ వ్యాధి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ వల్ల కంటిపై పడే ప్రభావాలు, వాటి లక్షణాలు, నివారణ, చికిత్స లాంటి అనేక అంశాలను తెలుసుకోడానికే ఈ కథనం...

ప్రతి అవయవానికి పోషకాలు అందించే బాధ్యత రక్తానిది. ఈ రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంటుంది. ఈ నాళాల చివరన ఉండే అత్యంత సూక్ష్మమైన నాళాలను రక్తకేశనాళికలు (క్యాపిల్లరీస్) అంటారు. దీర్ఘకాలంగా రక్తంలో చక్కెర పాళ్లు ఎక్కువగా ఉండేవారిలో కేపిల్లరీస్ దెబ్బతింటాయి. రక్తంలో పెరిగే గ్లూకోజ్ పాళ్ల వల్ల ఈ రక్తనాళాల చివర్లలో అడ్డంకులు (బ్లాకేజ్) ఏర్పడవచ్చు. ఫలితంగా ఆ అవయవానికి రక్తం అందకపోవచ్చు. దాంతో ఆ అవయవం శాశ్వతంగా చచ్చుబడే ప్రమాదం ఉంది. కంటిలో ఉండే రక్తనాళాల చివరల్లోనూ ఇలాంటి బ్లాక్స్ రావడం సంభవిస్తే చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.

డయాబెటిస్ వల్ల వచ్చే వ్యాధులివి...
డయాబెటిక్ రెటినోపతి

డయాబెటిక్ క్యాటరాక్ట్

గ్లకోమా నర్వ్ పాల్సీ ఆప్టిక్ న్యూరోపతి

కనురెప్పకు తరచూ వచ్చే ఇన్ఫెక్షన్

కనురెప్పలు వాలిపోవడం

కంటిలోపల ఉండే పొర కంజెంక్టివాకు వచ్చే ఇన్ఫెక్షన్లు

కార్నియాకు వచ్చే సమస్యలు.

డయాబెటిక్ రెటినోపతి... ఏదైనా వస్తువును చూసినప్పుడు దాని ప్రతిబింబం కంటిలోపల ఉండే ఒక తెరపై పడుతుంది. ఆ తెరపై పడే ప్రతిబింబం వల్లనే మనం చూడగలమన్నది తెలిసిందే. ఈ తెరనే ‘రెటీనా’ అంటారు. అన్ని అవయవాల్లాగే ఈ రెటీనాకు కూడా అత్యంత సూక్ష్మమైన నాళాల ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. చక్కెర వ్యాధి వల్ల ఈ రక్తనాళాలు దెబ్బతిని రెటీనాకు రక్తం సరిగ్గా అందక చూపు దెబ్బతినే పరిస్థితిని ‘డయాబెటిక్ రెటినోపతి’ అంటారు. దీని వల్ల శాశ్వతంగా చూపు కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి చాలా ఎక్కువగా ఉన్న కారణాల్లో ఇది ప్రధానమైనది.

 
‘డయాబెటిక్ రెటినోపతి’ ఎవరెవరిలో ఎక్కువ...
దీర్ఘకాలంగా చక్కెర వ్యాధి ఉన్నవారికి

చక్కెరను అదుపు చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండేవారికి

డయాబెటిస్‌తో పాటు అధిక రక్తపోటు ఉన్నవారికి

డయాబెటిస్‌తో పాటు కొలెస్ట్రాల్ పాళ్లు, రక్తంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి

కిడ్నీ సమస్యలు ఉన్నవారికి

గుండె జబ్బులు ఉన్నవారికి

పొగతాగేవారికి... వీళ్లందరిలో డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

గమనిక : షుగర్ పూర్తిగా నియంత్రణలో ఉన్నా రెటినోపతి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చక్కెర వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి వైద్యనిపుణులను తరచూ సంప్రదించడం అవసరం.

తస్మాత్ జాగ్రత్త...
డయాబెటిక్ రెటినోపతితో బాధపడే వారిలో, చూపు కోల్పోయే వారిలో - తమకు ఈ దుష్ర్పభావం పడబోతుందన్న విషయం దాదాపు సగానికి మందికి పైగా తెలియనే తెలియదు. ఒక్కోసారి కంటికి చేసే సాధారణ (రొటీన్) పరీక్షల్లో ఈ విషయం బయటపడుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది.

డయాబెటిక్ రెటినోపతి కేసుల్లో ఏం జరుగుతుంది?
డయాబెటిస్ ఉన్నవారిలో కంటిలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాల చివరలు ఉబ్బుతాయి. ఇలా రెటినాకు చెందిన రక్తనాళాల చివరలు ఉబ్బడాన్ని ‘మైక్రో అన్యూరిజమ్’ అంటారు. ఇవి ఉబ్బి ఉబ్బి ఒక్కోసారి చిట్లి రక్తస్రావం కావచ్చు. ఇలా రక్తస్రావం కావడాన్ని ‘డాట్ అండ్ బ్లాట్ హ్యామరేజ్’ అంటారు. కొన్నిసార్లు కంటిలోని ద్రవాలు లీక్ కావచ్చు. అలా జరిగితే దాన్ని ‘మాక్యులార్ ఎడిమా’ అంటారు. అప్పుడు రెటీనా నుంచి కొత్త రక్తనాళాలు ఆవిర్భవించవచ్చు. దీన్నే ప్రొలిఫిరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇలా కొత్తరక్తనాళాలు పుట్టుకురావడమే కంటికి ప్రమాదకరం అవుతుంది.

నేత్రవైద్యులు ఇందుకోసం చేసే పరీక్షలివి
ఫండస్ ఎగ్జామినేషన్

ఫండస్ ఫ్లోరోసిన్ యాంజియోగ్రఫీ

ఓసీటీ (ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ)

అల్ట్రా సౌండ్ ‘బి’ స్కాన్

చికిత్స
డయాబెటిస్ రెటినోపతీకి అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలు
1. వైద్యపరంగా అందించే చికిత్స
2. లేజర్ ఫోటోకోయాగ్యులేషన్
3. శస్తచ్రికిత్స (విట్రెక్టమీ)

1. వైద్యపరంగా చేయాల్సిన చికిత్స:
రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడానికి చికిత్స చేయాలి.

రక్తంలో కొవ్వులను నియంత్రించడానికి చికిత్స (కొలెస్ట్రాల్ తగ్గించడానికి)

యాంటీప్లేట్‌లెట్ ఏజెంట్స్ (రక్తం పలచబరచడానికి మందులు)

బీ కాంప్లెక్స్ ఔషధాలు ఇవ్వాలి.

3. శస్తచ్రికిత్స:
రెటినోపతి వల్ల వచ్చే దుష్ర్పభావాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటే అప్పుడు అక్కడ గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి విట్రెక్టమీ ఆపరేషన్ అవసరం కావచ్చు.

డయాబెటిక్ క్యాటరాక్ట్...
డయాబెటిస్‌తో శరీరంలోని జీవక్రియ (మెటబాలిజమ్) ల్లో మార్పుల వల్ల కొందరిలో కంటిలో త్వరగా క్యాటరాక్ట్ రావచ్చు. దీనివల్ల చూపు స్పష్టంగా కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారిలో ఫ్యాకో ఎమల్సిఫికేషన్ వంటి ప్రక్రియలతో కంటి ముందు ఉంటే లెన్స్ మార్చి కృత్రిమ లెన్స్‌ను అమర్చాల్సి ఉంటుంది.

గ్లకోమా...
కంటిలో ఉండే ద్రవాలలో ఒత్తిడి పెరిగి అది కంటి నరం మీద పడటాన్ని గ్లకోమా అంటారు. ఈ ఒత్తిడి వల్ల క్రమంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. యాంటీ గ్లకోమా చుక్కల మందు కంట్లో వేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు. అయితే దీన్ని జీవితకాలం వాడాల్సి ఉంటుంది. కొంతమందికి శస్తచ్రికిత్స ద్వారా కూడా గ్లకోమాను నయం చేసే అవకాశాలు ఉంటాయి.

ఆప్టిక్ న్యూరోపతి...
కంటిలో కనిపించే ప్రతిబింబాన్ని ‘ఆప్టిక్ నర్వ్’ మెదడుకు చేరవేయడం వల్లనే మనకు చూపు కనిపిస్తుంటుందన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఈ నరం దెబ్బతినడం వల్ల కంటి చూపు అకస్మాత్తుగా దెబ్బతింటుంది. ఈ నరం దెబ్బతిన్న విషయాన్ని ఫండస్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కంటి వైద్యులు, న్యూరోఫిజీషియన్ ఆధ్వర్యంలో చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.

చూపును దీర్ఘకాలం పదిలంగా కాపాడు కోవడం కోసం కంటి పరీక్షలు తరచూ చేయించడం అవసరం. డయాబెటిస్ ఉంటే అది మరింత అవసరమని గుర్తుంచుకోవాలి.

2. లేజర్ ఫోటోకోయాగ్యులేషన్
లేజర్ కిరణాల సహాయంతో చేయాల్సిన ఈ చికిత్స వల్ల కంటిలో రక్తస్రావాన్ని తగ్గించడం కొత్తగా ఏర్పడే రక్తనాళాలను నివారించడం సాధ్యమవుతుంది. ఈ చికిత్స ప్రక్రియలో కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ చికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. ఒకసారి చికిత్స చేశాక జీవితకాలం పాటు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఎన్నాళ్లకోమారు..?
డయాబెటిస్ ఉన్నవారు ఏడాదికి ఒకసారి కంటి పరీక్షలు చేయించాలి.

డయాబెటిక్ రెటినోపతి ఉన్నవారు ప్రతి ఆర్నెల్లకు ఓ మారు పరీక్షలు చేయించాలి.

డయాబెటిక్ రెటినోపతి తీవ్రంగా ఉంటే ప్రతి మూడు నెలలకోమారు పరీక్షించుకోవాలి.

నివారణ...
డాక్టర్లు చెప్పినవిధంగా మంచి పోషకాలు, పీచుపదార్థాలు ఎక్కుడా ఉండే ఆహారాన్ని క్రమబద్ధంగా తీసుకోవడం.

ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం

వ్యాయామం

క్రమం తప్పకుండా రక్తంలో గ్లూకోజ్ పాళ్లను పరీక్షించుకుంటూ దాన్ని నియంత్రించుకోవడం

పొగతాగే అలవాటును పూర్తిగా మానివేయడం.

No comments:

Post a Comment