Pages

Tuesday, December 14, 2010

స్టెప్ వేయండి ...... స్లిమ్ అవ్వండి ....... * ' బాలీఫిట్ '.

సన్నబడాలంటే ఏం చేయాలని ఎవరినడిగినా బోలెడు సలహాలు ఇస్తారు. జిమ్ కెళ్లమని ఒకరు చెబితే తిండి తగ్గించమని ఒకరు చెబుతారు. అవన్నీ విని విని బోరు కొట్టేసి ఉన్నాయి అందరికీ. అందుకే అనూజ రాజేంద్ర కనిపెట్టిన కొత్త పద్ధతికి చాలా డిమాండ్ ఉంది. ఆ పద్ధతి పేరు 'బాలీఫిట్'. 'ఫిట్‌నెస్ త్రూ డ్యాన్స్'అనే నినాదంతో అనూజ ఈ వినూత్న పద్ధతిని అందరికీ పరిచయం చేశారు. బరువు తగ్గాలనుకునే వారితో ఆమె నాట్యం చేయిస్తుందన్నమాట. అమెరికాలో స్థిరపడ్డ ఈ ఆలోచన అనూజకి మూడేళ్ల కిత్రం వచ్చింది.

భరతనాట్యం, భాంగ్రా నృత్యాలు వచ్చిన అనూజ ఇప్పటికే చాలా దేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. కాని పెళ్లయి పిల్లలు పుట్టాక బాగా ఒళ్లు చేసింది. తను స్లిమ్‌గా అవ్వాలంటే మళ్లీ నాట్యం చేయాల్సిందేననుకుంది. ఒక్క ఏడాదిలోనే ఇరవైకిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు తమకు కూడా నాట్యం నేర్పమని అడిగారు. అంతే 'నాట్యంతో బరువు తగ్గడమెలా' అని కొద్ది రోజులు స్టడీ చేసింది అనూజ. 2007లో అమెరికాలోని మిచిగాన్ పక్కనున్న ఆన్ ఆర్బర్‌లో తొలి శిక్షణా కేంద్రం ప్రారంభించింది. ఇందులో భారతీయుల కంటే ఎక్కువగా అమెరికన్లే చేరారు. మూడేళ్లు తిరిగేసరికి తీరిక లేనంత బిజీ అయిపోయింది అనూజ.

ఎలాంటి నాట్యం చేస్తారు...
భరతనాట్యం, భాంగ్రా, బాలీవుడ్ స్టెప్పులకు ఏరోబిక్స్ టిప్స్ కలిపితే బాలీఫిట్ అవుతుంది. ఒక నిమిషానికి 100 నుంచి 150 బీట్స్ ఉండి హోరెత్తింటే పాటల్ని ఎంపిక చేస్తారు. ఇందులో ఎక్కువగా రీమిక్సే ఉంటాయి. సరదాగా సాగే ఈ నాట్యంలో రకరకాల భంగిమలు ఉంటాయి. మూడు రకాల వ్యాయామాలు ఉండేలా దాన్ని తయారుచేశారు. బాలీఫిట్ కార్డియో, బాలీఫిట్ రిథమ్, బాలీఫిట్ టాట్స్. వీటికి కావాల్సిన స్టెప్పుల్ని ముందుగానే శిక్షకులు నేర్పిస్తారు. మ్యూజిక్‌లో వచ్చే బాణీలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తే సరిపోతుంది.

రోజూ ఉదయం పూట ఓ గంటసేపు ఈ బాలీఫిట్ చేస్తే ఒంట్లో కొవ్వుని ఇట్టే కరిగించేయొచ్చంటున్నారు అనూజ. విదేశాల్లో విజయవంతమైన తన ప్రయోగాన్ని ఆమె ఆ తర్వాత స్వదేశంలోనూ ప్రవేశపెట్టింది. ముంబై నగరంలో తను ఏర్పాటు చేసిన బాలీఫిట్ శిక్షణ కేంద్రాలకు కూడా యువత నుంచి మంచి స్పందనే వచ్చింది. బాలీఫిట్‌కి వెళుతున్న పెద్దవయసు వారు ఏమంటారంటే 'బాలీఫిట్ వల్ల ఒళ్లు తగ్గడమే కాదు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది' అని.

ఎప్పటికైనా గొప్ప నటిని అవ్వాలనుకున్న అనూజ ఇప్పుడు బాలీఫిట్ సెలబ్రెటీగా ఎదిగిపోయింది. అమెరికా, కెనడా, ఇండియాలో బోలెడు బాలీఫిట్ తరగతులు నిర్వహించి అందరి మనసుల్ని గెలిచింది.' స్లిమ్‌గా అవ్వడం ఎలా' అని బెంగపడుతున్నవారి పాలిట దేవతగా మారిపోయింది. మనమందరం అనూజ దగ్గరికి వెళ్లలేం కాబట్టి ఇంట్లోనే ఒక మ్యూజిక్‌ప్లేయర్ ఆన్ చేసి రోజూ ఉదయం ఓ గంట డ్యాన్స్ ప్రాక్టీసు చేసి చూద్దాం.

No comments:

Post a Comment