Pages

Thursday, January 6, 2011

చలి కాలంలో హాట్ హాట్‌గా...!

"అబ్బా.. పొద్దున్నే లేవాలంటే నావల్ల అయ్యే పనికాదు. చలి చంపేస్తోంది. ఇంకాసేపు పడుకొని లేస్తాలే..'' శీతాకాలం ప్రతి ఇంట్లో పొద్దున్నే కనిపించే సన్నివేశమే ఇది. బద్దకంగా ఒళ్లు విరుచుకునే ప్రతి ఉదయం.. చాలా డల్‌గా నడిచిపోతుంది. ఆ డల్‌నెస్‌ను తరిమేసి, హుషారు రాజేయాలంటే ఏం చేయాలి..? శరీరంలో వెచ్చదనాన్ని నింపాలి. అందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం..

* శీతాకాలంలో శరీరానికి వేడి చాలా అవసరం. ఎనర్జీ.. హీట్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్నే థర్మిక్ ఎఫెక్ట్ అంటాం. ప్రొటీన్లు అధికంగా కలిగిన ఆహారపదార్థాలకు ఈ గుణం ఎక్కువ.
* పొద్దున్నే లేవగానే తాజా అల్లం ముక్క వేసుకుని కాచిన టీ తాగాలి. కాఫీకంటే ఇదే బెటర్. లేదంటే, బ్లాక్ టీ, గ్రీన్ టీ తీసుకోవచ్చు. వేడి వేడి సూప్ కూడా తాగొచ్చు. బయట దొరికే రెడీమెడ్ సూప్‌కంటే ఇంట్లో తాజా కూరగాయలతో చేసుకున్న సూప్‌తోనే ఎక్కువ ప్రయోజనం.
* ఈ సీజన్‌లో శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోయే అవకాశం ఎక్కువ. అధిక బరువు పెరగడానికీ ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ కాలంలో ఆకలి ఎక్కువ వేస్తుంది. దీన్ని అధిగమించాలంటే సమయానికి తిండి తినాలి. రోజులో ఒకేసారి కాకుండా మూడు నాలుగుసార్లు తింటే బెటర్.
* చలికాలంలోనూ వ్యాయామం తప్పనిసరి. ఎంత కష్టమైనా పొద్దున్నే వాకింగ్, జాగింగ్, జిమ్, యోగా వాయిదా వేయవద్దు. వ్యాయామంతోనే శరీరంలో సహజమైన వేడి పుడుతుంది. నాడీమండలాన్ని చురుగ్గా ఉంచుతుంది. రక్తప్రసరణ స్వేచ్ఛగా సాగుతుంది.
* పొద్దున్నే లేస్తూనే బిస్కెట్లు, టీ కలిపి తీసుకోవడం చాలామందికి అలవాటు. బిస్కెట్లు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. నిద్రలేచిన 15 నిమిషాల్లో ఏదో ఒక ఆహారపదార్థం కొద్దిగానైనా తీసుకోవాలి. వీలుకాకపోతే కనీసం ఒక అరటిపండైనా తినాలి.
* చాలామంది రాత్రి మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి పొద్దున్నే వేడిచేసుకుని తింటుంటారు. చలికాలంలో దీనికి స్వస్తి చెప్పండి. అప్పటికప్పుడు వేడిగా వండుకుని తినండి.
* పొద్దున, రాత్రి పాలు తాగేవారు అందులో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే మంచిది. మిరియాలకు వేడి చేసే స్వభావం అధికం. వీటివల్ల దగ్గు, కఫం సమస్యలు తొలగుతాయి.
* వంటల్లో తరచూ అల్లం, మిరియాలు, యాలకులు, లవంగాలు, నువ్వులు వేసుకోవాలి. మసాలా దినుసులు మోతాదుకు మించకుండా వాడాలి.
* నాడీవ్యవస్థ సాఫీగా పనిచేసేందుకు ఫోలిక్ యాసిడ్, ఐరన్ అవసరం. దీనికోసం పచ్చరంగు కలిగిన ఆకుకూరలు, కూరగాయలు తినాలి. చిక్కుడు, బీన్స్, బీరకాయ, పొట్లకాయ తినొచ్చు. ఆకుపచ్చని కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

* ఆకుకూరల్లో శ్రేష్టమైనది, చలికాలంలో అవసరమైనది మునగాకు. మునగాకును ఉడికించి పప్పుతో కలిపి తీసుకోవచ్చు. మెంతికూర, పాలకూర, తోటకూర కూడా కూరల్లో వేసుకోవచ్చు. ఆకుకూరలు తింటే చర్మం పొడిబారడం తగ్గుతుంది.

* చలికాలంలో నూనె పదార్థాలను తగ్గించాలి. ఆకుకూరలు, చేపలు, చికెన్ అధిక మసాలాలతో వండకూడదు. ఉడికించి కూర చేసుకుని తింటేనే శరీరానికి ఉపయోగం. లేదంటే మలబద్ధకం ఏర్పడుతుంది.

* చలికాలంలో శరీరానికి ప్రొటీన్లు కూడా ఎంతో అవసరం. ఉదయాన్నే ఉడికించిన కోడిగుడ్డు, చేపలు, చికెన్, పప్పుదినుసులు, సలాడ్స్ తినండి.
* చలికాలంలో విటమిన్-సి, ఎ కొరత ఏర్పడుతుంది. వీటి కోసం నారింజ, బొప్పాయి, జామకాయలు, క్యారెట్ తినాలి.
* చలికాలంలో దాహం అవదు. అందువల్ల నీరు ఎక్కువ తాగరు. దీనివల్ల అనారోగ్యం తప్పదు. ద్రవ పదార్థాలను తీసుకున్నా, నీటిని మాత్రం పుష్కలంగా తాగాలి.
* రాత్రిపూట పడుకునే ముందు సూప్, పండ్లు, చపాతీ వంటివి తీసుకోవడం ఉత్తమం. వీలైనంత వరకు రాత్రిపూట అన్నం తక్కువ తినాలి. మాంసాహారం జోలికి పోకపోతేనే మంచిది.

No comments:

Post a Comment