Pages

Tuesday, January 11, 2011

డాక్టర్లతో పాటు అమ్మలదీ తప్పే! * సిజేరియన్

కారణం ఏదైనా కావచ్చు. తప్పా ఒప్పా అన్నది పక్కన పెడితే మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య పెరిగిపోతుండటం మాత్రం వాస్తవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం సిజేరియన్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 15 శాతానికి మించకూడదు. కానీ మనదేశంలో 20 నుంచి 30 శాతానికి సిజేరియన్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడున్నన్ని వైద్య పరికరాలు గతంలో లేవు. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఆరోగ్యపరిస్థితి పూర్తి స్థాయిలో తెలిసేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది.

అందుకే ఏమాత్రం రిస్కు ఉందన్నా వెంటనే సిజేరియన్ చేసి తల్లీబిడ్డల్ని రక్షిస్తున్నారు. ఆరోగ్య సమస్యల్ని పక్కన పెడితే పేషెంట్ల కోరిక మేరకో, తమకు టైమ్ లేదనో కూడా చాలామంది డాక్టర్లు సిజేరియన్ చేసేస్తున్నారు. ఫలానా ముహూర్తంలో పుడితే అద్భుతమైన జాతకం ఉంటుందనో, వర్జ్యంలో పుడితే ప్రమాదమనో.. ఇలా రకరకాల నమ్మకాల వల్ల కొంత, ప్రసవ వేదన పడలేక మరికొంత చాలామంది సిజేరియన్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఒకసారి సిజేరియన్ అయితే ఇక తరువాత కాన్పు తప్పనిసరిగా సిజేరియనే చేస్తారని అంటారు. గర్భసంచికి రిస్కు ఉన్నప్పుడు ఇది కరెక్టే. కానీ సాధారణంగా 40 నుంచి 50 శాతం డెలివరీలు నార్మల్‌గానే అవుతాయి.

పోషకలోపం... పెనుశాపం

సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తక్కువ. కార్పొరేట్ ఆసుపత్రులు ఎక్కువ డబ్బులు లాగడానికే సిజేరియన్లు చేస్తున్నారన్న అపోహ చాలామందిలో ఉంది. నిజానికి నొప్పులు వచ్చి ప్రసవం అయ్యేవరకు తల్లీబిడ్డల్ని కనిపెట్టుకుని ఉండటం దీని వెనుక ఉన్న అసలు సమస్య. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలు తల్లీ, బిడ్డల్ని గమనిస్తూ ఉండటానికి ఎవరో ఒకరు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కాబట్టి మానిటరింగ్ సమస్యలు ఉండవు.

కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో పేషెంట్లు డెలివరీ వరకూ ఒకే డాక్టర్ కావాలని కోరతారు. ఒకే డాక్టర్ ఒక పేషెంటునే అంటిపెట్టుకుని ఉండటం సాధ్యం కాదు. అంతేగాక పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి, లేటు వయసులో పెళ్లి చేసుకోవడం, ఆధునిక జీవనవిధానం గర్భిణులపై కూడా ప్రభావం చూపుతోంది. టైమ్‌కి తినకపోవడం వల్ల సరైన పోషకాలు అందడం లేదు. తద్వారా కడుపులో ఉన్న బిడ్డకు, తల్లికి రకరకాల సమస్యలు కలిగే అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటప్పుడు తల్లీ బిడ్డల్ని సేవ్ చేయడం కోసం ఆపరేషన్ చేయక తప్పడం లేదంటున్నారు ఉస్మానియా మెడికల్ కాలేజి రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిరాదేవి.

నార్మల్‌కే కష్టమెక్కువ సిజేరియన్ చేయడం నిమిషాల్లో పని. కానీ నార్మల్ డెలివరీ అంటే తల్లితో పాటు డాక్టర్ కూడా చాలా కష్టపడాలి. రిస్కు ఎక్కువ. అందువల్ల నిజానికి నార్మల్ డెలివరీకే ఎక్కువ ఖర్చు అవ్వాలి. కాబట్టి డబ్బుల కోసం సిజేరియన్ చేస్తారనడం హాస్యాస్పదం అంటారు ఇమేజ్ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ కృష్ణకుమారి. సమయమూ, కష్టమూ రెండూ మిగులుతాయని సిజేరియన్ చేయడానికి ఇష్టపడుతున్నారు.

డాక్టర్‌కీ, పేషెంటుకీ ఇద్దరికీ ఇది చాలా సౌకర్యవంతమైన పద్ధతి. అలాగని అనవసరంగా సిజేరియన్లు చేయడం కూడా మంచిది కాదు. ఒకసారి సిజేరియన్ అయిన తరువాత రెండోసారి గర్భం దాల్చినప్పుడు గర్భాశయం చిరిగిపోయే అవకాశాలుంటాయి. ప్లజెంటా సమస్యలు రావచ్చు. అందుకని ఎంతో అవసరం అనుకుంటే తప్ప సిజేరియన్ జోలికి పోకపోవడమే మంచిదంటున్నారు ఢిల్లీలోని ఎయిమ్స్‌కి చెందిన డాక్టర్ అల్కా కృపలానీ.

మిడ్‌వైఫ్ సిస్టమ్ బెస్ట్ మన దగ్గర డాక్టర్లు పేషెంట్ల సంఖ్యకు సరిపడినంత లేరు. పాశ్చాత్యదేశాల్లో మిడ్‌వైఫ్ సిస్టమ్ ఉంది. యుకె, యుఎస్‌లలో 60 నుంచి 70 శాతం డెలివరీలు మిడ్‌వైఫ్‌లే చేస్తారు. అక్కడి మిడ్‌వైఫ్‌లు సర్జరీలు తప్ప అన్నీ చేయగలరు. నార్మల్ డెలివరీలకు డాక్టర్ల అవసరం లేదు. అన్నీమిడ్‌వైఫ్స్‌లే చూసుకుంటారు. కాబట్టి డాక్టర్‌పై కూడా అంత ఒత్తిడి ఉండదు. ఇక్కడ అలాకాదు. మన దగ్గర సాధారణ నర్సులు తప్ప మిడ్‌వైఫ్ సిస్టమ్ అంటూ లేదు. కాబట్టి పని ఒత్తిడి, సమయం లేకపోవడం, 24 గంటల పాటు మానిటరింగ్‌లో తల్లిబిడ్డలకు ఉండే ప్రమాదాన్ని నివారించేందుకు చాలామంది డాక్టర్లు సిజేరియన్లు చేయడానికి మక్కువ చూపిస్తున్నమాట వాస్తవం.

అయితే పేషెంట్లు కూడా సిజేరియన్లనే కోరుకుంటున్నారు. లేబర్ నొప్పులను తట్టుకోలేకపోవడం, మన దగ్గర కొన్ని ఆసుపత్రుల్లో సరైన అనెస్తీషియా అందుబాటులో లేకపోవడం, పెయిన్ రిలీఫ్ మందులు సరైనవి లేకపోవడం వల్ల తల్లులు కూడా ఆపరేషనే బెస్ట్ అంటున్నారు. మన వాళ్లకి ప్రసూతి పట్ల ఏమాత్రం అవగాహన ఉండటం లేదు. సిజేరియన్ ఎందుకు చేయాల్సి వస్తోందని కూడా అడగరు. డాక్టర్ మాటే వేదం. కానీ ఏ కారణం వల్ల సిజేరియన్ చేస్తున్నారు, చేయకపోతే కుదరదా? రిస్కు ఎంత? తదితర వివరాల గురించి డాక్టర్‌ని అడిగి సమాచారం తెలుసుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇతర దేశాల్లో ఇవేవీ కనుక్కోకుండా ఎవరూ సిజేరియన్‌కి ఒప్పుకోరు. ఈ పరిస్థితి మారాలంటున్నారు ఫెర్నాండెజ్ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ గీత. మనవాళ్లలో చాలామందికి ముహూర్తాలపై నమ్మకాలు ఎక్కువ. కాబట్టి ఫలానా ముహూర్తంలోనే కనాలన్న ఆలోచనతో కూడా సిజేరియన్లకు ఓటేస్తున్నారంటున్నారామె.

డాక్టర్ల కష్టాలూ ఓ కారణం

- ప్రొఫెసర్ లిసిలొట్టి మెట్లర్, జర్మనీ తల్లీబిడ్డల రిస్కును ముందుగానే గుర్తించగల వైద్యపరికరాలు అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా సిజేరియన్లు పెరుగుతున్నాయి. అయితే ఇండియాలో మరీ ఎక్కువ. దాదాపు 50 శాతం ప్రసవాల్లో సిజేరియన్లే జరుగుతున్నాయి. జర్మనీలో సిజేరియన్ల సంఖ్య 30 శాతమే. పాశ్చాత్య దేశాలంతటా చూస్తే 20 నుంచి 30 శాతం ప్రసవాలకు సిజేరియన్లు అవసరం అవుతున్నాయి. జర్మనీలో ఎక్కువ శాతం పేషెంట్ల కోరిక మేరనే సిజేరియన్లు చేస్తాం. డెలివరీ సమయంలో ఉండే రిస్కును అవాయిడ్ చేయడానికి చాలామంది సిజేరియన్లు బెస్ట్ అనుకుంటారు.

ఇంతకు ముందులాగా ఎక్కువమంది పిల్లల్ని కనడం లేదు కాబట్టి ఉన్న ఒక్కరూ ఆరోగ్యంగా పుట్టాలనే కోరుకుంటారు. అందుకే ఏ చిన్న రిస్కును కూడా ఎదుర్కొనేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అయితే పదే పదే సిజేరియన్లు చేయడం మాత్రం సమంజసం కాదు. ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్లకు దీనివల్ల చాలారకాల సమస్యలు కలుగుతాయి. అంతకుముందే ఫైబ్రాయిడ్స్ వల్ల సర్జరీ అయినవాళ్లకు మరింత రిస్కు. సాధారణంగా బిడ్డ అడ్డం తిరిగి కాళ్లు కిందివైపుకి రావడం, తల్లి ఆరోగ్య సమస్యలు, హెచ్ఐవి, ఉమ్మనీరు ఎక్కువ తక్కువ కావడం, లేబర్ బ్లీడింగ్, బిపి, ఫిట్స్ లాంటి సమస్యలున్నప్పుడు సిజేరియన్ చేయడం తప్పనిసరి అవుతుంది. కానీ టైమ్ ఎక్కువ వెచ్చించలేక కూడా చాలామంది డాక్టర్లు సిజేరియన్ చేసేస్తున్నారు.

పేషెంట్లు కూడా 24 గంటలు నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేసే సమయం లేక సిజేరియన్ చేసేయమంటున్నారు. ఇండియాలో సిజేరియన్లు ఎక్కువ కావడానికి ఇదీ ఒక కారణమే. భారతీయులు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఇంటి బాధ్యతలు నెరవేర్చడం తప్పనిసరి. ముఖ్యంగా మహిళలు రాత్రి సమయాన్ని ఎక్కువగా వెచ్చించలేరు. మా దగ్గర పరిస్థితి వేరు. వ్యక్తిగత బాధ్యతల ఒత్తిడి తక్కువ. డాక్టర్లు ఏ అర్ధరాత్రి నొప్పులు వచ్చినా వెంటనే కేసు అటెండ్ అయి డెలివరీ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ ఇండియన్ డాక్టర్లు వృత్తి పట్ల ఎంత నిబద్ధత ఉన్నా కుటుంబ బాధ్యతలు, సామాజిక పరిస్థితుల వల్ల ఎప్పుడంటే అప్పుడు కేసు అటెండ్ కాలేరు. సిజేరియన్లు ఎక్కువ కావడానికి ఇదీ ఒక కారణమే అనుకుంటున్నాను. ఏది ఏమైనా భారతదేశంలో తల్లుల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది.

నార్మల్ డెలివరీ కావాలంటే...

సిజేరియన్‌లకి ముఖ్య కారణం ప్రసవ సమయంలో తల్లీ బిడ్డలకు సమస్యలు రావడమే. ఇవి నివారించగలిగితే ఆపరేషన్ చేయాల్సిన అవకాశాన్ని సగానికి సగం తగ్గించవచ్చు. ఇందుకు ఏం చేయాలో నిపుణుల సూచనలివి.
* గర్భిణులు ఎటూ కదలవద్దు. రెస్ట్‌లోనే ఉండాలనడం సబబు కాదు. ఏ పనీ చేయకుండా కూర్చుంటే కూడా ప్రసవంలో ఇబ్బంది రావచ్చు. అందుకే ప్రతిరోజూ కాసేపు వాకింగ్ చేయాలి. వాకింగ్ వల్ల పెల్విక్ కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. ప్రసవ సమయంలో కండరాల సంకోచవ్యాకోచాలు బావుంటాయి.
* గర్భంతో ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోకపోతే బిడ్డకు సరైన పోషకాలందక రిస్కు పెరుగుతుంది. అందువల్ల ఇనుము, కాల్షియం, విటమిన్లు, మినరల్స్.. ఇలా అన్ని రకాల పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవాలి. నోటికి రుచించకపోయినా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే అన్ని రకాల కూరగాయలు, పండ్లు తినక తప్పదు.
* బిపి, మధుమేహం లాంటి జబ్బులుంటే సాధారణ ప్రసవం కష్టం అవుతుంది. కాబట్టి గర్భిణులు బిపి, షుగర్‌లను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.
* సాధారణంగా చిన్నగా, పొట్టిగా ఉండేవారిలో సిజేరియన్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెల్విక్ నాళం చిన్నదిగా ఉండటం వల్ల బిడ్డ మామూలు బరువే ఉన్నప్పటికీ నార్మల్ డెలివరీ కష్టమై సిజేరియన్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇలాంటివాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి.
* నెలనెలా డాక్టర్ చెకప్‌లు తప్పనిసరి. నార్మల్ డెలివరీ వల్ల ప్రమాదం ఉండదని డాక్టర్లు తల్లిలో నమ్మకం కలిగించాలి. ప్రసవానికి సంబంధించిన అన్ని విషయాల్లో కౌన్సెలింగ్ ఇవ్వాలి. 
- రచన .కె

No comments:

Post a Comment