Pages

Friday, May 27, 2011

వంటిల్లే బ్యూటీపార్లర్


జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే... కొప్పు పెట్టుకునేంత జుట్టు లేకపోయినా అందంగా ఉండొచ్చంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. కేశాలంకరణ అనగానే పాపిటబిళ్ల, సూర్యచంద్రులు, జడ గంటలు గుర్తుకువస్తాయి. ఇప్పుడా మాట అంటే ఏ కాలంలో ఉన్నారు మీరు? అని అంటారు నేటి తరం అమ్మాయిలు. ఎందుకంటే...కేశాలకు కొత్త కళను తెచ్చే రకరకాల ఆభరణాలు మార్కెట్‌లో మెరిసిపోతున్నాయి. డిజైనర్లు పాత ఆభరణాలకి కొత్త రూపాన్నిచ్చి అమ్మాయిల మనసుల్ని దోచుకుంటున్నారు. హెయిర్‌బ్యాండ్, కొప్పుకు పెట్టుకునే పువ్వులు, కిరీటం డిజైన్లు, చంపసరాలు, చెంపలపై వేలాడే పాపిటబిళ్లలు...ఇలా రకరకాల ఆకారాలతో రంగురంగుల హెయిర్ జ్యువలరీ ప్రస్తుతం ఫ్యాషన్ వరల్డ్‌లో మెరుస్తోంది. అందులో కొన్ని డిజైన్లు ఇక్కడ చూడండి.
ప్రతిసారీ బ్యూటీపార్లర్ చుట్టూ తిరగకుండా, క్రీములు రుద్దకుండా వాడిన వెంటనే ఫలితమిచ్చే సౌందర్య సాధనాలు మన ఇంట్లోనే ఉన్నాయి. వాటి వాడకం, ఉపయోగం గురించిన వివరాలే ఇవి...

పెరుగు

ఎండ వేడికి నల్లకప్పేసిన చర్మానికి పెరుగు మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఎండ వల్ల కమిలిపోయిన చర్మంపై పెరుగు పూసుకోవాలి. అయితే జిడ్డు చర్మం, సున్నిత చర్మతత్వం ఉన్న వాళ్లు, యాక్నె ఉన్న వాళ్లు పెరుగు వాడకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే బ్యాక్టీరియా యాక్నె పెరిగేందుకు దోహద పడుతుంది. అందుకని నిమ్మరసం, గ్లిజరిన్‌లు సమ భాగాలుగా తీసుకుని ముఖానికి రాసుకోవాలి వాళ్లు. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ట్యాన్ పోవడమే కాకుండా చర్మం రంగు తేలుతుంది.

నిమ్మరసం

నిమ్మరసం ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకని జుట్టు రంగు మార్చుకోవాలనుకుంటే మూడు కప్పుల నీళ్లలో, పావుభాగం నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని జుట్టుపై పోసుకుంటే హెయిర్ కలరింగ్ ప్రొడక్ట్‌ల కంటే బాగా పనిచేస్తుంది.

కీరదోసకాయ

అలసిపోయి, ఉబ్బిపోయిన కళ్లు కాంతివిహీనంగా కనిపిస్తుంటే బాగా నిద్రపోతే సరిపోతుంది. కాని అది వీలుకానప్పుడు కీరదోసకాయ ముక్కల్ని గుండ్రంగా కోసుకుని కళ్ల పై ఓ 20 నిముషాల పాటు ఉంచాలి.

బంగాళా దుంప
బంగాళా దుంప తురుము కంటికింద ఉండే నల్లటివలయాలను మాయం చేస్తుంది. బంగాళా దుంపల్లో కాటెకొలేజ్ ఉంటుంది. ఇది సౌందర్య సాధనంగా పనిచేసి చర్మంపై ఉండే నలుపును తగ్గించేస్తుంది. పచ్చి బంగాళాదుంపను తురిమి రసం తీసి కంటికింద రాసుకోవాలి. పదిహేను నిముషాల తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. తేడా మీకే కనిపిస్తుంది.

టీ బ్యాగ్స్

అలసిన కళ్లు కాంతివంతంగా కనిపించాలంటే మరో టెక్నిక్ టీబ్యాగ్స్. టీబ్యాగ్స్‌ను గోరువెచ్చటి నీటిలో కొన్ని నిమిషాల పాటు నానపెట్టి ఆ తరువాత వాటిని రెండు కళ్లపై 20 నిమిషాల పాటు ఉంచాలి. టీబ్యాగ్స్ కళ్లకే కాకుండా కాళ్లకు కూడా బాగా పనిచేస్తాయి. కొందరి పాదాలు ఎంత శుభ్రం చేసుకున్నా దుర్వాసన వస్తుంటాయి. ఇటువంటి వాళ్లు నాలుగైదు టీ బ్యాగులను లేదా మూడు స్పూన్ల తేయాకు పొడిని నీళ్లలో వేసి ఉడికించాలి. గది ఉష్ణోగ్రత వరకు వచ్చిన తరువాత ఈ నీళ్లలో కొన్ని చల్లటి నీళ్లు కలపాలి. అందులో పాదాలను 30 నిమిషాల పాటు నానపెట్టాలి. పాదాలు ఆరిన తరువాత మెడికేటెడ్ ఫుట్ పౌడర్‌ను వేసుకోవాలి. సమస్య మరీ తీవ్రంగా ఉందనిపిస్తే ఈ పద్ధతిని రోజుకి రెండుసార్లు పాటించాలి. దుర్వాసన రావడం తగ్గిన తరువాత వారానికి రెండుసార్లు చేస్తే చాలు.

కమలా పండు రసం

ఇందులో ఉండే విటమిన్-సి మంచి టోనర్‌గా పనిచేస్తుంది. ఈ రసంతో మసాజ్ చేస్తే సబ్బు వల్ల కూడా పోని దుమ్ము, జిడ్డు వదిలిపోతాయి. టోనర్ తయారీకి అరచెక్క కమలా పండును ఒకటిన్నర స్పూను నిమ్మరసం, పావుకప్పు నీళ్లు కలిపి మెత్తగా అయ్యేవరకు మిక్సీ చేయాలి. ఆ తరువాత ఇందులో దూదిని నానపెట్టి ఆ దూదిని ముఖంపై మృదువుగా రుద్దాలి.

పెరుగు, శెనగపిండి, పసుపు

ఈ మూడు కలిపి వాడితే చర్మం రంగు నిగారింపు వస్తుంది. మూడు స్పూన్ల పెరుగులో ఒక స్పూను శెనగపిండి, చిన్న స్పూను పసుపు వేయాలి. గట్టిగా మెత్తటి పేస్ట్‌లా చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.

వెనిగర్

చుండ్రు తొలగించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా మాల్ట్ వెనిగర్ తీసుకుని మాడుపై మసాజ్ చేయాలి. పావుగంట లేదా ఇరవై నిమిషాల తరువాత హెర్బల్ షాంపూతో కడిగేయాలి. చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే వారానికి మూడుసార్లు ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే చుండ్రు మటుమాయం అవుతుంది.

తేనె - ఆలివ్ ఆయిల్

మంచి హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది ఇది. రెండు స్పూన్ల తాజా తేనెను ఒక స్పూను ఆలివ్ నూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతి మునివేళ్లతో తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు మర్దనా చేయాలి. మాడులోకి ఈ మిశ్రమం బాగా ఇంకేంత వరకు అంటే దాదాపు ఇరవై నిమిషాల తరువాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి.

బ్లాక్ టీ బ్యాగ్స్ - కొత్తిమీర ఆకులు
పెదవుల్ని మృదువుగా, అందంగా ఉంచుతాయి ఇవి. ఒక బ్లాక్ టీ బ్యాగును గోరు వెచ్చటి నీటిలో నానపెట్టాలి. తరువాత దాన్ని పెదవులపై ఉంచి పది నిమిషాల పాటు నెమ్మదిగా ఒత్తుతూ ఉండాలి. అవసరమనుకుంటే ఇంకా ఎక్కువసేపు కూడా చేయొచ్చు. బ్లాక్ టీలో ఉండే టానిన్ వల్ల పెదవులు మృదువుగా, అందంగా తయారవుతాయి. ఇదే కాకుండా కొత్తిమీర ఆకులు కూడా పెదవులకు బాగా పనిచేస్తాయి. పెదవులపై కొత్తిమీర రసాన్ని రుద్దితే గులాబీ రంగు సంతరించుకుని, మృదువుగా అవుతాయి.

Sunday, May 22, 2011

ఒక పౌష్టికాలోచన!

కొత్త పౌష్టికాహారం వచ్చిందనగానే... చూడ్డానికి వెయ్యి కళ్లొస్తాయి. కొనడానికి పది చేతులు వస్తాయి. అది రెడీమేడ్ ఫుడ్ అయితే మరీ మంచిది. ఎందుకంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల మనిషి రోజురోజుకీ నీరసించిపోతున్నాడు. రకరకాల కారణాల వల్ల ప్రకృతి ఇచ్చే పౌష్టికాహారాన్ని పొందలేకపోతున్నాడు. దీంతో బోలెడన్ని అంతర్జాతీయ వ్యాపారసంస్థలు పొడులరూపంలో రకరకాల ఆహారపదార్థాలను తయారుచేసి మార్కెట్‌లో పెడుతున్నాయి. వీటికి బోలెడు గిరాకి. కాని డబ్బున్నవారికే ఇవి అందుబాటులో ఉంటాయి. మరి పేదల సంగతేంటి? వీరి గురించి ఎవరూ ఆలోచించకపోయినా...నిజామాబాద్‌లో ఉండే ఒక గృహిణి ఆలోచించింది. అన్ని వర్గాలవారికీ అందుబాటులో ఉండే పౌష్టికాహారం తయారుచేసింది. అంతేనా... పేద ప్రజల ముంగిట్లో నిలబడి వాటినెలా తయారుచేసుకోవాలో కూడా వివరిస్తోంది. ఆ వివరాలు...

రోజూ మనం తినే తిండిలో ప్రకృతి నుంచి వచ్చే అన్ని రకాల ఆహారపదార్థాలు ఉండటం లేదు. అందుబాటులో లేక, ఒక వేళ ఉన్నా...ఉపయోగించుకునే విధానం తెలియక పౌష్టికాహారానికి దూరమవుతున్నాం. పేదలే కాదు మధ్యతరగతివారు సైతం ఏదో ఒకటి తిని...వారికున్నదానితో సరిపెట్టుకుంటున్నారు. మనకు అందుబాటులో ఉన్న పదార్థాలతోనే చక్కని పౌష్టికాహారం తయారుచేసుకుంటే ఎలా ఉంటుంది? అని ఆలోచించిన శ్రీదేవికి మొదట్లో ఇన్ని విషయాలు తెలియవు. ఎందుకంటే ఆమె చదివింది పదో తరగతే. పుట్టి పెరిగింది పల్లెటూర్లో. అయినా అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులకు ధీటుగా పౌష్టికాహారం తయారుచేస్తోంది.

సత్తిపిండితో మొదలై...

జొన్నలు, శెనగపప్పుతో చేసే జావని నిజామాబాద్ వాసులు సత్తిపిండి అంటారు. తన చిన్నప్పుడు అమ్మపెట్టిన సత్తిపిండిని గుర్తుచేసుకుని ఆ పదార్థాలతో కొత్తరకం న్యూట్రిషన్ పౌడర్ తయారుచేసింది శ్రీదేవి. ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే "మా వారు చంద్రమౌళి శర్మ, జ్యోతిష్యం చెబుతారు. మాకు ఇద్దరు పిల్లలు. 2004లో ఒకసారి ఆయన ఏదో పనిమీద నెలరోజులు టూర్ వెళ్లారు. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను.

ఆ సమయంలో నాకు వచ్చిన ఆలోచన ఈ న్యూట్రిషన్ ఫుడ్. చిన్నప్పుడు అమ్మ పెట్టిన సత్తిపిండిలో రెండే పదార్థాలు ఉండేవి. కాని నేను పది రకాలు వేసి దాన్ని మరింత బలవర్ధకంగా చేయాలనుకున్నాను. రాగులు, జొన్నలు, మినుములు, పెసలు, బెల్లం, ఐదు రకాల డ్రైఫ్రూట్స్ కలిపి పొడి తయారుచేశాను. నిజామాబాద్‌లో మేముండే వినాయక్‌నగర్‌లో ఒక సూపర్‌మార్కెట్‌కి తీసుకెళ్లి చూపించాను. వారికి బాగా నచ్చింది. రకరకాల సైజుల్లో ప్యాకింగ్ చేసి ఇమ్మన్నారు. నా పొడికి గిరాకి బాగా ఉందని చెప్పడంతో నాకు ధైర్యం వచ్చింది. చిన్నస్థాయి కుటీర పరిశ్రమ నెలకొల్పాలనుకున్నాను'' అని చెప్పారు శ్రీదేవి.

శ్రీదత్తా న్యూట్రిషన్స్...
ఏదైనా వస్తువు తయారుచేయడం ఒక ఎత్తు, దాన్ని మార్కెట్‌లో అమ్మి లాభాలను గడించడం మరో ఎత్తు, రెండు విషయాల్లో నూ శ్రీదేవి కొత్త పద్ధతిని అనుసరించింది. "నేను తయారుచేసిన సత్తిపిండికి గిరాకీ పెరగడంతో 2005లో ఇంట్లోనే ' శ్రీదత్తా న్యూట్రిషన్స్' అనే సంస్థని పెట్టి పెద్ద మొత్తంలో పౌష్టికాహారాన్ని తయారుచేయడం మొదలుపెట్టాను. చిన్న చిన్న ప్యాకెట్లు తయారుచేసి రోడ్డు పక్కన ఉండే పండ్ల దుకాణాల్లో పెట్టాను. ప్రతీ ప్యాకెట్టుకీ ఒక చిన్న కరపత్రం జోడించాను. అందులో ప్రాడక్ట్ వివరాలు, ప్రయోజనాలు, నా అడ్రసు ఇచ్చి ఏవైనా సలహాలు ఇమ్మని రాశాను. పండ్లు కొనడానికి వచ్చిన వారికి ఒక్కో ప్యాకెట్టు ఉచితంగా ఇచ్చేవారు. అలా పంచినందుకు ఆ పండ్లదుకాణాలవారికి కొంత డబ్బు ఇచ్చేదాన్ని.

వ్యాపార మెళకువలు...

ఒకరోజు ఇంటికి లెటర్ వచ్చింది. ఎవరో లెక్చరర్ రాశారు. ' నేను మీ న్యూట్రిషన్ పొడిని కొనుక్కున్నాను. చాలా బాగుంది. మార్కెటింగ్ చేసే విధానం మెరుగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రొడెక్టవిటీ కౌన్సిల్‌లో శిక్షణ తీసుకుంటే బాగుంటుంది' అని రాశారు.

వెంటనే నేను అక్కడికి వెళ్లాను. అక్కడ శ్రీనివాస్ రఘు అనే ఆఫీసర్ని కలిసాను. వ్యాపార మెళకువలలో ఓ పది రోజులు శిక్షణ తీసుకున్నాను. అక్కడ వారు చెప్పిన పాఠాలు నా సంస్థ అభివృద్దికి చాలా ఉపయోగపడ్డాయి. ఆ తరువాత శ్రీనివాస్‌గారి సలహాతో జాతీయ పోషకాహార సంస్థ వారి పుస్తకాలు చదివాను. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. వయసుని బట్టి, అవసరాన్ని బట్టి పౌష్టికాహారం తయారుచేయాలని అర్థమైంది'' అని చెప్పారు శ్రీదేవి.

ఎన్ని రకాలు...

ప్రస్తుతం శ్రీదేవి దగ్గర పద్దెనిమిది రకాల పౌష్టికాహారాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు పట్టే ఉగ్గు దగ్గర నుంచి పండు ముసలివారికి ఇవ్వాల్సిన ఆహారం వరకూ రకరకాల పొడులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని లడ్డూల రూపంలో కూడా ఉంటాయి.

నెలల వయసున్న పిల్లలకు, మూడేళ్ల వయసువారికి, పదిహేనేళ్ల వయసువారికి, పాతికేళ్ల వారికి, నలభైఏళ్లవారికి, యాభై దాటిన వారికి, డెబ్బైదాటిన వారికి, శారీరక వికలాంగులకి, మానసిక వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకు...ఇలా ఒక్కో వయసువారికి ఒకో రకం పొడి తయారుచేస్తారు. జిమ్‌లకు వెళ్లేవారికి, బిపీ, షుగర్‌లతో ఇబ్బందిపడేవారికి కూడా ప్రత్యేకంగా పొడులు తయారుచేస్తున్నారు. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ఆహార సంస్థ పరీక్షించింది. ల్యాబ్ టెస్ట్ చేసి అందులో ఉన్న పౌష్టిక విలువల గురించి అధ్యయనం చేసి గుర్తింపునిచ్చింది. దాంతో శ్రీదేవి పనిని పెద్ద పెద్ద సంస్థలు సైతం గుర్తించాయి.

రాష్ట్రం దాటిన పాఠాలు...

'శ్రీ దత్తా న్యూట్రిషన్స్' గురించి తెలుసుకున్న 'స్వదేశీ జాగరణ్‌మంచ్' అనే సంస్థ శ్రీదేవిని కేరళ తీసుకెళ్లింది. అక్కడ జరిగిన ఒక వర్క్‌షాప్‌లో పౌష్టికాహారం గురించి శ్రీదేవి ఇచ్చిన ప్రసంగాన్ని విని కేరళ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే... మన రాష్ట్రంలో తాను చేస్తున్న పని గురించి చెప్పకుండా కేరళలో ఉండే ఆహార పదార్థాలతో పౌష్టికాహారం ఎలా తయారుచేసుకోవాలో వివరంగా చెప్పిందామె...

" కేరళకు వెళ్లే ముందే అక్కడి ఆహారం గురించి కొంత స్టడీ చేశాను. ఆహారం విషయంలో మనకీ, వారికీ చాలా తేడాలుంటాయి. అందువల్ల వారికి అందుబాటులో ఉండే ఆహార పదార్థాలతోనే పౌష్టికాహారం ఎలా తయారుచేసుకోవచ్చో కొన్ని ఉదాహరణలతో చెప్పాను. ప్రయోజనాలు కూడా వివరించాను. వాళ్లు చాలా సంతోషించారు. నిజానికి నేను చదువుకున్నది పదోతరగతే. ఇంగ్లీషు గొప్పగా రాదు. కాని నేను హాజరయిన వేదికలే నాకు ఆంగ్లం నేర్పించాయి. ఒకటి రెండు కాదు...హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఫ్యాప్సీ...లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో అడుగుపెట్టే అవకాశం వచ్చింది నాకు. నాకు తెలియని ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను'' అని గతం గుర్తుచేసుకున్నారామె.

పేదలకు శిక్షణ...

శ్రీ దత్తా న్యూట్రిషన్‌లో ఇప్పుడు ఎనిమిది మంది ఆడవాళ్లు పనిచేస్తున్నారు. అందులో ఇద్దరు వికలాంగులు. ఏటా ఎనిమిదిలక్షల రూపాయల వ్యాపారం జరుగుతోంది. నిజామాబాద్‌లో ఉన్న ఐదు 'శుభోదయ' పాఠశాలల్లోని పిల్లలకు పౌష్టికాహారం అందించే బాధ్యత ప్రభుత్వం శ్రీదేవికే అప్పగించింది. ఈ ఫుడ్‌ని కొనుక్కునే స్థోమత లేని పేదవారికి శ్రీదేవి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో చెబుతున్నారు.

నిజామాబాద్‌లోని ప్రతీ మండలంలోని రైతులందరికీ పౌష్టికాహారం తయారీ గురించి, ప్రయోజనాల గురించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. మొన్నటివరకూ మాటలతో వివరించిన ఆమె ప్రస్తుతం పవర్‌పాయింట్ ప్రజంటేషన్లు కూడా ఇస్తోంది. తయారి నుంచి మార్కెటింగ్ వరకూ అన్నింటా రాణిస్తున్న శ్రీదేవిని పలు సంస్థలు ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్తగా గుర్తించి సన్మానాలు చేశాయి. " నేను తయారుచేసిన పౌష్టికాహారం ప్రజలందరికీ అందాలి. మరీ ముఖ్యంగా వందల రూపాయలు ఖర్చుపెట్టి పౌష్టికాహారం కొనుక్కోలేని పేదప్రజలకి అందాలి. దానికన్నా ముందు వారికి ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల అవగాహన రావాలి. పదేళ్లుగా నిర్విరామంగా పనిచేస్తుంటే ఇప్పటికి మా జిల్లాలో కొందరికి పౌష్టికాహారం పట్ల కొంత అవగాహన వచ్చింది. ప్రతి ఒక్కరికి తెలియాలంటే నేను ఇంకా చాలా కష్టపడాలి. దీనికి కావాల్సిన సులభమార్గాలు వెతుక్కునే పనిలో ఉన్నాను'' అని చెప్పారు శ్రీదేవి.

ఇవి కాకుండా...

తాను తయారుచేసిన ఆహారం అమ్ముకుని నాలుగు రూపాయలు వెనకేసుకునే పనిలో ఉండకుండా .. శ్రీదేవి మరిన్ని కొత్త ఆవిష్కరణలకు ఆహ్వానం పలుకుతున్నారు. స్థూలకాయంతో బాధపడుతున్నవారికి నెల రోజుల కోర్సు ఒకటి ప్రారంభించారు. వారికి ప్రత్యేకమైన పొడులు తయారుచేసి ఇస్తున్నారు. అలాగే వారు రోజూ చేయాల్సిన వ్యాయామాలు, వారి దినచర్య గురించి శిక్షణ ఇస్తున్నారు. గర్భిణిస్త్రీలకు పౌష్టికాహారంతో పాటు మామూలు కాన్పు అవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇంట్లోనే పాఠాలు చెబుతున్నారామె.

ఎన్ఐఎఫ్ గుర్తింపు...

జిల్లాకే పరిమితమైన తన పౌష్టికాహారానికి జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు శ్రీదేవి. " నాకు తెలిసిన ఒక వ్యక్తి హనీబీ సంస్థ గురించి చెప్పారు. వెంటనే ఆ సంస్థ కోర్డినేటర్ బ్రిగేడియర్ గణేశంగారిని కలిశాను. నేను చెప్పిన వివరాలన్నీ విని శ్రీ దత్తా న్యూట్రిషిన్‌కి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. నేషనల్ ఇన్నోవేషనల్ ఫౌండేషన్‌లో స్థానం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 25న కలవమని ఎన్ఐఎఫ్ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది'' అని ఎంతో సంతోషంగా చెప్పారామె.

"ప్రస్తుతం శ్రీదేవి దగ్గర పద్దెనిమిది రకాల పౌష్టికాహారాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు పట్టే ఉగ్గు దగ్గర నుంచి పండు ముసలివారికి ఇవ్వాల్సిన ఆహారం వరకూ రకరకాల పొడులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని లడ్డూల రూపంలో కూడా ఉంటాయి. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ఆహార సంస్థ పరీక్షించింది. ల్యాబ్ టెస్ట్ చేసి అందులో ఉన్న పౌష్టిక విలువల గురించి అధ్యయనం చేసి గుర్తింపునిచ్చింది.''
* భువనేశ్వరి

Monday, May 16, 2011

కాఫీ ఆరోగ్యకరమే!

ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ తాగితే కానీ ఉల్లాసంగా అనిపించదు చాలా మందికి. ఉదయమేనా? బద్ధకంగా అనిపించినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు.. ఇలా పలు
సందర్భాలలో కాఫీ తాగి వెంటనే ఉల్లాసాన్ని పొందుతుంటారు. అయితే కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని అంతకన్నా పళ్ళ రసాలు తాగడం మంచిదనే భావన కూడా ఉన్నది. 
ఇందులో నిజానిజాలు పరిశీలిద్దాం...

COFFEE 
చాలామంది కాఫీ అనగానే దానిలో ఉండే కెఫైన్‌ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ కాఫీ అనేది వందలాది కాం పౌండ్లు ఉన్న ఒక పానియం అంటున్నారు పౌష్టికాహార నిపుణు లు కొందరు. కొద్ది మాత్రపు కెఫైన్‌ (400-500 మి.గ్రా.) తాగ డం అనేది మన మానసిక కార్యకలాపాలను, పనితీరు, ప్రతిస్పం దించే సమయం. అప్రమత్తత, దృష్టితో పాటుగా మన మూడ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది.కొన్ని సందర్భాలలో కాఫీ తాగడమనేది ఆరోగ్యకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. అయితే మ నం తాగే కాఫీ ఏది అనేది కూడా ముఖ్యమేనంటున్నారు. ఏ రకం కాఫీ తాగుతున్నారు, ఎలా తాగుతున్నారు అనే దానిని బట్టే పరిణామాలు కూడా ఉంటాయిట.

కాఫీయా? పళ్ళ రసమా?
కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ధాతువులకు ఇన్సులిన్‌ సరఫరాలో సాయపడతాయి.అంతేనా గ్లూకోజ్‌ ప్రతి స్పందనను డికాఫినేటెడ్‌ కాఫీ తగ్గిస్తుందని కూడా పరిశోధనలలో రుజువైంది. మరోవైపు పళ్ళ రసాలలో చక్కెర పదార్ధం అధికంగా ఉంటుంది. ఒకవేళ అందులో చక్కెర పదార్ధం ఎక్కువ లేకపోయినప్పటికీ పళ్ళ రసాలు తేలికగా జీర్ణమైపోతాయి. అందులో ఫైబర్‌ కూడా తక్కువే ఉంటుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. అందు కే చక్కెర వ్యాధి ఉన్న వారిని పళ్ళ రసాలు తాగవద్దని అంటారు.పాకేజ్డ్‌ పళ్ళ రసాలలో రంగులు, ప్రిజర్వేటివ్లు, రసాయనాలు ఉంటాయి. ఇవి మోతాదును మించి ఉంటే కాన్సర్‌కు దారి తీసే ప్రమాదం కూడా ఉన్నది. పళ్ళ రసం కన్నా అందులోనూ తియ్య గా చేసుకున్న పళ్ళ రసంకన్నా మొత్తంగా పండును తినడం ఎం తైనా మేలు. మరోవైపు ఒక కప్పు కాఫీ తాగడం ఎంతైనా మంచిదిట. ఎందుకంటే అందులో ఉండే చురుకైన కాంపౌండ్‌ మెథిల్‌పైరిడీనయం అనే పదార్ధం కొలోన్‌ కాన్సర్‌ను నివారించే ఎంజైమ్‌లను ఉత్తేజితం చేస్తుందిట.

ఆరెంజ్‌ జ్యూస్‌ కన్నా కాఫీలో అధికంగా కరిగిపోయి కలిసిపోయే ఫైబర్‌ ఉన్నందున ఆరోగ్యానికి కాఫీనే మంచిదిట! ఆధునిక కాలంలో అనేకమంది ఒక గ్లాసు ఆరెంజ్‌ జ్యూస్‌ తాగి రోజును ఆరోగ్యంగా ప్రారంభిస్తున్నామనుకుంటారు. కానీ వారికి తెలియంది ఏంటంటే ఒక గ్లాసు కోకాకోలాలో ఉండేంత చక్కెర పదార్ధమే అందులోనూ ఉంటుందని. కరిగి, కలిసిపోయే ఫైబర్‌ ఎం దుకు లాభదాయకమంటే అది కొలెస్ట్రాల్‌ ఏర్పడకుండా నివారించడమే కాకుండా ధమనులను వెడల్పు చేయడం ద్వారా హై బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గిస్తుంది.

కాఫీ ఎంపికలో జాగ్రత్తలు...
కాఫీలో ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిని ఉత్తేజితం చేసే కెఫెస్టాల్‌ అనే పదార్ధం ఉంటుంది. కాఫీలో ఉండే నూనె పదార్దంలో ఈ కెఫెస్టాల్‌ ఉంటుంది. కాఫీని పేపర్‌ ఫిల్టర్‌ ద్వారా వడపోసినప్పుడు కెఫెస్టాల్‌ అందులోకి దిగదు. బాయిల్డ్‌ కాఫీ, ఫ్రెంచ్‌ ప్రెస్‌ కాఫీ, టర్కిష్‌ కాఫీలలో కెఫెస్టాల్‌ అధికంగా ఉంటుంది. ఎస్పెసో కాఫీ మధ్యస్థంగా చెప్పుకోవచ్చు. ఎల్‌డిఎల్‌ పెరగడాన్ని నివారించాలంటే ఇన్‌స్టాంట్‌ కాఫీని వాడకపోవడమే మంచిది.

పాలు, పంచదార, మీగడ, ఇతర ఫ్లేవర్లు వేసి కలిపిన కాఫీ ఆరోగ్యకరం కాదు. ఉదాహరణకు 500 మి.లీ. చాకొలెట్‌ విప్డ్‌ క్రీమ్‌ కలిపిన మోచా చిప్‌ ఫ్రాపుచినోలో 470 కేలరీలు ఉంటాయి. దానితో పాటుగా ఒకరోజుకు సరిపోయే 12 గ్రా.ల శాచ్యురేటెడ్‌ కొవ్వు, 71 గ్రా. పంచదార ఉంటాయి. అంటే 17 స్పూన్ల చక్కెరతో సమానమన్నమాట. కనుక ఆరోగ్యం కావాలంటే ఒక కప్పు బ్లాక్‌ కాఫీ తాగడం మంచిది. ఏది ఏమైనా అతి సర్వత్ర వర్జయేత్‌ అన్న విషయాన్ని మనసులో పెట్టుకుంటే మంచిది.

ఆరోగ్యానికి ఆహారం

ఆధునిక కాలంలో ఉద్యోగాలు మెదడుకు తప్ప శరీరానికి శ్రమ ఇచ్చేవిగా ఉండడం లేదు. రోజుకు పది పన్నెండు గంటల పాటు కదలకుండా డెస్క్‌ ముందు కూచొని పని చేసి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చి తినీ తినక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కద్దు. దాదాపుగా ఏ రంగాన్ని తీసుకున్నా పని విధానమిలాగే ఉంటోంది. కనుక ఉద్యోగం మానడమనేది కుదరని పని. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమెలా అంటే అందుకూ మార్గం ఉన్నది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రోజంతా రోబోలా కూర్చుని పని చేయడం వల్ల వచ్చే ప్రతికూల పరిణామాలను తగ్గించుకోవచ్చు.

chokletఆఫీసులో కూర్చుని ఏం తింటాం అనుకోనవసరం లేకుండా తేలికగా మోసుకు వెళ్ళగల ఆహారమిది. అవి మీ గుండెకు, బిపికి, మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఆహారమిది. అందులో ఐదింటి గురించి తెలుసుకుందాం...

అక్రూట్లు...
బాదం పప్పు, బఠాణీలు, పిస్తాలు, మరే ఇతర నట్స్‌ కన్నా కూడా అక్రూట్లలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని కొత్త పరిశోధనలు తెలిపుతున్నాయి. డ్రైఫ్రూట్స్‌ అన్నీ గుండెకు సంబంధించే వ్యాధులను తగ్గించే లిపిడ్స్‌ను మెరుగుపరుస్తాయి. కానీ అక్రూట్లు అంతకు మించి సాయపడతాయని పరిశోధనలలో తేలింది. అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న జంతువులకు వీటిని తినిపించగా వాటి జ్ఞాపకశక్తి మెరుగుపడినట్టు తేలింది. రోజుకు ఏడు అక్రూట్‌ పప్పులు తింటే చాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.

కప్పు గ్రీన్‌ టీ...
green-teaగ్రీన్‌ టీలో అధిక శాతం ఉండే పాలిఫెనాల్స్‌ ధ్వంసమైన డిఎన్‌ఎను మరమ్మత్తు చేయడమే కాక ఇమ్యూన్‌ వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తాయి. అంతేకాదు గ్రీన్‌ టీలు కాన్సర్‌ రాకుండా నిరోధిస్తుంది. చర్మం, ప్రోస్ట్రేట్‌ కాన్సర్లు రాకుండా కూడా ఇది నిరోధించగలదు.

పాప్‌కార్న్‌...
ఆరోగ్యకరమైన స్నాక్స్‌ చిట్టా ఏదైనా మీ వద్ద ఉంటే అందు లో తప్పనిసరిగా ఉండే పేరు దీనిదే.మనకందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్‌లో పాప్‌కార్న్‌ ఒకటని చాలా మంది చెప్తుంటారు.ఇందులో ఫైబరే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికశాతంలో ఉంటాయి. అయితే ఉప్పు తగ్గించుకొని వేసుకుంటే దాన్ని మించిన ఆహారం లేదని నిపుణులు చెబుతున్నారు. మీ ఆఫీసులో మైక్రోవేవ్‌ అందుబాటులో ఉంటే తక్కువ ఉప్పు గల పాప్‌కార్న్‌ తెచ్చి రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.

డార్క్‌ చాకొలేట్‌...
dorkఇందులో కూడా పాలిఫెనాల్స్‌ వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధులను నిరోధించడమే కాదు రక్తం గడ్డకట్టిపోవడాన్ని కూడా నిరోధిస్తుందిట. రోజూ చిన్న డార్క్‌ చాకొలెట్‌ బార్‌ను తింటే రక్తపోటు తగ్గుతుందిట. డార్క్‌ చాకొలేట్‌లో ఉండే కెఫైన్‌ మానసికంగాఉత్తేజితం చేయడమే కాదు ఏకాగ్రత పెరిగేందుకు కూడా దోహదం చేస్తుంది.



పళ్ళు...
frutsఆకలి వేస్తున్న భావనను జయించేందుకు అత్యుత్తమ ఆయుధం పళ్ళే. అంతేకాదు అందులో ఉండే పౌష్టికత మనం నీరసపడకుండా రోజంతా పని చేసేందుకు సాయపడుతుంది. ఆపిల్స్‌, అరటి పళ్ళు, మామిడిపళ్ళు, బొప్పాయ వంటి పళ్ళను రోజు వారీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.ఆరోగ్యాన్ని కాపాడుకోవడా నికి ఆ మాత్రం చేయాలి మరి!