ఆధునిక కాలంలో ఉద్యోగాలు మెదడుకు తప్ప శరీరానికి శ్రమ ఇచ్చేవిగా ఉండడం లేదు. రోజుకు పది పన్నెండు గంటల పాటు కదలకుండా డెస్క్ ముందు కూచొని పని చేసి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చి తినీ తినక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కద్దు. దాదాపుగా ఏ రంగాన్ని తీసుకున్నా పని విధానమిలాగే ఉంటోంది. కనుక ఉద్యోగం మానడమనేది కుదరని పని. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమెలా అంటే అందుకూ మార్గం ఉన్నది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రోజంతా రోబోలా కూర్చుని పని చేయడం వల్ల వచ్చే ప్రతికూల పరిణామాలను తగ్గించుకోవచ్చు.
ఆఫీసులో కూర్చుని ఏం తింటాం అనుకోనవసరం లేకుండా తేలికగా మోసుకు వెళ్ళగల ఆహారమిది. అవి మీ గుండెకు, బిపికి, మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఆహారమిది. అందులో ఐదింటి గురించి తెలుసుకుందాం...
అక్రూట్లు...
బాదం పప్పు, బఠాణీలు, పిస్తాలు, మరే ఇతర నట్స్ కన్నా కూడా అక్రూట్లలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని కొత్త పరిశోధనలు తెలిపుతున్నాయి. డ్రైఫ్రూట్స్ అన్నీ గుండెకు సంబంధించే వ్యాధులను తగ్గించే లిపిడ్స్‌ను మెరుగుపరుస్తాయి. కానీ అక్రూట్లు అంతకు మించి సాయపడతాయని పరిశోధనలలో తేలింది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న జంతువులకు వీటిని తినిపించగా వాటి జ్ఞాపకశక్తి మెరుగుపడినట్టు తేలింది. రోజుకు ఏడు అక్రూట్ పప్పులు తింటే చాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.
కప్పు గ్రీన్ టీ...
గ్రీన్ టీలో అధిక శాతం ఉండే పాలిఫెనాల్స్ ధ్వంసమైన డిఎన్‌ఎను మరమ్మత్తు చేయడమే కాక ఇమ్యూన్ వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తాయి. అంతేకాదు గ్రీన్ టీలు కాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. చర్మం, ప్రోస్ట్రేట్ కాన్సర్లు రాకుండా కూడా ఇది నిరోధించగలదు.
పాప్‌కార్న్...
ఆరోగ్యకరమైన స్నాక్స్ చిట్టా ఏదైనా మీ వద్ద ఉంటే అందు లో తప్పనిసరిగా ఉండే పేరు దీనిదే.మనకందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్‌లో పాప్‌కార్న్ ఒకటని చాలా మంది చెప్తుంటారు.ఇందులో ఫైబరే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికశాతంలో ఉంటాయి. అయితే ఉప్పు తగ్గించుకొని వేసుకుంటే దాన్ని మించిన ఆహారం లేదని నిపుణులు చెబుతున్నారు. మీ ఆఫీసులో మైక్రోవేవ్ అందుబాటులో ఉంటే తక్కువ ఉప్పు గల పాప్‌కార్న్ తెచ్చి రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.
డార్క్ చాకొలేట్...
ఇందులో కూడా పాలిఫెనాల్స్ వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధులను నిరోధించడమే కాదు రక్తం గడ్డకట్టిపోవడాన్ని కూడా నిరోధిస్తుందిట. రోజూ చిన్న డార్క్ చాకొలెట్ బార్‌ను తింటే రక్తపోటు తగ్గుతుందిట. డార్క్ చాకొలేట్‌లో ఉండే కెఫైన్ మానసికంగాఉత్తేజితం చేయడమే కాదు ఏకాగ్రత పెరిగేందుకు కూడా దోహదం చేస్తుంది.
పళ్ళు...
ఆకలి వేస్తున్న భావనను జయించేందుకు అత్యుత్తమ ఆయుధం పళ్ళే. అంతేకాదు అందులో ఉండే పౌష్టికత మనం నీరసపడకుండా రోజంతా పని చేసేందుకు సాయపడుతుంది. ఆపిల్స్, అరటి పళ్ళు, మామిడిపళ్ళు, బొప్పాయ వంటి పళ్ళను రోజు వారీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.ఆరోగ్యాన్ని కాపాడుకోవడా నికి ఆ మాత్రం చేయాలి మరి!
No comments:
Post a Comment