Pages

Saturday, September 11, 2010

జంతు'యోగం'

ఏ జంతువునైనా కరకరా నమిలి జీర్ణం చేసుకుంటుంది సింహం. ఎంతటి విషంకక్కే పాములను మింగినా సరే, నెమలి నిగనిగలాడుతూనే ఉంటుంది. మెరుపు వేగంతో పరిగెత్తే కుందేలుకు అలసట అంటే తెలీదు. మైళ్లదూరం ప్రయాణమంటే గద్దకు లెక్కేలేదు. తలకు మించిన బరువును సైతం లాగిపడేస్తుంది వృషభం. నిప్పుల కొలిమిలాంటి ఎడారిలో ఒంటె హాయిగా జీవించేస్తుంది. ఇరుకైన ప్రదేశానికి తగ్గట్టు పాము తన శరీర పరిమాణాన్ని మార్చుకుంటుంది. ఏమిటీ జీవ రహస్యం..? ఒక్కో జంతువుకు ఒక్కో అపురూప జీవలక్షణాలను అందించిన ప్రకృతి మహత్యమది. అలాంటి అన్ని లక్షణాలు మనుషులకూ వస్తే, ఇంకెంత ఆరోగ్యంగా ఉంటారు..? అన్న ఆలోచన నుంచే పుట్టాయి ఈ యోగాసనాలు.... వీటిని మనకు వివరించారు భారతీయ యోగా సంస్థాన్ హైదరాబాద్ అధ్యక్షులు ప్రకాష్‌రావు.

ఊష్ట్రాసనం
ఊష్ట్రం అంటే ఒంటె. ఈ ఆసనంలో శరీరం ఒంటెలాగ ఒంకరటింకరగా కనిపిస్తుంది. ఒంటె సాధు జంతువైనా బలిష్టంగా ఉంటుంది. మన శరీరం కూడా ఒంటెలాగ బలంగా ఉండేందుకు ఈ ఆసనం తోడ్పడుతుంది. ఈ ఫొటోలో ఉన్నట్లు.. మోకాళ్ల మధ్యన భుజాల మధ్య ఉన్నంత వెడల్పు ఉంచాలి. పాదాలు ఆకాశం వైపు చూడాలి. తల వెనక్కి వంచాలి. అరచేతులు అరికాళ్లపైన ఉంచాలి. కళ్లు మూసుకొని వెన్నెముక మీద కలిగే ప్రభావాన్ని గమనించాలి.

ప్రయోజనం : మనం చేసే రోజువారీ పనుల్లో ఎక్కువ సమయం ముందుకు వంగి చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల వెన్నుపూసలు దగ్గరై.. వాటి నడుమ ఉన్న గ్రంధులు ఒత్తిడికి గురవుతాయి. ఈ ఆసనంలో వెనక్కి వంగడం వల్ల రక్తప్రసరణ జరగని భాగాలు సర్దుకుంటాయి. మెడభాగం (సర్వికల్), నడుము మధ్య భాగం ( డోర్సల్) , నడుం కిందిభాగం (లంబార్) ఆరోగ్యంగా ఉంటాయి.  

సింహాసనం
సింహం అడవికి రాజు. అది ఎంత కఠినమైన ఆహారం తిన్నా అరిగించుకుంటుంది. సింహం తరచూ గర్జించడం వల్ల దాని లోపలి అవయవాలు చురుగ్గా తయారవుతాయి. సింహ ఆసనం వేసేవాళ్లకూ ఆ ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఫోటోలో చూపిన విధంగా కాళ్లు మడిచి కూర్చున్నాక, చేతులు ముందుకుచాపి నిటారుగా వంగాలి. నోరు పెద్దగా తెరిచి, నాలుకను బయట పెట్టి సింహంలా గర్జించాలి. కంఠం, ఛాతీ పూర్తిగా తెరుచుకోవాలి.

ప్రయోజనం : కంఠానికి సంబంధించి ఎలాంటి వ్యాధులున్నా ఈ ఆసనం వాటిని పోగొడుతుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. కళ్లు, ముక్కు, చెవుల పనితీరును మెరుగు పరుస్తుంది. పిత్తాశయంలో రాళ్లు చేరకుండా కాపాడుతుంది. ఒకవేళ ఇప్పటికే రాళ్లు ఏర్పడి ఉంటే.. మూత్రం ద్వారా బయటికి పంపుతుంది ఈ ఆసనం.  

భుజంగాసనం
పాముకు శరీరాన్ని ఎలా కావాలంటే అలా తిప్పుకొనే సౌకర్యం ఉంటుంది. పాము శరీరానికి ఉన్న లాభం మన శరీరానికి కూడా కలిగేలా చేస్తుంది భుజంగాసనం. రెండు చేతులనూ భూమికి ఆనించి, తలపైకెత్తి చూడాలి. వెన్నుపూసను కొద్దిగా వంచాలి.

ప్రయోజనం : మన శరీరానికి ఆధారం వెన్నుపూస. ఈ ఆసనం వేయడం వల్ల వెన్ను బలిష్టంగా తయారవుతుంది. వెన్నుపూస సమస్యలన్నీ తొలగిపోతాయి. వీపునొప్పి వెంటనే తగ్గిపోతుంది. మూల నాడులు, నాడీమండలం దృఢమవుతాయి. సెర్వికల్ నొప్పితో బాధపడే మహిళలకు ఈ ఆసనం ఎంతో ఉపయోగం.  



మయూరాసనం
పాములు నెమలికి ఆహారం. అయినా పాముల్లోని విషం నెమళ్లను ఏమీ చేయలేదు. విషాహారాన్ని కూడా జీర్ణం చేసుకోగల శక్తిని మయూరాసనం ఇస్తుంది. రెండు అరిచేతులను నేల మీద ఆన్చాలి. చేతులు పాదాల వైపు తిరిగుండాలి. నాభికి చెరోవైపు రెండు మోచేతులను ఉంచాలి. శరీరం కేవలం రెండు అరిచేతుల మీద నిటారుగా ఉంచాలి. ఈ స్థితిలో మెల్లగా శ్వాసను పీల్చాలి.

ప్రయోజనం : ఈ ఆసనం వల్ల కోలన్ నాడి (పెద్ద పేగులు) ప్రభావితం అవుతాయి. ఎంతో కాలం నుంచి వేధించే మలబద్ధకం అయినా తగ్గిపోతుంది. జఠరాగ్ని పెరుగుతుంది. నాభిని సరైన స్థానంలోకి తీసుకురావడం ఈ ఆసనంలోని ప్రత్యేకత. హెర్నియా, సయాటికా దోషాలు తగ్గుతాయి.
 
గరుడాసనం
శరీరాన్ని గరుడ పక్షి (గద్ద) ఆకారంలో ఉంచితే అది గరుడాసనం అవుతుంది. గద్ద ఎంత దూరం ప్రయాణించినా ఆయాసపడదు. ఆ లక్షణం మనకూ రావాలంటే ఈ ఆసనం వేయాలి. రెండు చేతులు, కాళ్లు మెలితిరిగినట్లు, పెనవేసుకున్నట్లు శరీరాన్ని ఉంచాలి. శ్వాసను బయటికి వదిలి సాధ్యమైనంత వరకు ఆపాలి. ఇదే ఆసనాన్ని తిరిగి రెండవకాలు, చేయితో చేయాలి.

ప్రయోజనం : నిల్చుని చేయడం వల్ల నడుము కింది భాగంలోని దోషాలు నయమవుతాయి. నడుంనొప్పి, స్లిప్ డిస్క్ దూరమవుతాయి. అండకోశం వృద్ధి చెందుతుంది. హెర్నియా బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలసట, ఆయాసాలను దూరం చేస్తుంది.
 
గోముఖాసనం
ఆవు ఆకారంలో ఈ ఆసనం ఉంటుంది. ఫొటోలో ఉన్నట్లు కుడికాలును ఎడంవైపుకు.. ఎడం కాలును కుడివైపుకు మడవాలి. రెండు చేతులను వెనక్కి తీసుకొచ్చి, ఇంటర్‌లాక్ చేయాలి. సాధారణ శ్వాస తీసుకోవాలి. కొంతసేపయ్యాక వ్యతిరేక దిశలో రిపీట్ చేయాలి.

ప్రయోజనం : అతిగా మూత్రం వెలువడేవారికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. నీరసాన్ని తొలగిస్తుంది. నరాల నీరసాన్ని తగ్గించి, మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. అండకోశం అనవసర పెరుగుదలను ఆపుతుంది.  


వృషభాసనం
వృషభం (ఎద్దు) ఎంత గట్టిగా ఉంటుందో మనకు తెలుసు. సుఖాసనంలో కూర్చున్నట్లే ఒక కాలు అటు, మరొక కాలు ఇటు మడిచి కూర్చోవాలి. రెండు చేతులను మోకాలిమడమ దగ్గర పెట్టుకోవాలి.

ప్రయోజనం : వృషభాసనం వేస్తే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. నడుంనొప్పిని కూడా ఇది దరి చేరనీయదు. సుఖాసనం లాంటిదే. ప్రయోజనాల మాట అటుంచితే, కాసేపు కూర్చోవడానికి ప్రశాంతంగా ఉంటుంది.  





మార్జాలాసనం
మార్జాలం అంటే పిల్లి. దాని ఆకారం వచ్చేలా ఈ ఆసనాన్ని వేయాలి. మోకాళ్లు, అరచేతుల మీద వంగి ఉండాలి. తలను కిందికి వంచాలి. ప్రయోజనం : మధుమేహాన్ని చక్కగా నియంత్రిస్తుంది. పొత్తి కడుపు భాగాలు గట్టిపడతాయి.

ముఖ్యంగా మహిళలకు నాభి కింది భాగం సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. గర్భవతులు కూడా ఈ ఆసనాన్ని యోగా నిపుణుల సలహాతో చేయవచ్చు. సులువుగా ప్రసవం అయ్యేందుకు మార్జాలాసనం తోడ్పడుతుంది.  


శశాంకాసనం
శశాంకం అంటే కుందేలు. కుందేలు ఎంత వేగంగా, ఎంత దూరం పరిగెత్తినా ఊపిరి తీసుకొనేందుకు ఇబ్బంది పడదు. ఈ ఆసనం వేస్తే మీరు కూడా శ్వాసలో స్వేచ్ఛను అనుభవిస్తారు. మోకాళ్ల మీద కూర్చుని నెమ్మదిగా చేతులు ముందుకు చాపాలి. నిదానంగా చేతులను నేలకు తాకిస్తూ ఈ ఫొటోలో ఉన్నట్లు ముందుకు వంగి కాసేపు అలాగే ఉండాలి.

ప్రయోజనం : ఊపిరితిత్తులు, గుండె పనితీరు మెరుగుపడుతుంది. పేగుల్లో సమస్యలు తొలగిపోతాయి. నడుం దగ్గర కొవ్వు కరిగిపోతుంది. ఉదర సంబంధిత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఆకలిని బాగా పెంచి అజీర్తిని నివారిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను పోగొడుతుంది.
 
మండూకాసనం
కప్ప ఆకారాన్ని పోలిన ఈ ఆసనంతో ఎన్నో ఉపయాగాలున్నాయి.మోకాళ్ల మీద కూర్చోవాలి. రెండు పిడికిళ్లు బిగించి పొట్టదగ్గర పెట్టుకోవాలి. మెల్లగా ముందుకు వంగి తలను నేలను తాకించే ప్రయత్నం చేయాలి.

ప్రయోజనం : రోజూ మండూకాసనం వేస్తే, ఇన్సులిన్ ఉత్పత్తి సవ్యంగా జరుగుతుంది. మధుమేహవ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపకరిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి సమస్యలను రాకుండా కాపాడుతుంది. బొజ్జ బాగా తగ్గిస్తుంది.

No comments:

Post a Comment