ఆరోగ్య పరిరక్షణ, రోగనివారణ అనేవి ఆయుర్వేద శాస్త్ర ప్రధాన లక్ష్యాలు. ఆయువు నిర్వహణలో సహజసిద్ధమైన వనమూలికల పాత్ర నిర్వివాదం. ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ధం కూడా. మానవుడు ప్రాణవాయువు, నీరు, ఆహారం, వస్త్రం, వసతి మొదలైన సర్వ అవసరాలకు మొక్కలపైనే ఆధారపడి ఉన్నాడు. మొక్కలే లేకుంటే మనిషి మనుగడే లేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మొక్కల ఆధారంగా జీవించే మానవుడు రోగగ్రస్తుడైనప్పుడు అతడి శరీరం సహజంగానే వనమూలికలను కోరుకుంటుంది. అందువల్లనే వనమూలికలతో తయారైన ఔషధాలు ఎలాంటి విపరీత లక్షణాలు కలుగనీయకుండా రోగాలను నివారించగలుగుతున్నాయి. వనమూలికలు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిర్మూలనలో మేలు చేస్తాయని, వాటి ఉపయోగం అత్యంత లాభదాయకమని ఆధునిక అభిప్రాయం. వీటితో పాటుగా కాలానికి తగ్గట్టుగా ఆహారం తీసుకుంటూ జీవనం సాగించినప్పుడే మానవుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. రుతువును బట్టి మనిషి నడచుకోవలసిన పద్ధతులను కూడా ఆయుర్వేద తెలిపింది.
వివిధ రుతువుల్లో పాటించవలసిన జాగ్రత్తలు
వర్ష రుతువు (జులై 16- సెప్టెంబర్ 15)
బలం చాలా తక్కువగా ఉంటుంది. ఆకలి మందగిస్తుంది కనుక పాత బియ్యం, గోధుమలు, బార్లీ శొంటి మొదలైనవి సేవించాలి. కాచిన నీటిని, తేనె కలిపిన నీటిని వినియోగించాలి. అన్నం పొడిగా, తేలికగా జీర్ణమయ్యేట్లు పులుపు, ఉప్పు మొదలైన వాటితో తినాలి. నలుగు పెట్టుకోవడం, వేడి నీటి స్నానం వంటివి పాటించాలి. పగటి నిద్ర, వ్యాయామం, కాలి నడక, పలుచని పదార్ధాలు, సంభోగం నిషేధించాలి.
శరదృతువు (సెప్టెంబర్ 16- నవంబర్ 15)
మధ్యమ బలం, ఆకలి కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక వగరు, తీపి, చేదు రసాలతో కూడిన చల్లని పానీయాలు శ్రేష్ఠం. వరి, గోధుమలు, బార్లీ, పెసలు, చక్కెర తేనె మొదలైనవి తీసుకోవాలి. సన్నని వస్తమ్రులు ధరించి మేడపైన నిద్రించాలి. కడుపు నిండా తినరాదు. పెరుగు, నూనె పదార్ధాలు, ఎండకు తిరగటం, ఎదురుగాలి, హోరుగాలి, మంచు, మద్యపానము, పగటి నిద్ర పనికి రావు.
హేమంత, శిశిర రుతువు (నవంబర్ 16- మార్చి 15):
ఈ సమయంలో మనుషులకు బలం అధికంగా ఉంటుంది. ఆకలి కూడా ఎక్కువగానే ఉంటుంది కనుక బలమైన ఆహారం తీసుకోవాలి. ఉదా: మినుములు, మాంసం, బెల్లం, చెరకు, పాల పదార్ధాలు, వేడి అన్నం, తైలం. వ్యాయామం, నలుగుపెట్టుకోవడం, తలస్నానం, కాటుక పెట్టుకోవడం చెయ్యాలి. ఈ రుతువులో తీపి, పులుపు, ఉప్పు, నీరు, నెయ్యి అధికంగా సేవించాలి.
వసంత రుతువు (మార్చి 16- మే 15)
బలం తక్కువగా ఉంటుంది. ఆకలి తక్కువగా ఉంటుంది. కనుక తేనె, బార్లీ, గోధుమలు, శొంఠి నీరు, తేనె కలిపిన నీరు ఎక్కువగా తీసుకోవాలి. బలమైన ఆహారం, చల్లనివి, పగ టి నిద్ర, పుల్లనివి, తీయనివి, నూనె పదార్ధాలు, పెరుగు ఈ రుతువులో నిషేధించాలి.
గ్రీష్మ రుతువు (మే 16- జులై 15)
బలం చాలా తక్కువగా ఉంటుంది. ఆకలి మందగిస్తుంది. కనుక కొత్త కుండలో నీరు, పానకము, చక్కెర కలిపిన మంచుగడ్డలు, రుచిగల చల్లని ద్రవప్రాయంగా ఉన్న అన్నం, ఎర్ర రాజనాల బియ్యం, పాలు, నెయ్యి, ద్రాక్ష, కొబ్బరి నీరు, పంచదార వినియోగించాలి. పగలు నీడపడే ఏర్పాట్లున్న గృహంలో, రాత్రిపూట మేడపై విశ్రమించాలి. వ్యాయామం, ఎండకు తిరగడం, కారం, ఉప్పు, పులుపు, రసాలు, వేడి చేసేవి, కల్లు వంటి పదార్ధాలు వదిలి పెట్టాలి.
- డా స్వాతి,
ఎం.డి (ఆయుర్వేద)
హైదరాబాద్,ఫోన్: 9390957168,08956156961
ఎం.డి (ఆయుర్వేద)
హైదరాబాద్,ఫోన్: 9390957168,08956156961
No comments:
Post a Comment