Pages

Friday, October 1, 2010

జీవితం చివరి క్షణం వరకూ ఉత్సాహం ఉండాలంటే ..... అంతే ఉల్లాసంగా బతకాలంటే మద్యం మానేయడమే .........

మద్యం తాగడం తాత్కాలికంగా హుషారు ఇవ్వవచ్చు. కానీ... జీవితం చివరి క్షణం వరకూ అదే ఉత్సాహం ఉండాలంటే... అంతే ఉల్లాసంగా బతకాలంటే మద్యం మానేయడమే మంచిది. అప్పటికి కలిగే సంతోషం కోసం తాగడం కావాలో... ఎప్పటికీ అదే ఆనందం కొనసాగాలో అన్న విషయాలు బేరీజు వేసుకుంటే మద్యం మానడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని సులభంగానే అర్థమవుతుంది. మద్యంతో వచ్చే మానసిక మార్పులు, ఎంత మోతాదుతో ఎలాంటి పరిణామాలు వంటి విషయాలు వివరించాం. ఈ కథనంలో మద్యం ఎలా మానాలి, మానేశాక మళ్లీ ముట్టకుండా ఉండటం ఎలా అన్న వివరాలను అందిస్తున్నాం.

రాఘవకు నలభై ఏళ్లు. మంచి వ్యాపారం ఉంది. తల్లిదండ్రులు, భార్యా, ఇద్దరు పిల్లలు అతని కుటుంబం. రాఘవకు ఇరవై ఏళ్లుగా ‘తాగుడు’ అలవాటు ఉంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు. మూత్రపిండాలు దెబ్బతిన్నాయని, ఇక ముందు ఒక్క చుక్క మద్యం తాగినా బతకడం కష్టం అని వైద్యులు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం కుదుటపడింది కదా! అనుకుని బలహీన క్షణంలో మద్యం తాగాడు. దాంతో ఆరోగ్యపరిస్థితి విషమించి రాఘవ చనిపోయాడు. ఆ కుటుంబం ఆధారాన్ని కోల్పోయింది.

పూర్ణచంద్రరావు వయసు 60 ఏళ్లు పైబడింది. అతని ఇద్దరు కొడుకులు అమెరికాలో స్థిరపడ్డారు. భార్య మరణించింది. చేసే పనులు, తన భావాలు పంచుకునే తోడు లేకపోవడంతో తాగుడుకి దగ్గరయ్యాడు. కొడుకులు అమెరికా రమ్మని ఒత్తిడి తెచ్చినా ఇష్టం లేదని చెప్పేశాడు. తాగితే తప్ప రోజు గడవని స్థితికి చేరుకున్న అతను, కొడుకులు ఎక్కడ తనను అమెరికా తీసుకెళ్లిపోతారో అని ఆత్మహత్య చేసుకున్నాడు.

వయసుకి, పరిస్థితులకు అతీతమైన ఈ వ్యాధి మనిషిని బలహీనుడిని చేస్తుంది. దిగువ, మధ్య, పై తరగతులు అన్న భేద భావం లేని ఈ అలవాటు నాశనం చేసే దిశల్లోనూ ఒకే విధంగా పనిచేస్తుంది. ఎంత వద్దనుకున్నా మళ్లీ మళ్లీ తన వైపుకు లాగే మద్యానికి జీవితాలను పణంగా పెట్టకుండా ఉండాలంటే అందరికీ ఈ విషయం పట్ల సంపూర్ణ అవగాహన ఉండాలి.

ఆల్కహాల్ అనానిమస్ అంటే...
1940 ముందు వరకు ‘తాగడం’ ఒక వ్యాధిగా గుర్తించలేదు. అమెరికాలోని డాక్టర్ బాబ్, బిజినెస్ మ్యాన్ బిల్ డబ్ల్యూ అనే ఇద్దరూ తాగుడు కారణంగా సర్వం కోల్పోయి చింతలో పడిపోయారు. వారు ఒక చోట కలిసి తమ దుస్థితికి చింతిస్తూ తమను బాగుపరుచుకోవడం కోసం ఏం చేయవచ్చు అని చర్చిస్తూ కూర్చున్నారట. ఆ చర్చ 24 గంటల పాటు సాగిందట. ఎప్పుడూ తాగుడు ధ్యాసలోనే ఉండే వారు ఓ రోజంతా తాగలేదు. మద్యం పట్ల ఉన్న సందేహాలను, సమస్యల గురించి చర్చించుకుంటే ఈ వ్యసనం నుంచి బయట పడటం సులభమే అని అర్థమైందట. తాము పడిన కష్టాలు చెప్పుకుంటుంటే తాగాలని అనిపించకపోవచ్చు. అలా పుట్టిందే ఈ ఆల్కహాలిక్ అనానిమస్ గ్రూపు. అలా ‘ఆల్కహాలిక్ అనానమస్’ పేరుతో ప్రపంచమంతటా సంస్థలు ఏర్పడ్డాయి. ఇలాంటి సంస్థలు అన్నిచోట్లా మద్యం దురలవాటు తగ్గించడానికి కృషి చేస్తున్నాయి.

మానేసినా...
తాగుబోతు తన బాల్యాన్ని, యవ్వనాన్ని, వయసుని ఆనందంగా అనుభవించలేడు. అలాగే తన పిల్లల బాల్యాన్ని, వారి అభివృద్ధిని కూడా చూసి ఆనందించే స్థితిలో ఉండడు. తన వ్యసనాన్ని గుర్తించి దాని నుంచి బయట పడాలనుకునే వారికి రిహాబిలిటేషన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మనస్తత్వ నిపుణులు కౌన్సెలింగ్, కొన్ని ప్రత్యేకమైన మెడిసిన్స్‌ను ఇస్తారు. వాటిని వైద్యుల సూచనల మేరకు వాడుతూ ఉండాలి. అయితే మెడిసిన్స్, ఆల్కహాల్ ఏకకాలంలో తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదం. సైకియాట్రిస్ట్ కౌన్సెలింగ్, మందులను పేషంట్ మానసిక స్థాయిని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డి-అడిక్షన్ సెంటర్‌లో కౌన్సెలింగ్ తీసుకొని బయటకు వెళ్లిన వ్యక్తి, తిరిగి వ్యసన పరుడిగా మారకుండా ఉండాలంటే తరచూ డి-అడిక్షన్ సెంటర్‌లకు వెళుతూ, అక్కడి మీటింగ్‌లలో పాలుపంచుకోవాలి. ఈ వ్యసనం వల్ల కలిగే నష్టాలను అవలోకించుకుంటూ కౌన్సెలింగ్ తీసుకుంటూ ఉండాలి.

పిల్లలు - మద్యం
‘జన్మతః వ్యాధిగా ‘తాగుడు’ వ్యసనాన్ని గుర్తించారు వైద్యులు. బిడ్డ ఎదిగిన కొద్దీ ఈ వ్యాధి లక్షణాలు బయట పడుతుంటాయి’ అంటున్నారు. దీనికి ఇంటి పరిస్థితులు, పరిసరాలు దోహదం చేస్తుంటాయి. అది ఎలా అంటే తల్లిదండ్రులకు చెప్పకుండానే స్కూల్‌కి డుమ్మా కొట్టడం, కాస్త ఎదిగాక కాలేజీ మానేసి సినిమాలకు, షికార్లకు వెళ్లడం జరుగుతుంటుంది. టీనేజ్ దశలో హార్మోన్ల వల్ల శరీరంలోనూ, మనస్తత్వంలోనూ మార్పులు వస్తుంటాయి. మొండిగా ప్రవర్తిస్తుంటారు. మూడీగా ఉంటాడు. సహనం ఉండదు. ఏ పనినీ సక్రమంగా చేయలేరు. తండ్రికి తాగే అలవాటు ఉంటే ‘నాన్న తాగుతున్నాడు కదా! నేను తాగితే తప్పేంటి’ అనుకుంటారు. దీంతో ఏ పని చేస్తున్నా ‘మద్యం’ తీసుకుంటే బాగుండు అనే ఆలోచన పుట్టుకొస్తుంటుంది. పిల్లవాడిలో చిన్ననాటి నుంచే మార్పు తీసుకురావాలంటే ఈ వ్యసనం పట్ల అవగాహన పేరెంట్స్‌లో తప్పక ఉండాలి.

ఆయుష్షు తగ్గించేస్తుంది
20 నుంచి 30 ఏళ్ల వయసులో-మద్యాన్ని సరదా కోసం తీసుకుంటారు. యుక్త వయసు కాబట్టి ఈ వయసులో శరీరం కూడా మద్యాన్ని భరిస్తుంది.

30 నుంచి 40 ఏళ్ల వయసు: రిలాక్సేషన్, కమ్యూనికేషన్ కోసం తప్పనిసరిగా తాగాలి అనుకుంటారు. ఈ వయసులో కూడా శరీరం మద్యాన్ని భరిస్తుంది.

40 ఏళ్ల వయసు నుంచి: మద్యం ఎంత తాగినా శరీరంలో అవయవాల పనితీరు మందగిస్తూ ఉంటుంది. మధుమేహం, హై బీపీ, లివర్, పాంక్రియాస్, కిడ్నీలు దెబ్బతినడం... లాంటి సమస్యలెన్నో వస్తుంటాయి. ఒక్కో ఆరోగ్య సమస్య బయట పడుతున్న కొద్దీ అప్పుడు తాము చేసిన తప్పేంటో తెలిసి వస్తుంది. తాగుడు ధ్యాసలో పడిపోయిన వ్యక్తి 50 ఏళ్ల వరకు కుటుంబాన్ని పట్టించుకోడు. దీని మూలంగా ఇంట్లో భార్యా బిడ్డలతోనూ, బంధువులతోనూ బాంధవ్యాలను పెంచుకోడు. తాగుడుకి విచ్చలవిడిగా డబ్బు కూడా ఖర్చు చేస్తుంటాడు కాబట్టి ఇటు ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికపరంగా దెబ్బతిని ఉంటాడు.

కుటుంబం
ఇంట్లో ‘తాగే’ వారు ఉంటే ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి సిగ్గు పడతారు. కాని ‘తాగే’ అలవాటున్న వారిలో మార్పు తేవడానికి కుటుంబసభ్యులు మొత్తం సహకరించాల్సి ఉంటుంది. మద్యానికి సంబంధించి అవగాహన ఇంట్లో అందరిలోనూ ఉండాలి. ఇది మందులతో చేసే చికిత్స కాదు, మానసిక చైతన్యంతోనే మార్పు తీసుకురావాలి. తాగిన వారిని తిట్టడం, కొట్టడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించదు. ఎందుకంటే తాగేవారిలో మూర్ఖత్వం ఉంటుంది. వారు చేయదలచుకున్నది చేసి తీరాలన్న పట్టుదల ఉంటుంది. అందుకని కుటుంబసభ్యులు కూడా రీహాబిలిటేషన్ సెంటర్‌లో కౌన్సిలింగ్ తీసుకోవడం అవసరం.

మానడం ఇలా...
మొదటిసారి మద్యం తీసుకునేటప్పుడు ఒక పెగ్గుతో సరిపెట్టేస్తారు. ఫర్వాలేదు కదా అనే ఆలోచనతో మరోసారి రెండు పెగ్గులు, పోను పోను రోజూ కొంత మోతాదును పెంచుతూ పోతుంటారు. ఇలాంటప్పుడు ఇది ఒక వ్యాధి అని గుర్తించాలి. వ్యసనం ఉన్నవారిలో చాలా తక్కువ మంది మాత్రమే దీని నుంచి బయట పడాలి అనుకుంటారు. మిగతా వారిని మాత్రం వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తెలివిగా వ్యవహరించి ఈ వ్యసనం నుంచి బయటపడేలా చేయాలి. వ్యసనం ఉన్న వ్యక్తి 3-4 నెలల పాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లోనే ఉండాలి. ‘ఎందుకు తాగుతున్నాను, మద్యం ముందు ఎందుకు బలహీనుడిగా మారాను’ అని ఎవరికి వారు తమ ‘ఆత్మకథ’ రాసుకోవాలి. రోజూ డైరీలో రాసుకోవడం వల్ల సమస్య ఎక్కడ ఉందో సమీక్షించుకోవడానికి వీలవుతుంది.

రిహాబిలిటేషన్ సెంటర్‌లో... ఉదయం 6 గం॥యోగా, 7 గం॥కాలకృత్యాలు, 8 గం॥అల్పాహారం, 9-10 గం॥ఆత్మపరిశీలన (ధ్యానం), 10 - 11 గం॥ఆల్కహాలిక్ థెరపీ సెషన్స్, స్నాక్స్ బ్రేక్. 1గం॥వరకు మద్యం పై అవగాహన చర్చలు. 1 గం॥భోజనం. 3 నుంచి 4 గం॥వరకు తమ ఆలోచనలను సెంటర్‌లో ఉన్న ఇతరులతో పంచుకోవడం. టీ బ్రేక్. ఆ తర్వాత రాత్రి 8 గం॥వరకు అవగాహన చర్చలు జరుగుతాయి.

No comments:

Post a Comment