Pages

Friday, October 1, 2010

అసుర * మద్యం నిజానికి దురలవాటు మాత్రమే కాదు... ఒక మానసిక వ్యాధి కూడా.

కొందరు మద్యం తాగడాన్ని సురాపానం అని వ్యవహరిస్తారు. దేవతలు ఇదే తాగారంటూ వాదిస్తారు. మద్యం తాగడం వల్ల ఇంచుమించు తాము దేవతలమనే అనుకుంటారు. కాని... మద్యంతో మనిషి రాక్షసుడవుతాడు. తాను సురాపానం అనుకునేది అసురాపానం అని మరచిపోతాడు. మత్తు తలకెక్కి కిక్కు కిర్రెక్కిస్తే రాక్షసుడై కళ్లతో పాటు విచక్షణకు మూతల పడిపోయి నేరాలకూ పాల్పడతాడు. మెదడు మందగించి ప్రమాదాలకు తావిస్తాడు. ఒళ్లు తేలికైందని అనుకుంటాడు కాని... కైపులో పడిపోయి కుటుంబానికీ, సమాజానికీ బరువుతాడు. మద్యం నిజానికి దురలవాటు మాత్రమే కాదు... ఒక మానసిక వ్యాధి కూడా. ఆ వ్యాధి వల్ల వచ్చే దుష్పరిణామాలు, చేసే దురాగతాలూ అన్నీ ఇన్నీ కావు. అయితే సంకల్పం ఉంటే ఆ వ్యాధినీ తగ్గించుకోవచ్చు. అందరిలాగే ఆరోగ్యంగా ఉండవచ్చు. నూరేళ్లూ నిశ్చింతగా జీవించవచ్చు.

మద్యం తాగడం ఒక మానసిక జాడ్యం. దాన్ని అలవాటుగా పరిగణిస్తారు గాని నిజానికి అదొక వ్యాధి. మద్యం వల్ల భవిష్యత్తులో వైద్యపరంగా మున్ముందు చికిత్స కోసం చేయాల్సిన ఖర్చులూ ఎక్కువే. అందుకే దీన్ని సామాజికంగానే గాక వైద్యపరంగా సమస్యగానూ చూడాలి. కేవలం మద్యం మానడం వల్ల జీర్ణకోశ సమస్యలు, గుండెపోటు, నాడీ వ్యవస్థకు సంబంధించిన లోపాలు, పక్షవాతం వంటి అనేక రకాలైన సమస్యలను నివారించవచ్చు. దీన్ని మానేయాలని అనుకున్నవారికి ముందుగా దృఢనిశ్చయం ఉండాలి. ఆ నిశ్చయంతో సైకియాట్రిస్ట్‌లను కలిస్తే వారి ఆధ్వర్యంలో కొన్ని మందులు వాడటం ద్వారా ఆ అలవాటును పూర్తిగా తగ్గించడం సాధ్యమవుతుంది.

సరదాగా ఆరంభమైన ఒక తప్పనిసరి అలవాటుగా మారిపోతుంది. మొదట వారం కొన్ని రోజులు, తర్వాత ప్రతిరోజూ, తర్వాత రోజంతా తాగడం... ఇలా సాగుతూ ఉంటుంది. వీరిని నిద్ర లేవగానే ముందుగా గుర్తుకు వచ్చేది మద్యమే.

మోతాదు- లక్షణాలు
20 ఎం.ఎల్- కొంత ఉద్వేగం, హుషారు, కొద్దిపాటి దుడుకుతనం
80 ఎం.ఎల్- మరింతగా నియంత్రణ కోల్పోవడం, ఒళ్లు తూలడం, ఎక్కువగా మాట్లాడటం, ఏకాగ్రత లేకపోవడం.
200 ఎం.ఎల్- మాట ముద్దగా రావడం, ఒళ్లు అధికంగా తూలడం, కోపం, చిరాకు, తేలికగా దెబ్బలాడటం, అరవటం.
300 ఎం.ఎల్ - కోమాలాంటి స్థితి
400 ఎం.ఎల్- మృతి చెందే అవకాశాలు చాలా ఎక్కువ.

ప్రమాదాలు
మద్యం వల్ల వ్యక్తి విచక్షణ, అంచనావేసే శక్తిని కోల్పోతాడు. అది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. వాహన ప్రమాదాల్లో దాదాపు 90 శాతం మద్యం తాగి డ్రైవ్ చేసినప్పుడు అయ్యేవే. మద్యం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువే కాకుండా, ప్రాణాపాయ అవకాశాలు కూడా ఎక్కువ. ఈ ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాల వల్ల ఒక్కోసారి బతికినా జీవితాంతం వైకల్యంతో జీవించాల్సి వచ్చే ప్రమాదం ఎక్కువ.

ఇది ఒక వ్యాధి
మద్యం వ్యక్తి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. మద్యపానం ఒక నేరమో, పాపమో కాదు. అది ఒక వ్యాధి. మద్యపానం ఒక వ్యసనంగా మారడం, మొదడులోని రసాయనాల మార్పుల వలన సంభవిస్తుంది. ఈ మార్పులను వైద్యంతో, శాస్ర్తీయ పద్ధతులతో నయం చేయవచ్చు. మద్యానికి బానిసైలన వారిని ద్వేషించడం, దూషించడం చేయకుండా వారిని ఆదరించి తగిన చికిత్స ఇప్పించాలి.

ఆర్థికంగా...
మద్యం కోసం ఒక వ్యక్తి చేసే ఖర్చు రాను రాను పెరుగుతూ వస్తుంది. మద్యానికి బానిసైన వ్యక్తి ముందుగా తను సాధించే దానిలో అధికశాతం మద్యానికే హెచ్చిస్తాడు. తర్వాత మద్యపానం వలన కలిగే వ్యాధులకు చికిత్స కోసం ఖర్చుచేస్తాడు. దీని వల్ల తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఫలితంగా ఇబ్బందులు తలెత్తుతాయి. మద్యపానం చేసిన వ్యక్తి సంఘంలో గౌరవం కోల్పోతాడు.

తిరిగి తాగే అవకాశాలు
* గతంలో మద్యం సేవించే సమయం ...
* గతంలో తనతో మద్యం సేవించిన స్నేహితులు కలిసినప్పుడు ...
* అధిక ఒత్తిడికి లోనైనప్పుడు ...

పై పరిస్థితులలో వ్యక్తి తన ప్రమేయం లేకుండానే తాగుతాడు. తన ప్రవర్తనపై నియంత్రణ ఉండదు. మోతాదును కూడా నియంత్రించుకోలేరు. ఈ పరిస్థితి మెదడులోని రసాయనిక మార్పుల వలన సంభవిస్తుంది. వైద్యం సాయంతో మాత్రమే దీని నుంచి బయటపడగలరు.

మానసిక మార్పులు
మద్యం ప్రభావం వల్ల జ్ఞాపకశక్తిని, గ్రాహణ శక్తిని, ఏకాగ్రతను, విచక్షణను కోల్పోతారు.

కొన్నిసార్లు తాగినప్పుడు చేసిన పనులు, మత్తు దిగాక గుర్తుండవు. దీనిని ఆల్కహాలిక్ బ్లాకౌట్స్ అంటారు.

మద్యం మెదడులోని రసాయనాల్లో మార్పును కలిగించి తీవ్రమైన భయం, ఎవరో హాని చేస్తారని అపనమ్మకం, ఆందోళన కలిగిస్తాయి.

జీవిత భాగస్వామికి ఇతరులతో అక్రమసంబంధం ఉందని నిరాధారంగా ఆరోపణలు చేయడం, నమ్మడం చేస్తుంటారు.

మనుషులు లేకుండా శబ్దాలు వినిపించడం, లేని ఆకారాలు కనిపించడం వంటి చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. ఉదాహరణకు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నట్లు ప్రవర్తన ఉంటుంది.

చేతులు, తలపై పురుగులు పాకుతున్న భావన వంటి లక్షణాలు కలుగుతాయి.

దీంతో తిరిగి మద్యాన్ని సేవిస్తారు.

ఒక్కసారిగా మానేస్తే!
మద్యానికి అలవాటు పడే వ్యక్తి మద్యం వ ల్ల కలిగే నష్టాలను తెలుసుకొని దానిని ఆపేయాలని ప్రయత్నించి, ఒక్కసారిగాఏ ఆపేస్తే...

గుండెదడ, ఆందోళన, నిద్రలేమి, చిరాకు, మద్యం సేవించాలని విపరీతమైన కోరిక, రక్తపోటులో హెచ్చుతగ్గులు, చేతులు, వేళ్లు వణకడం, మూర్ఛ, ఒక్కోసారి డిలెట్రియమ్ వంటి స్థితిలోకి వెళ్లడం మొదలైనవి సంభవిస్తాయి.

మద్యం వలన కలిగే కిక్కుకోసం ఒకప్పుడు తాగినా, తర్వాత ఈ లక్షణాలను తగ్గించుకోవడం కోసం మళ్లీ తాగుతారు. ఇలా కొంతకాలం తప్పనిసరి పరిస్థితులలో తాగవలసి వస్తుంది. దీంతో మద్యం పొందాలనే తపన తీవ్రమైపోతుంది. మద్యం పొందటమే లక్ష్యంగా మారి, మద్యం కోసం వ్యక్తి ఏ స్థాయికైనా దిగజారుతాడు.

తనపై తను నియంత్రణ కోల్పోతాడు. కొద్దిమొత్తంలో మాత్రమే మద్యం తీసుకుందామని భావించినా నియంత్రణ కోల్పోవడం వలన అధికంగా సేవిస్తాడు. తర్వాత పశ్చాత్తాపపడుతుంటారు.

కొన్ని రోజులకు మద్యానికి ఎంత బానిసగా మారుతారంటే, తమకు ఇష్టమైన అన్ని రకాల పనులను కూడా విడిచి ‘మద్యం సంపాదించడం ఎలా?’ అనే ఒక విషయం గురించే ఆలోచిస్తూ గడుపుతారు.

మద్యం ఎందుకు సేవిస్తారు?
 
ఈ ప్రశ్నని మద్యం సేవించేవారిని ప్రశ్నిస్తే వారిచ్చే సమాధానాలు...
*  పనిచేసి అలసిపోయి, విశ్రాంతి కోసం

*  చురుకుదనం, తెలివితేటలు, ధైర్యం పెంచుకోవడానికి, భావాలను వ్యక్తపరిచే ధైర్యం కోసం

*  బాధలను మరచిపోవడానికి

*  నలుగురితో కలిసి సరదా, కాలక్షేపం కోసం

*  పదిమందిలో గాని, బాస్ ముందుగానీ ధైర్యంగా మాట్లాడటం కోసం

*  ఆందోళన తగ్గించుకోవటం కోసం

*  తాగితే లైంగికశక్తి పెరుగుతుంది

*  సామాజిక సంబంధాలను పెంచుకోవచ్చనని

*  స్వేచ్ఛ కోసం, మద్యం వలన కలిగే కిక్కు కోసం

No comments:

Post a Comment