Pages

Wednesday, October 20, 2010

నాట్య యోగం * నాట్యమే యోగం

నాట్యం, యోగా వేర్వేరా? ఒకటేనా? ఒకే దానికి రెండు రూపాలా? ఒకటి శబ్దం లేకపోతే రక్తి కట్టదు. రెండోది శబ్దం ఉంటే ప్రయోజనం నెరవేరదు. ఒకటి ప్రదర్శన కళ. రెండోది వ్యక్తిగత సాధన. అయినా ఎన్నో భంగిమల్లో సారూప్యత. ఒకటి వస్తే రెండోది నేర్చుకోవడం సహజంగానే తేలిక.

ఈ సారూప్యత, సాన్నిహిత్యం భరతముని రాసిన నాట్యశాస్త్రంలోనే ఉన్నాయంటారు కాళ్లకూరి ఉమా వైజయంతిమాల. ఆమె ఈ అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ సాధించారు. ఆ థీసిస్‌ను 'నాట్య యోగ' అనే పుస్తకంగా విడుదల చేశారు. అమెరికాలోని ఇల్లినోయిస్ వెస్‌లియాన్ విశ్వవిద్యాలయంలో నాట్యయోగాన్ని బోధిస్తున్న ఉమ- ఈ ప్రక్రియ విశిష్టతను వివరించారు. ఎంతో ఆసక్తి కలిగించే ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

"మాది వరంగల్. మా నాన్నగారు ఎమ్.కె సోమయాజులు దగ్గర చాలామంది నృత్యం నేర్చుకుంటూ ఉండేవారు. వరంగల్‌లో తొలి నృత్య శిక్షణాలయం మాదే. మా అమ్మకి కూడా నాట్యమంటే చాలా ఇష్టం. నా ఐదవ ఏట నుంచే నృత్యం నేర్చుకోవటం మొదలుపెట్టా. పదో తరగతి పూర్తయ్యేసరికే- దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చాను. జపాన్‌లో కూడా ఒక ప్రదర్శన ఇచ్చా. డిగ్రీ చదివే సమయానికి- వరంగల్‌లో 'నృత్యమాల' అనే పేరిట ఒక డ్యాన్స్ స్కూల్‌ను స్థాపించా. ఒక పక్క చదువు, మరో వైపు డ్యాన్స్. అదే జీవితంగా బతికాను. ఆ తర్వాత పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయాను.

నాట్యమే యోగం
చిన్నప్పటి నుంచి నాకు నాట్యంలో పీహెచ్‌డీ చేయాలనే కోరిక ఉండేది. అప్పటి నుంచి నాట్యశాస్త్రానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదివా. మాకు డ్యాన్స్‌తో పాటు యోగా కూడా నేర్పేవారు. ఆ సమయంలో- నాట్యం, యోగం ఒకటేనా అనే అంశంపై జిజ్ఞాస కలిగింది. నాట్య శాస్త్ర గ్రంధాలు చదువుతుంటే అనేక ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.

నాట్యం, యోగం - ఈ రెండింటికి సంబంధించిన సమాచారం వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ కనిపిస్తుంది. యోగము అంటే కలయిక అని అర్థం. పరమాత్మతో ఆత్మ మమేకం కావటమే యోగం. దానికి మార్గం యోగ సాధన.

ఇక నృత్యం విషయానికి వస్తే - ధర్మం, అర్థం, కామం, మోక్షం మొదలైన పురుషార్థాలను అందించడానికి బ్రహ్మ నాట్యాన్ని సృష్టించాడని భరతముని నాట్యశాస్త్రం తొలి అధ్యాయంలో చెబుతాడు. నాట్యం చేసినా, చూసినా బ్రహ్మానందం సిద్ధిస్తుందని పేర్కొంటాడు. ఈ బ్రహ్మానందం, యోగశాస్త్రంలో చెప్పిన సమాధిస్థితి రెండూ ఒకటే. దీని ఆధారంగా చూస్తే నృత్యానికి, యోగాకు తుది లక్ష్యం భగవంతుడితో వ్యక్తి మమేకం కావటమే. ఈ రెండింటి లక్ష్యం ఒకటే అయినపుడు వీటి మధ్య సారూప్యత కూడా ఉండాలి.

నేను చేసిన అధ్యయనంలో నృత్యానికి యోగానికి మధ్య అనేక అంశాలలో సారూప్యత కనిపించింది. వీటన్నింటినీ ఆలంబనగా చేసుకొని నాట్యయోగ ప్రక్రియను రూపొందించాను. ఉదాహరణకు యోగాసనాలు వేయటం వల్ల శరీరం మన అదుపులో ఉంటుంది. మనసుకు ఏకాగ్రత ఏర్పడుతుంది. నాట్యం వల్ల కూడా శరీరం అదుపులో ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. యోగా వల్ల నాట్యం నేర్చుకొనేవారికి అనేక లాభాలు ఉంటాయి. ఆసనాలు వేయటం వస్తే నాట్యభంగిమలలో కచ్చితత్వం వస్తుంది.

ఏకాగ్రతను సాధన చేయటం వల్ల - హావభావాలను అనుకున్న రీతిలో ప్రదర్శించగలుగుతారు. ఈ విధంగా భరతముని నాట్యశాస్త్రంలో చెప్పిన అంశాల ఆధారంగా నేను నాట్యయోగాను రూపొందించాను. ఇప్పటి దాకా ఈ నాట్యయోగా ఎందుకు ప్రాచుర్యంలోకి రాలేదనే అనుమానం కొందరికి కలగవచ్చు. క్రీ.పూ. రెండవ శతాబ్దంలో భరతముని నాట్యశాస్త్రాన్ని రాశాడు.

ఆ మూల గ్రంధం ఇప్పుడు మనకు పూర్తిగా దొరకటం లేదు. ఆ తర్వాత అనేక మంది నాట్యశాస్త్రానికి సంబంధించిన గ్రంధాలను రాశారు. కాని వీటిలో నాట్యాన్ని, యోగాన్ని ఏకీకృతం చేస్తూ రాసినవి తక్కువే. అందువల్లనే నాట్యయోగానికి ఎక్కువ ప్రచారం లభించలేదు. నేను ఈ రెండింటిని అనుసంధానిస్తూ తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశాను.

శ్రద్ధ ఎక్కువే..
నేను అమెరికాలోని ఇల్లినోయిస్ వెస్‌లియాన్ యూనివర్శిటిలో నాట్యయోగ అంశాన్ని విద్యార్థులకు బోధిస్తున్నా. దీనితో పాటు ప్రతి రోజు ఇంట్లో పాతిక మంది పిల్లలకు నృత్యం నేర్పుతున్నా. ఇక్కడ భరతనాట్యానికి మంచి ఆదరణ లభిస్తోంది. నాట్యశాస్త్రంలో అలంకరణకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. విద్యార్థులకు నాట్యశాస్త్రంతో పాటు అలంకరణకు సంబంధించి అంశాలను కూడా బోధిస్తున్నా.''
నటరాజస్వామి చేసే నృత్యంలో 108 నృత్య భంగిమలు(కరణాలు) ఉంటాయి. ఇందులో దాదాపు అరవై భంగిమలు యోగాసనాలతో పోలి ఉంటాయి. ఇందులో ఏ భంగిమైనా యోగాలో ముందుగా సాధన చేయడం వల్ల నృత్య భంగిమ వేసేప్పుడు సులువుగా ఉంటుంది. భంగిమ సులువుగా వేయడం వల్ల మనసుని సన్నివేశంపై నిమగ్నం చేయడం కూడా సులువవుతుంది. దీనికి సంబంధించి నాలుగు ఆసనాలు, నాలుగు కరణాలు ఇక్కడ ఇస్తున్నాం చూడండి.
వీరభద్రాసనం
ఈ ఆసనంలో కాళ్లు, చేతులు వెడల్పుగా చాపాలి. మూడవ వీరభద్రాసనం
ఒంటి కాలిపై ముందుకు వంగి నిలబడాలి. అదే సమయంలో రెండు చేతులు జోడించి నమస్కరించాలి. ఇది చాలా కష్టమైన ఆసనం. నటరాజాసనం
ఒంటి కాలిపై నిలబడి వెనకనుంచి పైకి ఎత్తిన కాలిని ఒక చేత్తో పట్టుకుని మరో చేతిని నేరుగా చాపాలి. అర్థ పద్మోత్తనాసనం
ఒక కాలుపై నిలబడి మరో కాలిని మడుచుకోవాలి. అంటే ఒంటికాలిపై తపస్సు చేయడం అన్నమాట. ఉన్మత్తం
ఒక విధమైనటువంటి గర్వాన్ని, ఉన్నతమైనటువంటి స్థితిని చూపించేటపుడు ఈ కరణాన్ని ఉపయోగిస్తారు. ఆక్షిప్త రేచితం
అందమైన కదలికలు చూపించేప్పుడు ఈ కరణాన్ని వాడతారు. కష్టమైన భంగిమలోనే హావభావాలను చూపించాలి. తలవిలాసితం
సూత్రధారులు కథని చెప్పేటపుడు ఈ కరణాన్ని ఉపయోగిస్తారు. సంభ్రాంతం
హుందాతనాన్ని చూపించడానికి సంభ్రాంత కరణం వాడతారు.

No comments:

Post a Comment