Pages

Tuesday, October 19, 2010

ఆల్కహాల్ అనేది ఒక్క వ్యాధి మాత్రమే కాదు. ఇదొక సామాజిక దెయ్యం కూడా.

‘అంతా భ్రాంతియేనా’... అన్నది దేవదాసులోని పాట. అది దేవదాసులకు అక్షరాలా వర్తించే పాట అన్నది నిజం. మద్యం అలవాటున్న డోసుదాసులకు జీవితంలో వెలుగు ఉండదు. మద్యం తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందన్నది ఒక భ్రమ. పిల్లలకు ఒక స్పూన్ బ్రాందీ తాగిస్తే అజీర్తి ఉండదని, పరిమితంగా తాగితే గుండెకు మంచిదని ఒక అపోహ. వీటితో పాటు మద్యానికి అలవాటు పడి ఒక్కసారిగా మానేయాలనుకున్నా... కొన్ని సమస్యలు. శరీరంపై చీమలు పాకినట్లు, గోడలపై పాములు పాకినట్లు భ్రమలు. ఇలాంటి భ్రాంతులు, భ్రమలు తొలగించి, ‘జీవితాన వెలుగు ఎంతో ఉంద’ని చెప్పేందుకే ఈ కథనం...

అజయ్‌కి నలభై ఏళ్లు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. భార్య, ఇద్దరు పిల్లలు... ఫ్రెండ్స్‌తో మందు పార్టీలో అర్ధరాత్రి దాకా కూర్చున్నాడు. వాహనంపై ఇంటికి బయల్దేరాడు. తను సవ్యంగానే డ్రైవింగ్ చేస్తున్నట్టుగా అతనికి అనిపిస్తోంది. కాని అప్పటికే రోడ్డు మీద వచ్చీ పోయే వాహనాల వాళ్లు అజయ్‌ని సరిగ్గా డ్రైవ్ చేయమని హెచ్చరిస్తున్నారు. తను ఇంత బాగా డ్రైవ్ చేస్తుంటే వీళ్లు ఎందుకు అలా అంటున్నారో అనుకుంటూనే డ్రైవ్ చేస్తున్నాడు అజయ్. వాహనం కొంతదూరం ప్రయాణించిందో లేదో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో అజయ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

సూర్యారావు వయసు అరవై. తనకు ఇరవై ఏళ్ల వయసప్పటి నుంచి మద్యం తాగే అలవాటు ఉంది. అంటే దాదాపు నలభై ఏళ్లుగా మద్యం తాగుతున్నాడు. కూతురు ‘ఇక తాగొద్దు’ అని తన మీద ఒట్టు వేయించుకోవడంతో సడెన్‌గా తాగుడు మానేశాడు. అన్నాళ్లూ బాగానే ఉన్న సూర్యారావు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనను ఎవరో తరుముతున్నట్టుగా, చంపబోతున్నట్టుగా ఉలిక్కి పడుతున్నాడు. శరీరంపై చీమలు పాకినట్టుగా ఊరికూరికే చేతులు, పాదాలు గీరుకుంటున్నాడు. సూర్యారావు ప్రవర్తన ఇంటిల్లిపాదీని హడలెత్తిస్తోంది.

ఈ రెండు కేసులను పరిశీలిస్తే ఒకతను మద్యం సేవించిన తర్వాత ‘మత్తులో కూడా తను బాగానే ఉన్నాను కదా!’ అనుకున్నాడు. కాని శరీరం అదుపులో లేదు. ఫలితంగా ప్రమాదం సంభవించింది. రెండో కేసులో దాదాపు నలభై ఏళ్లపాటు రోజూ మద్యం తాగిన వ్యక్తి హఠాత్తుగా వ్యసనాన్ని మానుకోవడంతో అతని శరీరం అదుపు కోల్పోయింది.

అకస్మాత్తుగా మానేస్తే అనేక భ్రాంతులు...
రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకునేవారు అకస్మాత్తుగా మానేస్తే ‘ఆల్కహాల్ విత్‌డ్రావల్ సింప్టమ్స్’ కనిపిస్తాయి. అందులో భ్రాంతులు ప్రధానమైనవి. ఎవరూ మాట్లాడకపోయినా శబ్దాలు వినిపించడాన్ని ఆడిటరీ హ్యాలూసినేషన్స్ అంటారు. శరీరంపై చీమలు పాకినట్లు అనిపించడాన్ని టాక్టైల్ హ్యాలూసినేషన్స్ అంటారు. ఈ భ్రాంతికి గురయ్యే క్రమాన్ని ఫార్మికేషన్ అంటారు. అంతేకాదు గోడ మీద పాములు, జెర్రులు వంటి హానికరమైన జీవులు పాకినట్లు కనిపిస్తుంటాయి.

దీన్ని విజువల్ హ్యాలూసినేషన్స్ అంటారు. మద్యం తాగి వాహనం నడిపేవారు తామ కదలికలు చురుగ్గానే ఉన్నాయని భావిస్తుంటారు. నిజానికి అది వాస్తవం కాదు. మద్యం ప్రభావం వల్ల తాము అనుకుంటున్నంత, తమ అంచనాకు తగినట్లుగా వారి కదలికలు ఉండవు. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం కూడా మామూలే. అలాగే తమను ఎవరో వెంబడిస్తున్నట్లు అనుమానిస్తుంటారు. తమకు హాని చేయడానికి తలపోస్తున్నట్లుగా భ్రమపడుతుంటారు. ఇలాంటివి జరగక పోయినా జరుగుతున్నట్లు భ్రాంతులకు లోనుకావడాన్ని డెల్యూషన్స్ అంటారు.

గుండె ఆరోగ్యం - మద్యం
రోజూ 30 ఎం.ఎల్ వైన్ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కాని అదే అలవాటు పోను పోను మోతాదును పెంచేలా చేస్తుంది. అందుకని ముందుగానే ఇలాంటి వాటిని దరిచేరనీయకపోవడం మంచిది. గుండె ఆరోగ్యానికి రోజూ వ్యాయామం, సమతుల ఆహారం, డాక్టర్ సూచనలు పాటిస్తూ ఉండటం అన్ని విధాల మేలు.

జలుబు, దగ్గు - మద్యం
జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం సహజం. ఇలాంటప్పుడు బ్రాంది తీసుకుంటే రిలీఫ్‌గా ఉంటుందని, అవన్నీ తగ్గుతాయనుకోవడం పొరపాటు. వాతావరణంలో మార్పులు, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు, రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటికి ట్రీట్‌మెంట్ బ్రాంది ఎంత మాత్రమూ కాదు. వైద్యులు ఇచ్చిన మందులు, వారి సూచనలు మాత్రమే పనిచేస్తాయి.

మానసిక జబ్బులలో..
మొదటి రెండు పెగ్గులు తీసుకున్నప్పుడు శరీరం చాలా తేలికగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాని మోతాదు పెరిగిన కొద్దీ మెదడు డల్‌గా అయిపోతుంటుంది. నరాల వ్యవస్థ మీద ప్రభావం చూపడంతో తనపై తనకు, చుట్టుపక్కల ఏం జరుగుతోందో ధ్యాస ఉండదు. ఆల్కహాల్ ఇన్‌డ్యూస్ డిప్రెషన్, ఇన్‌డ్యూస్ యాంగ్జైటీ డిజార్డర్ వంటి సైకోసిస్ సమస్యలు వస్తాయి.

గర్భవతులు - మద్యం
ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పడు బీర్ తాగితే పిల్లలు ఎరగ్రా, తెల్లగా పుడతారని, నార్మల్ డెలివరీ అవుతుందని అనుకుంటారు. కాని అది తప్పు. పిల్లల రంగు ఎప్పుడైనా జెనిటికల్‌గా వస్తుంది. పైగా గర్భవతులు మద్యం తీసుకోవడం వల్ల పిల్లలు శారీరక, మానసిక లోపాలతో పుట్టే అవకాశాలు ఉంటాయి.

యుక్తవయసులో...
పియర్ ప్రెజర్ కారణంగా అంటే ‘స్నేహితులు తాగుతున్నారు కాదా! నేను తాగితే తప్పేంటి?’ అనో, సరదాకో ఫ్రెండ్స్ కోసమో మొదలుపెడుతుంటారు. ఈ అలవాటు సాధారణంగా 20, 25 ఏళ్ల నుంచి మొదలవుతుంది. కొన్ని రోజులకు మద్యం తీసుకోకపోతే చెమట్లు పట్టడం, చేతులు వణకడం, నోటికి ఏది తోస్తే అది మాట్లాడటం, అయోమయంగా ప్రవర్తించడం వంటివి చేస్తారు. దీంతో ఇన్ని రోజుల పాటు రాత్రివేళలలో తీసుకునే మద్యం పగటివేళకూ మారుతుంది. మొదట్లో ఒకటి, రెండు పెగ్గులతో మొదలైన అలవాటు నెమ్మదిగా పెరుగుతూ అధికమోతాదులో తీసుకుంటారు.

బయటపడటానికి...
* టీనేజ్ పిల్లలు ఇంటికి లేటుగా రావడం, దొంగతనం చేయడం, వారి నుంచి మద్యం వాసన రావడం వంటివి గమనిస్తే వదిలేయకుండా నిపుణులచే చికిత్స ఇప్పించాలి.
* ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నష్టాలు, కౌన్సిలింగ్ ద్వారా తెలియజేసి సదరు వ్యక్తిని మోటివేట్ చేయాలి.
* రెగ్యులర్‌గా మద్యం తీసుకునే వ్యక్తి హఠాత్తుగా మానేస్తే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వీళ్లు ఆల్కహాల్ విత్‌డ్రావల్ స్టేట్‌లోకి వెళతారు. చేతులు, కాళ్లు స్వాధీనం తప్పడం, తను ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అయోమయంగా ఉండిపోతాడు. అతనికి వారం నుంచి పది రోజుల వరకు నిద్రపోయేందుకు సరిపడా మెడిసిన్ డోసును పెంచుతూ, తగ్గిస్తారు. దీనిని డిటాక్సిఫికేషన్ అంటారు.
* హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి సమాజంలోకి వెళ్లాక, మళ్లీ మద్యం తీసుకోకుండా ఉండటానికి, దానిని అవాయిడ్ చేయడానికి కౌన్సెలింగ్ ఇస్తారు.
* డాక్టర్ సూచించిన విధంగా రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు రావడం, మందులు వాడటం చేస్తుంటే పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు.
* ఆల్కహాల్ అనేది ఒక్క వ్యాధి మాత్రమే కాదు. ఇదొక సామాజిక దెయ్యం కూడా. కాబట్టి దీనిని గుర్తించినప్పుడు సిగ్గుపడకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం.

మద్యం తాగడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చాలామందిలో ఓ అపోహ. కాని మద్యం వంధ్యత్వానికి దారితీస్తుంది. సంతానోత్పత్తి సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది.

పిల్లలకు ఒక స్పూన్ బ్రాంది తాగిస్తే అజీర్తి సమస్య ఉండదని కొంతమంది భావిస్తుంటారు. కాని దీని కారణంగా పిల్లల్లో చిన్నప్పటి నుంచే మద్యం వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. పైగా అది శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.



No comments:

Post a Comment