Pages

Tuesday, November 30, 2010

A Really Good One - Tips for Better Life








































Mr. CH. Phani Kiran,
Former Software Engineer (VC++ v5.0, JavaScript, Unix Shell Prog & Oracle v7.3 PL/SQL) &
Networking Administrator (IBM OS/2 Wrap 4.0, WinNT 4.0 Server & Workstation, Sco-Unix 4.0, Win2000 Advanced Server & Novel Netware 4.0)


THANK YOU
CHIVUKULA PHANI KIRAN, Former Software Engineer & Networking Administrator.

Sunday, November 28, 2010

ఇవి తింటే హృదయం పదిలం

జీడిపప్పు: ఇందులో ప్రొటీన్లు, పైబర్ అత్యధికంగా ఉంటాయి. శరీరానికి వెంటనే శక్తినిచ్చే గుణాలున్నాయి ఇందులో. గుండెకు కూడా మంచి శక్తినిస్తాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్, విటమిన్-బి పుష్కలం.

కర్జూరం: డ్రైప్రూట్స్‌లో అత్యంత శక్తివంతమైనది కర్జూరం. ఇందులోని గ్లూకోజ్, ప్రక్టోజ్ శరీరాన్ని ఉల్లాసపరుస్తాయి. వారానికి కనీసం రెండుసార్లయినా వీటిని తినాలి. అధిక రక్తపోటు బాధితులు వీటిని రెగ్యులర్‌గా తింటే తగినంత పొటాషియం లభిస్తుంది. బీపీ కూడా నియంత్రణలోకి వస్తుంది.

వాల్‌నట్స్: ప్రొటీన్లను అందించే వాల్‌నట్స్ తింటే అరుదైన ఒమెగా 3 ప్యాటీ ఆసిడ్స్ కూడా దొరుకుతాయి. విటమిన్-ఇ, యాంటీ యాక్సిడెంట్స్, పైబర్.. ఇలా శరీరానికి విలువైన పోషకాలన్నీ ఇందులో ఉన్నాయి. అందుకే రోజూ రెండు మూడు వాల్‌నట్స్ సరదాగా తినండి.

కిస్‌మిస్: తినేందుకు మధురంగా, రుచికరంగా ఉండే కిస్‌మిస్‌తో ఎనలేని ప్రయోజనాలున్నాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. జీర్ణప్రక్రియను మెరుగు పరుస్తాయి. మినరల్స్ శక్తినిస్తాయి. రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో కిస్‌మిస్‌ను నానబెట్టి, పొద్దున్నే ఆ నీళ్లను తాగితే కడుపు శుభ్రం అవుతుంది.

వేరుసెనగ: వందగ్రాముల విత్తనాల్లో 93 శాతం కాల్షియం, 16 శాతం కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. ఇవే కాదు. పౖౖెబర్, ఐరన్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కొవ్వులు... ఇలా ఎన్నో రకాల పోషకాలు వేరుసెనగ విత్తనాల్లో ఉన్నాయి. సుమారు 13 రకాల పోషకాలను కలిగిన వీటిని తక్కువ మోతాదులో తింటే మంచిది.

ఇవే కాదు. బాదాం తింటే కంటిచూపునకు, అంజీర తింటే ఊపిరితిత్తులకు, నల్లద్రాక్ష, కుర్భాణీ తింటే గుండెకు... మంచి చేస్తాయి. అందుకే కాస్త ఖరీదు ఎక్కువైనా.. వీలున్నప్పుడు తక్కువ మోతాదులోనైనా డ్రై ఫ్రూట్స్ తినడం మరువకండి.

Saturday, November 20, 2010

నిమ్మ గుబాళింపు


lemonనిమ్మకాయఫై  వుండే చర్మాన్ని గిచ్చి గుండెల నిండా వాసన పీల్చడాన్ని చాలా మంది ఇష్టపడతారు. ఇలా వెదజల్లే సువాసన వారికి బాగా నచ్చుతుంది. నచ్చడం ఒక్కటేకాదు దీని వల్ల ఒత్తిడి స్థాయిలూ గణనీయంగా తగ్గుతాయని జపాన్‌ పరిశోధకులు చెబుతున్నారు.నిమ్మకాయలు, మామిడి, లెవెండర్‌, తులసి, కొన్ని రకాల టీలలో కనిపించే ‘లినలూర్‌’ అనే పదార్థం రక్తంలోని నొప్పి, మంట వంటి సమస్యలను కలిగించే రసాయనాల్ని తగ్గిస్తుందని గుర్తించారు.లినటూల్‌ వాసనలు పీల్చడం వల్ల ఒత్తిడి సమయంలో చురుగ్గా వుండే వందరకాలకు ఫైబడిన జీవకారకాల ప్రభావం కూడా తగ్గుతుంది. మరింకేం ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఓ నిమ్మ కాయ చేతిలోకి తీసుకుని చూడండి..

Friday, November 19, 2010

సరికొత్త డైట్ డ్రింక్‌

బరువు తగ్గాలనిప్రయత్నించేవారు డైట్‌లు, వెయిట్‌లు అంటూ హైరానాపడడం కద్దు. ఇటువంటి వారికి సరికొత్త డైట్‌ డ్రింక్‌ సూచిస్తున్నారు అమెరికా వైద్య కళాశాల శాస్తవ్రేత్తలు. కూరగాయల రసం తాగితే అధిక బరువు వున్న పెద్దవారు వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మార్పు కనిపించినట్లు వారు చెబుతున్నారు.

fruts
సోడియం తక్కువగా వుండే వెజిటెబుల్‌ జ్యూస్‌ ప్రతిరోజూ తాగిన వారు 12 వారాల్లో రెండు కేజీల బరువు తగ్గినట్లు చెబుతున్నారు.

జ్యూస్‌ను టమోటాలతో కలిపి అన్ని రకాల కూరగాయలు వేసి చేస్తారు. దీన్ని మామూలు జ్యూసు మాదిరిగా తీసుకోవడం వల్ల కడుపునిండినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఆహార పదార్థాలు తక్కువ తీసుకుంటారు.

డిన్నర్‌ తీసుకునే ముందు ఓ గ్లాస్‌ వెజిటేబుల్‌ జ్యూస్‌ సిప్‌ చేస్తే మిగిలిన చిరుతిళ్ళ జోలికి వెళ్ళడం కూడా చాలా వరకు తగ్గుతుంది. శరీరానికి కావలసిన పోషకాలు కూడా లభిస్తాయి.


కూరగాయలలోని సాల్యుబుల్‌ పీచు, తక్కువ సోడియం శాతాలు అధిక బరువును నియంత్రించడంలో ఎంతో సాయపడతాయి.

పాలకూర, కీరా, సొరకాయ వంటివి ఈ జ్యూస్‌లో వుపయోగించినట్లైతే మరింత మంచిదని వారు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెజిటేబుల్‌ జ్యూస్‌ తయారీకి సిద్ధపడండి.

ఆరోగ్యం... అందం.. రెండూ సొంతం చేసుకోండి... అని కూడా చెబుతున్నారు. మొత్తం మీద శాకాహారమే కాదు కూరగాయల జ్యూస్‌లు కూడా గొప్ప మేలే చేస్తాయన్న మాట!

తులసి పూజ ప్రాశస్త్యమ్‌

tulasi1
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా
య దగ్రే సర్వవేదశ్చ తులసీం త్వా నమామ్యహమ్‌
శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణియైన ‘‘తులసి’’ మొక్క మూలంలో సర్వతీర్థాలు, మధ్యభాగమందు సమస్త దేవతలు, తులసిమొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువై వున్న తులసీ మాతకు ముందుగా నమస్కరించుకుని, అంతటి పూజ్యనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర- తులసి ప్రాశస్త్యాన్ని గూర్చి, మన పురాణాలలో ఎన్నో కథలు కానవస్తున్నాయి. వాటిలో ఒక గాథను సమీక్షించుకుందాం!
‘‘బ్రహ్మవైవర్తపురాణం’’లో గల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది. ధర్మధ్వజుడు, మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతియైన కుమార్తె కలిగింది. వారు ఆ బిడ్డకు బృంద అను పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి. ఆమెకు వివాహ వయస్సు రాగానే శ్రీహరిని వివాహమాడ తలచి బదరికాశ్రమము చేరి బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ దర్శనమిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుమనగా ‘నేను రాధా శాపముతో నున్న రుక్మిణిని, నాకు శ్రీకృష్ణుడే భర్తగా కావాలని వరమీయమ’ని ప్రార్థించినది.
అందుకు బ్రహ్మ! నీ కోరిక తప్పక నెరవేరగలదు. కాని! ముందుగా గోలోక నివాసి సుదాముడే నీకు భర్త కాగలడు. అనంతరమే నీవు కోరిన వాడు నీకు పతి అవుతాడని వరమిచ్చి అంతర్థానమ య్యాడు.

tulasiఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుదాముడు పుష్కరకాలము శాప కారణంగా భూలోకంలో శంఖచూడుడై, జన్మించి తపమాచరించ సాగెను. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అంత శంఖచూడుచు ‘‘లక్ష్మి భూలోకమున పుట్టినదట! నాకామెతో వివాహము చేయించమ’’ని వేడుకొనెను. బ్రహ్మ ‘తథాస్తు’ అని పలికి ఆమె బదరికాశ్రమంలో ఉన్నది. ఆమె నీకు తప్పక లభ్యం కాగలదు అని యంతర్థాన మందెను. అనంతరం శంఖచూడుడు- బృంద వాద ప్రతివాదాల ను గమనించి వారికి మరల బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టాలు నెరవేరేందుకు వైభవముగా వివాహము జరిపించాడు.ఇక శంఖచూడునకు లక్ష్మీ అంశతో ఉన్న భార్య లభ్యమయ్యేసరికి! అష్టైశ్వర్యాలతో తులతూగుతూ, అతిశయం పెంచుకుని స్వర్గాధిపత్యము పొందగోరి దేవరాజ్యాన్ని కొల్లగొట్టి, దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయటమే కాకుండా, పరమేశ్వరుని చెంతకేగి, శివా! నీ భార్య సుందరాంగి, ఆమెను నాకు వశ్యురాలును చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగెను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి ‘‘శివా! వీడు ఆజేయుడగుటకు కారణం ఈతని భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించెదను. నీవు వీనిని వధించుము’’ అని యుక్తి చెప్పెను.

అనంతరం మాయా శంఖచూడుని వేషము ధరించిన శ్రీహరిని చూసి బృంద తన భర్తే వచ్చాడని భ్రమించి, అతనికి సర్వోపచారాలు చేసి శ్రీహరి చెంతకు చేరగానే! ఆమె పాతివ్రత్యం భగ్నం కావటం గ్రహించి శివుడు శంఖచూడుని సంహరించగా అతడు దేహమును విడచి ‘‘సుదాముడై’’ గోలోకమునకు వెళ్ళాడు. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని ‘‘శిలారూపమందుదువుగాక’’ అని శపించగా, విష్ణువు తిరిగి ఆమెను నీవు వృక్షమగదువుగాక అని శపించెను. ఆ విధంగా శ్రీహరి గండకీనదిలో సాలగ్రామ శిలగాపుట్టి, బృంద తులసీ వృక్షమైపోయి ఇద్దరూ ప్రపంచం చేత పూజలందుకుంటున్నట్టు బ్రహ్మవైవర్త పురాణగాథ ద్వారా విదతమవుతోంది.
ఒకసారి పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామిని చెంతకు చేర్చుకుని
‘‘పుత్రా! సకల వృక్షములలోన తులసి మొక్కయే పూజ్యమైన క్ష్మారుహంబు దాని పత్రములును దాని పుష్పములును బ్రాణ సమములగును అచ్యుతునకు’’ అని చెప్పాడు.

అంతేకాక వృక్షాలన్నిటిలో తులసి శ్రేష్ఠమైనది. శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైంది. తులసిపూజ, తులసీ స్తోత్రం చదవడం, తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున జల్లుకోవడం. తులసీవనాన్ని పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించటం ఎంతో పుణ్యప్రదమైనవి. గోదాదేవి తులసివనంలోనే అయోనిజగా విష్ణుచిత్తునింట వెలసి శ్రీరంగనాధుని ఇల్లాలయింది.
శ్లో వశిష్ఠాది ముస్తోమైః పూజితో తులసీవనే
తదా ప్రభృతి యద్విష్ణూః బ్రతిజ్ఞాం కృతవాన్‌ ప్రభుః
తస్మిన్‌ తులస్యాంతు యః పూజాంకురుతే నర
సర్వపాప వినిర్ముక్తః మమసాయుజ్య మాప్నుయాత్‌
వశిష్ఠాది మునిగణంతో ఎన్నో విధాలుగా స్తోత్రపూర్వకంగా శ్రీహరి తులసీవనమందు పూజలందుకొని తన్ను కార్తీక శుద్ధద్వాదశి నాడు విశేషించి ఎవరు పూజచేస్తారో అట్టివారి సమస్త పాపాలు అగ్నిలో పడిన మిడతలు వలె భస్మమై వారు తప్పక నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసెనట!
శ్లో తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్ఛినః
యదిచ్ఛేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యంబ్రాహ్మణైస్సహ
విష్ణోః ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకథా
ద్వాదశ్యాం శ్రవణాత్తస్యాః పునర్జన్మ న విద్యతే
విష్ణు సాన్నిధ్యం కోరి విష్ణు దేవునకు ఏమాత్రమైనా ప్రీతి చేయాలని తలచేవారు తులసీ వ్రతమహత్య్మము తప్పక వినాలి. అందునా! క్షీరాబ్ధిద్వాదశి రోజున తులసి కథ వినువార్కి, చదువువారికి పూర్వజన్మ కృతమైన దుఃఖములన్నియు తొలగిపోయి విష్ణులోకాన్ని పొందుతారు అని శంకరుడు తులసి కొనియాడినట్లు తెలుస్తోంది. అలాంటి తులసీ బృందావన ంలో ఉసిరిమొక్కతో కలిపి తులసీధాత్రి సమేత శ్రీమన్నారాయణుని కార్తీక ద్వాదశినాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొన్నారు. పైగా తులసీ దళాలకు నిర్మాల్యదోషం పూజలో ఉండదని కూడా చెప్పారు.

కనుక హిందూ మతంలో తులసి ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్థానాన్ని పొందింది. తులసి మొక్క హిందువులకు పూజనీయమైంది. అందుకే హిందువులు ప్రతి ఇంటా తులసి మొక్క ను కోటలో పెంచి పూజించటాన్ని చూస్తూ ఉంటాం. ఇక పట్టణవాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని, చిన్న చిన్న కుండీల్లోనో, డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు. తులసి ఉన్న ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది.

ఇక ఈ తులసిని వైద్య పరంగా చూస్తే ఆయుర్వేద శాస్త్రంలో సప్తతులసి-భరతవాసి అంటూ తులసిని ఏడు విధాలుగా వివరించారు. అవి 1. కృష్ణ తులసి, 2, లక్ష్మీ తులసి, 3, రామతులసి, 4. నేల తులసి, 5. అడవి తులసి, 6. మరువ తులసి, 7. రుద్ర జడ తులసిగా వివరిస్తారు. వైద్యపరంగా అవన్నీ ఎన్నో అమోఘమైన ఔషధగుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతోంది. ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు (కోటలోవికాదు) విడిగా పెంచుకున్న మొక్కల నుండి నమిలి మింగితే వారికి బుద్ధి శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని, ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్తారు. ఇక దాని కాండముతో తయారు చేసిన తులసి మాలకు ఇటు ఆధ్యాత్మికపరంగా అటు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయట!
కనుక ప్రతి క్షీరాబ్ధిద్వాదశి వ్రతాన్ని ఆచరించి ఇటు ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆరోగ్య భాగ్యాన్ని సర్వులూ పొందవచ్చు!

సత్యనారాయణ వ్రత..

కార్తీక మాసంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి పుణ్య వ్రతాన్ని లక్షలాది కుటుంబాల్లో తప్పనిసరిగా జరిపిస్తారు. ఈ పుణ్యదినాలలో ఈ వ్రతం ఆచరించడం వల్ల సర్వ భోగభాగ్యాలు శ్రీ సత్యనారాయణ స్వామి కటాక్షంగా లభిస్తాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆంధ్ర ప్రాంతీయులకంటే తెలంగాణా ప్రాంతంలో ఈ వ్రతాచరణ ఒక విధివిధాన మవ్వడం, ఆచరించే విధానంలో ఉండే పద్ధతులు ప్రత్యేకంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో శ్రీ కేదారేశ్వరస్వామి వారి వ్రతాన్ని ఈ మాసంలోనే జరపడం మరో విశేషం. ఉత్తర భారత దేశంలో ఈ మాసంలో బిల్వపత్ర వ్రతాన్ని జరిపిస్తారు. ఇంటింటా లక్షలాది మారేడు దళాలతో ఈ మాసం పవిత్రమౌతుంది. శక్తి ఉన్నవారు స్వర్ణ బిల్వపత్రాలను చేయించి తొమ్మిది రోజులు శివసన్నిధిలో ఉంచి బ్రాహ్మణోత్తములకు లేదా వృద్ధ ముత్తయిదువులకు దానమిచ్చి బిల్వాష్టకమును పారాయణ చేస్తారు.

ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ దానాలు చేసినా, వ్రతాలు చేసినా కార్తీక వైభోగం కార్తీక వైభోగమే! ఒక్క బిల్వాన్ని శివుడికి అర్పిస్తే చాలు! జన్మ ధన్యమౌతుంది. ఒక పొద్దు ఉపవాసముంటే చా లు! కైలాసవాసం ప్రాప్తిస్తుంది. ఒక్క దీపాన్ని దానమిస్తే చాలు! జీవితం ఐశ్వర్యమయమౌతుంది ఇలా అనేక నమ్మకాలతో మనస్సు పవిత్రంగా పరమేశ్వర సేవలో లగ్నమౌతుంది.

కొరతలేని జీవనానికి కార్తీకమాసంలో పుణ్యవ్రతాలను మంగళప్రదంగా ఆచరించడం ఆనవాయితీ. శివతత్త్వాన్ని గృహంలో ప్రతిష్టించి, కార్తీక పురాణ కథలను పదిమంది ముందు పఠించి, భక్తికి ప్రాధాన్యత ఇస్తూ అర్థనారీశ్వర చైతన్యాన్ని హృదయంలో నింపుకుంటార భక్తులు. ఆ ప్రార్థనా శక్తి ఆవిర్భవింపచేసే మహోతేజస్సు శివం....శివం అంటూ హృదయాన్ని ప్రకాశింపచేస్తుంది.
- డా వి.జి.శర్మ

దానిమ్మతో కిడ్నీ వ్యాధులకు చెక్!

దానిమ్మ అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌లను తగ్గిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడవగా.. దీని రసం మూత్రపిండాల వ్యాధులను నిరోధించేందుకూ ఉపయోగపడుతుందని తాజాగా ఇజ్రాయెల్ పరిశోధకులు తేల్చారు. 

డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో పలు సమస్యలను ఇది నివారిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్ల ద్వారా సంభవించే మరణాలను, వ్యాధి సంబంధిత గుండె సమస్యలను గణనీయంగా తగ్గిస్తుందని పేర్కొన్నారు.

Thursday, November 11, 2010

మధుమేహం తియ్యటి శత్రువు.

మధుమేహం తియ్యటి శత్రువు. చాప కింద నీరులా చల్లగా మన ఒంట్లోకి చేరిపోతుంది. ఏమరుపాటుగా ఉంటే జీవితంలోని తీపిని దూరం చేసి చేదును మిగులుస్తుంది. ఈ స్వీట్ ఎనిమీ దరిదాపుల్లోకి రానేవద్దు అనుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే ఈ ఎనిమీతో పోరాడుతున్న వారు దానిమీద పైచేయి సాధించాలంటే ఏం చేయాలి? వీటి మీద సమగ్ర వివరణే ఈ ముందు జాగ్రత్త.

ప్రాణాపాయం కలిగించే అంటువ్యాధుల్లో టి.బి అత్యంత ప్రమాదకరమైనది. అంటువ్యాధి కాని జబ్బుల్లో డయాబెటిస్ ప్రమాదకరమైనది. ఈ రెండు వ్యాధులు మన దేశంలో చాలా ఎక్కువ. డయాబెటిస్ వచ్చినవారిలో అందరూ అనుకునేటట్టుగా గుండె, కిడ్నీలు దెబ్బతినడం ప్రాణాపాయం అనుకుంటారు. కాని డయాబెటిస్ వచ్చినవారికి టి.బి లాంటి పెద్ద ఇన్ఫెక్షన్ల కారణంగానే ఎక్కువ మందిలో ప్రాణాపాయం సంభవిస్తుంది. ఈ విషయం మన దేశంలో ఎన్నో డయాబెటిస్ పరిశోధనల్లో వెల్లడైంది.

నేషనల్ అర్బన్ డయాబెటిస్ సర్వే 2001లో హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ, ముంబయ్, మద్రాస్ నగరాలలో (5288 పురుషులు, 5929 స్ర్తీలపై) మధుమేహుల సంఖ్య ఎంతగా ఉందో తెలుసుకోవడానికి ఓ సర్వే నిర్వహించింది. మిగతా నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో పాతికేళ్లు దాటిన ప్రతి ఆరుగురిలో ఒకరికి మధుమేహం ఉన్నట్టుగా వెల్లడైంది. ఇక నలభై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ల మధ్య వయసు వారిలో 50శాతం మందికి ఈ వ్యాధి ఉందని తెలిసింది. పదేళ్లతో పోల్చి చూస్తే ఇప్పుడు ఈ సంఖ్య ఎంతగా పెరిగి ఉంటుందో ఊహించవచ్చు. మధుమేహం లేనివారు నాకు ఈ జబ్బు లేదు కదా! అని నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఏ వయసులోనైనా, ఎవరికైనా ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కారణాలు కనిపెట్టి, తగినంత శ్రద్ధ వహిస్తే ఈ సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు.

డయాబెటిస్ నివారణ కోసం ముందు జాగ్రత్తలు
1. పంటి జబ్బులు: పంటికి-మధుమేహానికి ఏమిటి లింకు? పంటి వ్యాధులు డయాబెటిస్‌కు ఎలా కారణం? అనేదానికి వైద్యపరంగా ఇంకా ఆధారాలు తెలియలేదు. అయితే కనెక్షన్ మాత్రం ఉంది. పంటి(పెరియోడాన్‌టైటిస్) వ్యాధుల బారినపడిన వారందరికీ మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది. దంత సంబంధ వ్యాధులు ఉన్నవారిలో డెంటిస్ట్ చేత పళ్లను క్లీన్ చేయించిన తర్వాత టెస్టులు చేస్తే, డయాబెటిస్ రిస్క్ సగానికి సగం తగ్గినట్లుగా పరిశీలనలు చెబుతున్నాయి. అందుకే డయాబెటిస్ సమస్య రాకుండా ఉండాలంటే పంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.

2. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు: ఇన్ఫెక్షన్లు తరచూ బాధిస్తే మధుమేహం వస్తుంది. ముఖ్యంగా చర్మవ్యాధులైన ఫంగస్, గజ్జి, తామర వంటి వాటి వల్ల పాంక్రియాస్‌లోని బీటా కణాలు పాడైపోయి మధుమేహం వస్తుంది. సాధారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ దాడిచేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లు పిల్లల్లో ఎక్కువగా గమనిస్తుంటాం. అందుకని చర్మవ్యాధులు అంటే ఒంటిపై చిన్న చిన్న కురుపులు కనిపించినా డాక్టర్‌ని సంప్రదించి తగిన యాంటీబయాటిక్స్ వాడాలి.

ఎ) మూత్రసంబంధిత ఇన్ఫెక్షన్లు: జననేంద్రియాలకు సంబంధించిన శుభ్రత సరిగ్గా పాటించకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు అధికంగా కనిపిస్తుంటాయి. పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. మగపిల్లల్లో అంగంపై తెల్లని పొడలా కనిపిస్తుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మూత్రద్వారం సగం మూసుకుపోయే అవకాశం ఉంది. దీని వల్ల పదే పదే ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఆడపిల్లల్లో అయితే రజస్వల అయిన నాటి నుంచి శుభ్రతకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన కల్పించాలి. లేదంటే వీరిలోనూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి, తద్వారా డయాబెటిస్‌కి దారితీసే అవకాశాలు ఎక్కువ.

బి) వైరల్ ఇన్ఫెక్షన్లు: చికెన్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్... వంటి వైరల్ ఫీవర్ల మూలంగా ప్రతి ఏడాది ఎంతో మంది బాధపడుతున్నారు. వీటి నివారణకు డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ కోర్సు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే వీటి వల్ల పదే పదే బాధపడేవారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

సి) నులిపురుగులు: ఆహారం ద్వారా పొట్టలోకి చేరిన బ్యాక్టీరియా, కడుపులో ఏర్పడే పురుగులు ఉదరకోశ సమస్యలకు కారణాలు అవుతుంటాయి. నులిపురుగుల సమస్య పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. నులిపురుగులకంటే ఆస్కారియాసిస్ అనే పురుగులు ఇంకా పెద్దగా ఉంటాయి. ఇవి పాంక్రియాస్ డక్ట్‌కు అడ్డం పడటంతో ఆ గ్రంథి నుంచి వెలువడే స్రావాలు ఆగిపోతాయి. ఫలితంగా డయాబెటిస్ వస్తుంది. అందుకని కడుపులో నులిపురుగులు ఉంటే ఎక్కువ రోజులు ఆగకుండా తగిన చికిత్స తీసుకోవాలి.

మానసిక ఒత్తిడి
ఈ మధ్యకాలంలో సామాజికంగా, వ్యక్తిగతంగా పనుల్లో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. స్ట్రెస్ హార్మోన్లు అన్నీ కూడా ఇన్సులిన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఉదాహరణకు కార్టిజాల్స్, ఎడ్రిలిన్, థైరాక్సిన్, గ్రోత్‌హార్మోన్... లాంటివి. మనలో కోపం, బాధ, ఉద్వేగం, భయాలకు లోనైనప్పుడు గుండెదడ, మెదడు బండబారిపోవడం, బి.పి పెరగడం లేదా పడిపోవడం, తల భారంగా అనిపించడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. ఈ ఒత్తిడి ఏదో ఒక రోజు కాకుండా, రోజూ ఎదుర్కుంటూ ఉంటే హార్మోన్ల పనితీరు మందగించి, ఒకవేళ ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అయినా ఆ మోతాదు శరీరానికి సరిపోదు. ఫలితంగా డయాబెటిస్ వస్తుంది. దాదాపుగా డయాబెటిస్ రావడానికి 70 శాతం మానసిక ఒత్తిడే ప్రధాన కారణం. అందుకే మానసిక ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. స్ట్రెస్‌ని మొదట్లోనే ఆధునికవైద్యపరంగా కాకుండా యోగా, మెడిటేషన్, లాఫింగ్, రిలాక్సేషన్ పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు.


డయాబెటిస్ ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మధుమేహం ఉన్నప్పుడు ఆహార నియమాలు పాటించడంతో పాటు ఇతరత్రా ఆరోగ్య విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
1. పంటి జబ్బులు: రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉన్నవారికి పంటిపై గారను శుభ్రపరిస్తే ఆ మరుసటి రోజుకి రక్తంలో గ్లూకోజ్ 50 శాతం తగ్గినట్టుగా చాలా సందర్భాల్లో తెలిసింది. మధుమేహం నియంత్రణలో ఉండాలంటే వీరు పంటి సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మౌత్‌వాష్‌లను రోజుకు నాలుగైదు సార్లు ఉపయోగించాలి.

 
2. ఇన్ఫెక్షన్లు:
ఎ) చర్మవ్యాధులు: చర్మంపై చిన్న చిన్న పొక్కులు వంటివి సాధారణంగా వస్తుంటాయి. అలాగని వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి నయం కావడానికి తగిన యాంటీబయాటిక్స్‌ను వాడాలి. రోజూ షుగర్ మాత్రలు, ఇన్సులిన్ తీసుకునే వారు చర్మ వ్యాధులు రాకుండా జాగ్రత్తపడాలి.

బి) మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు: మూత్రం ఆగి ఆగి రావడం, విసర్జనలో మంట, దురద వంటివి చూసినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవాలి.

3. శుభ్రత:
సాధారణంగా మన దేశంలో ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు తప్ప, మామూలుగా చెప్పుల వాడకం చాలా తక్కువ. దీని వల్ల కాలిగోళ్లు, కాలివేళ్ల మధ్య, పగుళ్ల మధ్య మురికి చేరి ఒక్కోసారి శాశ్వతంగా ఉండిపోతుంటుంది. వీటి వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ సమయానికి నొప్పి, జ్వరం, మంట అనిపించకపోవచ్చు. కాని కాళ్లు, చేతుల అశుభ్రత మధుమేహానికి ప్రధాన కారణం. అందుకని ఒక టబ్‌లో కొద్దిగా యాంటిసెప్టిక్ లోషన్ కలిపిన నీటిలో ఉదయం, సాయంత్రం పాదాలు పది, పదిహేను నిమిషాలు ఉంచి, శుభ్రపరిచి, ఆ తర్వాత తేమ లేకుండా తుడుచుకోవాలి. కాటన్ సాక్స్ వాడుతూ, చెమట పట్టకుండా చూసుకుంటే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే ముక్కు, చెవులు, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు తగిన యాంటీబయాటిక్స్ వాడాలి. కొందరికి తలపై మాడు నుంచి చుండ్రు రాలుతుంటుంది. దీనికీ తగిన మందులు వాడాలి.

మరిన్ని జాగ్రత్తలు: ఒత్తిడి తగ్గడానికి హార్ట్‌రేట్‌ను పెంచే ఫోన్, టీవీ.. వంటివి అతిగా వాడకూడదు.
లేట్‌గా నిద్రపోవడాలు, లేట్‌గా లేవడాలు చేయకూడదు. నిద్రకు కచ్చితమైన సమయం పాటించినవారిలో మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
వేళకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా డాక్టర్‌చే చెకప్స్‌చేయిస్తూ, వారి సూచనలు పాటిస్తుంటే మధుమేహాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు.

ప్రొ॥ పి.వి.రావు
ఎండోక్రైనాలజిస్ట్,
నిమ్స్, హైదరాబాద్