Pages

Friday, December 24, 2010

పెనుమానం * మానసిక జబ్బులలో ‘అనుమానం’ ఒక లక్షణం

‘వీడు నా కొడుకేనా!’ ఓ భర్తకు భార్య శీలం మీద ‘అనుమానం.’
‘నేను కాకుండా నీకు ఇంకొకరున్నారు. అందుకే ఆఫీస్ నుంచి లేట్‌గా వస్తున్నావు’
ఓ భార్యకు భర్త మీద ‘అనుమానం.’
‘పిల్లాడు కాలేజీకి వెళ్లాడు, జాగ్రత్తగా ఇంటికి చేరతాడా?’
ఓ తల్లికి కొడుకు క్షేమంపైన ‘అనుమానం.’
‘గ్యాస్ కట్టేశానో, లేదో... లీకై పేలిపోతుందేమో!’
ఇంటి నుంచి బయటకు వచ్చాక భయం వల్ల కలిగే ‘అనుమానం.’
‘నా డబ్బు కొట్టేయడానికి అందరూ కుట్రపన్నుతున్నారు.’ ఇదొకరకం ‘అనుమానం.’
ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ ‘అనుమానాల’కు సంబంధించిన ఎన్నో కథనాలు వింటుంటాం. కళ్లారా చూస్తుంటాం. మనిషికి ఎదుటివారిపైన, చివరకు తనపైన తనకే అనుమానం ఎందుకు మొదలవుతుంది? ఈ జబ్బు ఏ పరిస్థితులకు దారి తీస్తుంది. సింపుల్‌గా అనిపించే ఈ క్రిటికల్ కండిషన్ గురించి పూర్తి వివరాలు తెలిపే కథనం.


దగ్గు, జ్వరానికి ఇవీ అని చెప్పలేని కారణాలు ఉన్నట్టే ‘అనుమానం’ అనే జబ్బుకు అంతకన్నా ఎక్కువ కారణాలు ఉన్నాయి. కొన్ని మానసిక జబ్బులలో ‘అనుమానం’ ఒక లక్షణంగా పేర్కొంటారు. వందలో వందమందికి ఉండే అనుమానాలు రకరకాలు...


యాంగ్జైటీ డిజార్డర్...

భర్త ఆఫీస్‌కి చేరగానే ఫోన్ చేయాలన్నది మధుమతి రూల్. కాని వెళ్లి గంటయినా ఫోన్ రాలేదు. కంగారు గా తనే ఫోన్ చేసింది. ఫోన్ రింగవుతోంది, కాని ఎన్నిసార్లు చేసినా ఎత్తడం లేదు. ‘ఏమై ఉంటుంది?’ ముందు అనుమానం, తర్వాత భయం... ఆవరించాయి. టీవీ ఆన్ చేసింది, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉందా అని. తర్వాత యాక్సిడెంట్ అయినట్టు బ్రేకింగ్ న్యూస్ ఏమైనా వస్తుందా! అని టీవీకే కళ్లప్పగించింది. అక్కడి నుంచి ఆమెలో తీవ్రమైన ఆందోళన... భర్తకు జరగరానిదేదో జరిగిపోయిందని, ఎవరైనా ఆఫీస్ వరకు తోడురమ్మని ఏడుస్తూ చుట్టుపక్కల వారిని వేడుకుంటుంది... కాని అసలు విషయం ఏంటంటే భర్త మీటింగ్ హడావుడిలో ఉండి క్షేమంగా ఆఫీస్‌కి చేరానన్న విషయం ఆమెకు ఫోన్ చేసి చెప్పలేకపోయాడు. ఇది ఆ ఒక్కరోజే కాదు... ఇంచుమించు రోజూ ఇలాంటి సంఘటన ఉంటూనే ఉంది. భర్త, పిల్లలు కాలు బయటపెడితే తిరిగి వాళ్లు ఇంటికి వచ్చేంత వరకు ఆమె కనీసం మంచినీళ్లు కూడా ముట్టదు.

అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్...
సుధాకర్ ఉద్యోగవిరమణ చేశాడు. శుభ్రత పట్ల అతనికి ఎనలేని శ్రద్ధ. ఈ విషయంలో అందరిచేత ప్రశంసలు అందుకునే సుధాకర్ ప్రవర్తన ఈ మధ్య మరీ విపరీతంగా మారింది. చేతులు మురికిగా ఉన్నాయని కడుక్కొని, శుభ్రంగా తుడుచుకుని వచ్చి కూర్చుంటాడు. పేపర్ పట్టుకొని అటు పక్కగా పెట్టాక చేతులకు ఏదో అంటినట్టుగా ఉంది అనుకుని మళ్లీ వెళ్లి సబ్బుతో రుద్ది రుద్ది కడుగుతాడు. తర్వాత మంచినీళ్లు తాగి గ్లాసు పక్కన పెట్టి, గ్లాసుకున్న మురికి చేతులకు అంటినట్టుగా ఉందని సబ్బుతో రుద్ది రుద్ది మళ్లీ చేతులు కడుక్కుంటాడు. అలా అతను ప్రతి అయిదు నిమిషాలకోసారి చేతులు మళ్లీ మళ్లీ కడుక్కుంటూనే ఉన్నాడు. కొన్నాళ్లకు ఈ అదేపనిగా ‘కడగడం’ వల్ల చేతులపై ఉన్న చర్మం ఎరబ్రారి పుండ్లు అవడం మొదలయ్యాయి. నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఈ జాడ్యం అతన్ని వదలడం లేదు. చేసిన పనినే ‘సరిగ్గా చేశానో! లేదో!’ అనే అనుమానం వచ్చి మళ్లీ మళ్లీ చేయడాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. ‘అనుమానం’లో ఇది ఒక తరహా లక్షణం.

ప్యాథలాజికల్ జెలసీ...
భర్త పరాయి స్ర్తీతో తిరుగుతున్నాడని నమిత అతన్ని రోజూ సాధిస్తోంది. ఆఫీస్‌కు వెళ్లినప్పుడు అతనికి తెలియకుండా ఫాలో అవుతుంది. అతను ఆఫీస్ నుంచి రావడం ఐదు నిమిషాలు ఆలస్యం అయినా ‘ఎవరి దగ్గరికో వెళ్లి ఉంటారు’ అంటుంది. ఏదైనా పెర్‌ఫ్యూమ్ వాసన వస్తుందేమో... అని ఇంటికి రాగానే దగ్గరగా వెళ్లి డ్రెస్ వాసన చూస్తుంది. అతనికి సంబంధించిన వస్తువులన్నీ చెక్ చేస్తుంటుంది. డిటెక్టివ్ ఏజెన్సీలను కలిసి తన భర్త ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఫ్రూఫ్‌లతో సహా ఇమ్మంటుంది. భార్య ప్రవర్తన వల్ల ఇంట్లో మనశ్శాంతి కరువైందని ఇంటికి రావడమే మానేశాడు భర్త. ముప్పై ఏళ్ల నమిత పరిస్థితి ఇలా ఉంటే..

అరవై ఏళ్ల ప్రతాప్ ఇటీవలే ఉద్యోగ విరమణ చేశాడు. ఇల్లు కట్టాడు. పిల్లలు వారి వారి జీవితాల్లో సెటిల్ అయిపోయారు. ఏ చీకూ చింతా లేదు. ఈ మధ్య అతని ఇంటి పక్క పోర్షన్‌లోకి ఒకప్పటి తన కొలీగ్ కుటుంబం చేరడంతో అతనిలో ఎన్నడో పాతుకుపోయిన అనుమానం ఒకటి బయటకు వచ్చింది. పదిహేనేళ్ల క్రితం తనింటికి అతను వచ్చినప్పుడు భార్య అతనికి వంగి టీ అందించిందని, ఆ రోజు ఆమె అలా అతనికి సిగ్నల్ ఇచ్చిందని, కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య సంబంధం నడుస్తోందని, ఆ సంబంధాన్ని పెంచుకోవడానికే అతను తన ఇంటి పక్కన చేరాడని ఆమెతో రోజూ గొడవ పెట్టుకుంటున్నాడు. ఆలు మగల మధ్య వివాహేతర సంబంధాలు ఉన్నట్టు అనుమానాలు రేకెత్తడాన్ని ప్యాథలాజికల్ జెలసీ అంటారు.


పారనాయిడ్ స్క్రిజోఫీనియా...
‘లోకమంతా నా మీద కక్ష కట్టింది. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నేను చెడిపోవడమే వాళ్లకు కావాల్సింది. నన్ను ఎవరో వెంబడిస్తున్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నా ఆస్తిని అందరూ దోచుకుపోవాలనుకుంటున్నారు. ప్రభుత్వమే నాకు అన్యాయం చేయాలనుకుంటోంది. ఉపగ్రహాల ద్వారా నన్ను వారి అధీనంలోకి తెచ్చుకోవాలని కుట్ర పన్నుతోంది.’ ఈ తరహా ఆలోచనా విధానాలలో తీవ్రమైన అనుమానాలు కలుగుతుంటాయి. అనుమానాలలో ఇది తీవ్రమైన జబ్బు.
హైపో కాండ్రియాక్...
‘తలనొప్పి వచ్చినట్టుగా అనిపించగానే, బ్రెయిన్ ట్యూమర్ అయి ఉంటుందా?’ అనే అనుమానం తొలుస్తుంది. ‘ఛాతిలో నొప్పి, అమ్మో! ఇది డెఫినెట్‌గా గుండెజబ్బే..,’ ‘నడుం నొప్పి, బాబోయ్! కిడ్నీలు ఫెయిల్ అయ్యాయేమో,’ కడుపులో నొప్పి, క్యాన్సర్ కాదు కదా!...’ చిన్న చిన్న అనారోగ్యసమస్యలకు అనుమానం వల్ల పెద్ద పెద్ద జబ్బులను అంటగట్టుకొని భయపడుతుంటారు. ఎదుటివారు ‘అలా అయి ఉండదులే’ అంటే, మీకేం తెలుసు, దేనినైనా ‘కీడెంచి మేలెంచు’ అన్నారు పెద్దలు అంటుంటారు.

ఈ తరహా ప్రవర్తనలు ఎదుటివారికి చిరాకు, కోపాన్ని తెప్పించడం సహజం. అలాగని వీరి నుంచి దూరం అవ్వాలి అనుకోకుండా చికిత్సామార్గాలతో సాధారణ స్థితికి తీసుకురావచ్చు.

చికిత్స
‘అనుమానం’ తీవ్రంగా ఉన్నవాళ్లను డాక్టర్ వద్దకు వెళ్దామంటే వారి అహం దెబ్బతింటుంది. తమకు లేని జబ్బు ఏదో ఆపాదిస్తున్నారని కుంగిపోవడం, వాదనకు దిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఇతర సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అందుకని ‘అనుమానం’తో సఫర్ అవుతున్న వ్యక్తులను మంచి మాటలతో వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. వైద్యులు కూడా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కౌన్సెలింగ్ అంటూ వెళ్లకుండా ముందుగా మందులు సజెస్ట్ చేయాలి. తీవ్రత తగ్గాక కౌన్సెలింగ్, కాగ్నెటివ్ థెరపీ ద్వారా ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావచ్చు.

‘అనుమానం’ ఎందుకు?

మెదడులో జరిగే న్యూరో కెమికల్ ఇమ్‌బ్యాలెన్స్.

తనదైనదేదో తనకు కాకుండా పోతుందనే ఇన్‌సెక్యూరిటీ. అతి ప్రేమ.


ఎదుటివారిపైన నమ్మకం లేకపోవడం.


ఆల్కహాల్, పొగ తాగడం, కొన్ని రకాల మత్తు పదార్థాలకు బానిస కావడం.


త లకు చిన్న చిన్న దెబ్బలు తగిలి బ్రెయిన్ దెబ్బతినడం.


చిన్న నాటి నుంచి ప్రేమ లేకుండా పెరిగిన వాతావరణం.


{బెయిన్‌కు ఇన్ఫెక్షన్లు సోకడం.


అమితమైన ఆందోళన.


ఇలా రకరకాల కారణాల వల్ల ‘అనుమానం’ అనేది వ్యక్తిలో ఓ భాగం అయిపోతుంటుంది.


ఈ జబ్బు నుంచి బయటపడాలంటే...

అనుమానం అప్పుడప్పుడు వస్తున్నా, మాటలతో ఎదుటివ్యక్తిని సముదాయించగలుగుతున్నాం అనుకుంటే జబ్బుగా పరిగణించనక్కర్లేదు. కాని ఈసమస్య డైలీ లైఫ్‌ని ఇబ్బంది పెట్టేదిగా ఉంటే, అవతలి వ్యక్తి రోజూ నరకం చూడాల్సి వస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అనుమానం అనే జబ్బు వదిలించుకోవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

రోజూ మనసుకు సాంత్వన చేకూర్చే అభిరుచులను పెంపొందించుకోవాలి.


మాటలంటున్నప్పుడు జబ్బు వల్లే ఇలా చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారి మాటల్ని వినీ విననట్టు ఉండాలి. అనుమానించదగ్గ టాపిక్ రాగానే డైవర్ట్ చేయాలి.


ప్రతి దానికి అనుమానిస్తారని విసుక్కోవడం, కోప్పడటం, కొట్టడం లాంటివి చేయకూడదు.

అనుమానించదగ్గ పనులను మళ్లీ మళ్లీ చేయకూడదు. భాగస్వామిలో నమ్మకాన్ని పెంచేలా మన ప్రవర్తన ఉండాలి.


ఆల్కహాల్, స్మోకింగ్, మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి.


‘అనుమానం’ వల్ల చుట్టూ ఉన్న మనుషులు ఇబ్బంది పడుతున్నారు అని గమనించినప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి.

No comments:

Post a Comment