Pages

Monday, January 31, 2011

ఇబ్బందిపెట్టే గురక

sleepy-student-snoring 
మన పక్కన పడుకున్న వాళ్ళు ఎవరైనా గురక పెడుతుంటే మనకు నిద్ర పట్టదు. గురకలు కూడా రకరకాలుగా పెడుతుంటారు. కొన్ని గురకలు భయాన్ని పుట్టిస్తాయి. పాశ్చాత్య దేశాల్లో మొగుడి గురక తట్టుకోలేక విడాకులకై కోర్టులకు పరుగెత్తిన వాళ్ళూ ఉన్నారు. గురక పెట్టేవాళ్ళు రాత్రి సరిగ్గా నిద్రపోక పగలు కునికి పాట్లు పడుతూ వాహనాలు నడిపేటప్పుడు యాక్సిడెంట్లు చేస్తారని పలు అధ్యయనాల్లో తేలింది.

ఈ అధ్యయనం ప్రకారం ప్రపంచ జనాభాలో కనీసం 40 శాతం మంది గురకపెట్టే వారే! పిల్లల్లో సైతం ఇది కనబడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ గురక ఎక్కువవుతుంది. అలాగే బరువు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య పెరుగుతుంది.

గురక అంటే ఏమిటి?
శ్వాస లోపలికి తీసుకునేప్పుడు ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఎక్కడైనా నాళాలు సన్నబడ్డా, శ్వాసద్వారాలు మూసుకుపోయినా, గాలి లోపలికి బలవంతాన తీసుకుంటున్నప్పుడు వచ్చే శబ్దమే గురక. నాళాలు సన్నగా ఉండడంతో బలవంతాన గాలి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి గురకలో గాలి ఎక్కువ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది చూసేవారికి. గొతులో ఉండే కండరాల బిగువు తగ్గినప్పుడు అంగిట్లో చివరి భాగాన ఉండే కండరం సాఫ్ట్‌ పాలట్‌తో బాటు చుట్టుపక్కల ఉన్న ఫారింక్స్‌ కండరాలు, కొండ నాలుక బలంగా లోపలికి పీల్చే గాలి వల్ల కంపిస్తాయి. ఈ కంపనం వల్ల వచ్చే శబ్దమే గురక.

నిద్రలో బలవంతాన తీసుకున్న గాలిని తిరిగి సన్నని శ్వాసనాళాల ద్వారా బయటకు నెట్టడం కష్టమై నిశ్వాస నోటి ద్వారా కూడా జరుగుతుంటుంది. అప్పుడు పెదాలు కంపించి కొన్ని రకాల శబ్దాలు వస్తుం టాయి. ముక్కు దూలం వంకరగా ఉన్నా, అడినాయిడ్స్‌, టాన్సిల్స్‌ ఉన్నా శ్వాసమార్గం సన్నబడుతుంది. ఊపిరి తేలిగ్గా లోపలికి వెళ్ళదు. గురక వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. మెలకువగా ఉన్నప్పటికన్నా నిద్ర పోయేటప్పుడు శ్వాస సరిగా ఉండేట్లు శస్తచ్రికిత్స చేయించుకోవాలి. అడినాయిడ్స్‌, టాన్సిల్స్‌ గాని ఉంటే తీయించాలి. థైరాయిడ్‌ వ్యాధి ఉన్న వాళ్ళు థైరాయిడ్‌ హార్మోన్లు తీసుకోవాలి. ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గించుకోవాలి.

నిద్ర, నిద్రకు సంబంధించిన రుగ్మతపై అవగాహన పెరుగుతున్న తరుణంలో శ్వాససంబంధిత వ్యాధులు- గురక ఈ రుగ్మతలలో భాగమేనని గుర్తించారు. నిద్రలో 10 సెకన్ల పాటు శ్వాస ఆగిపోవడాన్ని ‘ఆప్నియా’ అని, 50 శాతం కంటే తక్కువ గాలి పీల్చడాన్ని ‘హైపోప్నియా’ అని అంటారు. వీటికి తోడు రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం కూడా బాగా తగ్గుతుంది. అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా (ఒఎస్‌ఎ) శ్వాస ప్రక్రియ జరుగుతున్నా ముక్కు- గొంతుకలో అడ్డంకుల వల్ల శ్వాస ఆగిపోతుంది. ఆ తరువాత గురక రావడం ఒక సైకిల్‌గా వస్తుంది. వ్యాధిగ్రస్తుడు తరచుగా మేల్కోవడం, గొంతు తడారిపోవడం జరుగుతుంది.

గురక లక్షణాలు: 1. గురక, నిద్రాభంగం. 2. వేకువజామున తలపోటు 3. పగటి నిద్ర. 4. పని మీద ఏకాగ్రత లేకపోవడం. 5. వ్యక్తిత్వంలో మార్పులు. 6. ఆక్సిడెంట్‌లకు గురి కావడం. 7. రాత్రివేళల్లో ఎక్కువ మూత్రం. 8. హై బిపి 9. హార్ట్‌ ఎటాక్స్‌. 10. అంగస్తంభన సమస్యలు.

వ్యాధి నిర్ధారణ: స్లీప్‌ స్టడీ ద్వారా అబ్‌స్ట్రక్టివ్‌ లేదా సెంట్రల్‌ స్లీప్‌ ఆప్నియాను గుర్తించవచ్చు. ఈ పరీక్ష రాత్రివేళలో నిర్వహిస్తారు. కనీసం 7-8 గంటలపాటు నిద్రలో వివిధ అంశాలను గుర్తించవచ్చు. ఆప్నియా, హైపోప్నియా, బిపి ఆక్సిజన్‌ పరిమాణం, గుండె స్పీడు, శ్వాస స్పీడు, ఛాతీ కదలికలు, ఏ పొజిషన్‌లో పడుకున్నది, కాళ్ళ కదలికలు, గురక వంటి వాటిని రికార్డు చేసి ఎంత ఉధృతంగా ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఒఎస్‌ఎ చికిత్స: బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బిఎమ్‌ఐ) 20 నుండి 25 లోపు ఉండేట్లు చూసుకోవడం, బరువు తగ్గడం, థైరాయిడ్‌, డియన్‌యస్‌, టాన్సిల్‌, అడినాయిడ్స్‌ సమస్యలను మందులతో లేదా శస్త్ర చికిత్స ద్వారా నయం చేసుకోవటం అప్పటికీ గురక తగ్గకపోతే యుపులో పాలాటో ఫారింజి యో ప్లాస్టీ అనే శస్త్ర చికిత్స అవసరం పడుతుంది. ఫెయిల్‌ అయిన వారిలో కంటిన్యువస్‌ పాజిటివ్‌ ఎయిర్‌వేస్‌ ప్రెషర్‌ (సిపిఎపి)తో శ్వాస మార్గాలను వెడల్పు చేయడం, తద్వారా శ్వాస ప్రక్రియ సజావుగా జరిగేట్లు చూడవచ్చు. దీనిని ఇంటి దగ్గరే ప్రతిరోజు పడుకునేటప్పుడు వాడాలి. ఈ చికిత్స వల్ల బరువు తగ్గడం, గురక, బిపి వంటివి తగ్గడమే కాకుండా దినచర్య కూడా చాలా ఆక్టివ్‌గా ఉండేట్లు చేయవచ్చు.

- డా బి.శ్యామ్‌ సుందర్‌ రాజ్‌
ఎం.డి., డి.ఎం., (పి.జి,ఐ.), డి.ఎన్‌.బి
పల్మనాలజిస్ట్‌, శ్రేష్టా హాస్పిటల్స్‌
హైదరాబాద్‌.

1 comment: