స్నానం చేస్తాం. శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తాం. తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తాం. బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తాం. మసాజ్‌లా ఉంటుంది.అయితే - ఇవన్నీ పైపై స్నానాలు. కాకిస్నానాలు. లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది. ఈవారం కపాలభాతి ఆసనం నేర్పిస్తున్నాం. సాధన చెయ్యండి. మెదడుకు, శ్వాసకోశాలకు, జీవక్రియలకు లాలపొయ్యండి. గాల్లో తేలినట్లు లేకపోతే అడగండి.
కపాలభాతి ప్రయోజనాలు:
మెదడు శుభ్రపడడంతోపాటు, ఆలోచనశక్తి, స్మరణశక్తి పెరుగుతాయి
శ్వాసకోశనాళాల్లో కఫం పోతుంది కాబట్టి ఆస్థ్మా బాధితులకు మంచి ఫలితాన్నిస్తుంది
ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి, రక్తశుద్ధి జరుగుతుంది, గుండెపనితీరు మెరుగవుతుంది
జీర్ణక్రియ మెరుగవుతుంది, మల బద్దకం, నిద్రమత్తు, బద్దకంపోతాయి
సైనస్, కిడ్నీ సమస్యలు పోతాయి
కపాలభాతిని రోజూ సాధన చేస్తుంటే మధుమేహం సాధారణస్థితికి వస్తుంది
వీళ్లు చేయకూడదు!
హైబీపీ, కడుపులో ట్యూమర్లు, హెర్నియా, గుండెజబ్బుల వాళ్లు, గర్భిణులు, పీరియడ్స్ సమయంలోనూ చేయకూడదు.
ఎప్పుడు చేయాలంటే!
ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు, కానీ పొట్ట ఖాళీగా ఉండడం ముఖ్యం. మొదలు పెట్టిన రోజే ఎక్కువ సేపు చేయకుండా క్రమంగా నిడివి పెంచుకోవాలి. సాధన మధ్యలో విశ్రాంతి తప్పనిసరి. ప్రారంభంలో వీపు కిందిభాగం, కడుపులో నొప్పి అనిపించవచ్చు. అది సాధన చేసే కొద్దీ తగ్గిపోతుంది.
జాలంధర బంధం అంటే గడ్డాన్ని ఛాతీకి బంధించి ఉంచడం, మూలబంధం అంటే మలద్వారాన్ని పైకి లేపి ఉంచడం, ఉడ్యానబంధం అంటే పొట్టను బిగించడం.
బాహ్య కుంభకం అంటే శ్వాస వదిలిన తరవాత కొద్దిసేపు తీసుకోకపోవడం (ఊపిరి బిగపట్టడం). ఇలా ఉండగలిగినంత సేపు మాత్రమే ఉండాలి.
అంతర వ్యాయామం: ఆయుర్వేదం
కపాలభాతి బాహ్య వ్యాయామం మాత్రమే కాదు అంతర వ్యాయామం కూడ. సాధారణ వ్యాయామాలతో దేహంలో అన్ని భాగాల మీద ఒత్తిడి పడుతుంది, కాని కడుపు భాగం మీద ఒత్తిడి కలగదు. కపాలభాతి ద్వారా ఉదరం, ఛాతీ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. దాంతో కొవ్వు కరుగుతుంది. వీటితోపాటు జీర్ణాశయం, క్లోమం, కాలేయం, ప్లీహం, మూత్రాశయం వంటి భాగాల కండరాలు కూడా ఉత్తేజితమవుతాయి. కాబట్టి ఆయా భాగాల నుంచి ఉత్పత్తి కావల్సిన ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి, పనితీరు మెరుగవుతుంది. ఉదాహరణకు క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధమై మధుమేహం నియంత్రణ అవుతుంది. చర్మానికి దేహభాగాలకు మధ్య నున్న కొవ్వు కాని, అంతర భాగాలు, కండరాల మధ్య నున్న కొవ్వు కరగాలన్నా ఇది మంచి వ్యాయామం. భోజనం చేసిన తర్వాత, ఉదర, ప్లీహ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు కపాలభాతి సాధన చేయరాదు. - డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్యులు
యోగశాస్త్రం ప్రకారం
‘కపాలం’ అంటే మస్తిష్కం లేదా మెదడు. ‘భాతి’ అంటే ప్రకాశం. శిరస్సును ప్రకాశింపచేసే క్రియ కాబట్టి దీనిని కపాలభాతి అంటారు. ఇది షట్‌క్రియల్లో ఒకటి అయినప్పటికీ ప్రాణాయామంలో భాగంగానూ సాధన చేయవచ్చు. దీనిని నాలుగు దశల్లో చేయాలి. గతవారం భస్త్రిక ప్రాణాయామాన్ని ఐదు దశల్లో సాధన చేశాం. భస్త్రికలో గాలిని తీసుకోవడం, వదలడం రెండూ ఉంటాయి, కపాలభాతితో గాలిని వదలడమే ప్రధానం. శ్వాస తీసుకోవడం అప్రయత్నంగా జరగాలి తప్ప, ప్రయత్నపూరకంగా గాఢంగా, దీర్ఘంగా తీసుకోవడం అనేది ఉండదు.
సాధన ఇలా!పద్మాసన స్థితిలో వెన్ను, మెడ నిటారుగా ఉంచి, చేతులను వాయుముద్రలో మోకాళ్ల మీద ఉంచాలి. కళ్లుమూసుకోవాలి, ముఖంలో ప్రశాంతత ఉండాలి.
మొదటి దశలో...
కుడి చేతి పిడికిలిని బిగించి, బొటనవేలితో ముక్కు కుడిరంధ్రాన్ని మూసి, ఎడమరంధ్రం నుంచి శ్వాసను పూర్తిగా వదలాలి. శ్వాసను వదిలినప్పుడు కడుపు భాగం లోపలికి ముడుచుకోవాలి. ఇలా 10-20 సార్లు చేయాలి. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ చేయాలి.
రెండవ దశలో...
కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలిని మడిచి వాటి మీద బొటనవేలిని ఉంచాలి. ఉంగరపువేలు, చిటికెన వేళ్లతో ముక్కు ఎడమయంధ్రాన్ని మూయాలి. ముక్కు కుడిరంధ్రం నుంచి శ్వాసను పూర్తిగా వదలాలి.
మూడవ దశలో...
కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలిని మడిచి, బొటన వేలితో ముక్కు కుడి రంధ్రాన్ని, చివరి రెండు వేళ్లతో ఎడమ రంధ్రాన్ని మూయాలి. ఇప్పుడు ఎడమరంధ్రం మీద ఉన్న వేళ్లను తీసి శ్వాసను వదలాలి. శ్వాసను పూర్తిగా వదిలిన వెంటనే చివరివేళ్లతో ఎడమరంధ్రాన్ని మూయాలి. తర్వాత ముక్కు కుడిరంధ్రం మీద ఉన్న బొటనవేలిని తీసి శ్వాసను పూర్తిగా వదలాలి.
నాలుగవ దశలో...
చేతులను వాయుముద్రలో ఉంచి శ్వాసను బలంగా వదలాలి. 10 -20 సార్లు చేయడం, మధ్యలో విశ్రాంతి, అప్రయత్నంగా శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలినప్పుడు కడుపులోపలికి పోవడం వంటి నియమాలు అన్ని దశల్లోనూ యథాతథం. కపాలభాతిలో 90శాతం నిశ్వాస, పదిశాతం ఉచ్వాశ జరగాలి.
నాలుగు దశలూ పూర్తయిన తర్వాత శ్వాసను వదిలి మూలబంధం, ఉడ్యానబంధం, జాలంధర బంధం వేయాలి. ఈ బంధాలన్నింటినీ బాహ్య కుంభకంలోనే వేయాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత బంధాలను విడవాలి. ముందుగా ఉడ్యానబంధం, తర్వాత జాలంధర బంధం, మూలబంధాలను విడవాలి. బంధాలను వేయడం, విడవడంలో క్రమం మారుతుంది. చివరగా విశ్రాంతి తీసుకోవాలి.
కొవ్వు శక్తిగా మారే ప్రక్రియ
మన శరీరంలోని కొవ్వును ఎల్ కార్నిటైన్ అనే పోషకం శక్తిగా మారుస్తుంది. ఎల్ కార్నిటైన్ తగ్గినా, దాని పనితీరు మందగించినా కొవ్వు శక్తిగా మారకుండా నిల్వ ఉండిపోతుంది. ఇది బాగా పనిచేయాలంటే దేహానికి తగినంత ఆక్సిజన్ అవసరం. కపాలభాతి సాధన చేసేవాళ్లు సమతుల ఆహారం తీసుకోవడం, మద్యపానం, ధూమపానం, జంక్‌ఫుడ్, స్వీట్లు, పాలు, పాల ఉత్పత్తులను మానేయడం. కార్బోహైడ్రేట్లను తగ్గించడం వంటి జాగ్రత్తలను పాటిస్తే నెలకు నాలుగు నుంచి ఐదు కిలోల బరువు తగ్గుతారు.
- డాక్టర్ సుజాతాస్టీఫెన్, న్యూట్రిషనిస్ట్, అవేర్ గ్లోబల్ హాస్పిటల్
- వాకా మంజుల, ఫొటోలు: అమర శ్రీనివాసరావు.వి , మోడల్: పూజిత
No comments:
Post a Comment