Friday, May 27, 2011

వంటిల్లే బ్యూటీపార్లర్


జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే... కొప్పు పెట్టుకునేంత జుట్టు లేకపోయినా అందంగా ఉండొచ్చంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. కేశాలంకరణ అనగానే పాపిటబిళ్ల, సూర్యచంద్రులు, జడ గంటలు గుర్తుకువస్తాయి. ఇప్పుడా మాట అంటే ఏ కాలంలో ఉన్నారు మీరు? అని అంటారు నేటి తరం అమ్మాయిలు. ఎందుకంటే...కేశాలకు కొత్త కళను తెచ్చే రకరకాల ఆభరణాలు మార్కెట్‌లో మెరిసిపోతున్నాయి. డిజైనర్లు పాత ఆభరణాలకి కొత్త రూపాన్నిచ్చి అమ్మాయిల మనసుల్ని దోచుకుంటున్నారు. హెయిర్‌బ్యాండ్, కొప్పుకు పెట్టుకునే పువ్వులు, కిరీటం డిజైన్లు, చంపసరాలు, చెంపలపై వేలాడే పాపిటబిళ్లలు...ఇలా రకరకాల ఆకారాలతో రంగురంగుల హెయిర్ జ్యువలరీ ప్రస్తుతం ఫ్యాషన్ వరల్డ్‌లో మెరుస్తోంది. అందులో కొన్ని డిజైన్లు ఇక్కడ చూడండి.
ప్రతిసారీ బ్యూటీపార్లర్ చుట్టూ తిరగకుండా, క్రీములు రుద్దకుండా వాడిన వెంటనే ఫలితమిచ్చే సౌందర్య సాధనాలు మన ఇంట్లోనే ఉన్నాయి. వాటి వాడకం, ఉపయోగం గురించిన వివరాలే ఇవి...

పెరుగు

ఎండ వేడికి నల్లకప్పేసిన చర్మానికి పెరుగు మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఎండ వల్ల కమిలిపోయిన చర్మంపై పెరుగు పూసుకోవాలి. అయితే జిడ్డు చర్మం, సున్నిత చర్మతత్వం ఉన్న వాళ్లు, యాక్నె ఉన్న వాళ్లు పెరుగు వాడకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే బ్యాక్టీరియా యాక్నె పెరిగేందుకు దోహద పడుతుంది. అందుకని నిమ్మరసం, గ్లిజరిన్‌లు సమ భాగాలుగా తీసుకుని ముఖానికి రాసుకోవాలి వాళ్లు. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ట్యాన్ పోవడమే కాకుండా చర్మం రంగు తేలుతుంది.

నిమ్మరసం

నిమ్మరసం ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకని జుట్టు రంగు మార్చుకోవాలనుకుంటే మూడు కప్పుల నీళ్లలో, పావుభాగం నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని జుట్టుపై పోసుకుంటే హెయిర్ కలరింగ్ ప్రొడక్ట్‌ల కంటే బాగా పనిచేస్తుంది.

కీరదోసకాయ

అలసిపోయి, ఉబ్బిపోయిన కళ్లు కాంతివిహీనంగా కనిపిస్తుంటే బాగా నిద్రపోతే సరిపోతుంది. కాని అది వీలుకానప్పుడు కీరదోసకాయ ముక్కల్ని గుండ్రంగా కోసుకుని కళ్ల పై ఓ 20 నిముషాల పాటు ఉంచాలి.

బంగాళా దుంప
బంగాళా దుంప తురుము కంటికింద ఉండే నల్లటివలయాలను మాయం చేస్తుంది. బంగాళా దుంపల్లో కాటెకొలేజ్ ఉంటుంది. ఇది సౌందర్య సాధనంగా పనిచేసి చర్మంపై ఉండే నలుపును తగ్గించేస్తుంది. పచ్చి బంగాళాదుంపను తురిమి రసం తీసి కంటికింద రాసుకోవాలి. పదిహేను నిముషాల తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. తేడా మీకే కనిపిస్తుంది.

టీ బ్యాగ్స్

అలసిన కళ్లు కాంతివంతంగా కనిపించాలంటే మరో టెక్నిక్ టీబ్యాగ్స్. టీబ్యాగ్స్‌ను గోరువెచ్చటి నీటిలో కొన్ని నిమిషాల పాటు నానపెట్టి ఆ తరువాత వాటిని రెండు కళ్లపై 20 నిమిషాల పాటు ఉంచాలి. టీబ్యాగ్స్ కళ్లకే కాకుండా కాళ్లకు కూడా బాగా పనిచేస్తాయి. కొందరి పాదాలు ఎంత శుభ్రం చేసుకున్నా దుర్వాసన వస్తుంటాయి. ఇటువంటి వాళ్లు నాలుగైదు టీ బ్యాగులను లేదా మూడు స్పూన్ల తేయాకు పొడిని నీళ్లలో వేసి ఉడికించాలి. గది ఉష్ణోగ్రత వరకు వచ్చిన తరువాత ఈ నీళ్లలో కొన్ని చల్లటి నీళ్లు కలపాలి. అందులో పాదాలను 30 నిమిషాల పాటు నానపెట్టాలి. పాదాలు ఆరిన తరువాత మెడికేటెడ్ ఫుట్ పౌడర్‌ను వేసుకోవాలి. సమస్య మరీ తీవ్రంగా ఉందనిపిస్తే ఈ పద్ధతిని రోజుకి రెండుసార్లు పాటించాలి. దుర్వాసన రావడం తగ్గిన తరువాత వారానికి రెండుసార్లు చేస్తే చాలు.

కమలా పండు రసం

ఇందులో ఉండే విటమిన్-సి మంచి టోనర్‌గా పనిచేస్తుంది. ఈ రసంతో మసాజ్ చేస్తే సబ్బు వల్ల కూడా పోని దుమ్ము, జిడ్డు వదిలిపోతాయి. టోనర్ తయారీకి అరచెక్క కమలా పండును ఒకటిన్నర స్పూను నిమ్మరసం, పావుకప్పు నీళ్లు కలిపి మెత్తగా అయ్యేవరకు మిక్సీ చేయాలి. ఆ తరువాత ఇందులో దూదిని నానపెట్టి ఆ దూదిని ముఖంపై మృదువుగా రుద్దాలి.

పెరుగు, శెనగపిండి, పసుపు

ఈ మూడు కలిపి వాడితే చర్మం రంగు నిగారింపు వస్తుంది. మూడు స్పూన్ల పెరుగులో ఒక స్పూను శెనగపిండి, చిన్న స్పూను పసుపు వేయాలి. గట్టిగా మెత్తటి పేస్ట్‌లా చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.

వెనిగర్

చుండ్రు తొలగించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా మాల్ట్ వెనిగర్ తీసుకుని మాడుపై మసాజ్ చేయాలి. పావుగంట లేదా ఇరవై నిమిషాల తరువాత హెర్బల్ షాంపూతో కడిగేయాలి. చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే వారానికి మూడుసార్లు ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే చుండ్రు మటుమాయం అవుతుంది.

తేనె - ఆలివ్ ఆయిల్

మంచి హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది ఇది. రెండు స్పూన్ల తాజా తేనెను ఒక స్పూను ఆలివ్ నూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతి మునివేళ్లతో తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు మర్దనా చేయాలి. మాడులోకి ఈ మిశ్రమం బాగా ఇంకేంత వరకు అంటే దాదాపు ఇరవై నిమిషాల తరువాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి.

బ్లాక్ టీ బ్యాగ్స్ - కొత్తిమీర ఆకులు
పెదవుల్ని మృదువుగా, అందంగా ఉంచుతాయి ఇవి. ఒక బ్లాక్ టీ బ్యాగును గోరు వెచ్చటి నీటిలో నానపెట్టాలి. తరువాత దాన్ని పెదవులపై ఉంచి పది నిమిషాల పాటు నెమ్మదిగా ఒత్తుతూ ఉండాలి. అవసరమనుకుంటే ఇంకా ఎక్కువసేపు కూడా చేయొచ్చు. బ్లాక్ టీలో ఉండే టానిన్ వల్ల పెదవులు మృదువుగా, అందంగా తయారవుతాయి. ఇదే కాకుండా కొత్తిమీర ఆకులు కూడా పెదవులకు బాగా పనిచేస్తాయి. పెదవులపై కొత్తిమీర రసాన్ని రుద్దితే గులాబీ రంగు సంతరించుకుని, మృదువుగా అవుతాయి.

No comments: