Saturday, May 19, 2012

గ్యాస్ట్రో ఎంటరాలజీలో చెయ్యి తిరిగిన ‘చల్లనయ్య’ - పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి


పెద్దవాళ్లు ఏమని దీవిస్తారు? నిండు నూరేళ్లు చల్లగా ఉండమనేగా!
డాక్టర్ నాగేశ్వరరెడ్డి వైద్యం కూడా పెద్దల దీవెనలాగే పని చేస్తుంది.
ఉదర బాధలు లేకుండా చేసి, జీవితాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది.
గ్యాస్ట్రో ఎంటరాలజీలో చెయ్యి తిరిగిన ఈ ‘చల్లనయ్య’ దగ్గరికి
‘కడుపు చేతపట్టుకుని’ మెలితిరిగిపోతూ రోజూ వందల మంది వస్తుంటారు.
ఒకసారి వచ్చి వెళ్లండని ఫారిన్ డాక్టర్‌ల నుండి
ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటాయి!


‘‘మా బాబే’’ అని పెద్దలు అందించే దీవెనలకు...
‘‘బతికించారు సార్’’ అని పెట్టే దండాలకైతే లెక్కే లేదు.
క్షణం తీరిక లేకుండా...
సెలబ్రిటీలకు, సామాన్యులకు
సమానంగా అందుబాటులో ఉంటూ...
ఇరవయ్యేళ్లకు పైగా భారతీయ వైద్యరంగానికి ఖ్యాతిని, ప్రఖ్యాతిని
ఆర్జించి పెడుతున్న ఈ డాక్టర్‌గారిలో ఇంత సంకల్పబలం ఎక్కడిది?


కర్తవ్యపు ఉరుకులు పరుగుల వేడిలో
ఈయన్ని చల్లగా ఉంచుతున్నదెవరు?


వైద్యో నారాయణో హరి అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం... వైద్యుడన్న మాటకు అసలు సిసలు నిర్వచనం అయిన పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి  

ఇన్నర్‌వ్యూ ఇది.

హాస్టల్ జీవితాన్ని చాలామంది ఇష్టపడరు. హాస్టల్‌ని జైలులా ఫీలవుతారు. కానీ హాస్టల్‌కి వెళ్లడం వల్లే నా జీవితం మలుపు తిరిగింది. అసలు ఇంట్లో అమ్మానాన్నల దగ్గర ఉండి చదువుకోవాల్సిన నేను, హాస్టల్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దాని వెనుక ఓ కథ ఉంది. ఆ కథలో హీరోని నేనే.


మాది చిత్తూరు జిల్లా, వీరనత్తోడ్. నాన్న దువ్వూరి భాస్కర్‌రెడ్డి పాథాలజీ ప్రొఫెసర్. తన వృత్తి కారణగా ఆయన పలుచోట్ల పని చేయడంతో నాకు మా సొంత ఊరితో పెద్దగా అనుబంధం లేదు.

నాన్న ఎక్కడ పనిచేస్తే, అదే మా ఊరు అన్నట్టుగా ఉండేది. నేను పెద్ద తెలివైనవాణ్నేం కాదు. మూడో తరగతి ఫెయిలయ్యాను కూడా. అల్లరిలో మాత్రం నేను నంబర్‌వన్!


చిన్నప్పుడు వైజాగ్‌లో ఉండేవాళ్లం. ఇద్దరు తమ్ముళ్లతో కలిసి చాలా అల్లరి చేసేవాణ్ని. ఏం చేయాలన్నా ఐడియా నాదే. పాపం వాళ్లు నన్ను ఫాలో అయ్యేవారంతే. ఓసారి మా తమ్ముణ్ని ఫ్రిజ్‌లో పెట్టేశాను. ఉక్కగా ఉందన్నాడు మరి! ఇంకోసారి మా వీధిలోకి గడ్డిబండి వచ్చింది. అది వీధి దాటేలోపు మొత్తం గడ్డంతా లాగి పారేశాం. పాపం, ఆయన మా అమ్మ (శారద) దగ్గరికి వచ్చి వాపోయాడు. మరోసారి ఇంటిముందున్న కారు గేర్లు మార్చి వదిలేశాను.


మా ఇల్లు ఎత్తుమీద ఉండేది. దాంతో కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. పెట్రోలు మండుతుందో లేదో చూడాలనిపించిందోసారి. సరే చూద్దామని షెడ్డులో పోసి అంటించా. పెద్ద పెద్ద మంటలు! నాన్నకు మామూలుగా కోపం రాలేదు. ఇక నిన్ను భరించలేను, ఆటో మెకానిక్ షెడ్డు పెట్టిస్తాను, రిపేర్లు చేసుకోమన్నారు. అయినా ఆ రేంజ్‌లో అల్లరి చేస్తే ఎవరు మాత్రం భరించగలరు!

అందుకే ఇక లాభం లేదని తీసుకొచ్చి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించేశారు. హాస్టల్ జీవితం ప్రారంభం! అయితే ఈనాటి ఈ జీవితానికి నాంది అక్కడే పడిందని చెప్పొచ్చు. అక్కడి ఉపాధ్యాయుల ప్రభావంతో నా ఆలోచనాధోరణి మారింది. చదువు ప్రాధాన్యత తెలిసి వచ్చింది. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోడానికి అవసరమైన అసలైన చదువు అప్పుడే మొదలయ్యింది.


ఐదేళ్లూ నేనే ఫస్ట్!


విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాను. ఆ సంవత్సరమే మెడిసిన్‌కి ప్రవేశ పరీక్ష పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేనా పరీక్ష రాసి పాసై, కర్నూలు మెడికల్ కాలేజీలో చేరాను. ఆ కాలేజీకి నాన్నే ప్రిన్సిపల్. మహా స్ట్రిక్టుగా ఉండేవారు.

మా కాలేజీలో చాలా చక్కని వాతావరణం ఉండేది. ఇంకా చెప్పాలంటే, అదో పల్లెటూరులా ఉండేది. ఎలాంటి భేదాలు, భేషజాలు ఉండేవి కాదు. ప్రొఫెసర్లలో చాలామంది సైకిల్‌మీదే కాలేజీకి వచ్చేవారు. దాంతో డాక్టర్ అంటే కారులో తిరగాలన్న ఆలోచనే మాకు కలిగేది కాదు. మెడికల్ కాలేజే అయినా రకరకాల ఆటల్లో కూడా ప్రోత్సహించేవారు. నాకు క్రీడల పట్ల ఆసక్తి చాలా ఎక్కువ. క్రికెట్, టెన్నిస్ టీములకి నేనే కెప్టెన్‌ని.


అలాగని చదువు పట్ల నిర్లక్ష్యం ఎప్పుడూ లేదు. ఐదేళ్లూ కాలేజ్ ఫస్ట్ వచ్చాను. అలాంటి అరుదైన, అందమైన వాతావరణంలో ఎంబీబీయస్ పూర్తయ్యింది. తర్వాత మద్రాస్ యూనివర్శిటీలో జనరల్ మెడిసిన్‌లో ఎండీ చేశాను. ఆ తర్వాత గ్యాస్ట్రో ఎంటరాలజీలో డీఎమ్ కోర్సు కోసం ఛండీగడ్‌లోని పీజీఐఎమ్‌ఈఆర్ యూనివర్సిటీలో చేరాను. నిజానికి అప్పట్లో కార్డియాలజీ కోర్సులంటే క్రేజ్!


కానీ నాకు ఎప్పుడూ ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనుండేది. అరుదైన అంశాలవైపే మనసు మొగ్గు చూపేది. అప్పుడే కొత్తగా ఎండోస్కోపీ టెక్నాలజీ రావడంతో గ్యాస్ట్రో ఎంటరాలజీలో నైపుణ్యం సాధించాలని డిసైడైపోయాను. అక్కడ ఆ బ్రాంచ్‌లో ఒకే ఒక్క సీటు ఉంది. అదృష్టం... ఆ ఒక్క సీటూ నాకే వచ్చింది.


అక్కడ రెండేళ్ల కోర్సు పూర్తయ్యాక హైదరాబాద్ నిమ్స్‌లో చేరాను. తర్వాత రెండేళ్లు గాంధీ మెడికల్ కాలేజీలో కూడా చేశాను. మళ్లీ నిమ్స్‌లో చేరాను. అక్కడ్నుంచి వచ్చేసి మెడినోవాలో చేరాను. కాస్త నిలదొక్కుకునేటప్పటికి విదేశీ యూనివర్సిటీల నుంచి అవకాశాలు రావడం మొదలయ్యింది. హార్వర్డ్ మెడికల్ కాలేజీ వారు కోటి రూపాయల జీతంతో జాబ్ ఆఫర్ చేశారు. కానీ నేను అంగీకరించలేదు. నా సేవలు మన దేశానికే అందాలన్నది నా కోరిక.


అప్పటికి మనదేశంలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో శిక్షణ పొందినవారుగానీ నైపుణ్యం ఉన్నవాళ్లు గానీ పెద్దగా లేరు. నా అవసరం ఇక్కడ ఎంతైనా ఉందనిపించింది. నేనిలా ఆలోచించడానికి కారణం ఓ రకంగా నాన్నే! ఆయన ఎప్పుడూ పేదల గురించి ఆలోచించేవారు. వారికి సేవలందించడమే లక్ష్యంగా భావించేవారు. ఆయన ప్రభావం నామీద చాలా ఉంది. ఆయనిచ్చిన ఆ స్ఫూర్తి విదేశాల్లో స్థిరపడాలన్న ఆలోచనను నాకు రానివ్వలేదు.


ధనికుల వైద్యుణ్ని కాను!


నేను ‘ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ’ పెట్టినప్పుడు చాలామంది అన్నారు- ‘ఎందుకీ ఆస్పత్రి పెట్టడం, దీనికి పెద్ద ప్రాముఖ్యత లేదు, రోగులు అంతగా రారు’ అని. అది నిజం కాదు. మన దేశంలో 1/3 వంతు మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి మంచి వైద్యం అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఆస్పత్రి పెట్టాను.

చాలామంది అనుకుంటారు మా హాస్పిటల్లో వైద్యం ఖరీదైనదని, సామాన్యుడికి అందుబాటులో ఉండదని! అది అపోహ మాత్రమే. ఇక్కడ వైద్యం ఖరీదైనదే. కానీ అది డబ్బున్నవాళ్లకి మాత్రమే అందడం లేదు. మా ఆస్పత్రిలో ధనవంతులకు ఎన్ని బెడ్స్ ఉన్నాయో, పేదవాళ్లకీ అన్నే ఉన్నాయి. ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుని వైద్యం చేస్తున్నానో, అంతమందికి ఉచితంగా కూడా చేస్తున్నాను. ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్లో కంటే మా దగ్గర ఎక్కుమంది పేద రోగులు ఉంటారంటే ఎవరూ నమ్మరు.


మా హాస్పిటల్లో ముప్ఫై శాతం చారిటీకే కేటాయించామని కూడా చాలామందికి తెలియదు. నిజానికి నాకింకా ఎక్కువే చేయాలనుంది. కానీ సంస్థ తరఫున అంతకంటే చేయడం కష్టం. జీతాలు ఇవ్వాలి, హాస్పిటల్ మెయింటెయిన్ చేయాలి, ఇంకా చాలా ఖర్చులుంటాయి కదా! అందుకే పూర్తిగా ఫ్రీగా చేయలేని పరిస్థితి. డబ్బు తీసుకుని వైద్యం చేయడం డాక్టర్‌గా నాకు బాధగానే ఉంటుంది. కానీ తప్పదు. ప్రభుత్వ సహాయం అందితే అది సాధ్యపడొచ్చు. ముఖ్యంగా రోగులకు ఇన్సూరెన్స్ ఇచ్చే పద్ధతిని ప్రభుత్వం ప్రారంభిస్తే, మరింతమందికి లబ్దిని చేకూర్చగలం!


అంతేకాదు, మన దేశంలో చాలామంది అల్సర్లు, నులిపురుగుల సమస్యలతో సతమత మవుతున్నారు. దానికి కారణం శుభ్రమైన నీరు, ఆహారం, పరిసరాలు లేకపోవడం!

అందుకే వాటిమీద అవగాహన కల్పించడానికే ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్‌ను స్థాపించాం.

మారుమూల గ్రామాలకు వెళ్లి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నాం. ఇంతవరకూ కోటిమందిని చేరగలిగాం. ఆంధ్రప్రదేశ్ అంతటా సేవలు అందించడానికి మరో పదేళ్లు పట్టొచ్చు. భువనగిరి (నల్లగొండ జిల్లా) దగ్గర్లో యాభై వేల జనాభా ఉన్న ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. దాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన పల్లెగా తీర్చి దిద్దాలనుకుంటున్నాం. ఇలా నా వరకూ నేను చేయగలిగినంత సేవ చేస్తున్నా!


వాళ్లలో నచ్చేది అదే!


ఓసారి హఠాత్తుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ నుంచి పిలుపు వచ్చింది... ఆయన భార్యకి సీరియస్‌గా ఉందని, చికిత్స చేయాలని! అక్కడి డాక్టర్లు లాభం లేదనడంతో చివరగా నన్ను సంప్రదించారు. నేను హైదరాబాద్ తీసుకు రమ్మన్నాను. కానీ ఆవిడ వచ్చే స్థితిలో లేరు. నేను అప్పటికప్పుడు వెళ్లలేను. దాంతో ఆయనే ఓ ప్రైవేట్ ఫ్లయిట్ పంపించారు.

అది చాలా మంచిదయ్యింది. ఎందుకంటే ఇంకాస్త లేటయినా ఆవిడ చనిపోయుండేవారు. చికిత్స తర్వాత చాలా త్వరగా కోలుకున్నారావిడ. దాంతో కృష్ణ చాలా ఆశ్చర్యపోయారు. తమ రాష్ట్రంలో ఆస్పత్రి పెట్టి సేవలు అందించమని కోరారు. కానీ నాకది ఇష్టం లేదు. మొదటి ప్రాధాన్యత నా రాష్ట్రానికే అని చెప్పాను. అర్థం చేసుకున్నారు. ‘మా ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ’ పెట్టినప్పుడు చాలా సహాయం చేశారు.


అంతకుముందు అమితాబ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. వెంటనే వచ్చి తన తండ్రిని చూడాలంటూ ఆయన ఐదారుసార్లు ఫోన్ చేశారు. ఎంతో బిజీగా ఉండటం వల్ల వెళ్లలేకపోయాను కానీ అన్నిసార్లు కాంటాక్ట్ చేయడంతో కాదనలేక వెళ్లాను. అసలు మొదట ఆయన డాక్టర్ కోసం అమెరికాకి ఫోన్ చేశారట. వాళ్లేమో మంచి డాక్టర్‌ని మీ దగ్గర పెట్టుకుని మాకు ఫోన్ చేశారేంటని అన్నారట. వాళ్ల ద్వారా నా గురించి తెలుసుకుని నాకు ఫోన్ చేశారాయన. ఆ సంఘటన తర్వాత ఆయన నాకు మంచి స్నేహితుడయ్యారు.


ఎం.ఎఫ్.హుస్సేన్ కూడా నా దగ్గర చికిత్స తీసుకున్నారు. ప్రతిగా ఆయన అభిమానంతో ఇచ్చిన పెద్ద పెయింటింగ్ నాకెంతో అపురూపం! ఆయన నన్నోసారి ముంబై పిలిచారు. నేను పెట్టబోయే కొత్త ఆస్పత్రి గోడల నిండా చిత్రాలు గీస్తానని చెప్పారు. దురదృష్టం! అలా జరగకముందే చనిపోయారు.


వీళ్లంతా గొప్పవాళ్లు. పేరు, డబ్బు, పరపతి ఉన్నవాళ్లు. అయినా తగ్గి ఉంటారు. గౌరవంగా ప్రవర్తిస్తారు. అభిమానంగా మాట్లాడతారు. ఎదిగేకొద్దీ ఒదగడమంటే ఏంటో వాళ్లను చూస్తే తెలుస్తుంది! నేనూ అలానే ఉండటానికి ప్రయత్నిస్తాను.


నా వరకూ నేను డాక్టర్‌కి మూడు లక్షణాలు తప్పకుండా ఉండాలని అను కుంటాను. హార్డ్‌వర్క్ (కష్టపడే తత్వం), హానెస్టీ (నిజాయితీ), హ్యుమిలిటీ (వినమ్రత). డాక్టర్ ప్రతిక్షణం వృత్తికి న్యాయం చేయడానికి కష్టపడాలి. చేసే పనిని నిజాయితీగా చేయాలి. అంతేకాదు, రోగుల విషయంలో వినమ్రతతో ఉండాలి. నేను డాక్టర్‌ని, నువ్వు రోగివి అన్నట్టుగా గర్వంగా ప్రవర్తించడం తగదు. ఈ మూడింటినీ నేనెప్పుడూ మిస్ కాను.


వీకెండ్ ఫాదర్‌ని!


డాక్టర్‌గా తెల్లకోటు వేసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకూ వైద్యం తప్ప మరో ప్రపంచమే లేకుండా బతుకుతున్నాను. ఈ ప్రపంచంలో ఏదైనా నాకు నా వృత్తి తర్వాతే. చివరికి నా కుటుంబం కూడా. నేను ఇంట్లో గడిపేది ఐదు గంటలు. రోజులో నిద్రపోయేది కేవలం నాలుగు గంటలు. మిగిలిన సమయమంతా రోగుల కోసమే. నా భార్య కూడా డాక్టరే కాబట్టి అర్థం చేసుకుంటుంది. నా కూతురు సంజన కూడా ఏనాడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు.

నేను ఇల్లు వదిలే సమయానికి తను లేచేది కాదు. నేను ఇంటికి వెళ్లేసరికి తను నిద్రపోయేది. వారాంతంలో మాత్రమే నన్ను చూసేది. దాంతో తనెప్పుడూ నన్ను ‘వీకెండ్ ఫాదర్’ అంటుండేది. నా బిజీ షెడ్యూల్స్ చూసి విసిగిపోయే తాను మెడిసిన్ చదవకూడదనుకుంది. ఇంజినీరింగ్ చేసింది. మరో ఇంజినీర్‌ని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడిపోయింది.


నాకు సెలవుల్లేవు. వీకెండ్స్ లేవు. పార్టీలు లేవు, సరదాలు లేవు. ముప్ఫయ్యేళ్లుగా ఒక్క సినిమా కూడా చూడ లేదు. అయినా కుటుంబాన్ని మిస్ అవు తున్నాననో, వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానో ఎప్పుడూ బాధపడలేదు. ఓ మంచి డాక్టర్‌ని అయినందుకు ఆనందపడుతున్నాను.


అది నా కల!


ఏదైనా పెద్ద జబ్బు చేయగానే విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలను కుంటారు చాలామంది. అక్కడైతేనే వైద్యం బాగుంటుందనుకుంటారు. కానీ అది కేవలం అపోహ. ఇక్కడ కూడా మనకు మంచి టెక్నాలజీ ఉంది. ప్రజ్ఞావంతులైన డాక్టర్లున్నారు. డాక్టర్ ఎక్కడైనా ఒక్కటే.

విధానాలు వేరుగా ఉంటాయి... అంతే! మన దేశంలో ఒక్క ఫోన్ చేస్తే పిజ్జా వచ్చేస్తుంది. కానీ అంబులెన్స్ మాత్రం రాదు. అదే విదేశాల్లో అయితే అంబులెన్స్ పిజ్జా కంటే ముందు వస్తుంది. ఇలాంటి కొన్ని తేడాలు తప్ప మన వైద్య విధానం విదేశీ వైద్యవిధానానికి ఏమాత్రం తీసిపోదు.

మా ఇన్‌స్టిట్యూట్‌నే తీసుకుంటే, విదేశాల నుంచి వచ్చిన ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అంటే మన దగ్గర విజ్ఞానం ఉందనే కదా! పదుల సంఖ్యలో డాక్టర్లు మా ఇన్‌స్టిట్యూట్‌లో నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు.

మాది టీమ్ వర్క్. అందరం కలసి కొత్త విధానాల కోసం శ్రమిస్తూ ఉంటారు. ఇటీవలే చర్మకణం నుంచి లివర్‌ని డెవలప్ చేసే విధానాన్ని కనుగొన్నాం. ఒకట్రెండు సంవత్సరాల్లో అది అందుబాటులోకి వస్తుంది. ఇంకా మరికొన్ని అంశాలపైనా ప్రయోగాలు చేస్తున్నాం. మరికొన్నేళ్లలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో మన దేశం మరింత అభివృద్ధి సాధించాలి. అది నా కల. దాన్ని నిజం చేయడానికి నా టీమ్ సహకారంతో అనుక్షణం శ్రమిస్తున్నాను.


పెద్దవాళ్లు ఒప్పుకోలేదు!


మద్రాస్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు క్యారల్ ఆన్‌తో పరిచయమయ్యింది. తను అప్పుడు డెర్మటాలజీలో పీజీ చేస్తోంది. ఎందుకో చెప్పలేను కానీ, తను నాకు చాలా నచ్చింది. తనకీ నేను నచ్చాను. తను పుట్టిందీ పెరిగిందీ మద్రాసులోనే. పైగా క్రిస్టియన్. మతాలు, సంప్రదాయాలు వేరుకావడంతో ఇరుపక్షాల పెద్దలూ ఒప్పుకోలేదు. మా ఇద్దరికీ మత విశ్వాసాలు లేవుకానీ పెద్దలను నొప్పించడం ఇష్టం లేక వాళ్లు ఒప్పుకునేవరకూ ఎదురుచూశాం. అందరూ ఓకే అన్నాకే ఒక్కటయ్యాం!
..............
మర్చిపోలేని అనుభవమది!


ఓసారి కర్నూలులో మెడికల్ క్యాంప్ జరుగుతోంది. ఆ విషయం తెలిసిన వైఎస్సార్ వెంటనే అక్కడికి వచ్చారు. అప్పటికి మేం అల్సర్ ఉన్న ఓ రోగికి ఎండోస్కోపీ సర్జరీ చేస్తున్నాం. ఆ పేషెంట్‌ని చూసి వైఎస్సార్- ‘నువ్వు రామిరెడ్డి’ కదా అన్నారు. అతను పులివెందులలో ఉండేవాడట. చాలాకాలం క్రితమే కర్నూలు వచ్చి స్థిరపడ్డాడట.

అయినా కూడా ఆయన గుర్తుపట్టి పలకరించడం చూసి ఆశ్చర్యపోయాను. అంతేకాదు, నేను ఎండోస్కోపీ మొదలుపెడుతుండగానే ఆయన- ‘అతనికి క్యాన్సర్ ఉన్నట్టుంది చూడండి’ అన్నారు. బయాప్సీ చేస్తే నిజంగానే క్యాన్సరని తేలింది. నేనెప్పటికీ మర్చిపోలేని అనుభవమది.


-సమీర నేలపూడి

ఫొటోలు: జి.అమర్

6 comments:

Prasad said...

నాగేశ్వరరెడ్ది గారు గ్యాస్ట్రొ సమస్య రాకుండా వుండడానికి ఏ జాగ్రత్తలు తీసుకొవాలి వివరించినట్లయితే ఇంకా బగుండేది.

Unknown said...

చాలామంది కి మీరు వేసే సేవ బాగుంది మన దేశానికి వన్నె తెచ్చారు.సంతోషం

raghu said...

India, really feels proud of you, sir.God bless you and your family.

Unknown said...

ఇటువంటి వారు గ్యాస్ట్రిక్ రాకుండా వుండ టా నికి సూచనలు చేస్తే బాగుండును మరియు కొన్ని చోట్ల బ్రాచ్ లు పెడితే బాగుండును

Unknown said...

డాక్టర్ గార్కి ద్దన్యవాదాలు మాది ప్రాకాశంజిల్లా చీరాల
మీగురించి చాలా తెలుసుకున్న,
మీకు మీా కుట్టుంబానికి దేవుడి (ఏసుక్రీస్తు)మంచీ ఆరోగ్యం ఇచ్చి కాపాడును గాకా.....

Unknown said...

Dear Sir Hatsof.God Bless More & More ur Humble Team. $€£¥₩