Monday, March 14, 2011

స్థూలకాయం సమస్యకుపరిష్కారం .... బేరియాట్రిక్ సర్జరీ

అది జబ్బు కాదు... కానీ చాలా రకాల జబ్బులకు కేంద్రబిందువు. బిపి నుంచి గుండెజబ్బుల దాకా, కిడ్నీ నుంచి కీళ్లనొప్పుల దాకా... రకరకాల సమస్యలకు మూలకారణం. అదే.... స్థూలకాయం. అధిక బరువు నుంచి స్థూలకాయం దశకు చేరుకున్న తరువాత ఇక చిన్నచిన్న చికిత్సలేవీ పనిచేయవు. బేరియాట్రిక్ సర్జరీ ఒక్కటే మార్గం అంటున్నారు ప్రముఖ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ టిఎల్‌విడి ప్రసాద్‌బాబు. ఆయన అందిస్తున్న వివరాలు....

మనదేశంలో 14 శాతం మంది పురుషులు, 18 శాతం మంది మహిళలు అధిక బరువు ఉండగా, 5 శాతం మంది స్థూలకాయులేనని సర్వేలు తెలుపుతున్నాయి. కాలి వేలి నుంచి తల వరకు అధిక బరువు ప్రభావం చూపించని శరీర భాగమే లేదు. కనబడకుండా కబళించే జబ్బు ఇది. అధిక బరువు స్థూలకాయంగా పరిణమించిందంటే ఇక రోజురోజుకీ అనారోగ్యాలకు దగ్గరవుతున్నట్టే.

అధిక రక్తపోటు, గుండెపోటు, కీళ్లనొప్పులు, కిడ్నీ వ్యాధులు, మధుమేహం.... ఇలా జబ్బుల లిస్టు పెరిగిపోతూనే ఉంటుంది. ఆధునిక జీవన విధానం తెచ్చిన ఈ సమస్యలన్నింటినీ కలిపి మూకుమ్మడిగా మెటబోలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ స్థితికి వచ్చిన తరువాత బరువు తగ్గడం కోసం మనం ఇంట్లో కూర్చుని చేసే ప్రయత్నాలేవీ సత్ఫలితాలను ఇవ్వవు. ఎంత డైటింగ్ చేసినా, ఎన్ని వ్యాయామాలు చేసినా ఫలితం ఆశాజనకంగా ఉండదు. ఇలాంటప్పుడు ఉపయోగపడేదే బేరియాట్రిక్ సర్జరీ.

ఎవరికి అవసరం?

మన ఎత్తు, బరువుల ఆధారంగా గణించి చెప్పేది జీవక్రియ ఆధారిత రేటు(బేసల్ మెటబోలిక్ ఇండెక్స్). అధిక బరువు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల బిఎంఐ 25 ఉంటుంది. బిఎంఐ విలువ 25 నుంచి 30 ఉంటే మంచి ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ బిఎంఐ 35 నుంచి 40 ఉంటే అధిక బరువు అంటాం. అధిక బరువు ఉన్నా, మధుమేహం, హైపర్‌టెన్షన్ సమస్యలుంటే అలాంటివాళ్లకి బేరియాట్రిక్ సర్జరీ అవసరం అవుతుంది. బిఎంఐ విలువ 40కన్నా ఎక్కువ ఉంటే వాళ్లు స్థూలకాయులన్నమాట. వీళ్లకి ఎటువంటి సమస్య లేకపోయినా భవిష్యత్తులో వచ్చే అవకాశాలెక్కువ.

కొవ్వు తీయడమేనా...?

ఈ సర్జరీ పేరు వినగానే శరీరంలో కొవ్వు తీసివేయడమేమో అనుకుంటారు. కానీ ఆ పద్ధతి వేరు.. ఈ చికిత్స వేరు. తొడలు, పిరుదులు, పొట్ట... ఇలా ఒకచోట పేరుకుపోయిన కొవ్వును తీసివేయడాన్ని లైపోసక్షన్ అంటారు. బేరియాట్రిక్ సర్జరీ అంటే కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే చికిత్స. శరీరం లోపల జీర్ణవ్యవస్థలో చిన్న మార్పులు చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుంది.

జీర్ణకోశం పరిమాణం తగ్గించడం, లేదా ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా ఆనకట్ట వేయడం.. బేరియాట్రిక్ సర్జరీలో ఉన్న అంశాలు ఈ రెండే. జీర్ణకోశాన్ని నిలువుగా కోసి కొంత భాగాన్ని తీసివేయడం ద్వారా దాని పరిమాణాన్ని తగ్గిస్తారు. ఈ తీసివేసే భాగంలో గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. గ్రెలిన్ ఆకలి పెంచే హార్మోన్. ఈ పద్ధతి ద్వారా జీర్ణాశయ పరిమాణం తగ్గిపోవడం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. అంతేగాకుండా గ్రెలిన్ ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఆకలి కూడా తగ్గిపోతుంది. తద్వారా మెల్లమెల్లగా తీసుకునే కేలరీలు తగ్గుతాయి.

జీర్ణాన్ని ఆపే పద్ధతి

మరోపద్ధతి మాల్ అబ్‌సార్‌ప్షన్ పద్ధతి లేదా రెస్ట్రిక్టివ్ ఆపరేషన్. ఈ పద్ధతిలో జీర్ణకోశాన్ని అడ్డంగా స్టేపుల్ చేస్తారు. అంటే పిన్ లాంటి నిర్మాణంతో జీర్ణాశయం ఒక చివరను మూసేస్తారు. సిలికాన్ బ్యాండింగ్ మరో పద్ధతి. సన్నని ట్యూబు ద్వారా మాత్రమే ఆహారం ప్రయాణిస్తుంది. దీనివల్ల చాలా కొద్ది పరిమాణంలో ఆహారం జీర్ణాశయానికి వెళ్తుంది. మిగిలింది పూర్తిగా జీర్ణం కాకుండానే బయటకు వెళ్లిపోతుంది.

ఈ పద్ధతి ద్వారా అవసరాన్ని బట్టి బిగించిన చివరను వదులు చేసుకోవచ్చు. బైపాస్ పద్ధతి ద్వారా కూడా ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా చేయవచ్చు. జీర్ణాశయం నుంచి డైరెక్ట్‌గా చిన్నపేగుకు దాదాపు చివరి భాగానికి బైపాస్ చేయడం వల్ల ఆహారం జీర్ణాశయం నుంచి వెంటనే ఆ చివరి భాగానికే వెళ్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆహారం జీర్ణం కాదు. కేలరీలు ఎక్కువగా అందవు. అలా నెమ్మదిగా బరువు తగ్గుతారు.

సురక్షితమేనా?

130, 150 కిలోలు... ఇలా వంద కిలోలకు మించి బరువున్నవారికి ఆపరేషన్ చేయడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటివాళ్లకి కాళ్లలోని రక్తనాళాల్లో గడ్డలు(క్లాట్స్) ఏర్పడే ప్రమాదం ఉంది. ఇవి ఊపరితిత్తుల వైపు వెళ్లి మరింత ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. అందువల్ల క్లాట్స్ ఏర్పడకుండా ప్రత్యేకమైన పరికరం ద్వారా కాళ్లకు వైబ్రేషన్స్ పంపిస్తారు. రక్తం పలుచబడటానికి బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్లు, హిపారిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. స్లీప్ అప్నియా ఉంటే సర్జరీకి వారం ముందు నుంచే పడుకునేటప్పుడు బైపాప్ పరికరం ద్వారా ఆక్సిజన్ అందిస్తూ సర్జరీకి ప్రిపేర్ చేస్తారు.

ఇలాంటి జాగ్రత్తలెన్నో తీసుకోవడం వల్ల ఎలాంటి క్రిటికల్ కేసు అయినా, ఎంత రిస్కు ఉన్నా ఆపరేషన్ విజయవంతమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంటుందేమో అన్నది చాలామంది అనుమానం. అయితే తీసుకునే కొద్ది ఆహారంలోనే అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవడం అవసరం. ఇందుకోసం సర్జరీ తరువాత డాక్టర్లు సూచించిన డైట్‌చార్జ్‌ను తప్పక పాటించాల్సి ఉంటుంది.

సైడ్ ఎఫెక్ట్‌లుంటాయా?

బరువు తగ్గించే పిల్స్ మాదిరిగా ఈ ఆపరేషన్ వల్ల సైడ్ ఎఫెక్టులు ఉండవు. ఇకపోతే ఈ ఆపరేషన్ కీహోల్ ద్వారా చేస్తారు కాబట్టి శరీరంపై గాయం ఉండదు. ఇన్‌ఫెక్షన్ల అవకాశమూ ఉండదు. ఎక్కువ రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. వారం రోజుల తరువాత అన్ని పనులూ యథావిధిగా చేసుకోవచ్చు. ఆరు నెలల నుంచి ఏడాదిలోగా బరువు తగ్గుతారు. ఒక్కసారిగా బరువు తగ్గరు కాబట్టి మళ్లీ లావెక్కే అవకాశం కూడా ఒక్కసారిగా ఉండదు. ఆపరేషన్ తరువాత ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకుంటే స్థూలకాయ సమస్య మళ్లీ తలెత్తదు.
డాక్టర్ టిఎల్‌విడి ప్రసాద్‌బాబు
బేరియాట్రిక్ అండ్ సర్జికల్
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్ - హైదరాబాద్
ఫోన్ : 9550001010

No comments: