Thursday, August 26, 2010

పక్షవాతం * ఆమూడు గంటలే అత్యంత కీలకమా?

పక్షవాతం లక్షణాలు గమనించిన వెంటనే రోగిని ఆసుపత్రికి తరలించడం చాలా అవసరం. మెదడుకు రక్తం సరఫరా తగ్గినప్పుడు క్షణక్షణానికీ మెదడులోని కణాలు (న్యూరాన్లు) ఆక్సిజన్ అందక చనిపోతూ ఉంటాయి. పక్షవాతం వచ్చిన 3-4 గంటల తరువాత ఈ కణాలు తిరిగి కోలుకోలేని రీతిలో చనిపోతాయి. ఆ తరువాత వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ కణాలను తిరిగి బతికించలేరు.
పక్షవాతం ఒక భయంకర విపత్తు. మెదడుకు రక్తప్రసరణ తగ్గడం వలన కానీ, రక్తనాళాలు చిట్లడం వలన కానీ పక్షవాతం వస్తుంది. మెదడుకు అందవలసినంత రక్తం అందకపోవడం వల్ల మెదడులోని కణాలు చనిపోవడం వల్ల వచ్చే పక్షవాతాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. 80 శాతం సందర్భాలలో ఇలా జరిగే అవకాశం ఉంటుంది. మెదడులోని రక్తనాళాలలో వచ్చే మార్పుల వలన అవి చిట్లినప్పుడు రక్తస్రావం జరిగి పక్షవాతం వస్తే దానిని హిమర్రేజిక్ స్ట్రోక్ అంటారు.

గుర్తించడం ఎలా?
అకస్మాత్తుగా కాలు, చేయి పనిచేయకుండా పోవడం, మూతి వంకరపోవడం, మాట్లాడలేకపోవడం, చూపు తగ్గిపోవడం, అకస్మాత్తుగా భరించలేని తలనొప్పి రావడం, తల తిరగడం, వాంతులు కావడం, నడవలేకపోవడం.. ఇవన్నీ పక్షవాతం లక్షణాలే. ఈ లక్షణాలను తమంతట తాము గుర్తించినా లేక ఇతరులు కనిపెట్టినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

కారణాలు ఇవీ..
ధూమపానం, బిపి, మధుమేహం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్న వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక కొలెస్టరాల్, జన్యుపరమైన కారణాల వలన కూడా పక్షవాతం రావచ్చు.

వేగంగా స్పందించాలి..
పక్షవాతం లక్షణాలు గమనించిన వెంటనే రోగిని ఆసుపత్రికి తరలించడం చాలా అవసరం. మెదడుకు రక్తం సరఫరా తగ్గినప్పుడు క్షణక్షణానికీ మెదడులోని కణాలు (న్యూరాన్లు) ఆక్సిజన్ అందక చనిపోతూ ఉంటాయి. పక్షవాతం వచ్చిన 3-4 గంటల తరువాత ఈ కణాలు తిరిగి కోలుకోలేని రీతిలో చనిపోతాయి. ఆ తరువాత వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ కణాలను తిరిగి బతికించలేరు. కాబట్టి పక్షవాతం వచ్చిన మొదటి మూడు గంటల్లోనే ఆసుపత్రికి వెళితే వైద్యులు టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అనే మందులను ఇంజక్షన్ ద్వారా రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు.

దీనివల్ల రక్త నాళాలలో ఏర్పడిన పూడికలు తొలగిపోతాయి. దీంతో మళ్లీ యథావిధిగా మెదడుకు రక్తం సరఫరా అయి అప్పటికే దెబ్బతిన్న మెదడులోని కణాలు తిరిగి కోలుకుంటాయి. టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ మందు ఇచ్చిన తరువాత 50 శాతం రోగుల్లో వెంటనే కాలు, చెయ్యి పని చేస్తాయి. లేదా సమస్య జటిలం కాకుండా ఆగిపోతుంది. ఫలితంగా పక్షవాతం వచ్చినప్పటికీ వారు త్వరితగతిన కోలుకునే అవకాశాలు ఏర్పడతాయి.

అయితే పక్షవాతం వచ్చిన తరువాత మూడు గంటల సమయం ఉంది కదా అని అలసత్వం ప్రదర్శించకూడదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆసుపత్రికి తీసుకువచ్చి టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ ఇప్పిస్తే జబ్బు నయం కావడానికి అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.

అపోహలు..
పక్షవాతం వచ్చిన వ్యక్తి శరీర బరువును బట్టి ఈ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ రూ.45,000-60,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ ఇంజక్షన్ అతి ఖరీదైనది అయినా, దీనిని తీసుకోవడం వలన 50 శాతం రోగుల్లో పక్షవాతం పూర్తిగా నయమయ్యే అవకాశముంటుంది. కాలు, చెయ్యి పడిపోవడం వలన వారం నుంచి నెల వరకు ఆసుపత్రిలో ఉండడం, ఆ కాలంలో ఉద్యోగానికి వెళ్లలేకపోవడం, కుటుంబానికి భారం కావడం వంటి వాటితో పోల్చితే ఈ ఇంజక్షన్‌కు అయ్యే ఖర్చు తక్కువే. ఈ ఇంజక్షన్ వలన మెదడులో రక్తస్రావం కావడం అరుదుగా జరగవచ్చు. అయితే కేవలం 4 నుంచి 7 శాతం మందిలో మాత్రమే ఇలా జరుగుతుంది.

ఇంజక్షన్ తీసుకోవడం ఎలా?
చాలా సందర్భాలలో పక్షవాతం వచ్చిన వెంటనే రోగిని కుటుంబ సభ్యులో, బంధువులో, స్నేహితులో వారి ఇంటికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ఈ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ ఇప్పించాలని భావించినప్పుడు కచ్చితంగా సీటీ స్కాన్ యంత్రం ఉండి, ఇరవైనాలుగు గంటలూ న్యూరాలజిస్ట్ అందుబాటులో ఉండే ఆసుపత్రికి తీసుకెళ్లడమే మంచిది.

అలాగే అక్కడ ఉండే డాక్టర్‌కి ఈ ఇంజక్షన్ ఇవ్వడం గురించి పూర్తి అవగాహన ఉండాలి. కాబట్టి ఎవరికైనా పక్షవాతం లక్షణాలు కనిపించినప్పుడు వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు దగ్గరలో ఉన్న ఆసుపత్రి ఎమర్జెన్సీ ఫోన్ నంబరులోగాని, అక్కడ ఉండే న్యూరాలజిస్ట్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి రోగిని తీసుకెళ్లడం మంచిది. ఇలా చేయడం వల్ల వెళ్లగానే వెంటనే రోగిని పరీక్షించి, సీటీ స్కాన్ చేసి, టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ ఇవ్వడానికి వీలవుతుంది.

అవగాహన పెంచాలి..
నిజానికి పాశ్చాత్య దేశాలలో పక్షవాతానికి ఈ రకమైన చికిత్స పదేళ్ల క్రితం నుంచే అందుబాటులో ఉంది. అయితే మన దేశంలో కొద్దిమంది డాక్టర్లకే ఈ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ గురించి అవగాహన ఉండడంతో ఎక్కువ మంది పక్షవాత రోగులు తక్షణ చికిత్స పొందలేకపోతున్నారు. పాశ్చాత్య దేశాలలో మాదిరిగా మన దేశంలోనూ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయడంతోపాటుగా పక్షవాతానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, మీడియా ద్వారా ప్రజలను చైతన్య పరచడం ద్వారా ఈ చికిత్సను అందరికీ అందుబాటులోనికి తీసుకురావచ్చు
.
డాక్టర్ నవీన్‌కుమార్ వెనిగళ్ళ,
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,
అవేర్ గ్లోబల్ హాస్పిటల్, ఎల్‌బి నగర్,
హైదరాబాద్.

ఫోన్ : 040-24111111

No comments: