మధుమేహం తియ్యటి శత్రువు. చాప కింద నీరులా చల్లగా మన ఒంట్లోకి చేరిపోతుంది. ఏమరుపాటుగా ఉంటే జీవితంలోని తీపిని దూరం చేసి చేదును మిగులుస్తుంది. ఈ స్వీట్ ఎనిమీ దరిదాపుల్లోకి రానేవద్దు అనుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే ఈ ఎనిమీతో పోరాడుతున్న వారు దానిమీద పైచేయి సాధించాలంటే ఏం చేయాలి? వీటి మీద సమగ్ర వివరణే ఈ ముందు జాగ్రత్త.
ప్రాణాపాయం కలిగించే అంటువ్యాధుల్లో టి.బి అత్యంత ప్రమాదకరమైనది. అంటువ్యాధి కాని జబ్బుల్లో డయాబెటిస్ ప్రమాదకరమైనది. ఈ రెండు వ్యాధులు మన దేశంలో చాలా ఎక్కువ. డయాబెటిస్ వచ్చినవారిలో అందరూ అనుకునేటట్టుగా గుండె, కిడ్నీలు దెబ్బతినడం ప్రాణాపాయం అనుకుంటారు. కాని డయాబెటిస్ వచ్చినవారికి టి.బి లాంటి పెద్ద ఇన్ఫెక్షన్ల కారణంగానే ఎక్కువ మందిలో ప్రాణాపాయం సంభవిస్తుంది. ఈ విషయం మన దేశంలో ఎన్నో డయాబెటిస్ పరిశోధనల్లో వెల్లడైంది.
నేషనల్ అర్బన్ డయాబెటిస్ సర్వే 2001లో హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ, ముంబయ్, మద్రాస్ నగరాలలో (5288 పురుషులు, 5929 స్ర్తీలపై) మధుమేహుల సంఖ్య ఎంతగా ఉందో తెలుసుకోవడానికి ఓ సర్వే నిర్వహించింది. మిగతా నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో పాతికేళ్లు దాటిన ప్రతి ఆరుగురిలో ఒకరికి మధుమేహం ఉన్నట్టుగా వెల్లడైంది. ఇక నలభై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ల మధ్య వయసు వారిలో 50శాతం మందికి ఈ వ్యాధి ఉందని తెలిసింది. పదేళ్లతో పోల్చి చూస్తే ఇప్పుడు ఈ సంఖ్య ఎంతగా పెరిగి ఉంటుందో ఊహించవచ్చు. మధుమేహం లేనివారు నాకు ఈ జబ్బు లేదు కదా! అని నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఏ వయసులోనైనా, ఎవరికైనా ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కారణాలు కనిపెట్టి, తగినంత శ్రద్ధ వహిస్తే ఈ సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు.
డయాబెటిస్ నివారణ కోసం ముందు జాగ్రత్తలు
1. పంటి జబ్బులు: పంటికి-మధుమేహానికి ఏమిటి లింకు? పంటి వ్యాధులు డయాబెటిస్‌కు ఎలా కారణం? అనేదానికి వైద్యపరంగా ఇంకా ఆధారాలు తెలియలేదు. అయితే కనెక్షన్ మాత్రం ఉంది. పంటి(పెరియోడాన్‌టైటిస్) వ్యాధుల బారినపడిన వారందరికీ మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది. దంత సంబంధ వ్యాధులు ఉన్నవారిలో డెంటిస్ట్ చేత పళ్లను క్లీన్ చేయించిన తర్వాత టెస్టులు చేస్తే, డయాబెటిస్ రిస్క్ సగానికి సగం తగ్గినట్లుగా పరిశీలనలు చెబుతున్నాయి. అందుకే డయాబెటిస్ సమస్య రాకుండా ఉండాలంటే పంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.
2. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు: ఇన్ఫెక్షన్లు తరచూ బాధిస్తే మధుమేహం వస్తుంది. ముఖ్యంగా చర్మవ్యాధులైన ఫంగస్, గజ్జి, తామర వంటి వాటి వల్ల పాంక్రియాస్‌లోని బీటా కణాలు పాడైపోయి మధుమేహం వస్తుంది. సాధారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ దాడిచేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లు పిల్లల్లో ఎక్కువగా గమనిస్తుంటాం. అందుకని చర్మవ్యాధులు అంటే ఒంటిపై చిన్న చిన్న కురుపులు కనిపించినా డాక్టర్‌ని సంప్రదించి తగిన యాంటీబయాటిక్స్ వాడాలి.
ఎ) మూత్రసంబంధిత ఇన్ఫెక్షన్లు: జననేంద్రియాలకు సంబంధించిన శుభ్రత సరిగ్గా పాటించకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు అధికంగా కనిపిస్తుంటాయి. పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. మగపిల్లల్లో అంగంపై తెల్లని పొడలా కనిపిస్తుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మూత్రద్వారం సగం మూసుకుపోయే అవకాశం ఉంది. దీని వల్ల పదే పదే ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఆడపిల్లల్లో అయితే రజస్వల అయిన నాటి నుంచి శుభ్రతకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన కల్పించాలి. లేదంటే వీరిలోనూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి, తద్వారా డయాబెటిస్‌కి దారితీసే అవకాశాలు ఎక్కువ.
బి) వైరల్ ఇన్ఫెక్షన్లు: చికెన్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్... వంటి వైరల్ ఫీవర్ల మూలంగా ప్రతి ఏడాది ఎంతో మంది బాధపడుతున్నారు. వీటి నివారణకు డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ కోర్సు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే వీటి వల్ల పదే పదే బాధపడేవారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
సి) నులిపురుగులు: ఆహారం ద్వారా పొట్టలోకి చేరిన బ్యాక్టీరియా, కడుపులో ఏర్పడే పురుగులు ఉదరకోశ సమస్యలకు కారణాలు అవుతుంటాయి. నులిపురుగుల సమస్య పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. నులిపురుగులకంటే ఆస్కారియాసిస్ అనే పురుగులు ఇంకా పెద్దగా ఉంటాయి. ఇవి పాంక్రియాస్ డక్ట్‌కు అడ్డం పడటంతో ఆ గ్రంథి నుంచి వెలువడే స్రావాలు ఆగిపోతాయి. ఫలితంగా డయాబెటిస్ వస్తుంది. అందుకని కడుపులో నులిపురుగులు ఉంటే ఎక్కువ రోజులు ఆగకుండా తగిన చికిత్స తీసుకోవాలి.
మానసిక ఒత్తిడి
ఈ మధ్యకాలంలో సామాజికంగా, వ్యక్తిగతంగా పనుల్లో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. స్ట్రెస్ హార్మోన్లు అన్నీ కూడా ఇన్సులిన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఉదాహరణకు కార్టిజాల్స్, ఎడ్రిలిన్, థైరాక్సిన్, గ్రోత్‌హార్మోన్... లాంటివి. మనలో కోపం, బాధ, ఉద్వేగం, భయాలకు లోనైనప్పుడు గుండెదడ, మెదడు బండబారిపోవడం, బి.పి పెరగడం లేదా పడిపోవడం, తల భారంగా అనిపించడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. ఈ ఒత్తిడి ఏదో ఒక రోజు కాకుండా, రోజూ ఎదుర్కుంటూ ఉంటే హార్మోన్ల పనితీరు మందగించి, ఒకవేళ ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అయినా ఆ మోతాదు శరీరానికి సరిపోదు. ఫలితంగా డయాబెటిస్ వస్తుంది. దాదాపుగా డయాబెటిస్ రావడానికి 70 శాతం మానసిక ఒత్తిడే ప్రధాన కారణం. అందుకే మానసిక ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. స్ట్రెస్‌ని మొదట్లోనే ఆధునికవైద్యపరంగా కాకుండా యోగా, మెడిటేషన్, లాఫింగ్, రిలాక్సేషన్ పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు.
డయాబెటిస్ ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మధుమేహం ఉన్నప్పుడు ఆహార నియమాలు పాటించడంతో పాటు ఇతరత్రా ఆరోగ్య విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
1. పంటి జబ్బులు: రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉన్నవారికి పంటిపై గారను శుభ్రపరిస్తే ఆ మరుసటి రోజుకి రక్తంలో గ్లూకోజ్ 50 శాతం తగ్గినట్టుగా చాలా సందర్భాల్లో తెలిసింది. మధుమేహం నియంత్రణలో ఉండాలంటే వీరు పంటి సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మౌత్‌వాష్‌లను రోజుకు నాలుగైదు సార్లు ఉపయోగించాలి.
2. ఇన్ఫెక్షన్లు:
ఎ) చర్మవ్యాధులు: చర్మంపై చిన్న చిన్న పొక్కులు వంటివి సాధారణంగా వస్తుంటాయి. అలాగని వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి నయం కావడానికి తగిన యాంటీబయాటిక్స్‌ను వాడాలి. రోజూ షుగర్ మాత్రలు, ఇన్సులిన్ తీసుకునే వారు చర్మ వ్యాధులు రాకుండా జాగ్రత్తపడాలి.
బి) మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు: మూత్రం ఆగి ఆగి రావడం, విసర్జనలో మంట, దురద వంటివి చూసినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవాలి.
3. శుభ్రత:
సాధారణంగా మన దేశంలో ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు తప్ప, మామూలుగా చెప్పుల వాడకం చాలా తక్కువ. దీని వల్ల కాలిగోళ్లు, కాలివేళ్ల మధ్య, పగుళ్ల మధ్య మురికి చేరి ఒక్కోసారి శాశ్వతంగా ఉండిపోతుంటుంది. వీటి వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ సమయానికి నొప్పి, జ్వరం, మంట అనిపించకపోవచ్చు. కాని కాళ్లు, చేతుల అశుభ్రత మధుమేహానికి ప్రధాన కారణం. అందుకని ఒక టబ్‌లో కొద్దిగా యాంటిసెప్టిక్ లోషన్ కలిపిన నీటిలో ఉదయం, సాయంత్రం పాదాలు పది, పదిహేను నిమిషాలు ఉంచి, శుభ్రపరిచి, ఆ తర్వాత తేమ లేకుండా తుడుచుకోవాలి. కాటన్ సాక్స్ వాడుతూ, చెమట పట్టకుండా చూసుకుంటే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే ముక్కు, చెవులు, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు తగిన యాంటీబయాటిక్స్ వాడాలి. కొందరికి తలపై మాడు నుంచి చుండ్రు రాలుతుంటుంది. దీనికీ తగిన మందులు వాడాలి.
మరిన్ని జాగ్రత్తలు: ఒత్తిడి తగ్గడానికి హార్ట్‌రేట్‌ను పెంచే ఫోన్, టీవీ.. వంటివి అతిగా వాడకూడదు.
లేట్‌గా నిద్రపోవడాలు, లేట్‌గా లేవడాలు చేయకూడదు. నిద్రకు కచ్చితమైన సమయం పాటించినవారిలో మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
వేళకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా డాక్టర్‌చే చెకప్స్‌చేయిస్తూ, వారి సూచనలు పాటిస్తుంటే మధుమేహాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు.
ప్రొ॥ పి.వి.రావు
ఎండోక్రైనాలజిస్ట్,
నిమ్స్, హైదరాబాద్