Friday, November 19, 2010

తులసి పూజ ప్రాశస్త్యమ్‌

tulasi1
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా
య దగ్రే సర్వవేదశ్చ తులసీం త్వా నమామ్యహమ్‌
శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణియైన ‘‘తులసి’’ మొక్క మూలంలో సర్వతీర్థాలు, మధ్యభాగమందు సమస్త దేవతలు, తులసిమొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువై వున్న తులసీ మాతకు ముందుగా నమస్కరించుకుని, అంతటి పూజ్యనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర- తులసి ప్రాశస్త్యాన్ని గూర్చి, మన పురాణాలలో ఎన్నో కథలు కానవస్తున్నాయి. వాటిలో ఒక గాథను సమీక్షించుకుందాం!
‘‘బ్రహ్మవైవర్తపురాణం’’లో గల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది. ధర్మధ్వజుడు, మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతియైన కుమార్తె కలిగింది. వారు ఆ బిడ్డకు బృంద అను పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి. ఆమెకు వివాహ వయస్సు రాగానే శ్రీహరిని వివాహమాడ తలచి బదరికాశ్రమము చేరి బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ దర్శనమిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుమనగా ‘నేను రాధా శాపముతో నున్న రుక్మిణిని, నాకు శ్రీకృష్ణుడే భర్తగా కావాలని వరమీయమ’ని ప్రార్థించినది.
అందుకు బ్రహ్మ! నీ కోరిక తప్పక నెరవేరగలదు. కాని! ముందుగా గోలోక నివాసి సుదాముడే నీకు భర్త కాగలడు. అనంతరమే నీవు కోరిన వాడు నీకు పతి అవుతాడని వరమిచ్చి అంతర్థానమ య్యాడు.

tulasiఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుదాముడు పుష్కరకాలము శాప కారణంగా భూలోకంలో శంఖచూడుడై, జన్మించి తపమాచరించ సాగెను. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అంత శంఖచూడుచు ‘‘లక్ష్మి భూలోకమున పుట్టినదట! నాకామెతో వివాహము చేయించమ’’ని వేడుకొనెను. బ్రహ్మ ‘తథాస్తు’ అని పలికి ఆమె బదరికాశ్రమంలో ఉన్నది. ఆమె నీకు తప్పక లభ్యం కాగలదు అని యంతర్థాన మందెను. అనంతరం శంఖచూడుడు- బృంద వాద ప్రతివాదాల ను గమనించి వారికి మరల బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టాలు నెరవేరేందుకు వైభవముగా వివాహము జరిపించాడు.ఇక శంఖచూడునకు లక్ష్మీ అంశతో ఉన్న భార్య లభ్యమయ్యేసరికి! అష్టైశ్వర్యాలతో తులతూగుతూ, అతిశయం పెంచుకుని స్వర్గాధిపత్యము పొందగోరి దేవరాజ్యాన్ని కొల్లగొట్టి, దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయటమే కాకుండా, పరమేశ్వరుని చెంతకేగి, శివా! నీ భార్య సుందరాంగి, ఆమెను నాకు వశ్యురాలును చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగెను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి ‘‘శివా! వీడు ఆజేయుడగుటకు కారణం ఈతని భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించెదను. నీవు వీనిని వధించుము’’ అని యుక్తి చెప్పెను.

అనంతరం మాయా శంఖచూడుని వేషము ధరించిన శ్రీహరిని చూసి బృంద తన భర్తే వచ్చాడని భ్రమించి, అతనికి సర్వోపచారాలు చేసి శ్రీహరి చెంతకు చేరగానే! ఆమె పాతివ్రత్యం భగ్నం కావటం గ్రహించి శివుడు శంఖచూడుని సంహరించగా అతడు దేహమును విడచి ‘‘సుదాముడై’’ గోలోకమునకు వెళ్ళాడు. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని ‘‘శిలారూపమందుదువుగాక’’ అని శపించగా, విష్ణువు తిరిగి ఆమెను నీవు వృక్షమగదువుగాక అని శపించెను. ఆ విధంగా శ్రీహరి గండకీనదిలో సాలగ్రామ శిలగాపుట్టి, బృంద తులసీ వృక్షమైపోయి ఇద్దరూ ప్రపంచం చేత పూజలందుకుంటున్నట్టు బ్రహ్మవైవర్త పురాణగాథ ద్వారా విదతమవుతోంది.
ఒకసారి పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామిని చెంతకు చేర్చుకుని
‘‘పుత్రా! సకల వృక్షములలోన తులసి మొక్కయే పూజ్యమైన క్ష్మారుహంబు దాని పత్రములును దాని పుష్పములును బ్రాణ సమములగును అచ్యుతునకు’’ అని చెప్పాడు.

అంతేకాక వృక్షాలన్నిటిలో తులసి శ్రేష్ఠమైనది. శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైంది. తులసిపూజ, తులసీ స్తోత్రం చదవడం, తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున జల్లుకోవడం. తులసీవనాన్ని పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించటం ఎంతో పుణ్యప్రదమైనవి. గోదాదేవి తులసివనంలోనే అయోనిజగా విష్ణుచిత్తునింట వెలసి శ్రీరంగనాధుని ఇల్లాలయింది.
శ్లో వశిష్ఠాది ముస్తోమైః పూజితో తులసీవనే
తదా ప్రభృతి యద్విష్ణూః బ్రతిజ్ఞాం కృతవాన్‌ ప్రభుః
తస్మిన్‌ తులస్యాంతు యః పూజాంకురుతే నర
సర్వపాప వినిర్ముక్తః మమసాయుజ్య మాప్నుయాత్‌
వశిష్ఠాది మునిగణంతో ఎన్నో విధాలుగా స్తోత్రపూర్వకంగా శ్రీహరి తులసీవనమందు పూజలందుకొని తన్ను కార్తీక శుద్ధద్వాదశి నాడు విశేషించి ఎవరు పూజచేస్తారో అట్టివారి సమస్త పాపాలు అగ్నిలో పడిన మిడతలు వలె భస్మమై వారు తప్పక నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసెనట!
శ్లో తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్ఛినః
యదిచ్ఛేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యంబ్రాహ్మణైస్సహ
విష్ణోః ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకథా
ద్వాదశ్యాం శ్రవణాత్తస్యాః పునర్జన్మ న విద్యతే
విష్ణు సాన్నిధ్యం కోరి విష్ణు దేవునకు ఏమాత్రమైనా ప్రీతి చేయాలని తలచేవారు తులసీ వ్రతమహత్య్మము తప్పక వినాలి. అందునా! క్షీరాబ్ధిద్వాదశి రోజున తులసి కథ వినువార్కి, చదువువారికి పూర్వజన్మ కృతమైన దుఃఖములన్నియు తొలగిపోయి విష్ణులోకాన్ని పొందుతారు అని శంకరుడు తులసి కొనియాడినట్లు తెలుస్తోంది. అలాంటి తులసీ బృందావన ంలో ఉసిరిమొక్కతో కలిపి తులసీధాత్రి సమేత శ్రీమన్నారాయణుని కార్తీక ద్వాదశినాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొన్నారు. పైగా తులసీ దళాలకు నిర్మాల్యదోషం పూజలో ఉండదని కూడా చెప్పారు.

కనుక హిందూ మతంలో తులసి ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్థానాన్ని పొందింది. తులసి మొక్క హిందువులకు పూజనీయమైంది. అందుకే హిందువులు ప్రతి ఇంటా తులసి మొక్క ను కోటలో పెంచి పూజించటాన్ని చూస్తూ ఉంటాం. ఇక పట్టణవాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని, చిన్న చిన్న కుండీల్లోనో, డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు. తులసి ఉన్న ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది.

ఇక ఈ తులసిని వైద్య పరంగా చూస్తే ఆయుర్వేద శాస్త్రంలో సప్తతులసి-భరతవాసి అంటూ తులసిని ఏడు విధాలుగా వివరించారు. అవి 1. కృష్ణ తులసి, 2, లక్ష్మీ తులసి, 3, రామతులసి, 4. నేల తులసి, 5. అడవి తులసి, 6. మరువ తులసి, 7. రుద్ర జడ తులసిగా వివరిస్తారు. వైద్యపరంగా అవన్నీ ఎన్నో అమోఘమైన ఔషధగుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతోంది. ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు (కోటలోవికాదు) విడిగా పెంచుకున్న మొక్కల నుండి నమిలి మింగితే వారికి బుద్ధి శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని, ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్తారు. ఇక దాని కాండముతో తయారు చేసిన తులసి మాలకు ఇటు ఆధ్యాత్మికపరంగా అటు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయట!
కనుక ప్రతి క్షీరాబ్ధిద్వాదశి వ్రతాన్ని ఆచరించి ఇటు ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆరోగ్య భాగ్యాన్ని సర్వులూ పొందవచ్చు!

సత్యనారాయణ వ్రత..

కార్తీక మాసంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి పుణ్య వ్రతాన్ని లక్షలాది కుటుంబాల్లో తప్పనిసరిగా జరిపిస్తారు. ఈ పుణ్యదినాలలో ఈ వ్రతం ఆచరించడం వల్ల సర్వ భోగభాగ్యాలు శ్రీ సత్యనారాయణ స్వామి కటాక్షంగా లభిస్తాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆంధ్ర ప్రాంతీయులకంటే తెలంగాణా ప్రాంతంలో ఈ వ్రతాచరణ ఒక విధివిధాన మవ్వడం, ఆచరించే విధానంలో ఉండే పద్ధతులు ప్రత్యేకంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో శ్రీ కేదారేశ్వరస్వామి వారి వ్రతాన్ని ఈ మాసంలోనే జరపడం మరో విశేషం. ఉత్తర భారత దేశంలో ఈ మాసంలో బిల్వపత్ర వ్రతాన్ని జరిపిస్తారు. ఇంటింటా లక్షలాది మారేడు దళాలతో ఈ మాసం పవిత్రమౌతుంది. శక్తి ఉన్నవారు స్వర్ణ బిల్వపత్రాలను చేయించి తొమ్మిది రోజులు శివసన్నిధిలో ఉంచి బ్రాహ్మణోత్తములకు లేదా వృద్ధ ముత్తయిదువులకు దానమిచ్చి బిల్వాష్టకమును పారాయణ చేస్తారు.

ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ దానాలు చేసినా, వ్రతాలు చేసినా కార్తీక వైభోగం కార్తీక వైభోగమే! ఒక్క బిల్వాన్ని శివుడికి అర్పిస్తే చాలు! జన్మ ధన్యమౌతుంది. ఒక పొద్దు ఉపవాసముంటే చా లు! కైలాసవాసం ప్రాప్తిస్తుంది. ఒక్క దీపాన్ని దానమిస్తే చాలు! జీవితం ఐశ్వర్యమయమౌతుంది ఇలా అనేక నమ్మకాలతో మనస్సు పవిత్రంగా పరమేశ్వర సేవలో లగ్నమౌతుంది.

కొరతలేని జీవనానికి కార్తీకమాసంలో పుణ్యవ్రతాలను మంగళప్రదంగా ఆచరించడం ఆనవాయితీ. శివతత్త్వాన్ని గృహంలో ప్రతిష్టించి, కార్తీక పురాణ కథలను పదిమంది ముందు పఠించి, భక్తికి ప్రాధాన్యత ఇస్తూ అర్థనారీశ్వర చైతన్యాన్ని హృదయంలో నింపుకుంటార భక్తులు. ఆ ప్రార్థనా శక్తి ఆవిర్భవింపచేసే మహోతేజస్సు శివం....శివం అంటూ హృదయాన్ని ప్రకాశింపచేస్తుంది.
- డా వి.జి.శర్మ

No comments: