Saturday, November 6, 2010

అడవిలో ఆసుపత్రి ..... మూలికలే మందులు !

mulikalu5అక్కడ కార్పొరేట్‌ వైద్యానికి సైతం లొంగని వ్యాధులు మటు మాయమవుతాయి. ఆయన హస్తవాసిని చూసి మొండి రోగాలు కూడా తోకముడుస్తాయి. అలా అని ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులున్న ప్రముఖ వైద్యుడేమీకాదు. ప్రకృతి ప్రసాదించిన వనమూలికలతో ఈ సత్కార్యాన్ని చేపట్టారు. ఇప్పటివరకు కొన్ని వేలమంది రోగులకు వైద్యసేవలందించి వారికి స్వాంతన చేకూర్చిన... చేకూర్చుతున్న ఆ వైద్య‘నారాయణుడే’ జమాల్‌ ఖాన్‌. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని ఓ కుగ్రామం నిమ్మలగూడెంలో... వారసత్వ సంపదగా వచ్చిన వైద్య విధానంతో జమాల్‌ తన ప్రకృతి చికిత్సాలయం ద్వారా ఎంతో మందికి వైద్య సేవ చేస్తున్నాడు. ఆయుర్వేదం వేల సంవత్సరాల క్రితం చెట్లలోని మందు గుణాన్ని క్రోడీకరించింది. ఆయుర్వేదం పరిధిలోకి రాని చెట్టు, మొక్క, తీగ అంటూ ఏదీలేదు. ఆలాంటి అపార వృక్షసముదాయంలోంచి వైద్య సంపదను సృష్టిస్తున్నాడాయన. మన్నెం అటవీ ప్రాంతంలో బీదబిక్కి జనానికి సహజమైన ఓషధులతో తన ప్రకృతి వైద్యశాల ద్వారా సేవ చేస్తున్నాడు. మన రాష్ట్రం నుండే కాక... చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, మహారాష్ట్ర నుండి వచ్చే రోగులకు కూడా తన వైద్య సేవలు అందిస్తున్న జమాల్‌ఖాన్‌... ‘వైద్యో నారాయణో హరి’ అనే ఆర్యోక్తికి అక్షరాల అర్హుడు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చుచేసినా తగ్గని మొండి వ్యాధులను వనమూలికలతో... అదీ ఉచితంగా అందిస్తూ... తన సేవా తత్పరతను చాటుకుంటున్న ప్రకృతి వైద్య నిపుణుడు జమాల్‌ నిస్వార్థ సేవల కథనం.

- మహత్తర వనమూలికలతో మొండి రోగాలకు వైద్యం
- రెండు దశాబ్దాలకు పైబడిన వంశపారంపర్య ఉచిత వైద్య సేవలు
- మూడు రాష్ట్రాల రోగుల ఆశాజ్యోతి ఎండి.జమాల్‌ఖాన్‌
అనాది నుంచి ప్రకృతిలో మమేకమైన మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో ఆ ప్రకృతికి దూరమయ్యాడు. వైద్యరంగం అభివృద్ధి చెందుతున్న కొద్ది మానవుని ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలు పెట్టింది. అయితే వైద్యరంగంలో అనేక రకాల వైద్య విధానాలతో రకరకాల చికిత్సలు జరుగుతున్నప్పటకీ, అన్నింటికీ మించి, ప్రకృతిలో దొరికే మహత్తర వన మూలికలే మేలైన రోగ వినాశకారులని గుర్తించిన జమాల్‌ఖాన్‌ కుటుంబం వంశ పారంపర్యంగా ఏజెన్సీలో వైద్యం చేస్తూ, ఎందరో రోగులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. అడవి నుండి ఔషద గుణాలు ఉన్న మొక్కలను, వేర్లను, దుంపలను సేకరించి, వాటి ద్వారా చికిత్స నిర్వహిస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లోని చింతూరు మండల కేంద్రానికి సరిగ్గా మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న నిమ్మలగూడెం జమాల్‌ఖాన్‌ మూలికా వైద్య ప్రకృతి కేంద్రం.

mulikaluచుట్టూ గుట్టలు, పచ్చటి ప్రకృతి, ప్రక్కనే జలజలా పారుతున్న శబరి నది ఒడ్డున తనకున్న కొద్దిపాటి భూమిలోనే అనేక రకాల వన మూలికలను పెంచుతూ, దాన్ని కుటీర పరిశ్రమగా చేసి వనమూలికలతో మందులు తయారు చేస్తున్నారు. సుమారు 20 మంది సహాయకులతో ఈయన వైద్య సేవలు కొనసాగుతున్నాయి. జమాల్‌ఖాన్‌ సేకరించే అరుదైన వన మూలికా ఔషధాలైన తెల్ల మద్ది, ఎర్రచిత్రమూలం, తెలియకండ, బొమ్మల మర్రి, పీడాకుల పాల, అశ్వగంధ, పాతాల గరిడి, అడ్డసార, సత్తావరి తదితర ప్రకృతి నుంచి లభించే చెట్లు, వేళ్లతో ఎన్నో నయం కాని రోగాలను తగ్గించవచ్చని ఆయన రుజువు చేశారు. ఈ వైద్యశాలలో పాము కాటుకు గురై వచ్చే రోగులకు ఉచితంగా చికిత్స నిర్వహించి, అనేక మంది ప్రాణాలు కాపాడారు. ఈయన వద్దకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది రోగులు వస్తుంటారు. క్యాన్సర్‌, అస్త్మా, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, బిపి, షుగర్‌ వంటి రోగాలను సైతం జమాల్‌ఖాన్‌ నయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు అనేక మంది రోగులు తమ రోగాలు పూర్తిగా ముదిరిన తర్వాత చివరి దశలో రావడం, మందులు పనిచేసే వరకు ఓపికగా ఉండలేకపోవడంతో ఈ ప్రకృతి వైద్యం అంతగా గుర్తింపునకు నోచుకోవడం లేదని ఈ ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. అందుకనే మానవ అవసరాలకు ఉపయోగపడే ఎన్నో మహత్తర వన మూలికలు నిర్లక్ష్యానికి గురౌతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలగలతో వినూత్న చికిత్స...
mulikalu1 శరీరంపై... ఎన్నో యేళ్లుగా మానకుండా, చికాకు కలిగించి, జీవితంపై విరక్తి పుట్టించే దీర్ఘకాలిక గాయాలకు ఈయన చేసే చికిత్స వినూత్నంగా ఉంటుంది. దీర్ఘకాళికంగా ఉన్న పుండ్ల ప్రదేశంలో బురద నీటి నుండి తెచ్చిన జలగలను వదిలి పుండ్లలో పేరుకుపోయి ఉన్న చెడు రక్తాన్ని పీల్పించడం ద్వారా చికిత్స మొదలుపెడతారు. అలా జలగలు చెడు రక్తాన్ని పీల్చివేసిన అనంతరం వైద్యుడు ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి మందుల ద్వారా 10-15 రోజులలో గాయం మానేటట్లు వైద్యం చేస్తారు. ఈ ప్రక్రియలో చికిత్స కోసం జలగలను ఒక రోగికి ఒక్కసారి మాత్రమే వినియోగిస్తారు.


రోగుల క్షేమమే కోట్ల ఆస్తితో సమానం...: మూలికా వైద్యుడు జమాల్‌ఖాన్‌
mulikalu3 ఒరిస్సాలోని మల్కా న్‌గిరి జిల్లా మోటు ప్రాంతం, మా నాన్నగారికి నేను 23వ సంతానం. నా తర్వాత తమ్ముడు ఖాలిక్‌ఖాన్‌తో కలిసి వంశపారంపర్యంగా వస్తున్న ఈ మూలికా వైద్యాన్ని కొనసాగిస్తున్నాం. మా తండ్రి మహ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ గారు 1920వ సం లోనే శబరి పరివాహక ప్రాంతాలలో వచ్చిన కలరా, డయేరియా వంటి అంటువ్యాధులను నివారించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. దాంతో ఆనాడే మా వైద్య విధానానికి మంచి గుర్తింపు లభించింది. మా తాతల కాలం నుండి నేటివరకు వైద్యసేవలకు గాను ఎప్పుడూ, ఎవరి దగ్గర ఒక నయా పైసా కూడా ఫీజు తీసుకోలేదు. 2002లో శబరి నది దాటి ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతానికి వచ్చాం. ఇప్పుడు మూలికలు సేకరించి తెచ్చిన గిరిజనులకు... కూలీ రూపేణా ఇవ్వడానికి మాత్రమే నామ మాత్రపు డబ్బు తీసుకుంటున్నాం. నాకు కాంట్రాక్టులు, వ్యవసాయం తదితర ఆదాయ మార్గాలు ఉన్నాయి. వైద్య సేవలకు ఎటువంటి రుసుము అవసరం లేదు. ఎందరో దేవుళ్లకు మొరపెట్టుకొని నా దగ్గరకు వచ్చే రోగులకు నయమై క్షేమంగా ఉంటే చాలు, అదే నాకు కోట్ల ఆస్తితో సమానం.

mulikalu2 ఏజెన్సీ ప్రాంతంలో ఆయుర్వేద వైద్య సేవల ద్వారా పక్షవాతం, మధు మేహం, కిడ్నిలో రాళ్లు, కిడ్ని ఫెయిల్యూర్‌, కీళ్లవాతం, కీళ్లనొప్పులు, టి.బి., కాలేయ సంబంధిత వ్యాధులు, రకరకాల కామెర్లు, గర్భసంచి క్యాన్సర్‌, బ్లడ్‌ క్యాన్సర్‌, సైనస్‌, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, తెల్లపొడ, శూలబాధలు, అల్సర్‌, అర్ష మొలలు, మూత్ర సంబంధమైన వ్యాధులు, ఎర్రబట్ట, సెక్స్‌ సంబంధ మైన సమస్యలు, హై, లో బి.పి., కుష్టు, ఇంకా అనేక రకమైన వ్యాధులకు చికిత్స వనమూలికల (గింజలు, బెరడు, వేర్లు, కాయలు, పువ్వు, ఆకులు) ద్వారా నయం చేస్తాం. మాకున్న కొద్దిపాటి ఆవరణలోనే ఎన్నో రకాల ఔషద మొక్కల ను పెంచుతున్నాం. సేకరించిన వాటిల్లో చాలావరకు బట్టీల ద్వారా ఆవిరి రూపంలో కషాయం (లిక్విడ్‌) తీస్తాం. అందులో తెల్లమద్ది, వాకుడు, ఉత్త రేణి, తామెరతీగ, పాషానంబేది, కొండపిండి ఆకు, నేల ఉసిరి, బొమ్మల మర్రి, నల్ల ఉమ్మెత్త, తెల్ల చిత్రమూలం, ఎర్ర ఉల్లి, ముల్ల గోరింక, నిమ్మగడ్డి అంజీరా, జీరా, నేలతాడి, పారీజాత, తిప్పతీగ, అడవినాబి, అడ్డసారా, మామి డి అల్లం, తెల్లగన్నేరు ఇలా వందలాది అడవి వన మూలికలతో పొడులు, లేహ్యాలు, ఔషదగుళికలు తయారు చేసి వ్యాధులను నయం చేస్తుంటాం.ఎందరో మేధావుల సందర్శన...

mulikalu4 భద్రాచలం మన్నెంలో ప్రకృతి వైద్యంతో పలు దీర్ఘకాలిక రోగాలను ఎలా నయం చేస్తున్నారో తెలుసుకోవాలని, ఎందరో మేధావులు, విద్యావేత్తలు, విదేశాల నుంచి సైతం ప్రొఫెసర్లు వచ్చి ఇక్కడి వైద్య విధానాన్ని తెలుసుకొని వెళ్లారు. డబ్బు ప్రధానంగా ఈ వృత్తిని ఎంచుకోకుండా, జమాల్‌ఖాన్‌ చేసే వైద్య సేవలు పలువురు కొనియాడారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వనమూలికల సేకరణ చాలా కష్టమైన విషయమని, దానిని ఇంతకాలంగా కొనసాగిస్తూ ఉండటం నిజంగా ప్రశంసనీయమని పలువురు వైద్యులు కొనియాడారు.


ఎన్నో రోజులుగా రాని మార్పు గమనించాను...: కోటగిరి మురళి, ఉద్యోగి, హైదరాబాద్‌
muraliనేను చాలా కాలంగా వెరికోస్‌వెయిన్స్‌ (చీలమండ వద్ద పుండు) అనే వ్యాధితో బాధపడు తున్నా, ఎన్నో రకాల వైద్య చికిత్స ద్వారా రాని మార్పు నాకు ఈ వైద్య విధానం ద్వారా వచ్చింది. గత సెప్టెంబర్‌ 16న ఒక న్యూస్‌ ఛానల్‌ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. జమాల్‌ఖాన్‌ చేసే వైద్యం, ఆయన రోగులతో మెలిగే తీరు నాకు ఎంతగానో నచ్చింది. అందుకే కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండి వైద్యం చేయించుకోవడానికి వచ్చాను. నాకు పూర్తిగా తగ్గిపోతుందనే నమ్మకం వుంది.

జన్మజన్మలకు ఋణపడి ఉంటా...: వాసం నాగేశ్వరరావు, నర్సిపట్నం
nageshwaraoనాకు లివర్‌ దెబ్బతిన్నది. గ్యాస్‌ట్రబుల్‌ వల్ల హెచ్‌.బి.ఎస్‌ పాజిటివ్‌ అనే వ్యాధితో ఇక్కడికి వచ్చాను. లివర్‌పై ఉండే పొర పూర్తిగా చెడిపోయిందని, ఇక బ్రతకడం కష్టమని, చాలామంది చెప్పారు. కానీ, ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకున్న తర్వాత, అంతకు ముందు ఉన్న రేచీకటి కూడా పోయింది. ఇప్పుడు నాకు కళ్లు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. జన్మజన్మలకు డాక్టర్‌గారికి రుణపడి ఉంటాను.

మాకు జమాల్‌ ఖానే దేవుడు...: మడివి విజయ్‌, స్థానికుడు
వారం రోజుల కిందట నన్ను కట్లపాము కరి చింది. అదే వేరేచోట అయితే నేను చచ్చిపోయేవాడినే. కానీ మా ప్రాంతం వాళ్లకు పాముకాటు భయం లేదు. ఎందుకంటే మాకు దేవుడు లాంటి జమాల్‌ఖాన్‌ ఉన్నాడు.

జమాల్‌ లేకుంటే అవిటిదాన్న య్యేదాన్ని...: సిద్దోజి పద్మ, చల్లగరిగ గ్రామం, వరంగల్‌ జిల్లా
padmaబోన్‌ క్యాన్సర్‌తో నా కుడికాలి మడమపై పుండు వచ్చింది. హన్మకొండలోని అమృత హాస్పటల్‌కి కూడా వెళ్లి చూపించుకున్నా. నిమ్స్‌ కూడా వెళ్లి చూపిస్తే మోకాలు వరకు తీసేయాలని చెప్పారు. ఇక్కడి రాకుంటే నా కాలు కోల్పోయేదాన్ని. 20 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాను. ఇప్పటివరకు సుమారు 70 శాతం నాకు ఆరోగ్యం కుదుటపడింది. పూర్తిగా నయమవుతుందనే విశ్వాసం ఉంది. ఈ ఆవరణ, మొక్కలతో ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంది.

జమాల్‌గారివద్ద పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం: ముఖ్య సహయకుడు, ఎస్‌కె.సుభానీ
subaniజమాల్‌ఖాన్‌తో నాకు బంధుత్వం ఉంది. బావగా నాకు చుట్టమే అయినా, ఆయన నాకు గురువుతో సమానం. ఆయన తో కలిసి వైద్య సేవల్లో పాలుపంచుకోవడం నా పూర్మజన్మ సుకృతం. ఎంత నేర్చుకున్నా ఇంకా ఆయన దగ్గర మిగిలే ఉందని అనిపిస్తూ ఉంటుంది. ఆయనకు ఎన్ని రకాల పనులున్నా... వైద్యా న్ని, వైద్యసేవలను ఎంతో గౌరవంగా భావి స్తారు. అది నాకు, మా సహాయకులందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రతి మనిషి ఏదో ఒకరోజు చిరాకు పడటం, అశ్రద్ధగా ఉండడం మనం చూస్తుంటాం... కాని మా జమాల్‌ఖాన్‌ గారిలో అది మేం ఇంతవరకు చూడలేదు.

ఇక్కడికి వచ్చే రోగుల్ని చూస్తే... మనసు చలిస్తుంది...:  -  రమణ, కాంపౌండర్‌
mulikalu6 జమాల్‌ఖాన్‌గారితో 15సంలుగా ఉంటున్నా. ఎన్నో వేలమంది రోగులకు సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కోసారి... బాగా రోగం ముదిరిన తర్వాత వచ్చే రోగులను, వారు పడే బాధలు చూస్తే మనసు చలిస్తుంది, రోగం ముదరక ముందే ఇక్కడికి వస్తే త్వరగా నయం చేస్తాం. కాబట్టి బాగుపడ్డ రోగులు ఇతరులకు చెప్పి, వారి వంతు సహకారాన్ని అందిస్తే... ఈ వైద్యానికి ఇంకా మంచి గుర్తింపు వస్తుంది.

ఆయన సేవల్లో పాలుపంచుకోవడం మా అదృష్టం : సహాయకులు... సోయం ముత్తమ్మ, సోడే రాములమ్మ, సోడే అచ్చమ్మ, సోడే లక్ష్మి (విద్యార్థిని)
మా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రతి బుధవారం గిరిజనులు సంతకు వచ్చేటప్పుడు, జమాల్‌ఖాన్‌గారు చెప్పినటువంటి వేర్లు, బెరడులు, చెట్లు, ఆకులు తీసుకొస్తారు. వారు తెచ్చిన వాటిని మేం శుభ్రపరుస్తాం. ఎన్నో యేళ్లుగా ఈ పనిలో ఉన్నాం. డాక్టర్‌ గారు చెప్పినట్లు ఆవిరితీయడం, ఔషధ గుళికలు తయారు చేయడం, లేహ్యాలు తయారు చేయడం చేస్తుంటాం. డాక్టర్‌ గారు రోగులకు ఉచితంగా వైద్యం చేస్తున్నప్పటికీ మాకు మాత్రం కూలీ ఇస్తుంటారు. ఆయన చేసే వైద్యంలో మా వంతు సేవ చేస్తూ, ఆయన వెంట ఉండటం పరమానందంగా ఉంటుంది.

వైద్య సదుపాయాలు ఎన్ని ఉన్నా...:మన్నెంలో వనమూలికా వైద్యానికే పెద్దపీట
mulikalu7 మన్నెంలో వనమూలికా వైద్యం చేస్తున్న జమాల్‌ఖాన్‌ వైద్యశాలకు 3 కిలోమీటర్ల దూరంలోని చింతూరు మండల కేంద్రంలో ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాల, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా (100 పడకల) హస్పటల్‌ లు అన్నిరకాల అల్లోపతి చికిత్సలు అందిస్తున్నప్పటికీ, నిమ్మలగూడెంలో యం.డి జమాల్‌ఖాన్‌ చేస్తున్న వనమూలికా వైద్యానికే రోగులు, వారి బందువులు పెద్ద పీట వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఐటిడిఎ సంస్థద్వారా నిత్యం ఈ పరిసర ప్రాంతాల గిరిజన, గిరిజనేతరులను అనునిత్యం అభివృద్ది పరుస్తూ, అన్ని రకాల వైద్యసేవలను వారి వారి ముంగిటకు తెచ్చినా, వనమూలికా వైద్యమే ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాల వారందరికి శ్రీరామరక్ష. ఈయన చేసే వైద్యంతో పాటు, పలకరింపు, రోగులతో ఈయన ఉండే వ్యవహర శైలి ప్రతిఒక్కరికి హత్తుకునే విధంగా ఉండడమే దీనికి కారణమని స్థానికులంటారు. హస్తవాసి, వంశపారంపర్య వైద్య విధానముతో జమాల్‌ఖాన్‌ చేసే విన్నూతన ప్రయోగాలతో (జలగలతో చికిత్స) చేస్తున్న వైద్యం కూడా మంచి ఫలితాలను ఇవ్వడం, ఇక్కడకి వచ్చే రోగులకు ఎంతో త్వరగా నయం అవ్వడమే జమాల్‌ఖాన్‌ వైద్య రహస్యమని, పలువురు స్వస్థత చేకూరిన వ్యక్తులు చెప్పడం గమనార్హం.
- మల్లేల సత్యనారాయణ, భద్రాచలం

2 comments:

sl.swamy said...

ఆయురారోగ్యాలు ADBHTHANGA UNDHI ILANTI
VAIDYALANU VELIKI THEVATAM NIJAGA CHAALA GREAT


THANKS, dr,laxmanswamy@gmail.com

Girija said...

may i know MR. MD. Jamalkhans Contact details......