Tuesday, February 1, 2011

అవగాహనాలోపం ... సెర్వికల్ క్యాన్సర్ శాపం ....

స్త్రీలలో మాత్రమే వచ్చే వ్యాధి సెర్వికల్ క్యాన్సర్. ఇది హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) వల్ల వస్తుంది. పురుషుల్లో ఈ వైరస్ ఉన్నా ఎటువంటి హాని చేయదు. కానీ వారి ద్వారా స్త్రీలకు సంక్రమిస్తుంది. గర్భాశయ ముఖద్వారానికి వచ్చే ఈ క్యాన్సర్ వేగంగా విస్తరించడానికి అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఈ వ్యాధి గురించి సరియైన అవగాహన లేదు. హెచ్‌పీవీ వైరస్ సోకినపుడు కొన్ని ప్రాథమిక లక్షణాలు బయటపడతాయి. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చేయి దాటిపోతోంది. కొందరు స్త్రీలు గుర్తించినా బయటకు చెప్పుకోలేక క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువగా బయటపడుతోంది.

కారణాలు అనేకం
హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) సోకడం వల్ల యోనికి, గర్భాశయంకు మధ్యన ఉన్న ప్రాంతంలో(గర్భాశయ ముఖద్వారం) క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. జననాంగాల ప్రాంతంలో శుభ్రత పాటించని వారికి, ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు పెట్టుకున్న వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెసీ సమయంలో వేసుకునే కొన్ని రకాల మాత్రల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సెర్వికల్ క్యాన్సర్‌లో squamous cell carcinoma ఎక్కువగా వస్తుంది. 90 శాతం మందిలో ఈ రకమైన క్యాన్సర్ వస్తుంది. మిగతా 10 adenocarcinoma, adenosquamous carcinoma అనే క్యాన్సర్ కనిపిస్తోంది.

రక్తస్రావంతో జాగ్రత్త
వైరస్ శరీరంలో ప్రవేశించినపుడు ప్రాథమిక దశలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఆ తరువాత ఎటువంటి లక్షణాలు ఉండవు. కానీ కొన్ని ఏళ్ల తరువాత క్యాన్సర్‌గా బయటపడుతుంది. మొదటి దశలో నొప్పి ఉండదు. రక్తస్రావం, పీరియడ్స్ ఎక్కువ రోజులు ఉండటం, సంభోగం తరువాత రక్తస్రావం, పీరియడ్స్‌కు, పీరియడ్స్‌కు మధ్య పీరియడ్స్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరువాత దశలో మూత్రంలో, మలంలో రక్తం పడటం, రక్తహీనత. నడుం నొప్పి, కాళ్లనొప్పులు ఉంటాయి. నాలుగో దశలో మూత్ర పిండాలలో వాపు, లివర్ ఎఫెక్ట్ కావడం జరుగుతుంది.

పాప్‌స్మియర్ టెస్ట్
సెర్వికల్ క్యాన్సర్ ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి పాప్‌స్మియర్ టెస్టు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒక ప్రత్యేకమైన పరికరం ద్వారా గర్భాశయ ముఖ ద్వారం నుంచి కొన్ని కణాలు తీసుకుని పరీక్షించడం జరుగుతుంది. పెల్విక్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా సెర్వికల్ నార్మల్‌గా ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. సెర్వికల్ ప్రాంతం నుంచి ముక్క తీసి పరీక్ష(బయాప్సీ)చేయడం ద్వారా కూడా క్యాన్సర్‌ను నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్లయితే ఎంత వరకు వ్యాపించింది తెలుసుకోవడానికి అల్ట్రా సౌండ్ అబ్డామిన్, ఎక్స్‌రే వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

హిస్ట్రెక్టమీ ఆపరేషన్
సెర్వికల్ క్యాన్సర్ సోకినపుడు మెదటి, రెండు దశలలో ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చు. రాడికల్ హిస్ట్రెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా గర్భాశయం, యోనిపైభాగం, అండాశయాలు, పెల్విక్‌నోడ్స్‌ను తొలగించడం జరుగుతుంది. క్యాన్సర్ సోకిన భాగాలను తొలగించడం వల్ల త్వరగా కోలుకుంటారు. మూడు, నాలుగో దశలో గుర్తించినపుడు రేడియేషన్, కీయోథెరపీని ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి బాగా ముదిరినపుడు కీమోథెరపీ ఇవ్వడం ద్వారా మరికొంతకాలం జీవించే అవకాశం కల్పించవచ్చు.

ముందుగా గుర్తిస్తే మేలు
సెర్వికల్ క్యాన్సర్‌లో నాలుగు దశలుంటాయి. మొదటి దశలో సెర్విక్స్ దగ్గరే వైరస్ ప్రభావం ఉంటుంది. రెండవ దశలో కొంత విస్తరిస్తుంది. మూడవ దశలో కొన్ని భాగాలకు, నాలుగవ దశలో శరీరం మొత్తం వైరస్ విస్తరిస్తుంది. మొదటి దశలో గుర్తిస్తే 95 శాతం కంటే ఎక్కువ నయమయ్యే అవకాశాలుండగా, రెండవ దశలో 80 శాతం, మూడవ దశలో 40 శాతం, నాలుగో దశలో 15 శాతం వరకు నయమయ్యే అవకాశాలున్నాయి.

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క మహిళ పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. ఋతుక్రమం ప్రారంభమయినప్పటి నుంచి వివాహం అయ్యేలోగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ప్యూబర్టీ దశలో మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సెర్వికల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. జననాంగాల ప్రాంతంలో శుభ్రత పాటించాలి. సురక్షితమైన లైంగిక సంబంధాలు చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సెర్వికల్ క్యాన్సర్ బారినపడకుండా చూసుకోవచ్చు.


డా. కె. శ్రీకాంత్
సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్టు,
యశోద క్యాన్సర్ ఇనిస్టిట్యూట్,
యశోద హాస్పిటల్, సోమాజిగూడ,హైదరాబాద్,
ఫోన్ : 9849977889

No comments: