Tuesday, February 22, 2011

క్యాన్సర్‌ని ముందే కనిపెట్టే పెట్‌స్కాన్

క్యాన్సర్... వచ్చిందంటే ఇక అంతే అని భయపడే రోజులు పోయాయి. ఎంత క్లిష్టమైన క్యాన్సర్‌నైనా ఇప్పుడు ఆధునిక పద్ధతులతో మట్టికరిపించవచ్చు. చాలా సందర్భాల్లో కణితి ముదిరేవరకూ ఎటువంటి లక్షణాలూ కనిపించవు. ఇలాంటప్పుడు ట్యూమర్ ఏర్పడుతున్న ప్రారంభదశలోనే గుర్తించగలిగితే క్యాన్సర్ మూలాలు కూడా లేకుండా చేయవచ్చు. వ్యాధి నిర్ధారణ దగ్గరి నుంచి కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇతర చికిత్సల వరకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య పరిజ్ఞానం ద్వారా క్యాన్సర్‌ను ఎదుర్కోవడం ఇప్పుడు మరింత సులభం అయింది. తొలిదశలోనే ఉన్న క్యాన్సర్ కణితిని వెతికిపట్టుకోవడానికి వచ్చిన కొత్త పరికరమే హై డెఫినిషన్ పెట్ స్కాన్.

ఆదిలోనే...
అనారోగ్యం కలిగినప్పుడు శరీర ప్రక్రియల్లో మార్పులు వస్తాయి. ఆ తరువాతే మనకు పైకి వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. చాలా సందర్భాల్లో ఈ లక్షణాలు కనిపించేవరకు అనారోగ్యం కలిగిందని గుర్తించలేం. మొట్టమొదట జీవప్రక్రియల్లో కలుగుతున్న మార్పుల దశలోనే వాటిని గుర్తించగలిగితే మరింత త్వరగా చికిత్స అందించవచ్చు. ఈ మార్పులను ప్రారంభదశలోనే గుర్తిస్తుంది పెట్ స్కాన్.

ఉదాహరణకు క్యాన్సర్ విషయంలో కణితి ఏర్పడటానికి ముందు ఆ భాగంలో ఉండే కణాలు అనియంత్రంగా అసహజంగా పెరుగుతూ ఉంటాయి. అంటే కణవిభజన ప్రక్రియలో మార్పులు వస్తాయి. అలా అసాధారణమైన కణవిభజన ప్రక్రియను ముందుగానే గుర్తించగలిగితే క్యాన్సర్‌ని అంత సులువుగా తరిమేయవచ్చు. పెట్ స్కాన్ ఇలా వ్యాధి ప్రారంభదశలోనే జీవక్రియల్లో జరిగే మార్పులను గుర్తించగలుగుతుంది కాబట్ట్టే కణుతులు పూర్తిగా ఏర్పడకముందే క్యాన్సర్ ఉందనే విషయాన్ని కనుక్కోవచ్చు. అంతేకాదు ఎటువంటి చికిత్స అందించాలో కూడా నిర్ణయించుకోవడం సులభం అవుతుంది.

పెట్ స్కాన్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ఏది అవసరమో అదే చికిత్స చేయవచ్చు. క్యాన్సర్ ఏ దశలో ఉందో కనుక్కోవడానికి చేసే ఇన్వేసివ్ పద ్ధతులను చేసే అవసరం ఉండదు. అంతేకాదు, క్యాన్సర్ దశను బట్టి చేసే శస్త్రచికిత్సలతో పనిలేదు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాదు.. పేషెంటుకు అనవసరమైన ఇబ్బందులుండవు. క్యాన్సర్ కణాలు వేగంగా పెరుగుతుంటాయి కాబట్టి వీటి జీవక్రియ రేటు అధికంగా ఉంటుంది. ఈ కణాలు పెట్ స్కాన్‌లో తక్కువ సాంద్రతతో కనిపిస్తాయి.

ఎలా పనిచేస్తుంది?
పెట్, సిటి రెండింటి సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించుకుని పనిచేస్తుంది పెట్ సిటి స్కాన్. ఈ పరీక్షకు దాదాపు 20 నిమిషాలు పడుతుంది. ముందుగా రేడియోలేబల్ రూపంలోని గ్లూకోజ్‌ని ట్రేసర్ ఇంజక్షన్‌గా ఇస్తారు. ఒక గంట సమయంలో ఈ ట్రేసర్ రోగి శరీరమంతా వ్యాపిస్తుంది. రోగి శరీరంలోకి ఎక్కించిన ఈ రేడియో యాక్టివిటీ ఆరు గంటల వరకు ఉంటుంది. ట్రేసర్ శరీరం అంతా వ్యాపించిన తరువాత స్కానింగ్ మొదలవుతుంది.

రోగి పడుకున్న బల్ల స్కానర్ కింద ముందుకు వెళ్తూ ఉంటుంది. సిటి చేయడానికి ఓ నిమిషం సమయం పడుతుంది. తరువాత పెట్ స్కానింగ్ వైపు రోగి పడుకున్న బల్ల కదులుతుంది. పెట్ స్కానర్‌లో రోగి చుఉట్టూ కొన్ని వందల రేడియేషన్ డిటెక్టర్లు ఉంటాయి. రోగికి ఎక్కించిన రేడియోన్యూక్లైడ్ ఎమిషన్స్ (ఉద్గారం)ని బట్టి ఆయా శరీర భాగాల జీవక్రియల రేటును కొలుస్తారు. ఈ సంకేతాలను 3 డైమెన్షనల్ చిత్రాలుగా తయారుచేస్తుంది కంప్యూటర్. ఇలా ప్రతి కణ జాల పనితీరును నిర్ధారిస్తారు.

ఎలా చేస్తారు?
పెట్ సిటి స్కాన్ ఫలితాలు వ్యాధి నిర్ధారణలో కీలకపాత్ర పోషిస్తాయి. క్యాన్సర్ ఉందా లేదా అన్న విషయమే కాకుండా ఎటువంటి చికిత్సను అందివ్వాలి.. ఎలా డీల్ చేయాలన్న అంశాల్లో స్పష్టమైన అవగాహనను అందిస్తాయి. అంటే వ్యాధి నిర్ధారణలోనే కాకుండా అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతుల్లో సరైనదాన్నిఎంచుకోవడాని, చికిత్స తరువాత పరిస్థితులను అంచనా వేయడానికి, చికిత్స పద్ధతులను మార్చడానికి కూడా ఇది మార్గనిర్దేశనం చేస్తుంది. స్కాన్ చే సేటప్పుడు మెత్తని బల్లపై పడుకోబెడతారు.

ట్యూబు ఆకారంలో ఉండే పెట్ సిటి స్కానర్ వైపు ఆ టేబుల్ నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. స్కాన్ చేసేటప్పుడు కదలకుండా పడుకోవాలి. ఏమాత్రం కదిలినా స్కాన్ సరిగ్గా రాదు. స్కానింగ్ సమయంలో చిన్న శబ్దం వస్తూ ఉంటుంది. బల్ల ముందుకు కదులుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు చిత్రాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పరీక్షకు 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. అయితే మొత్తం పరీక్ష కోసం 2 నుంచి 3 గంటల వరకు ఇందుకోసం రోగి తన సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.

స్కానింగ్ వేళ ఇలా...

- స్కాన్ చేసే సమయంలో కదలకూడదు. - స్కానింగ్ తరువాత డాక్టర్ చెప్పేవరకు ఏమీ తినకూడదు. తాగకూడదు.

- పరీక్ష అయిపోయిన తరువాత ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న రేడిఫార్మసుటికల్ పదార్థం తొలగిపోతుంది. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు.

- పెట్ స్కాన్ తరువాత ఇత రులను కలవద్దేమో అని అపోహ పడుతుంటారు. కానీ రేడియోధార్మిక పదార్థం ఎంతోసేపు శరీరంలో ఉండదు కాబట్టి ఎటువంటి సమస్యా లేదు. కానీ అదనపు రక్షణ కోసం కొన్ని గంటల పాటు చిన్నారులు, గర్భిణులు దూరంగా మెలగడం మంచింది.

క్యాన్సర్ కాకుండా...
హై డెఫినిషన్ పెట్ స్కాన్ కేవలం క్యాన్సర్ నిర్ధారణలోనే కాదు.. గుండె, నాడీవ్యవస్థలకు సంబంధించిన సమస్యలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మూర్ఛవ్యాధి మూలాలను కనుక్కోవడంలో పెట్‌స్కాన్ సహాయపడుతుంది. మెదడులో ఏ ప్రదేశంలో సమస్య ఉందో కనిపెడుతుంది. అల్జీమర్ వ్యాధి నిర్ధారణలో స్పష్టమైన ఫలితాలను అందిస్తుంది. సాధారణ మతిమరుపుకి, అల్జీమర్స్‌కి తేడా పెట్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు.

గుండెకు సంబంధించిన జీవక్రియను అధ్యయనం చేయడం ద్వారా పెట్ స్కాన్ హృద్రోగాలను నిర్ధారిస్తుంది. ఏయే రక్తనాళాల్లో రక్తప్రసరణ తక్కువగా ఉందో, ధమనులు బ్లాక్ అవడానికి ఏమేమి కారణం అవుతున్నాయో పసిగడుతుంది. అంతేకాదు దెబ్బతిన్న కండర భాగాన్ని, జీవం వున్న కండరాన్ని గుర్తిస్తుంది. మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ ఉన్న రోగులకి, రీవాస్కులరైజేషన్ చేయాల్సిన వాళ్లకి ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది.


యశోద క్యాన్సర్ ఇనిస్టిట్యూట్
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ
హైదరాబాద్ ఫోన్ : 040-2341 4444, 98661 14064

No comments: