Friday, October 1, 2010

చక్కటి ఆరోగ్యానికి రెండు అద్భుత గ్రంథాలు

మన ప్రాచీనగ్రంథాలలో, వేదాలలో ఇమిడి ఉన్న సంప్రదాయక ఆరోగ్య పరిరక్షణ పద్ధతులను వెలికి తీసి వాటిని అందరికీ ఉపయోగపడేలా చేయాలని స్వామి మైత్రేయ సంకల్పించారు. ఆ సంకల్పానికి అక్షర రూపమే ‘ముద్రల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం’, ‘మధుమోహమే మధుమేహం’. మొదటి దానిని ఆయన శిష్యురాలు శ్రీమతి లక్ష్మీమైత్రేయ రాయగా, రెండవ దానిని మరో శిష్యులు శ్రీమతి విజయలక్ష్మీ మైత్రేయ అందించారు.

‘అరచేతిలో ఆరోగ్యం’అనే పుస్తకంలో మన ఆరోగ్యంపై హస్తముద్రలు ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలుపుతూ, మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వాటి ప్రాముఖ్యతను సులభశైలిలో వివరించారు. ప్రతిముద్రనూ ఎలా వేయాలో రేఖాచిత్రాలు, ఫొటోల రూపంలో చూపించడమేగాక ఏ రకమైన రుగ్మతకు ఏ ముద్ర వేయాలో చెబుతూ దానికి తీసుకోవలసిన జాగ్రత్తలతో సహా వివరించే ఈ పుస్తకం అవశ్య పఠనీయం.

లేచింది మొదలు పడుకునేవరకు కాలంతో పోటీ, రోజంతా క్షణం తీరిక లేని పని ఒత్తిడి. ఫలితంగా వయసుతో పని లేకుండా అనేకమంది స్ర్తీలు, పురుషులు మధుమేహవ్యాధికి గురవుతున్నారు. అనేక రకాల భావోద్వేగాలు, మానసిక ఒత్తిడి, ఇతర శారీరక, మానసిక అనారోగ్యాలు కూడా మధుమేహానికి దారితీస్తున్నాయి. దానివల్ల కలిగే బాధలు సామాన్యమైనవి కావు.

ఒకసారి మధుమేహవ్యాధి వచ్చిందా అంటే ఇక జీవితాంతం ఔషధ సేవ తప్పదని వైద్యులు చెబుతున్నారు. అయితే శారీరక వ్యాయామం, ఆసనాలు, షట్కర్మ క్రియలు, ప్రాణాయామాలు, ముద్రలు తదితరాలను ఆచరించడం ద్వారా మధుమేహ వ్యాధిని మన దరి చేరకుండా చేయవచ్చునని, ఒకవేళ వచ్చినా సులభంగా నివారించుకోవచ్చునన్నది ‘మధుమోహమే మధుమేహం’ పుస్తకసారాంశం. ఇందులో మన జీవనశైలి, ఆహారవిధానాలు, ఆరోగ్యసూత్రాలను పాటించడం ద్వారా ఆ వ్యాధిని ఎలా నివారించుకోవచ్చో చక్కగా వివరించారు. ఆరోగ్యవంతమైన జీవనానికి మార్గదర్శనం చేసే ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండదగ్గది.

2 comments:

Unknown said...

Please change the background image,and please change the font colors

Chinna said...

where can i get these book ?