Sunday, July 18, 2010

శ్వాసను బట్టే ఆయుష్షు, యోగా ఏకైక మార్గం..

పార్కు కనిపిస్తే యొగా క్లాస్ పెట్టేస్తాడు

తెల్లటి దుస్తుల్లో యోగా నేర్పిస్తున్న ఈ పెద్దాయన పేరు ధరణీప్రగడ ప్రకాష్‌రావు. ఉద్యోగం మానేసి పదిహేనేళ్ల నుంచి రోజూ ఇదే పని. ఎక్కడ పచ్చటి పార్కు కనిపిస్తే అక్కడ యోగా క్లాసు పెట్టేస్తాడు. అందరూ బుద్ధిగా యోగా చేస్తుంటే.. చూస్తూ మురిసిపోతాడు. అరవై వేల మందికి యోగా నేర్పించిన ఈ పెద్దాయనను చూసి అరవై ఏళ్ల ఆయన వయసే చిన్నబోయింది..

'సార్, నా కడుపులో ఒక్కటే మంట...'
'మీరు పిజ్జా తింటారా..?'
'తినని రోజే లేదు. బాగా లాగిస్తా.. '
'గోడలకు సినిమా వాల్‌పోస్టర్లను దేంతో అతికిస్తారో తెలుసా..?'
'మైదాపిండితో..'
'పిజ్జాను కూడా ఆ మైదాతోనే చేస్తారు. అందుకే మీ కడుపులో సినిమా ఆడేస్తుంటుంది..'
'అమ్మో, ఈ రోజు నుంచే పిజ్జా మానేస్తా!'

*** 'సార్, నన్ను గ్యాస్ట్రిక్ సమస్య వేధిస్తోంది..?'
'బిర్యానీ తింటూ, కూల్‌డ్రింక్‌తాగే అలవాటుందా..'
'కూల్‌డ్రింక్ లేనిదే నోట్లోకి ముద్ద దిగదు సార్..'
'బాగుంది. ఓ రోజు నువ్వు తాగే కూల్ డ్రింక్‌ను మీ పెరట్లోని మొక్కలకు పిచికారి చెయ్యి. వారం తర్వాత చూడు. ఒక్క పురుగుపడితే ఒట్టు..' 'అంటే, కూల్‌డ్రింక్ ప్రాణుల్ని చంపేంత ప్రమాదకరమా.. వామ్మో, ఇక నుంచి తాగనే తాగను..'

*** మీకు జబ్బు వస్తే ఎంత పెద్ద డాక్టర్ దగ్గరకైనా వెళ్లండి. గురి కుదిరే మందులు రాస్తే రాస్తాడు కానీ, మీకు జబ్బు ఎందుకు వచ్చిందో ఇంత సులువుగా చెప్పి.. మీ తప్పును అక్కడికక్కడే మీతోనే ఒప్పించి మాన్పించలేడు. అరవై ఏళ్ల ప్రకాష్‌రావు మాత్రం డాక్టరు కాకపోయినా మీ వ్యసనాలను మీ ద్వారానే మీకు చూపించి సిగ్గుపడేలా చేస్తారు.

మారుమాట మాట్లాడకుండా ఆ క్షణం నుంచే మాన్పించేలా చేస్తారు. అదే ఈ యోగా మాస్టారు ప్రత్యేకత. లేకపోతే అరవై వేలమంది గుండెల్లో యోగముద్ర ఎలా వేయగలిగేవాడు..? రిటైరయ్యాక ఇంట్లో కాలక్షేపం చేయకుండా హైదరాబాద్‌లోని పార్కులన్నీ తిరుగుతూ ఆరోగ్యానికి సింహాసనాలు వేస్తున్నారు. పదిహేనేళ్ల నుంచి యోగా నేర్పిస్తూ.. ఆరోగ్య సైన్యాన్ని తయారు చేస్తున్నారు.

-యోగా ఎందుకు మంచిదంటే..
- జిమ్‌లో వ్యాయామం చేస్తే 13 నుంచి 14 జాయింట్లు కదులుతాయి.
-వాకింగ్ చేస్తే 27 జాయింట్లు కదులుతాయి.
-స్విమ్మింగ్ చేస్తే 100 జాయింట్లు కదులుతాయి.
-యోగా చేస్తే మాత్రం శరీరంలోని 360 జాయింట్లూ కదులుతాయి. అంతే కాదు. అస్థిరంగా ఉన్న మనసును స్థిరంగా ఒకేచోట బంధించడం యోగాతోనే సాధ్యం.

"ఇప్పటికి 60 వేల మందికి రూపాయి ఫీజు తీసుకోకుండా యోగా నేర్పించాం. ఆరోగ్య చైతన్యం తీసుకొచ్చా. వాళ్లందరి అభిమానాన్ని సంపాదించుకున్నాం''

మన్యం రోగాల నుంచి..
విశాఖపట్టణం నుంచి అరకు దాటిన తర్వాత మాచ్‌ఖండ్ జలపాతం వస్తుంది. అక్కడే ప్రకాష్‌రావు నాన్న రామశర్మ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌కు లీడర్‌గా ఉండేవారు. మన్యంలో తాగే నీరంతా కలుషితం. కుటుంబమంతా జబ్బులు పట్టుకున్నాయి. చేసేది లేక హైదరాబాద్ మకాం మార్చేశారు. ప్రకాష్‌రావు ఇక్కడే సైక్లో స్టయిల్ మెకానిక్‌గా 15 ఏళ్లు పనిచేశారు.

ఇద్దరు పిల్లలను బాగా చదివించారు. అనుకోకుండా ఓ రోజు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఎవరో చెబితే యోగాలో చేరి, ఆరోగ్యం బాగు చేసుకున్నారు. ఆ అనుభవమే వేలమందికి యోగాపాఠాలు బోధించేలా చేస్తోంది ఆయన్ని. ఆధునిక జీవనశైలిలో ఒత్తిళ్లను అధిగమించలేక నలిగిపోతున్న వారికి ఆయన యోగ ్దదిక్కుగా మారాడు. "మనకు 4,500 రోగాలు వస్తున్నాయి. వీటిలో మానసిక ఒత్తిళ్ల వల్ల వస్తున్నవే ఎక్కువ. ఒత్తిడిని తగ్గించే విశ్రాంతి లేదు.

ఉరుకులు, పరుగులు. అనవసర ఉద్వేగాలు, ఆందోళనలు. మనసు ఒక చోట, శరీరం ఒక చోట. అందుకే బ్రెయిన్ రిలేటెడ్ జబ్బులొస్తున్నాయి..' అంటారాయన. ఆస్పత్రి అవసరం లేకుండా వీటిని యోగాతోనే బాగు చేసుకోవచ్చు. అందుకే ఆయన యోగాను సాధ్యమైనంత మందికి ఉచితంగా నేర్పించాలనుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా భారతీయ యోగా సంస్థాన్‌ను నెలకొల్పిన ప్రకాష్‌లాల్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు ప్రకాష్‌రావు.

"మా సంస్థ తరఫున హైదరాబాద్‌లో 50 యోగా సెంటర్లు నడుస్తున్నాయి. రోజూ తెల్లవారుజామునే అన్ని పార్కులు యోగాతో కళకళలాడాలి. అదే నా ఆశయం. ఇప్పటికి 60 వేల మందికి రూపాయి ఫీజు తీసుకోకుండా యోగా నేర్పించాం. ఆరోగ్య చైతన్యం తీసుకొచ్చా. వాళ్లందరి అభిమానాన్ని సంపాదించుకున్నాం. గొప్ప దానాలలో ఆరోగ్యదానం కూడా ఒకటి.

మా ఇద్దరు పిల్లలు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఇంట్లో ఉండి నేనేం చేయాలి..? అందుకే యోగానే జీవితమైపోయింది...'' అంటున్న ప్రకాష్‌రావు తమ దగ్గర యోగా నేర్చుకున్నవాళ్లనే టీచర్లుగా నియమిస్తున్నారు. ఇలా 150 మంది యోగా టీచర్లను తయారు చేశారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని పార్కుల్లో క్లాసులు ఏర్పాటు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నా ఆయన రవ్వంత కూడా అలసిపోరు. ద్విచక్ర వాహనంలోనే నగరమంతా కలియదిరుగుతూ ఏ పార్కు అనుకూలంగా ఉంటే అక్కడ యోగా క్లాసులకు ప్రాణం పోస్తున్నారు.

శ్వాసను బట్టే ఆయుష్షు
- కుక్క నిమిషానికి 30 సార్లు గాలిని తీసుకొని వదులుతుంది. అందుకే 15 ఏళ్లే బతుకుతుంది.
-తాబేలు నిమిషానికి 5 నుంచి 6 సార్లే గాలిని తీసుకొని వదులుతుంది. అందుకే 400 ఏళ్లు జీవిస్తుంది.
-మనిషి యోగా చేస్తే నిమిషానికి 12 సార్లు గాలిని తీసుకొని వదిలేస్థితికి వస్తాడు. అప్పుడు నూరేళ్లు నిండు ఆరోగ్యంతో బతకగలుగుతాడు.

వీటికి భలే డిమాండ్
- ఒత్తిడితోనే హైపర్‌టెన్షన్ వస్తుంది. మధుమేహం, బీపీ వస్తాయి. ఇలాంటి వారు నావాసనం వేస్తే మధుమేహం, బీపీ, థైరాయిడ్ సమస్యలు వేగంగా తగ్గిపోతాయి.
- ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు వజ్రాసనం వేస్తే వెన్నెముక వజ్రంలా తయారవుతుంది. వెన్నునొప్పులు దరిచేరవు. ఇన్సులిన్‌ను కంట్రోల్ చేస్తుంది.
-అధిక బరువుతో బాధపడేవారికి హస్తపాద ఉత్థాన ఆసనం మంచిది. బొజ్జ, ఒబేసిటీ తగ్గుతాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

యోగా ఏకైక మార్గం..
ఆధునిక కాలంలో ఒత్తిడి తెచ్చే అనర్థాలు అన్నీఇన్ని కావు. సకల రోగాలకు ఒత్తిడే కారణం. "ఇప్పుడు జనం మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేకే యోగాను ఆశ్రయిస్తున్నారు. ప్రాణాయామంలో ప్రాణశక్తి ఉంది. సాధారణ పరిస్థితుల్లో శ్వాస తీసుకున్నప్పుడు కంటే ప్రాణాయామం చేసినపుడు 10 రెట్లు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. ప్రతి కణానికి ఆక్సిజన్ అందినపుడే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

శరీరం గట్టిగా తయారవుతుంది..'' అన్నారు. "శ్వాసను నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా వదిలితేనే ఆయుష్షు పెరుగుతుంది. పవర్ యోగా అంటూ పతంజలి యోగశాస్త్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కొందరు. మేము మాత్రం శాస్త్రీయ పద్ధతుల్లోనే బోధిస్తున్నాం. ఏ కాలానికైనా యోగా ఒక్కటే. యోగాను పదిమందికి ఉచితంగా పంచాలనుకొనేవారు ముందుకొస్తే మా సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఆరోగ్యవంతమైన సమాజమే మా లక్ష్యం..'' అంటున్నారు ప్రకాష్‌రావు.

No comments: