Tuesday, December 14, 2010

'జిమ్ జిమ్మం' టోంది యువత


సమయం
ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య
నగరాల్లో ఎక్కడ చూసినా ఎవరో ఒకరు 'వాకింగ్' లేదా 'జాగింగ్' చేస్తూ కనిపిస్తారు. కొందరు 'వ్యాయామాలు', మరికొందరు 'యోగాసనాలు' వేస్తూ కనిపిస్తుంటారు. కొందరు 'జిమ్' నుంచి, మరి కొంతమంది 'ఏరోబిక్స్' సెంటర్ల నుంచి బయటకొస్తూ కనిపిస్తుంటారు. ఇంకా జాగ్రత్తగా చూస్తే బయటకొచ్చే టైమ్ లేక బాల్కనీలోనో వరండాలో ఏదో ఒక వ్యాయామ భంగిమలో కనిపిస్తుంటారు.

సమయం
సాయంత్రం నాలుగున్నర గంటల తరవాత- సేమ్ సీన్ రిపీట్.
ఏదో ఒక నగరంలో కాదు దేశంలోని అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ఎవరికీ తప్పని 'ఫిట్‌నెస్ మంత్ర' ఇది. ఆడ, మగ, చిన్నా పెద్దా తేడా లేకుండా ఫిట్‌నెస్ కోసం కొందరు 'పరుగులు' పెడుతుంటే, కొందరు 'బరువులు' మోస్తున్నారు. కొంతమంది 'ఆడు'తుంటే, కొంతమంది 'ధ్యానం'లో మునిగిపోతున్నారు. ఒక దశాబ్దం క్రితం మన ఫిట్‌నెస్ పరిశ్రమ పరిధి చాలా తక్కువ. ఫిట్‌నెస్ పట్ల మన వాళ్ల ఆలోచనా విధానం 'మోజు' నుంచి 'అవగాహన'కు చేరుకోవడమే ఈ రంగంలో సంభవించిన పెద్ద మార్పు అనుకోవచ్చు. ఆ మార్పే భారత ఫిట్‌నెస్ పరిశ్రమను విదేశీ కంపెనీలు సైతం కోట్ల పెట్టుబడులతో పరుగెత్తుకొచ్చే విస్తృత పరిశ్రమగా రూపొందించింది. ఆ 'పరిశ్రమ' గురించే ఈ వారం కవర్‌స్టోరీ.


మన దేశ యువత ఇప్పుడు ఫిట్‌నెస్ బాట పడుతోంది. ఆ బాటే అవకాశంగా విదేశీ ఫిట్‌నెస్ కంపెనీలు మన దేశంలో ప్రవేశిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ఇండియాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ రెండేళ్లలో వెయ్యికి పైగా 'వ్యాయామ కేంద్రాలు' ఏర్పాటు చేశాయంటే వాటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఫిట్‌నెస్ ఇండస్ట్రీ టర్నోవర్ ఏటా 40 శాతం పెరుగుతూ వస్తోంది. ఈ యేడాది అంచనా 2900 కోట్లకు పైమాటే! ఇక్కడ కనిపిస్తున్న ప్రధాన విదేశీ కంపెనీలు 'స్నాప్ ఫిట్‌నెస్ క్లబ్', 'గోల్డ్స్ జిమ్', 'ఫిట్‌నెస్ ఫస్ట్', '24 హవర్స్ ఫిట్‌నెస్', 'ఎనీటైమ్ ఫిట్‌నెస్', 'రీబాక్ ఫిట్‌నెస్ క్లబ్స్'. మొదటి మూడు టాప్‌టెన్ లిస్టులో ఉన్న కంపెనీలు. ఈ కంపెనీలకు 'ఫిట్‌నెస్ మ్యాగజైన్స్' కూడా మంచి రేటింగ్ ఇవ్వడంతో విస్తరణకు మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జీవనశైలిలో ఫిట్‌నెస్ కూడా ఒక భాగం అనే అవగాహన పెరుగుతుండడంతో జిమ్ సెంటర్‌లు నడుపుతున్న కంపెనీలు 'ఎనీటైమ్ జిమ్'లు, 'ఏసీ జిమ్'లంటూ కొత్త కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టాయి.

దేశవ్యాప్తంగా...

అమెరికాకు చెందిన 'స్నాప్ ఫిట్‌నెస్ క్లబ్' పదకొండు మిలియన్ డాలర్ల పెట్టుబడితో రెండేళ్ల క్రితం మనదేశంలో మొత్తం 250 వ్యాయామకేంద్రాలను ప్రారంభించాలనే ఆలోచనతో వచ్చింది. ఇప్పటికి యాభై ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, హైద్రాబాద్, పూణె, నాగపూర్, జలంధర్, చంఢీగఢ్, అమృతసర్, లూధియానాలలో ఈ కంపెనీకి బ్రాంచీలు ఉన్నాయి. ఈ కంపెనీ చెప్పేమాట ఏమిటంటే... 'యూరప్, అమెరికా దేశాల కంటే ఇక్కడే వ్యాయామం పట్ల ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారని, కనుక తాము తప్పకుండా వ్యాపారంలో విజయవంతం అవుతామని.'
అంతేకాదు వీళ్లు ప్రారంభించిన 'ఎనీటైమ్ ఫిట్‌నెస్ క్లబ్'లకు కూడా బాగానే ఆదరణ ఉంది. వివిధ షిఫ్టుల్లో పనిచేసే కార్పొరేట్ ఉద్యోగుల సౌకర్యార్థమే ఈ ఎనీ టైమ్ జిమ్‌లు. యు.ఎస్.కే చెందిన మరో ఫిట్‌నెస్ కంపెనీ 'గోల్డ్స్ జిమ్'. ఒక్క ముంబయిలోనే ఆ కంపెనీకి నలభై ఐదు వ్యాయామకేంద్రాలున్నాయి. 2002లో భారతదేశంలో ప్రవేశించి ప్రధాన నగరాలన్నింటిలోకి విస్తరించిన ఈ కంపెనీ రెండు నెలలకు ఒక జిమ్ చొప్పున బ్రాంచీలను పెంచుకుంటూ పోతోంది. వీటి తర్వాత స్నాప్ ఫిట్‌నెస్ కంపెనీ, 24 అవర్స్ ఫిట్‌నెస్ కంపెనీ ఇలా ఒక్కొక్కటీ మన దేశానికి వచ్చి నిలదొక్కుకున్నాయి.

ముంబయి, బెంగళూరులలో బ్రాంచీలను తెరిచిన మరో విదేశీ కంపెనీ 'ఫిట్‌నెస్ ఫస్ట్'. ఇది బ్రిటిష్ కంపెనీ. 'భారతదేశంలో అర్బన్ ప్రజల జీవన ప్రమాణస్థాయి పెరిగిందని, ఫిట్‌నెస్ కోసం కొంత మొత్తం వెచ్చించేందుకు వారు ముందుకొస్తున్నారని' అభిప్రాయ పడుతున్న ఈ కంపెనీ 2012 నాటికి దేశంలో 125 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సమాయత్తం అవుతోంది. అప్పటి వరకు మరో 15 కేంద్రాలను తెరిచి మెంబర్‌షిప్‌ను ఇంకా పెంచుకునే యోచనలో ఉంది.

అత్యాధునిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి నిర్వహణతో ఇప్పటికే బాగా పాతుకుపోయిన ఈ జిమ్‌లలో నెలకు సగటున ఆరు వందల చొప్పున మెంబర్‌షిప్ పెరుగుతోంది. సంవత్సర సభ్యత్వం కోసం సగటున రూ. 14,000 వరకు చార్జ్ చేస్తున్నారు. నెలకయితే 1500 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఈ ఫిట్‌నెస్ సెంటర్లలో యోగా,ఏరోబిక్స్, ఇండోర్ సైక్లింగ్, పర్సనల్ ట్రెయినింగ్ (విదేశీ వ్యక్తిగత శిక్షకులతో), స్విమ్మింగ్‌పూల్స్, షవరింగ్ ఏరియాస్, డీవీడి లైబ్రరీ తదితర సదుపాయాలు ఉంటాయి.

దేశీయ కంపెనీ టాల్‌వాకర్


మన దేశం విషయానికొస్తే అతిపెద్ద జిమ్ నెట్‌వర్క్ ఉన్న సంస్థ 'టాల్‌వాకర్'. ఉదయపూర్, లూధియానా, నెరుల్(నవీ ముంబయి), హిమాయత్‌నగర్(హైద్రాబాద్), బెంగళూరు, హుబ్లీ, బెల్గాం, ఔరంగాబాద్ మొదలైన చోట్ల దీనికి వ్యాయామ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వ్యక్తిగత శిక్షకుడు, డైటీషియన్, ఫిజియోథెరపిస్టు తప్పకుండా ఉంటారు. వారికి జీతాలు మొదలు మిషనరీ కొనుగోలు వరకు అన్నీ కలుపుకుని ఏడాదికి అన్ని సెంటర్ల నిర్వహణ వ్యయం సుమారు పదహారు కోట్ల రూపాయలు. అయినా 76 కేంద్రాల్లో సుమారు లక్ష మంది మెంబర్‌షిప్‌తో నడుస్తున్న ఈ కంపెనీకి వచ్చే లాభాలతో పోల్చితే ఆ 'ఖర్చు' చాలా తక్కువే.

ప్యాకేజీ ఆఫర్లు

విదేశీ ఫిట్‌నెస్ క్లబ్‌లు మన దేశంలో ప్రవేశించాక ఫిట్‌నెస్ రంగం స్థాయిలో చాలా మార్పులే వచ్చాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, అంతర్జాతీయ స్థాయి నిర్వహణను అన్ని కంపెనీలు అనుసరిస్తున్నాయి. ప్రత్యేక 'ప్యాకేజీలు', పండగలకు 'ఆఫర్లు' ఎక్కువయ్యాయి. దాంతో పాటు మెరుగైన మెషినరీ కోసం ఎంత సొమ్మయినా ఖర్చు చేసేలా స్థానిక కంపెనీలు తమ పద్ధతులను మార్చుకున్నాయి.
ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది మెషినరీ మార్కెట్ గురించి. భారత్‌లో ఉన్న విదేశీ కంపెనీల ఎక్విప్‌మెంట్ అంతా దిగుమతి చేసుకున్నది కావడం వల్ల మన వాళ్లు కూడా అటుగా దృష్టి సారించారు. పేరున్న ఏ జిమ్‌ను చూసినా అంతా విదేశీ టెక్నాలజీయే. ఇండియా వస్తువుల మీద నమ్మకం లేక కాదుగాని విదేశీ మెషినరీ మీద మోజు పెరుగుతుండడం వల్లే అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల నుంచి మెషనరీ దిగుమతి పెరిగిపోతోంది. సెలబ్రిటీ జిమ్‌లు, హోమ్ జిమ్‌లు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. దాంతో మెషినరీ కొనుగోలు విశేష స్థాయిలో ఉంది. మన దేశంలో ఫిట్‌నెస్ మెషినరీ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? 12.5 బిలియన్ రూపాయలు. అది రెండేళ్ల కిందటి మాట. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం మరో రెండేళ్లలో అది ఐదింతలు పెరగనుంది.

పర్సనల్ ట్రెయినర్ ఉంటే బెటర్

అదే క్రమంలో వ్యక్తిగత శిక్షకులను నియమించుకునే పద్ధతి కూడా పెరిగింది. మూడునాలుగేళ్ల క్రితం కంటే ఇప్పుడు టీనేజ్ మొదలు యువత, సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ వ్యక్తిగత శిక్షకులను ఆశ్రయించడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, కలకత్తా, బెంగళూరులలో జిమ్‌కు వెళ్లేవారిలో దాదాపు సగం మంది వ్యక్తిగత శిక్షకులను నియమించుకుంటున్నారు. వారికి ఒక్కో సెషన్‌కు 250-500 వరకు ఫీజు చెల్లించాల్సి ఉన్నా వెనకాడడం లేదు. అంటే నెలకు ఐదు నుంచి ఇరవై వేల రూపాయలు. మంచి శరీరాకృతి కోసం యువత, అధిక బరువు వంటి సమస్యలతో మధ్యవయస్కులు, అనారోగ్య నివారణ కోసం రిటైరయిన ఉద్యోగులు... ఇలా ఎవరి కోణం వారిదే అయినా అందరి కామన్ ఎజెండా మాత్రం ఫిట్‌నెస్సే. షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్, ఐశ్వర్యారాయ్, కరీనాకపూర్ వంటి సెలిబ్రిటీలకు వ్యక్తిగత శిక్షకులుగా పనిచేసే వారికి ఒక్కో సెషనుకు పది వేల రూపాయలు చెల్లిస్తారని చెప్పుకుంటారు.

సర్టిఫికేట్ కోర్సులు

విదేశీ కంపెనీల రాక తర్వాత ఈ కేంద్రాల నిర్వహణ, ఫీజులు ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. అయితే ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో ఉపాధిని పెంచేందుకు ఇవి దోహదపడుతున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాయామ కేంద్రాలు వ్యక్తిగత శిక్షకులతో పాటు థెరపిస్టులు, డైటీషియన్‌లు ఇలా అనేకమందిని నియమించుకుంటున్నాయి. గోల్డ్స్ జిమ్ ఏకంగా 'జి.జి.యు.' (గోల్డ్స్ జిమ్ యూనివర్శిటీ) అని ఒక విశ్యవిద్యాలయాన్నే నడుపుతోంది. అందులో ఫిట్‌నెస్ రంగానికి సంబంధించిన ఏ సర్టిఫికెట్ కోర్సు చేసినా వారికి ఉపాధి ఖాయం. అది ఎంతోమందికి ఉద్యోగావకాశంగా కనిపిస్తోంది. గోల్డ్స్ జిమ్మే కాదు ఇప్పుడు దేశంలో పేరు పొందిన ఫిట్‌నెస్ కంపెనీలన్నీ 'ఫిట్‌నెస్ ఎడ్యుకేషన్ ఇన్సిట్యూట్'లుగా కూడా వ్యవహరిస్తున్నాయి.

మహిళలను లక్ష్యంగా చేసుకుని రీబాక్ కంపెనీ కూడా ఒక సర్టిఫికేట్ కోర్సును నేర్పిస్తోంది. 'నైక్ ఏరోబిక్స్' పేరుతో నడిచే ఆ కోర్సులో ఈ మధ్యే విద్యార్థుల సంఖ్య పెరగుతోందట. ఈ ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లను కూడా మరిన్ని కేంద్రాలకు విస్తరించే యోచనలో ఉంది రీబాక్. చాలా నగరాల్లో ఇప్పటికీ (ఏరోబిక్స్ మినహా) మహిళా శిక్షకులు కొన్ని జిమ్ సెంటర్లలో మాత్రమే ఉన్నారు. గోల్డ్స్ జిమ్ కంపెనీకి కూడా ఇండియాలో ఇరవై మంది మాత్రమే మహిళా శిక్షకులు ఉన్నారట.

అన్ని కంపెనీల చూపూ ఈ రంగం మీదే

ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో వ్యాపారావకాశాలు పెరుగుతుండడం గమనించి ఇతర రంగాలకు చెందిన కంపెనీలు కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. అందుకు ఉదాహరణ ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చిన 'ఎనీటైమ్ ఫిట్‌నెస్ క్లబ్'. సుమారు పదిహేను మిలియన్ డాలర్ల పెట్టుబడితో మన దేశంలో అడుగు పెట్టిందీ కంపెనీ. కంప్యూటర్లు తయారు చేసే టీజీఎస్ కంపెనీయే ఈ పేరుతో ఫిట్‌నెస్ రంగంలోకి ప్రవేశించింది. రీబాక్ కూడా అంతే! ప్రధానంగా క్రీడావస్తువులను తయారు చేసే కంపెనీ అది. ఏరోబిక్, జిమ్ సెంటర్లను నిర్వహిస్తుండమే కాకుండా ఇటీవల మెషినరీ తయారీని కూడా మొదలు పెట్టింది అది. రీబాక్ కంపెనీ చెప్తున్న లెక్కల ప్రకారం వాళ్లకు డెబ్బయి శాతం ఆదాయం ఫిట్‌నెస్ సెంటర్ల వల్లే వస్తోందట మిషనరీ అమ్మకాలు కలుపుకుని.

వీడియో ఫిట్‌నెస్

ఈ రంగంలో మరో కొత్త ట్రెండ్ డీవీడీ వర్క్ అవుట్స్. బిజీగా ఉండేవాళ్లకి, లేజీగా ఉండేవాళ్లకి ఫిట్‌నెస్ డీవీడీలు ఎంతగానో ఉపకరిస్తాయని ప్రకటనులు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితమే శిల్పాశెట్టి విడుదల చేసిన యోగా వీడియోలు సంచలనం సృష్టించాయి. ఆ తరవాత బిపాషా బసు, కరీనాకపూర్, షెర్లిన్‌చోప్రా, లారాదత్తాలు ఆ జాబితాలో చేరారు. వీళ్లందరి వర్క్ అవుట్ డీవీడీలు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కథానాయికలే కాదు హీరోలూ ఇదే దారిలో ఉన్నారు. జాన్ అబ్రహాం ఇప్పటికే ఒక 'వర్క్ అవుట్' చేయగా, హృతిక్‌రోషన్, సల్మాన్‌ఖాన్‌ల డీవీడీలు త్వరలోనే విడుదల కానున్నాయి. కత్రినా, ప్రియాంక చోప్రాలు కూడా అదే పనిలో ఉన్నారు. అందుకోసం ఈ స్టార్లంతా కోట్లలో పారితోషికం పుచ్చుకున్నట్టు బాలీవుడ్‌లో ప్రచారం జరగుతోంది. బాలీవుడ్ వర్క్ అవుట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 'బాలీవుడ్', 'బాంబే డ్రీమ్స్', 'మసాలా బాంగ్రా', 'బాలీవుడ్ గ్రూవ్స్', 'ఇండియన్ డాన్స్ ఏరోబిక్స్', 'ఇండియన్ ఫోక్ డాన్స్' డీవీడీలు అమెరికా, యూరోప్ దేశాలలో నీరాజనాలు అందుకుంటున్నాయి.

యోగా...కాస్త వెరైటీగా

కొంచెం వెరైటీ కోరుకునే వారు మనసును, మెదడును అదుపులో ఉంచే యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక వ్యాయామానికి కూడా ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్, అక్షయ్‌కుమార్, శిల్పాశెట్టి, దీపికా పదుకొనె, నేహా ధూపియా వంటి చాలామంది సెలబ్రిటీలు జిమ్ మానేసి యోగాసనాల వెంటపడ్డారు. ఆధునిక మానవుడు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మానసిక ఒత్తిడితో ఉంటున్నాడు కాబట్టి 'హౌ వుయ్ ఫీల్, నాట్ హౌ వుయ్ లుక్' అనేది కొత్త నినాదంగా మారుతోంది. ఆఫీసుల్లో, ఇళ్లల్లో పనులు చేసి శారీరకంగా అలిసిపోతున్న వాళ్లకి మళ్లీ జిమ్‌లో మిషనరీ వ్యాయామం చేస్తే అలసటే తప్ప శరీరానికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందనేది కొంతమంది యోగా గురువుల ప్రశ్న. యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక వ్యాయామాల ద్వారా శరీరానికి కావల్సిన ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్తున్నారు వాళ్లు. అయితే ఏ పరికరాలు అవసరం లేని యోగాను కూడా ఎవరూ చవకగా నేర్పించడానికి సిద్ధంగా లేరు. యోగా ఇష్టపడే వాళ్ల కోసం చాలా కంపెనీలు యోగా గురువులను అధిక మొత్తం చెల్లించి తమ ఫిట్‌నెస్ క్లబ్బులలో నియమించుకుంటున్నాయి. ఆకర్షణీయమైన జీతాలు ఊరిస్తుండడంతో ఎంతోమంది యోగా గురువులు కమర్షియల్ కెరీర్‌కు పునాదులు వేసుకుంటున్నారు.

అన్నీ ఫిట్‌నెస్ లోకే!

సగటు మనిషి 'బాడీ బిల్డర్'గా కండలు చూసుకుని మురిసిపోయే స్థాయి ఎప్పుడో దాటిపోయింది. సినిమాల ప్రభావంతోనే జిమ్ యావ మొదలైనప్పటికీ అది ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరూ గుర్తించారు. ఈ యేడాది వ్యాయామ కేంద్రాలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఫిట్‌నెస్ సెంటర్లు నిర్వహిస్తున్న వివిధ కంపెనీలు ప్రకటించాయి. ప్రజల్లో వస్తున్న అవగాహనకు అనుగుణంగా వారిలో ఇంకా ఆసక్తిని పెంచి లాభాలు గడించేందుకు వ్యాయామాల్లో కూడా కొత్త కొత్త పద్ధతులు సృష్టిస్తున్నాయి పలు కంపెనీలు. అందుకోసం డాన్సులు, ఏరోబిక్స్‌లే కాకుండా 'స్పా' యోగాలను కూడా హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌లో కలిపేశారు. అందుకే యోగా గురువులకు, కొరియోగ్రాఫర్లకు ఫిట్‌నెస్ సెంటర్లు నడిపే కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.
ఫిట్‌నెస్ కోసం చేసే వ్యాయామం అయినా సరదాగా, ఆడుతూ పాడుతూ చేసేలా ఉండాలనేదే ఇప్పుడున్న కొత్త నియమం. అందులో భాగంగానే జాజ్, సల్సా, రుంబా...ఇలా కొన్ని ప్రత్యేక డాన్సులు కూడా ఫిట్‌నెస్‌లో కలిసిపోయాయి. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా డాన్సు నేర్చుకుంటున్న వారితో శిక్షణా సంస్థలు నిండిపోతున్నాయి.

ఒళ్లు జిమ్మనాల్సిందే

భారతీయులు ఇప్పుడు 'సిక్స్‌ప్యాక్', 'ఎయిట్ ప్యాక్'లకు షేకవడం లేదు కాని 'ఫ్యామిలీ ప్యాక్' నుంచి దూరంగా ఉంటూ ఫిట్‌గా ఉండేందుకు మాత్రం ఆరాటపడుతున్నారు. ఒబేసిటీ, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతుండడమే అందుకు ప్రధాన కారణం. గతంలో 'ఫిట్‌నెస్' అంటే మరోమాట లేదు జిమ్‌కు పరుగెత్తడం తప్ప. కాని ఇప్పుడు అలా కాదు ఆటలు, డాన్సులు, ఏరోబిక్స్, యోగా కూడా ఫిట్‌నెస్‌ను అందించే ప్రత్యామ్నాయాలుగా మారిపోయాయి. అందుకే నగరాల్లో ఎన్ని జిమ్ సెంటర్లు ఉన్నాయో, అన్ని డాన్సు సెంటర్లు, ఎన్ని ఏరోబిక్స్ సెంటర్లు ఉన్నాయో అన్ని యోగా కేంద్రాలూ దర్శనమిస్తాయి. నగర జీవితంలో ఐదు నిమిషాలు కూడా గట్టిగా నడవలేని పరిస్థితే ఉంది. ఆఫీసుల్లో కూర్చున్నచోటు నుంచి కదలకుండానే పనులు చేయాల్సి రావడం... రాకపోకలకు వాహనాలు ఉపయోగించక తప్పని స్థితి ఉండడంతో ఇంక శరీరాన్ని అన్ని రకాలుగా 'అదుపు'లో ఉంచుకోవాలంటే ఫిట్‌నెస్ కేంద్రాల్ని ఆశ్రయించక తప్పడం లేదు. సహజంగా ఒళ్లొంచే పరిస్థితులు వచ్చేదాకా ఈ ట్రెండ్ కొనసాగక తప్పదు.

హైద్రాబాద్ సంగతేంటి?

హైద్రాబాద్‌లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతున్నకొద్దీ వ్యాయామకేంద్రాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. అందరికీ తెలిసిన గోల్డ్స్ జిమ్, లాటిట్యూడ్స్ ప్రో, ఫిట్‌బజ్, టాల్‌వాకర్, బాడీ అండ్ సోల్, స్నాప్ ఫిట్, దినాజ్ ఫిట్‌నెస్ స్టూడియో వంటివే కాకుండా కొత్తగా పాపులర్ అవుతున్న ఫిట్‌నెస్ వన్, బండాస్ బాడీఫ్లెక్స్ జిమ్, స్లిమ్‌జోన్, ఫిట్‌నెస్ వరల్డ్ జిమ్, పవర్‌పాయింట్ జిమ్... ఇలా లెక్కలేనన్ని వ్యాయామ కేంద్రాలు పట్టుకొస్తున్నాయి. చిన్నా చితకా జిమ్‌లు కలిపి వెయ్యికి పైగా ఉన్నాయి. కొందరిది బిజినెస్ అయితే కొందరికి అది ఉపాధి.
* కార్పొరేట్ జిమ్‌లలో నెల రోజుల మెంబర్‌షిప్ రూ. 5000, ఆరు నెలలకు 12000, సంవత్సరానికి 18000 వరకు ఉంది. అదే స్థానికంగా కొంచెం పేరున్న వాటిలో అయితే నెలకు 1200 రూపాయలు ఉండగా, చిన్న వాటిలో 125-400 మధ్య ఉంది.
* అయితే ఎనభై శాతం మంది రెండు నెలలకు మించి మెంబర్‌షిప్ కొనసాగించడం లేదు. అంటే మధ్యలో మానేసే వాళ్లే ఎక్కువ.
* కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్య బాగానే ఉన్నా డ్రాపవుట్స్‌లో కూడా వాళ్లే ఎక్కువ.
* పెద్దవాళ్లు యోగా, జాగింగ్, వాకింగ్‌లతోనే సరిపెట్టుకుంటున్నారు.
* పూర్తిస్థాయి బాడీబిల్డర్‌గా పోటీల్లో పాల్గొనాలంటే కనీసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఆసక్తి కలవారు అందుకూ వెనకాడడం లేదు.
* 'మిస్టర్ వరల్డ్' పోటీల్లో పాల్గొనాలనే ఆశతో, అది సాధ్యం కాకపోతే వ్యక్తిగత శిక్షకులుగానైనా ఉపాధి పొందవచ్చనే నమ్మకంతో నగర యువత ఫిట్‌నెస్ కెరీర్‌పై ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నారు.
ఇది నాణేనికి ఒకవైపు, మరోవైపు ఫిట్‌నెస్‌పై అత్యాశతో అనర్థాలు కొనితెచ్చుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సినిమా హీరోలనో, మరొకరినో చూసి త్వరగా కండలు పెంచాలనే అత్యాశతో 'డ్రగ్స్' తీసుకుని అనారోగ్యం పాలవుతున్నారు కొందరు. 'నిజం చెప్పాలంటే హైద్రాబాద్‌లో ఆరోగ్యం కోసమే జిమ్‌కు వచ్చే యువకుల సంఖ్య చాలా తక్కువ. ఐదారు నెలల్లోనే బాడీ బిల్డర్‌గా కనిపించాలని, సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలనే కోరికతో ఎక్కువ మంది వస్తుంటారు. విచ్చలవిడిగా ప్రచారంలో ఉన్న ఫిట్‌నెస్ డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. దానివల్ల భవిష్యత్‌లో కలిగే అనర్థాలేమిటో జిమ్ నిర్వాహకులు చెప్పడం లేదు. ఇక్కడ సగానికి పైగా జిమ్‌లు డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే వాటికి వచ్చే ఆదాయంలో డెబ్బయి శాతం డ్రగ్స్ ద్వారానే' అని ఎనిమిది సంవత్సరాల నుంచి 'పవర్‌పాయింట్ జిమ్' నడుపుతున్న అచ్చగొని సతీష్ గౌడ్ అన్నారు.

* బి. మహేందర్

No comments: