Tuesday, December 28, 2010

డిస్క్‌ప్రొలాప్స్‌తో ఎన్ని ఇక్కట్లో...

శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. ఆ మూల స్తంభం దెబ్బ తింటే ఎటూ కదల్లేక నేల మీద వాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. ఒకవేళ ఆ సమస్యలు వస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య చికిత్సలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే శరీరం శాశ్వతంగా మూలనపడే ముప్పు ఏర్పడుతుందంటున్నారు నిపుణులు.

* వెన్ను పలు విభాగాల సమ్మేళనం. వెన్నుముకకు తోడుగా కండరాలు, లిగమెంట్లు, డిస్కులు ఉంటాయి. వెన్నెముక సులభంగా వంగడానికి డిస్కులు, లిగమెంట్లు తోడ్పడతాయి. మెడనుంచి న డుము వరకు ఉండే ఈ వెన్నెముకలో 33 పూసలు ఉంటాయి. వెన్నెముకలోని ప్రతి రెండు పూసలను బంధిస్తూ లిగమెంట్లు ఉంటాయి. పూసల మధ్య రబ్బరు కుదురు లాంటి ఒక పదార్థం ఉంటుంది.

దీనికే డిస్క్ అని పేరు. వెన్నెముక పొడవునా లేదా వెన్నుపాము (స్పైనల్ కార్డ్) ఉంటుంది. దీంట్లోంచి అసంఖ్యాకమైన నరాలు వెళుతుంటాయి. మెడభాగం నుంచి వె ళ్లే నరాలు చేతుల్లోకి వెళతాయి. న డుము నుంచి వెళ్లే నరాలు కాళ్లలోకి వెళతాయి. వీటిలో కొన్ని నరాలు మూత్రకోశం, మలవిసర్జక భాగంతో పాటు లైంగిక భాగాల్లోకీ వెళతాయి. వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు దెబ్బ తినడం శరీరంలోని ఒక పరిణామం.

శరీరంలోని కదలిక లకు ఒక ప్రధాన కేంద్రంగా ఉండడం వల్ల సర్వైకల్, లుంబార్ భాగాల్లోని డిస్క్‌లే ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి. అంటే ఉన్న స్థానం నుంచి పక్కకు జరుగుతాయి ఈ స్థితినే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. శరీరంలో వెన్నుపాము ఒక మూలస్తంభం లాంటిది. దానికి ఇరువైపులా, ఉదరభాగంలోనూ కండరాలు ఉంటాయి. నిరంతరం శరీర శ్రమ చేసివారిలో ఈ కండరాలు బలిష్టంగా ఉంటూ వెన్నుపూసలకు సహాయంగా ఉంటాయి.

ఈ శరీర శ్రమేదీ లే ని వారిలో కండరాలు బలహీనమై శరీర భారమంతా వెన్నుపాము మీదా అలాగే డిస్కుల మీదా పడుతుంది. ఆ ఒత్తిడికి లోనైన డిస్కు తన స్థానం నుంచి పక్కకు జరుగుతుంది. ఈ స్థితినే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఈ స్థితిలో పక్కకు జరిగిన డిస్కు పక్కనున్న నాళాల మీద వాలిపోతుంది. ఆ తరువాత వచ్చే సమస్యల అన్నిటికీ ఇదే మూలం. డిస్కు నాళాల మీద వాలిన వెంటనే నొప్పి రావడం మొదలువుతుంది.

సాధారణంగా డిస్క్ ప్రొలాప్స్ సమస్యలకు గురయ్యే వారిలో ఎక్కువగా వృద్దులే ఉంటారు. అయితే శరీర శ్రమ బాగా తగ్గిపోవడం వల్ల ఇటీవలి కాలంలో యుక్తవయస్కులు కూడా ఈ సమస్యకు లోనవుతున్నారు. డిస్కుల్లో సహజంగానే కొంత ద్రవం ఉంటుంది. డిస్కుల్లో వెన్నుపూసను పట్టి ఉంచే బిగువు ఈ ద్రవం వల్లే కలుగుతుంది.. అయితే వయసు పైబడే కొద్దీ ద్రవం క్రమంగా తగ్గిపోయి డిస్కు మెత్తబడుతుంది. ఆ తరువాత వెన్నుపూసకు ఆధారంగా ఉండలేక డిస్కు తన స్తానం నుంచి కొంత పక్కకు జరిగి నరాల మీద వాలిపోతుంది. వెన్ను నొప్పి కారణాల్లో ఇదీ ఒకటి.

* డిస్కు సమస్యలకు స్థూలకాయం మరో ప్రధాన కారణం. బరువు పెరిగే కొద్దీ డిస్కుల మీద భారం పెరిగి అవి బయటికి అంటే త మ సహజ స్థానం నుంచి పక్కకు జరుగుతాయి.
* పని భారాన్ని అన్ని అవయవాల మీద సమంగా వేయకుండా ఆ ఒత్తిడి అంతా వెన్నెముక మీదే పడేలా చేయడం మరో కారణం.అలాగే శక్తిని మించిన బరువులు ఎత్తడం, ఏ శిక్షణా లేకుండానే హై జంప్, లాంగ్ జంప్, హెవీ వెయిట్ లిఫ్టింగ్‌లు, ఎక్కువ దూరం రన్నింగ్ చేయడం, రోజంతా వంగి పనిచేయడం డిస్కు ప్రొలాప్స్ కు దారి తీసే మరికొన్ని ఇతర కారణాలు. అలాగే వయాగ్రా లాంటి కృత్రిమ ప్రేరకాలు కూడా డిస్కు సమస్యలకు కారణమవుతాయి.

ఇవే కాకుండా ఏదైనా ప్రమాదంలో వెన్నుపూసల మీద బలంగా దెబ్బ తగలడం, మనం ప్రయాణిస్తున్న వాహనాలు గోతుల్లో పడిపోవడం కూడా ఈ సమస్యలను తెచ్చిపెడతాయి. కొందరిలో టిబి ఇన్‌ఫెక్షన్లు కూడా వెన్నుపూసను దెబ్బ తీసే ప్రమాదం ఉంది. పక్కకు జరిగిన డిస్కు నరాల మీద పడిపోయినప్పుడు నొప్పి మాత్రమే కాకుండా కొన్ని సార్లు పక్షవాతం కూడా రావచ్చు.

డిస్క్ దెబ్బతింటే...

మెడ భాగంలో మొదలయ్యే సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యతో మెడతో పాటు చేతి నరాల్లోనూ నొప్పివస్తుంది. నడుము భాగంలోని డిస్కులు పక్కకు జరిగిన వారికి పడుకుని లేదా కూర్చుని ఉంటే ఏమీ అనిపించదు. కానీ, లేచి కొద్ది దూరం నడవగానే వెన్నునొప్పి మొదలవుతుంది. కాళ్లల్లో నొప్పితో పాటు నరం ఒత్తిడికి గురవుతున్న చోట తిమ్మిరి వస్తుంది. నడకలో ఇబ్బందులు మొదలవుతాయి ఈ స్థితినే సయాటికా అంటారు.

చికిత్సలేమిటి?

ఎంఆర్ఐ పరీక్షలోనే దాదాపు 50 మందిలోని డిస్క్ ప్రొలాప్స్ సమస్య కనిపిస్తుంది. నిజానికి డిస్క్ ప్రొలాప్స్‌తోనే సమస్య కాదు. ప్రొలాప్స్ తరువాత నొప్పి వస్తేనే దాన్ని సమస్యగా భావించాలి. నొప్పి లేనప్పుడు పక్కకు జరిగిన డిస్కులు వాటికవే తిరిగి తమ సహజ స్థానానికి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి 90 శాతం డిస్కు సమస్యలు మందులతోనే నయమవుతాయి.

మిగతా ఆ 10 శాతం మందికే శస్త్ర చికిత్స అవసరమవుతుంది. కాళ్లల్లో బలహీనతగానీ, తిమ్మిరిగానీ లేకుండా కే వలం నొప్పి మాత్రమే ఉంటే మందులు, ఫిజియోథెరపీతో సమస్య ముగిసిపోతుంది. కొందరిలో మందులు వాడుతున్నా తిమ్మిర్లతో పాటు కాళ్లు లేదా చేతులు బలహీనపడుతూ నొప్పి భరించలేని స్థితికి చేరుతుంది. తమ ఉద్యోగ, వ్యాపారాలేవీ చేసుకోలేని స్థితికి కూడా కొందరు వచ్చేస్తారు. అలాంటి వారికి శస్త్ర చికిత్స తప్పనిసరి అవుతుంది.

సాధారణంగా డిస్కు ఏదో ఒక పక్కకు జరగడమే చూస్తాం. కానీ, అరుదుగా కొందరిలో డిస్కు మద్యలో దెబ్బ తింటుంది. ఇది మరీ తీవ్ర సమస్య. ఈ సమస్యతో లైంగిక శక్తి దెబ్బ తింటుంది. చివరికి మలమూత్ర విసర్జనలు కూడా ఆగిపోతాయి, ఈ స్థితిలో తక్షణమే శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుంది. ఆలస్యం చేస్తే ఇది ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు.

నివారణేమిటి ?

రోజూ పొట్ట, మెడ కండరాలను పటిష్టపరిచే వ్యాయామాలు చేస్తే నడుము భాగంలో వచ్చే లుంబార్ స్పాండిలోసిస్ గానీ, మెడ భాగంలో వచ్చే సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యలు గానీ రాకుండానే కాపాడుకోవచ్చు. నిజానికి మన రోజు వారి కార్యకలాపాలన్నిలోనూ శరీరాన్ని ముందు వైపు వంచే ఉంచుతాం.
ఈ స్థితిని బ్యాలెన్స్ చేసేందుకు శరీరాన్ని వెనుకకు వంచే సాధన లేవీ చాలా మంది చేయరు. అందుకే విధిగా శరీరాన్ని ముందుకు వ ంచే ఫ్లెక్షన్ వ్యాయామాలతో పాటు వెనక్కు వంచే ఎక్స్‌టెన్షన్ వ్యాయామాలు కూడా రోజూ చేస్తే డిస్కు సమస్యలను చాలా వరకు దూరంగా ఉంచవచ్చు.

No comments: