Tuesday, December 28, 2010

పసికందులు అంధులైతే....

మనదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చొప్పున పిల్లలు అంధత్వానికి గురవుతున్నారు. ఆ లెక్కన ప్రస్తుతం మన దేశంలో రెండు లక్షలా డెబ్బై వేల మంది చిన్నారులు అంధులుగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. రెండేళ్లలోపే అంధత్వానికి గురైన పిల్లల్లో సుమారు 50 శాతం మంది 5 ఏళ్ల లోపే చనిపోతున్నారు. నిజానికి అంధత్వాన్ని కలిగించే ఈ సమస్యల్లో 70 శాతం దాకా నివారించడం సాధ్యమయ్యేవే. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి అవసరమైన వైద్య, శస్త్ర చికిత్సలు అందించకపోతే అది అంధత్వానికి దారి తీస్తుంది. అందుకే ముందస్తు జాగ్రత్తలే పిల్లలను అంధత్వ ముప్పునుంచి తప్పిస్తాయంటున్నారు, నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ మాధవి.
శుక్లాలతో పుట్టిన పిల్లలను చూసి జాలిపడతారు. లేదా ఉన్నంతలో ఏదో ఆర్థిక సహాయం చే స్తారు. అంతేగానీ, వెంటనే వైద్యపరీక్షలు చేయించడం గానీ, మందులతోనో లేదా శస్త్ర చికిత్సల ద్వారానో పరిస్థితి చక్కబడే అవకాశాల గురించి ఆలోచించడమో చాలా మంది చేయరు. ఫలితంగా పరిస్థితి చక్కబడే అవకాశం కూడా జారిపోయి, వారు శాశ్వత అంధులుగా మారే స్థితికి దారి తీస్తుంది.

కొంత మంది పిల్లలు కార్నియా లోపం కారణంగా పుట్టుకతోనే అంధులవుతారు. అయిన వాళ్లంతా ఆ స్థితిని ఎవరూ ఏమీ చేయలేర న్నట్లు వదిలేసి ఊరుకుంటారు. నిజానికి కార్నియా మార్పిడి చికిత్సతో కొంత మేరకైనా వారికి తిరిగి చూపు అందించే అవకాశాలు ఉంటాయి. నేత్ర వైద్య విభాగంలో వచ్చిన అధునాతన చికిత్సల గురించిన అవగాహన లేకపోవడమే సమాజంలో మన దేశంలో లక్షలాది మంది పిల్లలు జీవితమంతా అంధులుగానే ఉండిపోయే పరిస్థితి ఎదురవుతోంది.

పిల్లల్లో వచ్చే విటమిన్-ఎ లోపాలు, మశూచికం, రుబెల్లా, ఆఫతాల్మిక్ నియోనెటోరియం వంటి సమస్యలను నివారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక శుక్లాలు, నీటికాసులు (గ్లకోమా), కార్నియా అంధత్వం, మెల్లకన్ను, రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యురిటీ, రెటినో బ్లాస్టోమా, మరికొన్ని దృష్టిలోపాలు వీటిని వైద్య చికిత్సలతో తొలగించడం సాధ్యమవుతుంది. కానీ, ఈ విషయం తెలియక కంటి సమస్యలను అవేవో శాప ఫలితాలు అన్నట్లు అలా వదిలేయడం వల్ల ఎంతో మంది పిల్లలు కనుచూపు నోచుకోకుండా కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.

ఎలా తెలుస్తాయి ?

సాధారణంగా ఆరు మాసాల వయసు నుంచే పిల్లలు తల్లిని గుర్తు పడుతుంటారు. పరిశీలనగా అన్ని వైపులా చూడటం కూడా చేస్తుంటారు. ఆ లక్షణాలేమీ కనిపించకపోతే ఆ పిల్లల్లో కంటికి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నట్లు భావించాలి. తరుచూ కనురె ప్పలు కొట్టుకోవడం, కనుగుడ్లు అదేపనిగా తిప్పుతూ ఉండడం, రంగు వస్తువులను చూపినా వాటిమీద దృష్టి పడకుండా మరోవైపు చూడటం, కళ్లు మరీ పెద్దవిగా ఉండడం వంటివి కూడా కంటి సమస్యలు ఉన్నట్లు అనుమానించే అంశాలే.

అయితే తలిదండ్రులకు ఈ విషయాల మీద అనుమానం కలిగినా వయసు పెరుగుతూ ఉంటే ఇవన్నీ వాటంతట అవే పోతాయి అనుకునే వారే ఎక్కువ. కానీ, ఆ లక్షణాలు ఆ తరువాత ఒక తీవ్రమైన సమస్యకు గురిచేస్తాయనే అవగాహన లేక పోవడమే ఇందుకు కారణం. పిల్లల్లోని ఈ అసహజ లక్షణాలను ముందే గుర్తించి మందులో లేదా శస్త్ర చికిత్సలో అందిస్తే ఆ తరువాత పిల్లలు చూపు కోల్పోయే పరిస్థితి రాకుండా నివారించవచ్చు.

విటమిన్-ఏ లోపాలు:

పిల్లల్లో కార్నియా సమస్యతో వచ్చే అంధత్వానికి విటమిన్-ఏ లోపమే ప్రధాన కారణం. ఈ లోపం వల్ల ముందుగా రేచీకటి సమస్య వస్తుంది. బాగా అలవాటైన ప్రదేశంలో కూడా పిల్లలు రాత్రిపూట తడబడుతున్నా, పదే పదే వస్తువులను గమనించక వాటిని పడదోస్తున్నా అది రేచీకటి సమస్యగా గుర్తించాలి.

కంటిలో తడి ఆరిపోవడం, తెల్లగుడ్డుపైన బూడిద రంగు మచ్చలు ఏర్పడటం ఉంటాయి. చివరి దశలో కార్నియా దెబ్బతిని అంధత్వం వస్తుంది. నివారణగా ప్రతి ఆరుమాసాలకు ఒకసారి 200000 ఐయు విటమిన్-ఎ ఇస్తూ ఉండాలి. పాలు ఇచ్చే తల్లులకు ప్రసవం నుంచి తగిన మోతాదులో విటమిన్-ఏ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మశూచి టీకాలు కూడా ఇప్పించడం ద్వారా కార్నియా సమస్యను నియంత్రించవచ్చు.

కళ్లకలక (ఆఫతాల్మిక్ నియోనెటోరియం) కొంత మంది పిల్లలు 10 రోజుల వయసులోనే కళ్లకలక సమస్యకు గురవుతుంటారు. గర్భిణులు బ్యాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లకు గురైనప్పుడు ఆ సమస్య కడుపులో ఉన్న శిశువుకు కూడా సోకుతుంది. ఫలితంగా పుట్టిన శిశువు కళ్లల్లో పుసులు కట్టడం, కళ్లలోంచి ఒక జిగురు పదార్థం స్రవించడం కనిపిస్తుంది.

వెంటనే వైద్యం అందకపోతే కంటి కార్నియా దెబ్బతిని అంధత్వం రావచ్చు. అందుకే గర్భిణిగా ఉన్నప్పుడు గానీ, ప్రసవ సమయంలో గానీ, తల్లులు ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడటం చాలా ముఖ్యం. అలాగే పుట్టిన పాప కళ్లు పరీక్షించి కళ్లకలక ఉంటే కళ్లను శుభ్రపరుస్తూ పొవిడీన్ ఐయాడీన్ ద్రావకం చుక్కలను కంటిలో వేయాలి.

రుబెల్లాతో జాగ్రత్త...

మూడు నుంచి ఆరుమాసాల గర్భంతో ఉన్నప్పుడు తల్లులు రుబెల్లా అనే వైరల్ ఇన్‌ఫెక్షన్లకు గురైతే బిడ్డ పలురకాల రుగ్మతలతో పుడుతుంటారు. ముఖ్యంగా పుట్టుకతో వచ్చే గుండెలోపాలు, చెవిటితనం, మానసిక వైకల్యం, రోజులు గడిచే కొద్దీ దంతాల లోపాలు, కంటి శుక్లాలు, గ్లకోమా, రెటీ నా పరమైన వ్యాధులు కూడా ఈ పిల్లలకు రావచ్చు. ఈ స్థితిని నివారించడానికి యుక్తవయసులో ఉన్న యువతులకు రుబెల్లా టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలి.

అపోహలూ ఎక్కువే...

పిల్లల్లో కంటి సమస్యలు ఎన్ని ఉన్నా వయసు పెరిగితే వాటంతట అవే త గ్గిపోతాయనుకోవడం, కళ్లు ఎరుపెక్కితే తల్లి చనుబాలు పోయడం, కొన్ని సందర్భాల్లో కంట్లో ఆకు పసర్లు, ఇతర మూలికా మందులు వేయడం, గర్భిణిగా ఉన్నప్పుడు అవసరమైన మందులు, టీకాలే వీ తీసుకోకపోవడం, మేనరిక వివాహాలు ఇవన్నీ పిల్లల్లో కంటి సమస్యలను పెంచి చివరికి వారి చూపునే హరిస్తున్నాయి.

పిల్లల్లో శుక్లం

ప్రతి రెండు వేల మంది పిల్లల్లో ఒక రు పుట్టుకతోనే శుక్ల సమస్యకు గురయ్యే వీలుంది. కొంతమంది పిల్లలకు పుట్టుకతో గానీ, కొంత వయసు వచ్చిన తరువాత గానీ ఒక కంట్లో లేదా రెండు కళ్లల్లో శుక్లాలు రావచ్చు. ఇందుకు గల కారణాల్లో బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఇన్ ఫెక్షన్లకు గురికావడం, జన్యుపరమైన కార ణాలు, కంటికి బలంగా దెబ్బ త గలడం వంటివి ప్రధానమైనవి.

ఈ వ్యాధి సోకినప్పుడు కనుపాప నల్లగా కాకుండా తెలుపు రంగులోకి మారుతుంది. ఈ పిల్లల్లో వెలుతురు చూడలేకపోవడం, చూపు నిలబెట్టలేకపోవడం, కనుగుడ్డును అతిగా తిప్పడం, ఎక్కువగా కళ్లు చిట్లించి చూడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ స్థితిలో శస్త్ర చికిత్స ద్వారా శుక్లాన్ని తీసివేయడం ఒక్కటే పరిష్కారం. శుక్లాల కారణంగా పిల్లల్లో చేసే శస్త్ర చికిత్స, పెద్దవారిలో చేసే శస్త్ర చికిత్స ఈ రెండు వేరు వేరు.

రెండేళ్ల లోపు పిల్లలకు ఈ శస్త్ర చికిత్స చేసినప్పుడు వారికి ఐదేళ్లు వచ్చేదాకా లావుపాటి అద్దాలు వాడాల్సి ఉంటుంది. రెండవ సారి శస్త్ర చికిత్స చేసి కంట్లో అద్దం అమర్చాక సాధారణ అద్దాలే సరిపోతాయి. అయితే ఒకసారి ఈ శస్త్ర చికిత్స జరిగిన పిల్లలను జీవితాంతం నేత్రవైద్యుని పర్యవేక్షణలో ఉంచడం చాలా అవసరం.

గ్లకోమా (నీటికాసులు)

ఈ వ్యాధి సోకే వారిలో పెద్ద వారే ఎక్కువగా ఉంటారు. అయితే పిల్లల్లోనూ ప్రతి 10 వేల మందికి ఒకరు చొప్పున ఈ వ్యాధి బారినపడుతుంటారు. గ్లకోమాతో కంటిలో ఒత్తిడి పెరిగి, అక్కడున్న నరం దెబ్బ తిని అంధత్వం వస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో కనుపాప పెద్దదవుతుంది. వెలుతురు చూడలేకపోవడం, కంట్లోంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కంటిలోని ఒత్తిడిని తగ్గించడానికి శస్త్ర చికిత్స ఒక్కటే పరిష్కారం. ఆ తరువాత కూడా ఒత్తిడి తగ్గకపోతే మరోసారి శస్త్రచికిత్స చేయవలసి రావచ్చు. లేదా మందులు వాడవలసి రావచ్చు. ఏమైనా గ్లకోమా ఉన్న వారు జీవితాంతం డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం చాలా అవసరం.

మెల్ల

మెల్ల ఉన్నప్పుడు ఒక క న్ను సమాంతరంగా ఉండదు. అందుకే రెండు కళ్లనుంచి మెదడుకు చేరే ప్రతిబింబాలు కూడా సమంగా ఉండవు. మెదడు స్పష్టంగా ఉన్న ప్రతిబింబాన్ని పరిగణనలోకి తీసుకుని మసకగా ఉండే రెండవ ప్రతిబింబాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. అలాగే ఇంకొంత కాలం గడిస్తే మెల్లకంటి చూపు మరింత తగ్గి చివరికి అంధత్వానికి దారి తీస్తుంది. ఈ స్థితిని యాంబిలోపియా అంటారు.

మెల్ల కన్ను ఉన్నప్పుడు ఆరేళ్ల లోపే గుర్తించి తగిన వైద్య చికిత్సలు చేయవలసి ఉంటుంది. మెల్ల నివారణలో కంటి కండరాలను సరిచేయడానికి శస్త్ర చికిత్స కూడా అవసరమవుతుంది. మెల్లను పూర్తి స్తాయిలో తొలగించడానికి కొందరికి రెండవసారి కూడా శస్త్ర చికిత్స చేయవలసి రావచ్చు. శస్త్ర చికిత్స తరువాత దృష్టిలోపాలకు కళ్లజోడు కూడా వాడవలసి ఉంటుంది.

కంటి చూపు వృద్ధికి...

కొంత మంది పిల్లల్లో మందులతోగానీ, శస్త్ర చికిత్సల వల్ల గానీ చూపును మెరుగుపరిచే అవకాశాలు ఉండవు. అలాంటి వారిలో అప్పటికి ఇంకా మిగిలి ఉన్న చూపును మెరుగుపరిచే ఆధునిక చికిత్సలు కొన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పిల్లల ప్రస్తుత కంటి చూపును అంచనా వేసి కొన్ని రకాల బూతద్దాలు, టెలిస్కోపులు, ప్రత్యేకమైన కళ్లజోడు, కొన్ని ప్రత్యేకమైన లైట్ల ద్వారా పిల్లల చూపును మెరుగు పరిచే అవకాశాలు ఉన్నాయి.

అయితే అప్పటికే అంధత్వం కారణంతా బ్రెయిలి లిపికి అలవాటు పడితే ఈ పరికరాలను ఉపయోగించడానికి అంతగా ఇష్టపడరు. అందుకే చిన్న వయసులోనే పిల్లల అంధత్వాన్ని అంచనా వేసి అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకుంటే ప్రయోజనం ఉంటుంది. పుట్టుకతో వ చ్చిన అంధత్వాన్ని పూర్తిగా జయించలేకపోయినా, ప్రయోజనకరమైన కంటిచూపును పొందే అవకాశాలు ఉన్నాయి. "ఆలస్యం...అమృతం...విషం'' అన్న నానుడి పిల్లల కంటి సమస్యల విషయంలో నూటికి నూరు పాళ్లు నిజం.


-డాక్టర్ జి.మాధవి
కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు,
మెడికల్ డైరెక్టర్, గౌతమి ఐ ఇనిస్టిట్యూట్, రాజమండ్రి,
ఫోన్ : 9502136068

No comments: