Sunday, December 26, 2010

శాకాహారంతో లోటేమిటి? * శాకాహారంలో లభించే పోషకాలు .....

శాకాహారం జీర్ణమయినంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు. ఎదిగే వయసు పిల్లల్లో పౌష్టికాహారం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత వయసులో కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పోషకాలు అవసరమవుతాయి. నిజానికి శాకాహారంలో లభించే పోషకాలు ఎవరికైనా సరిపోతాయి.
ఏమిటిలా చిక్కిపోతున్నావ్? అని ఎవరైనా ప్రశ్నిస్తే, గుడ్లా? మాంసమా? చిక్కిపోక ఏం చేస్తాం? అంటూ ఎదురుప్రశ్న వేస్తుంటారు. చిక్కిపోవడానికి గల అసలు కారణాల గురించి ఏ మాత్రం ఆలోచన ఉండదు. ఆకుకూరలు, కాయగూరలు తినడమే అసలు లోపం అన్నట్లుగా వారి ధోరణి ఉంటుంది. నిజానికి మనిషికి అవసరమైన అన్ని పోషకాలు, ప్రొటీన్లు శాకాహారంలోనూ సంపూర్ణంగా లభిస్తాయంటున్నారు నిపుణులు.

సిసలైన పౌష్టికాహారం అంటే మాంసాహారమేనన్న అభిప్రాయం ఉంది. అందుకే మాంసాహారానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అంతిమంగా ఈ ఆహారపు అలవాట్లు జీర్ణకోశ సమస్యలకు దారి తీస్తాయి. శాకాహారం జీర్ణమయినంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు. ఎదిగే వయసు పిల్లల్లో పౌష్టికాహారం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత వయసులో కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పోషకాలు అవసరమవుతాయి. నిజానికి శాకాహారంలో లభించే పోషకాలు ఎవరికైనా సరిపోతాయి. మాంసాహారం మీద ప్రీతితో అంతే మోతాదులో తీసుకుంటూ పోతే అవి జీర్ణం కావు. ఆకలి మందగించడంతో పాటు కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.

పౌష్టికాహారం పేరిట అదేపనిగా మాంసాహారం, గుడ్లు తీసుకుంటే వాటిని అరిగించుకోవడానికి జీర్ణకోశంపైన అనవసరపు భారం పడుతుంది. శరీరంలోని జీవశక్తి అదనంగా ఖర్చవుతుంది. శరీరతత్వంలో కొన్ని చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకలి మందగించడం, కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయి. మాంసాహారం, గుడ్లు పూర్తిగా మానకోవాలని కాదు. ఒక పరిమితిలో వాటిని తీసుకోవచ్చు. అయితే, మాంసాహారం నుంచి మాత్రమే కావలసిన పోషకాలు లభిస్తాయనుకోవడం సరికాదు. శాకాహారం నుంచి కూడా అవసరమైన ప్రొటీన్లతో పాటు పోషకపదార్థాలన్నీ లభిస్తాయి. పెద్దవారికి ఇవి అవసరానికంటే ఎక్కువే.

మొలకెత్తిన పెసర్లు, శనగలు

వీటి నుంచి ప్రొటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. తరుచూ వీటిని ఉపాహారంగా (బ్రేక్‌ఫాస్ట్) తీసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తాయి. మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్లతో పాటు లవణాలు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.పైగా వీటిని జీర్ణించుకోవడంలో శరీరానికి ఎక్కువ శక్తి కూడా ఖర్చు కాదు. మొలకెత్తించే విధానం గింజలను నీటిలో నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత వాటిని తడిగుడ్డలో మూట కట్టి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. కొంచెం గాలి తగిలేలా మూత కాస్త తెరిచి పెట్టాలి. సాధారణంగా 12 నుంచి 16 గంటల వ్యవధిలో ఇవి మొలకెత్తుతాయి. చలికాలంలో అయితే 24 గంటల దాకా పట్టవచ్చు.

నానబెట్టిన వేరుశనగలు

శరీరానికి కావలసిన ఎన్నో పౌష్టిక విలువలు, ప్రొటీన్లను వీటి ద్వారా పొందవచ్చు. వేరుశనగ గింజలను పన్నెండు గంటలపాటు నానబెట్టాలి. ఆ తరువాత నీరు తీసివేయాలి. ఇలా చేయడం వల్ల అందులోని హానికారక అంశాలన్నీ తొలగిపోతాయి. ఈ వేరుశనగలను బెల్లంతో కలిపి తీసుకుంటే ఎంతో శక్తి లభిస్తుంది.
సలాడ్

క్యారెట్, కీర, బీట్‌రూట్, ఉల్లి, క్యాబేజీ, క్యాప్సికమ్‌లను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. అప్పుడప్పుడు పచ్చి బఠాణి, రుచి కోసం కొంచెం ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవచ్చు. టమాటకు బదులుగా నిమ్మరసం కలుపుకోవచ్చు. సలాడ్ తినడానికి చాలా ముందు ఉప్పు కలిపి పెడితే నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తరువాత ఒకరకమైన వాసన వస్తుంది. కాబట్టి తినే సమయంలో మాత్రమే ఉప్పు కలుపుకోవాలి. రాత్రిపూట ఆహారంతో పాటు తీసుకుంటే చాలా మంచిది.

పప్పు, ఆకుకూరలు

పప్పులో ప్రొటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆకుకూరలో, ఇనుము, లవణాలు అధికంగా ఉంటాయి. రక్తహీనతను ఆకుకూరలు బాగా అరికడతాయి. నీరసం, అలసట తగ్గుతుంది. రక్తహీనత తగ్గడంతో పాటు రక్తస్రావ సమస్యలు కూడా నయమవుతాయి. వీటితో పాటు నానబెట్టిన ఎండు ద్రాక్ష, అత్తిపండు, నానబెట్టిన బాదం, నల్లరకం ఎండు ఖర్జూరం తీసుకోవడం శ్రేయస్కరం.

జాగ్రత్తలు

* తరచు వేపుడు పదార్థాలు, మైదా వంటలు, ఊరగాయలు తినడం మానేయాలి.
* ఉప్పు సగం టీ స్పూన్‌కు మించకుండా ఉండాలి.
* అవసరం ఉన్న వాళ్లు డాక్టర్‌ను సంప్రదించి రెండు లేక మూడు స్పూన్‌ల నెయ్యి వాడవచ్చు.
* సమయానికి భోజనం చేయాలి. రాత్రి భోజనం ఎనిమిది గంటల కంటే ముందే ముగించాలి.
* నిద్రా సమయానికి, రాత్రి భోజనానికి మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండాలి.
* రాత్రి ఆహారంలో 50 శాతం పచ్చి కూరగాయలు, పళ్లు తీసుకోవాలి.
* అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు రాత్రి ఆహారంలో అన్నం కాకుండా గోధుమ పుల్కాలు, జొన్న రొట్టె తినడం మంచిది. * 35 ఏళ్లు దాటిన వారు వారానికి ఒక రోజు ఉపవాసం చేయడం ఆరోగ్యకరం. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు. వండని పదార్థాలు తీసుకోవడం, పళ్లు, పళ్ల రసాలు, మొలకెత్తిన గింజలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తప్పనిసరిగా తీసుకోవాలి.

నీళ్లెప్పుడు తాగాలి?

ప్రతిరోజు మూడు లీటర్ల నీళ్లు తాగాలి. అజీర్తి, మలబద్ధకం, అర్షమొలలు, గాల్‌బ్లాడర్, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు అధికంగా నీరు తీసుకోవడం వల్ల తొలగిపోతాయి. భోజనానికి అరగంట ముందు, అరగంట తరువాత మాత్రమే నీరు తాగాలి. భోజన సమయంలో జీర్ణప్రక్రియ కోసం కేవలం ఒకటి రెండు గ్లాసుల నీరు తీసుకోవచ్చు. భోజనం చేస్తున్నప్పుడే అమితంగా నీరు తాగడం వల్ల ఎంతో నష్టం ఉంటుంది. ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి కొన్ని జీర్ణరసాలు తయారవుతుంటాయి.

భోజనసమయంలో లేక భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచబారతాయి. దీనివల్ల తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కాకుండా పోతాయి. కొంత మంది రోజుకు 5 నుంచి 6 లీటర్ల నీరు తాగుతుంటారు. దీనివల్ల నీటిని తిరిగి బయటకు పంపడంలో కిడ్నీలపై అనవసరపు భారం పడుతుంది. శరీరానికి అవసరమయ్యే నీరు మూడు లీటర్లే. ఆ పరిమితిని పాటించడమే ఆరోగ్యకరం.

No comments: