Monday, December 27, 2010

శరీరానికే తెలివి ఎక్కువ!

ప్రపంచానికి మన దేశం అందించిన ఆధ్యాత్మిక గురువుల్లో యూజీ కృష్ణమూర్తి ఒకరు. దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోను పర్యటించిన యూజీ- తనదైన శైలిలో భారతీయ ఆధ్యాత్మికతను ప్రచారం చేశారు. ఆయన చివరి రోజుల్లో తన శిష్యులతో జరిపిన సంభాషణల సమాహారమే- 'ద బయాలజీ ఆఫ్ ఎన్‌లైటెన్‌మెంట్'. జీవితం పట్ల ఆసక్తికి, అనురక్తి, జిజ్ఞాసను పెంపొందించే ఈ సంభాషణలలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు.....

పాల్ (శిష్యుడు): సరైన ఆహారం అంటే ఏమిటి?

యూజీ: శరీరానికి ఆహారం కావాలి. 'సరైన ఆహారం' అనే నిబంధన పెడితే, ఆహారాన్ని తీసుకోవటంపై నియంత్రణను విధించినట్లే. మన కడుపు దేనినైనా అరిగించుకోగలదు. అయితే మెదడు దానిని నియంత్రించటానికి ప్రయత్నించటం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి.

పాల్: నిజంగానా..?

యూజీ: చాలాసార్లు మనం ఆహారాన్ని ఆనందం కోసం తింటాం. శరీరం కోసం తినం. ఆ విధంగా మనం అలవాటు పడ్డాం. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. మీకు బాగా నచ్చిన ఆహారాన్ని తినద్దు. అప్పుడు మెదడులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించండి. తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోటం ఒక పని మాత్రమే. ఆహారాన్ని గుర్తించటం, దాని రుచిని ఆస్వాదించటం ఇవన్నీ వేర్వేరు పనులు.

ఇవన్నీ ఒక దానితో మరొకటి ముడిపడి ఉంటాయి. ఆహారం తినేటప్పుడు అనేక రకాల విషయాల గురించి ఆలోచిస్తుంటే- ఆహారాన్ని ఆస్వాదించలేం. అది అందించే తృప్తిని పొందలేం. మన కడుపుకు అందాల్సిన రక్తం మెదడుకు బదిలీ అవుతుంది. అందువల్లే మన పూర్వీకులు- తినే సమయంలో ఆలోచించటం కాని మాట్లాడటం కాని చేయవద్దంటారు..

మన శరీరానికి ఎలా పనిచేయాలో తెలుసు. దానికి కూడా తెలివితేటలు ఉన్నాయి. అయితే అది పనిచేయటానికి మనం అనుమతించాలి. ప్రతి సారి అడ్డం పడకూడదు. పరిణామక్రమంలో అభివృద్ధి చెందిన మానవుల తెలివితేటలు- శరీరపు తెలివితేటల ముందుకు ఎందుకు పనికిరావు. తనని తాను ఎలా రక్షించుకోవాలో శరీరానికి తెలుసు. కాబట్టి తినకూడని పదార్థమేదీ అది తినదు. ఎప్పుడైనా మనం అలాంటిది తిన్నా శరీరం దానిని బయటకు తోసివేస్తుంది.

పాల్: కొన్ని రకాల ఆహారాలను త్యజించటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటారు.. యూజీ: భారతదేశంలో చాలామంది పాటించే ఒక ఆచారం ఉంది. కొంతమంది తమకు బాగా ఇష్టమైన పదార్థాన్ని అక్కడ వదిలేసి వస్తారు. నాకు తెలిసిన ఒక పెద్ద గురువు ఉన్నాడు. ఆయన భగవద్గీత ప్రవచనాలు చెబుతూ ఉంటాడు. ఆయన కాశీకి వెళ్లి - తనకు నచ్చని పదార్థాలు వదిలేసి వచ్చేశాడు. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు. చాలా సార్లు మనం ఇతరులను అనుకరిస్తూ ఉంటాం.

కాశీకి వెళ్లి ఏదో ఒకటి వదిలేయాలన్నారు కాబట్టి వదిలేసి వచ్చేస్తాం. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. చాలా సార్లు బుద్ధుడు చెప్పాడు కాబట్టి ఆ పని చేస్తున్నాం.. జీసస్ చెప్పాడు కాబట్టి ఈ పని చేస్తున్నాం అంటూ ఉంటారు. అసలు భావం తెలియకుండా చేసే పనుల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దీని వల్ల ప్రపంచమంతా అనుచరులు మాత్రమేతయారు అవుతారు. మళ్లీ వారి మధ్య ఘర్షణలు ఏర్పడతాయి...

పాల్: అసలు దేవుడు ఉన్నాడా?

యూజీ: ఈ ప్రశ్నను నాకు నేనే వేసుకుంటూ ఉంటాను. నాకు సమాధానం అయితే దొరకలేదు. భయం వల్ల మనకు మనం దేవుడిని సృష్టించుకుంటాం. అందువల్ల దేవుడు ఉన్నాడా? లేడా అనేది అసలు సమస్య కాదు. 'దేవుడు' అనే ఆకారాన్ని సృష్టించుకోవటం వల్ల మనం ఎంత ఆనందంగా ఉన్నాం అనే విషయమే ప్రధానం. అందుకే భారత దేశంలో 33 కోట్ల దేవుళ్లు ఉన్నారంటారు. 33 కోట్ల మంది ప్రజలు-తమ కోసం దేవుళ్లను సృష్టించుకున్నారన్నమాట.

ఈ సమాధానాన్ని నమ్మితే- దేవుడు ఉన్నాడా? లేదా? అనే వాదనలకు అసలు అర్థమే ఉండదు. అయితే అప్పుడు మనంతట మనం సృష్టించుకున్న దేవుడిని మనం ఎందుకు నమ్మాలి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. భయం వలనే దేవుడిని మనం సృష్టించుకున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకుంటే- మిగిలిన విషయాల్లో దేవుడి ప్రమేయం ఉండదు.

యోగా గురించి..

మన శరీరంలో 64 ప్రాంతాల్లో నాడులు ఉంటాయి. మన మణికట్టు దగ్గర ఉన్న నాడినే డాక్టర్లు పరీక్షిస్తారు. కాని శ్వాసకు సంబంధించిన వ్యాయామ సూత్రాలను నేర్చుకుంటే-ఈ నాడులు కొట్టుకోవటాన్ని మనం గమనించగలుగుతాం. ఇదే విధంగా ఆధ్యాత్మిక అంశాలను మనం శారీరకంగా కూడా గమనించవచ్చు. ఉదాహరణకు హిందువులు - 'ఓమ్' అనే నాదాన్ని జపిస్తారు.

దీనిని జపించినప్పుడు మనం శ్వాస తీసుకొనే పద్ధతి పూర్తిగా మారిపోతుంది. దీనినే కొన్ని వేల సార్లు జపించినప్పుడు మనకు తెలియకుండానే శ్వాస తీసుకొనే పద్ధతిలో మార్పు వస్తుంది. అలౌకికమైన ఆనందం వస్తుంది. అందువల్లే ఓంకారాన్ని కొన్ని వేల సార్లు జపించమని చెబుతూ ఉంటారు. అయితే ఓంకారాన్ని జపించటం వెనక ఉన్న మర్మాన్ని మాత్రం ఎవరూ చెప్పరు.. 
పాల్: యోగా వల్ల మన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగలమా? యూజీ: లేదు. యోగా వల్ల శరీరమే అదుపులోకి వస్తుంది. మంచి స్థితిలో ఉంటుంది. మనం జీవించటానికి ఆహారం ఎలా తింటామో ఇది కూడా అంతే.....

పాల్: అయితే ఉన్నత స్థితికి చేరుకోవటానికి యోగ ఉపయోగపడుతుందంటారా..? యూజీ: యోగానే కాదు. ఏ వ్యవస్థా ఆ స్థితిని చేరుకోవడానికి ఉపయోగపడదు. ముందు శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. క్రమశిక్షణతో వ్యవహరించాలి.

శరీరం అదుపులోకి వచ్చిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ఆ తర్వాత మన చుట్టూ ఉన్న స్థితిని ప్రశ్నించాలి. ఆ తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానం అన్నింటికన్నా చివరది. మొదటిది కాదు. అయితే కొందరి సిద్ధాంతం ప్రకారం ఇవన్నీ ఒకే సారి చేయాలి. ఈ సిద్ధాంతం గురించి నాకు తెలియదు. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు.

No comments: