Thursday, January 13, 2011

జుట్టు రాలడాన్ని నిరోధించేదెలా?

మా అమ్మకి అరవై ఏళ్లు వచ్చినా ఇప్పటికీ జుట్టు నల్లగా నిగనిగలాడుతోంది. ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేదు. నాకేమో ఉన్న జుట్టుకు రంగు వేయాల్సి వస్తోంది. మా అమ్మాయికి అప్పుడే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతోంది. నా సంగతి సరే! మా అమ్మాయికి జుట్టు ఊడకుండా, తెల్లజుట్టు రాకుండా ఉండటానికి ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వండి.
- బృంద, వైజాగ్

ఈ మధ్యకాలంలో మీరు చెబుతున్న సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ, బ్యూటీ క్లినిక్‌ల చుట్టూ తిరిగే వారి సంఖ్య చాలా పెరిగింది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనిపించే జుట్టురాలే సమస్య ఇప్పుడు యుక్త వయస్కుల్లోనూ కనిపిస్తోంది. ఇరవై ఏళ్లకే జుట్టు తెల్లబడుతోందని, తలస్నానం చేస్తే జుట్టంతా ఊడిపోతోందంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

బట్టతల వంశపారపర్యంగా సంక్రమించేదే అయినా జుట్టు రాలడానికి పోషకాహారలోపం, మానసిక ఆందోళన, నిద్రలేమి, కాలుష్యం, హార్మోన్ల సమస్య వంటివి కారణమవుతున్నాయి. చర్మం కిందిపొరను ఎపిడెర్మిస్ అంటారు. ఎపిడెర్మిస్‌లో రక్తనాళాలు ఉండవు.

స్వేదగ్రంథుల నాళాలు, రోమాలు ఎపిడెర్మిస్ పొరను చీల్చుకుని చర్మం పైకి వస్తాయి. రోమాల మూలంలో ఒక గ్రంథి ఉంటుంది. దీన్ని కేశమూలము లేదా హెయిర్ ఫాలికల్ అంటారు. కేశము ఒక సన్నని ప్లాస్టిక్ నాళం వంటి నిర్మాణము. దీని నాళికలో ఉండే రంగుపదార్థాన్ని మెలనిన్ అంటారు. దీని కారణంగానే జట్టుకు రంగు వస్తుంది.

కారణాలు
వయస్సు : వయసు పైబడుతున్న కొద్దీ కేశమూలాలు కుంచించుకుపోతాయి. కొత్త వెంట్రుకల ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది వంశపారంపర్యంగా ఒక్కో కుటుంబంలో ఒక్కో రకంగా ఉంటుంది.
ఆహారం : వెంట్రుకలు రాలిపోవడానికి పోషకాహార లోపం ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఎక్కువ శాతం మందిలో శిరోజాలు రాలడానికి పోషకాహార లోపమే కారణం.
హార్మోన్ సమస్యలు : థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు అధికంగా లేక తక్కువగా విడుదలకావడం వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంది.
స్త్రీలలో..: గర్భిణిలు డెలివరీ అయ్యాక మూడు నెలలకు జుట్టు రాలే సమస్య కనిపిస్తుంది. గర్భం దాల్చినపుడు అధికంగా విడుదలయిన హార్మోన్ల మూలంగా ఈ సమస్య వస్తుంది.
మందుల ప్రభావం: గౌట్, అధిక రక్తపోటు, గుండె, నాడీ సమస్యలకు వాడే మందుల ప్రభావం జుట్టుపై ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో ఎ-విటమిన్ తీసుకోవడం వల్ల, గర్భనిరోధక మాత్రలు, యాంటీడిప్రెషన్ మందుల కారణంగా కూడా జుట్టు రాలవచ్చు.

ఇన్‌ఫెక్షన్లు : తలలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా శిరోజాలు రాలిపోయే అవకాశం ఉంది.
మానసిక ఒత్తిడి : శారీరక, మానసిక ఒత్తిడి, ఐరన్ లోపం వంటి అంశాలు కూడా జుట్టు ఊడిపోవడానికి కారణమవుతాయి.
కాలుష్యం : వాహన కాలుష్యం వల్ల శిరోజాలు బలహీనపడి రాలిపోవడం జరుగుతుంది.
దీర్ఘకాలిక వ్యాధులు: క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న వారిలో జుట్టు రాలిపోయే అవకాశం ఉంది.

డయాబెటిస్‌ను నిర్ధారించేందుకు చేసే పరీక్షలు, సి.బి.పి(కంప్లీట్ బ్లడ్ పిక్చర్), థైరాయిడ్ హార్మోన్ల శాతాన్ని నిర్ధారించే పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ వంటి టెస్టులు జుట్టు రాలిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి.

హోమియో చికిత్స
ముందుగా వ్యక్తి శారీరక, మానసిక లక్షణాలను పరిశీలించి, తద్వారా శరీరతత్వానికి సరిపోయే మందులను ఇస్తారు. జన్యులోపాలను, హార్మోన్ల సమస్యలను తగ్గించడంలో హోమియో మందులు చక్కగా ఉపకరిస్తాయి. ఈ సమస్యను నివారించడానికి చక్కని మార్గాలున్నాయి.

* హెయిర్ డైలను, కృత్రిమ రంగులను జుట్టుకు ఉపయోగించకూడదు. కృత్రిమ రంగులు వాడటం వల్ల అందులో ఉండే రసాయనాలు శిరోజాలను బలహీనపరుస్తాయి.
* వారంలో ఒకటి, రెండు సార్లు షాంపూతో తలస్నానం చేయాలి. తరువాత తడిలేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. షాంపూలు తరుచుగా మార్చడం మంచిది కాదు. ఎప్పుడూ ఒకే బ్రాండ్ షాంపూ ఉపయోగించాలి.
* పోషకాహారం తీసుకోవాలి. రోజువారీ మెనూలో ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. జుత్తు బలంగా ఉండాలంటే కాల్షియం, ఐరన్ ప్రొటీన్లు సమంగా అందాలి.
* తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడమూ అవసరమే. మానసిక ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి.
* తలలో ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లయితే వెంటనే చికిత్స తీసుకోవాలి.
* శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం ఉంటేనే శిరోజాలు బాగుంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

డా. శ్రీకాంత్. యం
హోమియోకేర్ ఇంటర్నేషనల్,
ఆంధ్రప్రదేశ్-కర్ణాటక,
ఫోన్ : 9550001144, 9550001188

No comments: