Wednesday, January 26, 2011

అందమైన చిరునవ్వుకు కృత్రిమ దంతాలు

చక్కని చిరునవ్వుకే కాదు.. ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపిస్తాయి దంతాలు. కోల్పోయిన దంతాల స్థానంలో కృత్రిమ దంతాలను అమర్చగలగడం దంతవైద్యరంగంలో మంచి పరిణామం. ఎంతోకాలంగా అందుబాటులో ఉన్న ఇంప్లాంటేషన్ చికిత్స అందించడంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వీటికి పరిష్కారంగా వచ్చాయి బేసల్ డెంటల్ ఇంప్లాంట్స్.

స్విట్జర్లాండ్‌కి చెందిన డాక్టర్ ఇధావో రూపొందించిన ఈ కృత్రిమ దంతాలను మన రాష్ట్రంలో మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చారు డాక్టర్ మహేందర్ ఆజాద్. మాక్సిలోఫేషియల్ సర్జరీ, ఇంప్లాంటేషన్ చికిత్సలలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని గడించిన డాక్టర్ మహేందర్ ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. హైదరాబాద్‌లో గత పదేళ్లుగా సేవలందిస్తున్న ఆయన కృత్రిమ దంతాల గురించి అందిస్తున్న విశేషాలు...

నెలరోజుల్లో నా పెళ్లి ఉంది డాక్టర్.. ఈలోగా ఊడిపోయిన పళ్ల స్థానంలో కొత్త దంతాలు పెట్టేయండి.... అంటూ వచ్చింది వినీల. దంతాలు పుచ్చిపోవడంతో దవడ భాగంలో రెండు పళ్లను తీసేశారు ఆమెకు. వాటి స్థానంలో కృత్రిమ దంతాలు పెట్టించుకోవాలనుకుంటోంది. కృత్రిమ దంతాలు అమర్చాలంటే సుమారు ఓ సంవత్సరం పడుతుందంటున్నారు ఫ్రెండ్స్. పెళ్లిని వాయిదా వేసుకునే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు డాక్టర్ చెప్పిన మాట ఆమెకు అమృతంలా తోచింది. అదే... బేసల్ డెంటల్ ఇంప్లాంట్స్.

*** కృత్రిమ దంతాలను అమర్చే చికిత్సలు అందుబాటులోకి వచ్చి ముప్పయ్యేళ్ల పైగానే అయింది. డెంటల్ ఇంప్లాంట్స్‌ను తయారుచేసే కంపెనీలు కూడా రకరకాల మోడల్స్‌లో ఆధునిక పద్ధతుల్లో తయారుచేస్తూనే ఉన్నాయి. అయినా సరే డెంటల్ ఇంప్లాంటేషన్ (కృత్రిమ దంతాలను అమర్చడం)లో చాలా లోపాలు, కష్టాలు తీరనేలేదు. ఈ లోపాలన్నింటికీ పరిష్కారం చూపేవే బేసల్ డెంటల్ ఇంప్లాంట్స్.

ఇంప్లాంటేషన్ ఎలా?

దంతం అంటే మనకు పైకి కనిపించేది మాత్రమే కాదు. దాని రూట్ చిగుళ్ల దగ్గర ఉన్న ఎముకలో ఉంటుంది. ఇక్కడి నుంచే దంతానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఈ ఎముక రెండు భాగాలుగా ఉంటుంది. దంతం వైపు ఉండేదాన్ని అల్వియోలార్ ఎముక అనీ, దాని కింద ఉండేదాన్ని బేసల్ ఎముక అనీ అంటారు. దంతం దెబ్బతిన్నప్పుడు ఈ రూట్ భాగాన్ని కూడా తీసేస్తారు. సహజమైన దంతం స్థానంలో అమర్చే ఇంప్లాంట్‌లో మూడు భాగాలుంటాయి. దీనికి కూడా సహజమైన దంతంలాగా రూట్ ఉంటుంది.

కానీ అది ప్లాటినమ్‌తో తయారుచేయబడింది. దీని కింది భాగం చూడటానికి ఒక స్క్రూలాగా ఉంటుంది. ఈ స్క్రూ పైన ఉండే భాగంలో లోపల అంతా ఖాళీగా ఉంటుంది. ఈ ఖాళీ భాగంలో ఇంప్లాంట్ మూడో భాగాన్ని చొప్పిస్తారు. దాని పైన మనకు పైకి కనిపించే కృత్రిమ దంతం ఉంటుంది. ఇంప్లాంట్ స్క్రూను అల్వియోలార్ ఎముకకి రంధ్రం చేసి దానిలోకి బిగిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం చేయడానికి సుమారు సంవత్సర కాలం అవసరం అవుతుంది. ఇంత కష్టపడి ఇప్పటి వరకు అనుసరిస్తున్న ఈ ఇంప్లాంట్స్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి.

ఏమిటా లోపాలు?

చిగుళ్ల వ్యాధి వల్లగాని, ఇతరత్రా సమస్యల వల్ల గానీ దంతాన్ని తీసివేసినప్పుడు వెంటనే కృత్రిమ దంతాన్ని అమర్చడం సాధ్యం కాదు. దంతం అనారోగ్యానికి గురయినప్పుడు దానితో పాటు అల్వియోలార్ ఎముక కూడా దెబ్బతింటుంది. దాని గాయం మానడానికి కనీసం 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. అందువల్ల 3 లేదా 4 నెలల తరువాత గానీ ఇంప్లాంటేషన్ చేయడానికి వీలుపడదు. స్క్రూను బిగించే అల్వియోలార్ ఎముక బేసల్ బోన్ కన్నా సున్నితమైనది. కాబట్టి కృత్రిమ దంతం త్వరగా వదులయ్యేందుకు అవకాశం ఉంటుంది.

దంతం పాడయినప్పుడు అల్వియోలార్ ఎముక కూడా దెబ్బతినడం వల్ల కృత్రిమ దంతానికి అవసరమైనంత ఎముక ఉండదు. దానివల్ల కూడా అమర్చిన దంతం తిరిగి వదులయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.

స్క్రూ బిగించిన తరువా ఇంప్లాంటేషన్ ప్రక్రియ కొనసాగడానికి 4 నుంచి 6 నెలలు ఆగాల్సి ఉంటుంది. స్క్రూ ఎముకలో సర్దుకోవడానికి అంత టైం పడుతుంది.

తరువాత శాశ్వత దంతాన్ని అమర్చడానికి తిరిగి 10నెలల వ్యవధి అవసరం అవుతుంది. కానీ పేషెంట్ మాత్రం దంతాన్ని తీసివేయగానే వెంటనే కృత్రిమ దంతాన్ని అమర్చేయమని అడుగుతుంటారు. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న స్క్రూ ఇంప్లాంట్స్ వల్ల మాత్రం సుమారు సంవత్సర కాలం పడుతుంది.

బేసల్ ఇంప్లాంట్స్

ఇప్పుడు కొత్తగా వచ్చిన కృత్రిమ దంతాలు సంప్రదాయ ఇంప్లాంట్స్‌తో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. స్విట్జర్లాండ్‌కి చెందిన డాక్టర్ ఇధావో బేసల్ ఇంప్లాంట్స్‌ని రూపొందించారు. పేరులో ఉన్నట్టుగానే ఈ ఇంప్లాంట్స్‌ని అల్వియోలార్ ఎముకకు బదులుగా బేసల్ బోన్‌లో అమరుస్తారు. అందువల్ల ఇవి వదులయ్యే అవకాశమే ఉండదు.

దంతాలను తీసివేసిన వెంటనే వీటిని అమర్చడం సాధ్యమవుతుంది. చిగుళ్ల వ్యాధి లేదా ఇన్‌ఫెక్షన్ వల్లగానీ దంతాలను కోల్పోవాల్సి వచ్చిన సందర్భంలో కూడా బేసల్ ఇంప్లాంట్స్‌ని అమర్చవచ్చు. వీటిలో స్క్రూకి బదులుగా రింగ్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ రింగు ఎముక వ్యాసానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి దంతం అటూ ఇటూ జరిగిపోకుండా సరిగ్గా ఫిట్ అవుతుంది.

దీన్ని బేసల్ బోన్‌లో అమరుస్తారు కాబట్టి అల్వియోలార్ ఎముక పూర్తిగా దెబ్బతిన్నా ఇంప్లాంటేషన్ సాధ్యమవుతుంది. పై దవడ వైపు దంతం అనారోగ్యానికి గురయినప్పుడు ఎముక కూడా చాలావరకు దెబ్బతింటుంది. సంప్రదాయ ఇంప్లాంట్స్ అయితే ఇలాంటప్పుడు సైనస్ ఎఫెక్ట్ కాకుండా సైనస్ లిఫ్ట్ అనే పద్ధతి ద్వారా దీన్ని అమర్చేవారు. కానీ బేసల్ ఇంప్లాంట్స్ విషయంలో సైనస్ లిఫ్ట్ చేయనవసరం లేదు. ఏ వయసువారైనా భేషుగ్గా వీటిని పెట్టించుకోవచ్చు.

ఇంప్లాంటేషన్ ఎప్పుడు?

- దంతాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం నోరు, దంతాలు సక్రమంగా శుభ్రం చేసుకోకపోవడమే. దీనివల్ల దంతాలు, చిగుళ్లు దెబ్బతిని పంటిని పూర్తిగా తీసేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటప్పుడు ఇంప్లాంటేషన్ ద్వారా కృత్రిమ దంతాలను అమరుస్తారు.
- చిగుళ్ల వ్యాధులు - నోరు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చి చిగుళ్లు దెబ్బతింటాయి. చిగుళ్ల వ్యాధి వల్ల ఎముక కూడా దెబ్బతినవచ్చు. చిగుళ్ల వ్యాధులు వంశపారంపర్య కారణాల వల్ల కూడా రావచ్చు.
- చిప్స్, చాక్లెట్లు లాంటివి ఎక్కువగా తినడం వల్ల కూడా దంతాలు దెబ్బతింటాయి. నోటి శుభ్రత లేకపోవడం కూడా కారణమే. - ప్రమాదాల్లో నోటికి దెబ్బలు తగిలినప్పుడు కూడా దంతాలను కోల్పోయే అవకాశం ఉంటుంది.

డాక్టర్ మహేంద్ర ఆజాద్
డెంటల్ అండ్ మాక్సిలోఫేషియల్
సర్జరీ సెంటర్, హైదరాబాద్.
ఫోన్:9391035568

No comments: