Saturday, September 11, 2010

పిండివంటల పరమార్థం * వంటల్లో ఆరోగ్య విశిష్టత

మన సంప్రదాయ వంటలు రాన్రాను కనుమరుగైపోతున్నాయి. నూడిల్స్, పానీపురీ.. వెజిటబుల్ పలావ్.. బిర్యానీలూ.. ఇలా దైనందిన జీవితంలో ఫాస్ట్ఫుడ్ సంస్కృతి జీర్ణించుకుపోతోంది. దీంతో అనేక సమస్యలూ తలెత్తుతున్నాయి. ఐతే -
సంప్రదాయ రీతిలో ‘వినాయక’ చవితికి చేసుకునే వంటల్లో ఆరోగ్య విశిష్టత ఉండటం గమనార్హం. పులగం, కుడుములు, ఉండ్రాళ్లు తరచూ తీసుకోవడం బహు శ్రేష్టం. బియ్యంతో ఏదో ఒక పప్పు కలిపి వండే వంటకాన్ని పులగం అంటారు. కొంతమంది నెయ్యి, ఇంగువ, ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తదితర ద్రవ్యాలతో కలిపి వండుతారు. దీనే్న కిచిడీ అంటారు. గుండె జబ్బులకు మినపప్పుతో చేసిన పులగం భేష్షుగ్గా పనిచేస్తుంది. శరీరానికి చలవ చేయాలంటే పెసరపప్పు కలిపి చేసిన పులగం ఆరోగ్యప్రదాయిని. దీనే్న ఆలయాల్లో ‘కట్టె పొంగలి’ అని పిలుస్తారు. దీంట్లో కొద్దిగా మిరియాలు వేయడం ద్వారా మరింత రుచి వస్తుంది. శనగపప్పుతో చేసిన పులగం బలాన్నిస్తుంది.
శే్లష్మంతో బాధపడేవారు కందిపప్పుతో చేసిన పులగాన్ని తీసుకుంటే ఫలితం ఉంటుంది. పులగంలో కొద్దిగా జీలకర్ర వేయడం వల్ల పైత్యాన్ని నివారించవచ్చు. ఇక ఉండ్రాళ్లు, ఆవిరి కుడుములు కూడా.
ఆయుర్వేదంలో ఉండ్రాళ్లకు ఉండ్రములని, మోదకములనీ పేరు. విఘ్నేశ్వరుడు మోదకప్రియుడు కాబట్టి వినాయక చవితినాడు ఈ పిండివంటను చేస్తారు. మరిగే వేడినీటిలో బియ్యపు పిండి పోసి, ముద్దగా మారేటట్లు చేసి దానికి నానబెట్టిన సెనగపప్పు కలిపి నిమ్మకాయ సైజులో వుండలుగా చేసి నీటి ఆవిరి మీద వండితే ఉండ్రాళ్లు తయారవుతాయి. కొంతమంది కొబ్బరి తురుముని మధ్యలో వుంచి పూర్ణం చేసి కూడా వండుతారు. వీటిని అల్లం చెట్నీతో కాని లేదా పాలతో కాని లేదా నెయ్యితో కాని కలిపి వడ్డిస్తారు. ఉండ్రాళ్లను నూనె లేకుండా చేస్తారు. కాబట్టి తింటే లావెక్కుతామన్న భయం ఉండదు. అయితే అతిగా తింటే విరుగుడుగా జీలకర్ర, పుదీనా కలిపిన మజ్జిగ తీసుకోవాలి.
కుడుములు
సాధారణంగా కుడుములని మినపప్పు, బియ్యప్పిండి కలిపి చేస్తారు. ముందుగా మినపప్పు రుబ్బి, దానికి బియ్యప్పిండిని కలిపి వాసెన మీద బిళ్లలుగా ఉడికిస్తారు. ఇది వాతాన్ని, మేహవాతాన్ని తగ్గిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కుడుములను వేరు రకంగా కూడా చేస్తారు. ముందుగా కొబ్బరి తురుమునూ, బెల్లాన్ని కలిపి ఉడికించాలి. ఏలక్కాయలు, గసగసాలు, కొద్దిగా బియ్యప్పిండి చేర్చి ముద్దలుగా చేసి ఉంచుకోవాలి. ఇది మధ్యభాగం కోసమన్నమాట. ఇప్పుడు పై పొర కోసం పిండిని తయారుచేసుకోవాలి. కొంచెం నీళ్లు తీసుకుని బుడగలు వచ్చేవరకూ మరిగిన తరువాత కొద్దిగా నెయ్యి, ఉప్పు చేర్చాలి. తగినంత బియ్యప్పిండి కలిపి బాగా కలియతిప్పి మెత్తని ముద్దగా చేయాలి. దీనిని వేడిగా ఉండగానే చిన్నచిన్న వుండలుగా చేసి, అప్పడం మాదిరిగా చేతులతో వెడల్పు చేసి, మధ్యలో ముందు తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి ఉండను పెట్టి కొసలకు నెయ్యి పూసి సీలు చేసి ఆవిరి మీద ఉడికించాలి. వేడివేడి కుడుములు రెడీ.
పాలతాలికలు
మరిగే నీళ్లలో బియ్యప్పిండిని పోసి ముద్దగా కలిపి, అరచేతులతో చిటికెన వేలు ఆకృతిలో పొడవుగా చేసి పాలలో వేసి ఉడికించి తయారుచేసినవే పాలతాలికలు. అతి దప్పికను, పైత్య వికారాలను తగ్గిస్తాయి.
పరమాన్నం
దీనికి ఆయుర్వేదంలో క్షీరోదనం అని పేరు. పాలలో బియ్యాన్నిగాని లేదా సగ్గుబియ్యాన్ని కాని వేసి తగినంత బెల్లాన్ని లేదా పంచదారను కలిపి ఉడికిస్తే పరమాన్నం తయారవుతుంది. ఇది ధాతువృద్ధిని కలిగిస్తుంది. వాతాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది.
శనగ గుగ్గిళ్లు
శనగలను నీళ్లలో నానబెట్టి, నీటి ఆవిరి మీద ఉడికించి, కొద్దిగా నెయ్యితోనూ, పసుపు కారం, ఉప్పు, ఇతర దినుసులతోనూ తాళింపు వేసి చేస్తారు. నానబెట్టడం వల్ల పొట్ట ఉబ్బరింపును కలిగించదు. మాంసకృత్తులు ఎక్కువ కనుక పెరిగే పిల్లలకు మంచి చేస్తాయి.
-డా.చిరుమామిళ్ల మురళీ మనోహర్

No comments: