Saturday, September 11, 2010

ఆనందాసనం

ఆరోగ్యానికి నవ్వు చాలా అవసరం. హృదయం ప్రసన్నంగా వున్నప్పుడే నవ్వు వస్తుంది. అదే విధంగా నవ్వు రాగానే హృదయం ప్రసన్నం అవుతుంది. మొత్తం జీవరాశిలో నవ్వు మానవ జాతికే లభించిన వరదానం. నవ్వు ముఖం అందరినీ ఆకర్షిస్తుంది. అందువల్లనే నవ్వు ముఖం అవసరమని అందరూ భావిస్తూ వుంటారు. నవ్వు ముఖం వికసించి వుంటుంది.

andhanamహాస్యం టెన్షనును తొలగించేందుకు ఉపయోగపడుతుందని ఆధునిక శాస్తవ్రేత్తలు కూడా అంగీకరించారు. కనుకనే ప్రపంచమంతా హాస్య క్లబ్బులు(లాఫింగ్‌) ఏర్పడుతున్నాయి. యోగా శిక్షణా కేంద్రాల్లోనూ దీనిని ఆనందాసనం రూపంలో సాధకులు అభ్యసిస్తున్నారు. ఇప్పుడు ఆ ఆసనం గురించి తెలుసుకుందాం..

సాహిత్య రసశాస్త్రం ప్రకారం నవరసాల్లో హాస్యరసం ఒకటి. హాస్యరసానికి స్థారుూ భావం నవ్వు... నవ్వు వచ్చినప్పుడు శరీరంలో జరిగే మార్పును అనుభావాలు అంటారు. చిరు నవ్వు వచ్చినప్పుడు ముఖం విప్పారడం, కళ్లు సగంగాని లేక పూర్తిగా గాని మూత పడటం, పళ్లు బయటికి కనబడడం, పకపక నవ్వుతూ వున్నప్పుడు ధ్వని రావడం, భుజాలు ఎగురు తూ వుండటం, హాస్యరసానికి సంబంధించిన అనుభావాలు. ఈ అనుభావాలను రసశాస్త్రం లో స్మిత, హసిత, విహసిత, అవహసిత, అపహసిత, అతిహసిత అని ఆరు విధాలుగా విభజించారు.

స్మితము : నేత్రాల్లో కొద్దిగా వికాసం, పెదవుల కొద్ది కదలిక, ధ్వని వెలువడక పోవుట, చిరునవ్వు లేక మందహాసం దీనికి లక్షణాలు.
హాసితము : పెై లక్షణాలతోపాటు పళ్ల వరుస కూడా బయటికి కనబడటం హసిత లక్షణం.
విహసితము : ఇందులో స్మిత, హసిత లక్షణాలతోపాటు కంఠం నుంచి మధురధ్వని వెలువడుతుంది.
అవహసితము : విహసిత లక్షణాలతోపాటు శిరస్సులో కొంచెం కదలిక, భుజాల కదలిక లేక భుజాలు కొద్దిగా ఎగరడం అవహసిత లక్షణాలు.
అపహసితము : అవహసిత లక్షణాలతోపాటు కండ్లలో నీరు నిండటం, ఆనందబాష్పాలు రాలడం, అపహసిత లక్షణాలు.
అతిహసితం : పెై లక్షణాలతోపాటు కాళ్లు చేతులు కదిలించడం, ఎదురుగా వున్నవారిని చేతులతో పొడవటం, పెద్దగా ధ్వని చేస్తూ అట్టహాసంగా నవ్వడం అతిహసిత లక్షణాలు.
లాభాలు : బాధలు, కష్టాలు, నిరాశలు, నిస్ఫృహలు తొలగి మన స్సుకు ఆనందం కలు గుతుంది. జీర్ణక్రియ, శ్వాసప్రక్రియ, రక్త ప్రసరణ వంటి శరీర క్రియలపెై మంచి ప్రభావం పడుతుంది. హృదయం లోతుల్లో నుంచి ప్రసన్నత,ఆకర్షణా శక్తి పెరుగుతుంది.

No comments: