Thursday, September 23, 2010

ఫ్రెంచ్ ఫ్రైస్.. ఇక ఎన్నైనా తినొచ్చు!

మీకు బంగాళదుంపతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ తెలుసు కదా? ప్రపంచంలో చాలామందికి ఇవంటే ప్రాణం. కానీ తినాలంటేనే భయం. ఎందుకో తెలుసా? బంగాళదుంపల్లో అధిక శాతం పిండి పదార్థం ఉండడమే దానికి కారణం. తింటే ఎక్కడ లావెక్కుతామో అని చాలామంది వీటిని దూరం పెడుతుంటారు. కానీ ఇకమీదట ఆ బాధ లేదు.

ఎంచక్కా మీరు తినగలిగినన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగించేయొచ్చు. ఎందుకంటే సిమ్లాలోని సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇటీవల జన్యుమార్పిడి పద్ధతి ద్వారా ప్రొటీన్లు అధిక శాతం ఉండే బంగాళదుంపను సృష్టించారు. వ్యవసాయ శాస్త్రవేత్త శుభ్ర చక్రవర్తి ఆధ్వర్యంలో ఆయన సహచర బృందం ఈ బంగాళదుంపను సృష్టించారు. దక్షిణ అమెరికాలో విరివిగా దొరికే అమరంత్(తోటకూర) మొక్క నుంచి తీసిన జన్యువును దేశీయ బంగాళదుంప వంగడంలో ప్రవేశపెట్టడం ద్వారా 60 శాతం ప్రొటీన్లు కలిగిన కొత్త రకం బంగాళదుంప రూపుదిద్దుకుంది.

అంతేకాదు న్యూఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఇప్పటికే మన దేశంలోని మూడు ప్రాంతాల్లో రెండేళ్లుగా ఈ రకం బంగాళదుంపలను పండించి చూశారు. "ప్రొటీన్లు అధికంగా కలిగిన ఈ బంగాళదుంపను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

ఈ రకం బంగాళదుంపలను వాణిజ్య పంటగా పండించేందుకు అవసరమైన అనుమతుల కోసం మేం జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీకి దరఖాస్తు చేశాం. తొలిదశ అనుమతి కూడా లభించింది. త్వరలోనే రెండో దశ అనుమతి కూడా లభించే అవకాశం ఉంది..'' అని చక్రవర్తి చెప్పారు.

No comments: