Saturday, February 26, 2011

వెజిటేరియన్ మాంసం


పిల్లల ఎదుగుదల బాగుండాలన్నా, కండరాలు దృఢంగా తయారు కావాలన్నా, మెదడు చురుగ్గా ఉండాలన్నా ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి అని చెబుతుంటారు వైద్యులు. శరీరానికి అత్యంత అవసరమైనవి సూక్ష్మ పోషకాలు, పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు. వీటన్నింటిలో నీటి తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్నవి ప్రొటీన్లే. వీటినే తెలుగులో మాంసకృత్తులు అంటారు. కొన్ని ప్రోటీన్లు మాంసాహారంతో శరీరానికి నేరుగా అందుతాయి కాబట్టే వాటికి ఆ పేరు. మరి శాకాహారులైతే ఈ మాంసకృత్తులు ఎలా...? మాంసం, చేపలు తినని వారికి ఏ ఆహారంతో ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. ప్రొటీన్లు పుష్కలంగా అందేలా ‘ముందుజాగ్రత్త’ తీసుకోండి. 

మాంసకృత్తులు మన శరీర నిర్మాణంలో ముఖ్యమైన పదార్థాలు. కండరాల బలానికి ఇవి చాలా అవసరం. అలాగే కణజాలల పనితీరు, అంతర్గత అవయవాల ఆరోగ్యానికి ప్రొటీన్లు ఎంతగానో అవసరం అవుతాయి. మాంసకృత్తులని ప్రాణ్యములు అనీ, ప్రొటీన్లు అని వీటిని పిలుస్తారు. గ్రీకు భాషలో ‘ప్రోటోస్’ అంటే ముఖ్యమైనది అని అర్థం.
అమినో యాసిడ్స్...


ఇరవెరైండు రకాల అమినో యాసిడ్స్ వేరు వేరు తరహాల్లో ఒక దానికి ఒకటి అనుసంధానితమై మన శరీరంలో ఎన్నో రకాల ప్రొటీన్లుగా తయారవుతాయి. ఉదాహరణకు... శిరోజాలకు, గోళ్లకు, ఎముకలకు, హార్మోన్లకు, కండరాలకు... ఇలా ప్రతీ దానికీ వేరు వేరు మోతాదుల్లో ప్రొటీన్ అవసరం అవుతుంది. ఈ ప్రోటీన్ సమకూర్చడం అన్నది ఇరవై రెండు రకాల అమినో యాసిడ్స్ ద్వారా సాధ్యమౌతుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆర్.ఎన్.ఎ, డి.ఎన్.ఎ పర్యవేక్షణలో జరుగుతుంది. (ఆర్.ఎన్.ఎ, డి.ఎన్.ఎ ప్రత్యేకమైన ప్రొటీన్లు. వీటిలో మన జీవన విధానాన్ని నిర్దేశించే జన్యువులు ఉంటాయి). అయితే వీటిలో ఎనిమిది రకాల అమినో యాసిడ్స్‌ని శరీరం స్వయంగా తయారుచేసుకోలేదు. అందుకని వీటిని తప్పనిసరిగా ఆహారం ద్వారానే తీసుకోవాలి. వీటినే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు.

శరీరంలో ప్రొటీన్లు అమినో యాసిడ్స్‌తో తయారవుతాయి. అన్ని రకాల ప్రొటీన్లు జీర్ణం అయ్యాక అమినో యాసిడ్స్‌గా మారి రక్తంలోకి వెళ్తాయి. అక్కడ నుంచి ఈ అమినో యాసిడ్స్ మళ్లీ మన శరీరానికి అవసరమైన కొత్త ప్రొటీన్‌గా రూపొందుతాయి. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, మొదలైన జంతు సంబంధమైన వనరుల నుండి లభించే ప్రొటీన్లు తీసుకునేవారికి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అయితే పప్పులు, కాయగూరలు తీసుకునే శాకాహారులు కూడా ప్రొటీన్లు ఉండే సమతుల ఆహారం తమ భోజనంలో ఉండేలా చూసుకుంటే వారి ఆరోగ్యం బాగుంటుంది.


ప్రొటీన్ల వల్ల ఉపయోగాలు...
శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు, ఎముకల బలానికే కాకుండా హార్మోన్ల పనితీరుకు, రోగనిరోధక కణాల కోసం, జీర్ణకోశ రసాయనాల విడుదలకు, ఎర్ర రక్త కణాల పునరుజ్జీవానికి ప్రొటీన్ల అవసరం ఎంతైనా ఉంది. పెరిగే వయసులో సరైన ఎదుగుదలకే కాదు, ఒకసారి ఎదిగిన తర్వాత శరీరాన్ని సరిగ్గా మెయింటనెన్స్ చేయడానికి కూడా ప్రొటీన్ల సహాయం తప్పనిసరి. అంతేకాదు ప్రొటీన్లు శక్తినీ, శరీరానికి తగినంత వేడిని అందిస్తాయి.
ప్రొటీన్లు శరీరానికి తగినంతగా అందకపోతే...
జుట్టు రాలిపోవడం, గోళ్లు విరిగిపోవడం, చర్మం పొడిబారడం, రక్తహీనత, నీరసంగా ఉండటం, కండరాలు క్షీణత, లైంగికంగా బలహీనంగా అనిపించడం, చురుకుదనం లోపించడం... వంటివి జరుగుతాయి.
వీటిలో ప్రొటీన్లు ఎక్కువ...
పాలు, మాంసం, గుడ్లలో ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి.
తల్లిపాలలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే మొదటి ఏడాది ఇవి బిడ్డకు కావల్సిన బలాన్ని ఇస్తాయి. అందుకే తప్పనిసరిగా
తల్లిపాలు శిశువుకి ఇవ్వాలని, అవి శిశువు భవిష్యత్తు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటారు.

గింజధాన్యాలను నేరుగా కంటే, కొద్దిగా ఉడికించి తీసుకుంటే, త్వరగా జీర్ణమై ఇందులోని ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. అలా అని గింజ ధాన్యాలను ఎక్కువ ఉడికించడం, ఉడికించిన నీరు పారబోయడం వంటివి చేస్తే ప్రొటీన్లను కోల్పోయే అవకాశం ఉంటుంది.

మిగతా చిక్కుడు జాతి గింజలతో పోల్చితే సోయాలో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి.
 

వెజ్‌లో ప్రొటీన్లు...
బాదం, జీడిపప్పు, శనగలు, వేరుశనగలు, చిక్కుళ్లు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వులు, వాల్‌నట్స్, కందిపప్పు, బీన్స్, సోయా బీన్స్, బఠాణీ, బార్లీ, దంపుడు బియ్యం, ఓట్‌మిల్, గోధుమ...

గుడ్డులో...




రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది అని చెబుతుంటారు. కోడిగుడ్డులో 13 శాతం అన్ని రకాల అమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే ప్రొటీన్లు తెల్ల సొనలో ఉంటాయి. పచ్చసొనలో విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఉంటాయి. మన శరీరానికి, కణజాలానికి తెల్లసొనలో ఉండే ప్రొటీన్లు 99.9% సరిగ్గా సరిపోలుతాయి. రోజూ ఒక గుడ్డును తినడం వల్ల వీటిలోని పోషకాలు అంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
అల్పాహారంలో...
తొమ్మిది నుంచి పదకొండు సంవత్సరాల వయసు గల విద్యార్థులలో పౌష్టికాహార నిపుణులు జరిపిన పరిశోధనల్లో తేలిన విషయం ఏంటంటే... ఉదయాన్నే అల్పాహారంలో ప్రోటీన్లు ఎక్కువ శాతం ఉన్న ఆహారం తీసుకున్న వారిలో మెదడు పనితీరు చురుకుగా ఉన్నట్టు వెల్లడైంది. అయితే శరీరానికి కావలసిన ప్రొటీన్లను అందించకుండా టీ, కాఫీల ద్వారా నేరుగా చక్కెరను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందవు. ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి.
 

100 గ్రా.ల పదార్థాలలో ప్రొటీన్ల శాతం...
మాంసాహారం, గుడ్డు, సోయా, కాయ గింజలు, పప్పు దినుసులు, నట్స్, పాలలో ఎక్కువ శాతం, కొద్ది మోతాదులో బియ్యం, గోధుమలలోనూ ప్రొటీన్లు ఉంటాయి.
సోయా - 40 %
కోడిగుడ్డు - 13%
మాంసం - 20 %
తృణధాన్యాలు - 10%
బియ్యం - 7%
ఆకుకూరలు, పండ్లు, దుంపలు - 2%
కొవ్వు తీసేసిన నూనె గింజలు - 50- 60%
(తెలగపిండి)
వయసుల వారీగా ఒక రోజుకు కావలసిన ప్రొటీన్లు

పురుషులకు - 60 గ్రా.; స్ర్తీలకు - 50 గ్రా.
గర్భవతికి - 50+15 గ్రా.; పాలిచ్చే తల్లులకు - 50+25 గ్రా. (12 నెలల వరకు)


Tuesday, February 22, 2011

క్యాన్సర్‌ని ముందే కనిపెట్టే పెట్‌స్కాన్

క్యాన్సర్... వచ్చిందంటే ఇక అంతే అని భయపడే రోజులు పోయాయి. ఎంత క్లిష్టమైన క్యాన్సర్‌నైనా ఇప్పుడు ఆధునిక పద్ధతులతో మట్టికరిపించవచ్చు. చాలా సందర్భాల్లో కణితి ముదిరేవరకూ ఎటువంటి లక్షణాలూ కనిపించవు. ఇలాంటప్పుడు ట్యూమర్ ఏర్పడుతున్న ప్రారంభదశలోనే గుర్తించగలిగితే క్యాన్సర్ మూలాలు కూడా లేకుండా చేయవచ్చు. వ్యాధి నిర్ధారణ దగ్గరి నుంచి కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇతర చికిత్సల వరకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య పరిజ్ఞానం ద్వారా క్యాన్సర్‌ను ఎదుర్కోవడం ఇప్పుడు మరింత సులభం అయింది. తొలిదశలోనే ఉన్న క్యాన్సర్ కణితిని వెతికిపట్టుకోవడానికి వచ్చిన కొత్త పరికరమే హై డెఫినిషన్ పెట్ స్కాన్.

ఆదిలోనే...
అనారోగ్యం కలిగినప్పుడు శరీర ప్రక్రియల్లో మార్పులు వస్తాయి. ఆ తరువాతే మనకు పైకి వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. చాలా సందర్భాల్లో ఈ లక్షణాలు కనిపించేవరకు అనారోగ్యం కలిగిందని గుర్తించలేం. మొట్టమొదట జీవప్రక్రియల్లో కలుగుతున్న మార్పుల దశలోనే వాటిని గుర్తించగలిగితే మరింత త్వరగా చికిత్స అందించవచ్చు. ఈ మార్పులను ప్రారంభదశలోనే గుర్తిస్తుంది పెట్ స్కాన్.

ఉదాహరణకు క్యాన్సర్ విషయంలో కణితి ఏర్పడటానికి ముందు ఆ భాగంలో ఉండే కణాలు అనియంత్రంగా అసహజంగా పెరుగుతూ ఉంటాయి. అంటే కణవిభజన ప్రక్రియలో మార్పులు వస్తాయి. అలా అసాధారణమైన కణవిభజన ప్రక్రియను ముందుగానే గుర్తించగలిగితే క్యాన్సర్‌ని అంత సులువుగా తరిమేయవచ్చు. పెట్ స్కాన్ ఇలా వ్యాధి ప్రారంభదశలోనే జీవక్రియల్లో జరిగే మార్పులను గుర్తించగలుగుతుంది కాబట్ట్టే కణుతులు పూర్తిగా ఏర్పడకముందే క్యాన్సర్ ఉందనే విషయాన్ని కనుక్కోవచ్చు. అంతేకాదు ఎటువంటి చికిత్స అందించాలో కూడా నిర్ణయించుకోవడం సులభం అవుతుంది.

పెట్ స్కాన్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ఏది అవసరమో అదే చికిత్స చేయవచ్చు. క్యాన్సర్ ఏ దశలో ఉందో కనుక్కోవడానికి చేసే ఇన్వేసివ్ పద ్ధతులను చేసే అవసరం ఉండదు. అంతేకాదు, క్యాన్సర్ దశను బట్టి చేసే శస్త్రచికిత్సలతో పనిలేదు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాదు.. పేషెంటుకు అనవసరమైన ఇబ్బందులుండవు. క్యాన్సర్ కణాలు వేగంగా పెరుగుతుంటాయి కాబట్టి వీటి జీవక్రియ రేటు అధికంగా ఉంటుంది. ఈ కణాలు పెట్ స్కాన్‌లో తక్కువ సాంద్రతతో కనిపిస్తాయి.

ఎలా పనిచేస్తుంది?
పెట్, సిటి రెండింటి సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించుకుని పనిచేస్తుంది పెట్ సిటి స్కాన్. ఈ పరీక్షకు దాదాపు 20 నిమిషాలు పడుతుంది. ముందుగా రేడియోలేబల్ రూపంలోని గ్లూకోజ్‌ని ట్రేసర్ ఇంజక్షన్‌గా ఇస్తారు. ఒక గంట సమయంలో ఈ ట్రేసర్ రోగి శరీరమంతా వ్యాపిస్తుంది. రోగి శరీరంలోకి ఎక్కించిన ఈ రేడియో యాక్టివిటీ ఆరు గంటల వరకు ఉంటుంది. ట్రేసర్ శరీరం అంతా వ్యాపించిన తరువాత స్కానింగ్ మొదలవుతుంది.

రోగి పడుకున్న బల్ల స్కానర్ కింద ముందుకు వెళ్తూ ఉంటుంది. సిటి చేయడానికి ఓ నిమిషం సమయం పడుతుంది. తరువాత పెట్ స్కానింగ్ వైపు రోగి పడుకున్న బల్ల కదులుతుంది. పెట్ స్కానర్‌లో రోగి చుఉట్టూ కొన్ని వందల రేడియేషన్ డిటెక్టర్లు ఉంటాయి. రోగికి ఎక్కించిన రేడియోన్యూక్లైడ్ ఎమిషన్స్ (ఉద్గారం)ని బట్టి ఆయా శరీర భాగాల జీవక్రియల రేటును కొలుస్తారు. ఈ సంకేతాలను 3 డైమెన్షనల్ చిత్రాలుగా తయారుచేస్తుంది కంప్యూటర్. ఇలా ప్రతి కణ జాల పనితీరును నిర్ధారిస్తారు.

ఎలా చేస్తారు?
పెట్ సిటి స్కాన్ ఫలితాలు వ్యాధి నిర్ధారణలో కీలకపాత్ర పోషిస్తాయి. క్యాన్సర్ ఉందా లేదా అన్న విషయమే కాకుండా ఎటువంటి చికిత్సను అందివ్వాలి.. ఎలా డీల్ చేయాలన్న అంశాల్లో స్పష్టమైన అవగాహనను అందిస్తాయి. అంటే వ్యాధి నిర్ధారణలోనే కాకుండా అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతుల్లో సరైనదాన్నిఎంచుకోవడాని, చికిత్స తరువాత పరిస్థితులను అంచనా వేయడానికి, చికిత్స పద్ధతులను మార్చడానికి కూడా ఇది మార్గనిర్దేశనం చేస్తుంది. స్కాన్ చే సేటప్పుడు మెత్తని బల్లపై పడుకోబెడతారు.

ట్యూబు ఆకారంలో ఉండే పెట్ సిటి స్కానర్ వైపు ఆ టేబుల్ నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. స్కాన్ చేసేటప్పుడు కదలకుండా పడుకోవాలి. ఏమాత్రం కదిలినా స్కాన్ సరిగ్గా రాదు. స్కానింగ్ సమయంలో చిన్న శబ్దం వస్తూ ఉంటుంది. బల్ల ముందుకు కదులుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు చిత్రాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పరీక్షకు 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. అయితే మొత్తం పరీక్ష కోసం 2 నుంచి 3 గంటల వరకు ఇందుకోసం రోగి తన సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.

స్కానింగ్ వేళ ఇలా...

- స్కాన్ చేసే సమయంలో కదలకూడదు. - స్కానింగ్ తరువాత డాక్టర్ చెప్పేవరకు ఏమీ తినకూడదు. తాగకూడదు.

- పరీక్ష అయిపోయిన తరువాత ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న రేడిఫార్మసుటికల్ పదార్థం తొలగిపోతుంది. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు.

- పెట్ స్కాన్ తరువాత ఇత రులను కలవద్దేమో అని అపోహ పడుతుంటారు. కానీ రేడియోధార్మిక పదార్థం ఎంతోసేపు శరీరంలో ఉండదు కాబట్టి ఎటువంటి సమస్యా లేదు. కానీ అదనపు రక్షణ కోసం కొన్ని గంటల పాటు చిన్నారులు, గర్భిణులు దూరంగా మెలగడం మంచింది.

క్యాన్సర్ కాకుండా...
హై డెఫినిషన్ పెట్ స్కాన్ కేవలం క్యాన్సర్ నిర్ధారణలోనే కాదు.. గుండె, నాడీవ్యవస్థలకు సంబంధించిన సమస్యలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మూర్ఛవ్యాధి మూలాలను కనుక్కోవడంలో పెట్‌స్కాన్ సహాయపడుతుంది. మెదడులో ఏ ప్రదేశంలో సమస్య ఉందో కనిపెడుతుంది. అల్జీమర్ వ్యాధి నిర్ధారణలో స్పష్టమైన ఫలితాలను అందిస్తుంది. సాధారణ మతిమరుపుకి, అల్జీమర్స్‌కి తేడా పెట్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు.

గుండెకు సంబంధించిన జీవక్రియను అధ్యయనం చేయడం ద్వారా పెట్ స్కాన్ హృద్రోగాలను నిర్ధారిస్తుంది. ఏయే రక్తనాళాల్లో రక్తప్రసరణ తక్కువగా ఉందో, ధమనులు బ్లాక్ అవడానికి ఏమేమి కారణం అవుతున్నాయో పసిగడుతుంది. అంతేకాదు దెబ్బతిన్న కండర భాగాన్ని, జీవం వున్న కండరాన్ని గుర్తిస్తుంది. మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ ఉన్న రోగులకి, రీవాస్కులరైజేషన్ చేయాల్సిన వాళ్లకి ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది.


యశోద క్యాన్సర్ ఇనిస్టిట్యూట్
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ
హైదరాబాద్ ఫోన్ : 040-2341 4444, 98661 14064

Sunday, February 20, 2011

న్యుమోనియాకు బ్రయోనియా

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు త్వరగా న్యుమోనియా బారిన పడుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సరియైన సమయంలో చికిత్స అందించకపోతే న్యుమోనియా వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ సమస్యకు హామియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయంటున్నారు డాక్టర్ శ్రీకాంత్.

న్యుమోనియా అంటే ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్. బాక్టీరియా లేక వైరస్ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఫంగస్, శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే కొన్ని రకాల ఇరిటెంట్స్ ద్వారా వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి అంతగా అభివృద్ధి చెందని చిన్న పిల్లలు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే 65 సంవత్సరాలు పైబడిన వారు న్యూమోనియా బారినపడే అవకాశాలు ఎక్కువ.

వ్యాధి నిరోధక శక్తి తగ్గితే...

వ్యాధి నిరోధక శక్తి తగ్గినపుడు ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉండదు. దీనివల్ల త్వరగా వ్యాధి బారినపడతారు. సీఓపీడీ, హెచ్ఐవీ, డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా న్యుమోనియా బారిన పడే అవకాశం ఉంది. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, కీమోథెరపీ తీసుకున్న వారిలో న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దుమ్ము, కెమికల్స్, గాలి కాలుష్యం, హానికర పదార్థాలు ఎక్కువగా విడుదలయ్యే ప్రదేశాలలో పనిచేసే వారిలో ఈ ఇన్‌ఫెక్షన్ కనిపిస్తూ ఉంటుంది.

స్మోకింగ్, ఆల్కహాల్ :
ఊపిరితిత్తుల్లో ఉండే సన్నని కేశాలు క్రిములను, బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడతాయి. పొగతాగడం వల్ల ఇవి డ్యామేజ్ అవుతాయి. తద్వారా బాక్టీరియా చేరిపోయి న్యుమోనియా బారినపడతారు. ఆల్కహాల్ తీసుకునే వారిలో ఆస్టిలేషన్ న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ. శ్వాస పీల్చుకునేటప్పుడు కొన్ని రకాల పార్టికల్స్ ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల ఈ రకమైన న్యుమోనియా వస్తుంది. ముఖ్యంగా వాంతులు అయినపుడు చిన్న పార్టికల్స్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం ద్వారా న్యుమోనియా వస్తుంది.

హాస్పిటల్ ఎక్వైర్డ్ న్యుమోనియా : ఇతర కారణాల వల్ల వచ్చే న్యుమోనియా కంటే ఇది తీవ్రంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడానికి సహాయంగా వెంటిలేటర్స్ పెట్టినపుడు సమస్య తీవ్రతరం అవుతుంది. వెంటిలేటర్స్ వల్ల రోగి దగ్గలేకపోవడంతో క్రిములు ఊపిరితిత్తుల్లోకి చేరి ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తాయి. సర్జరీ, గాయం: గాయాల బారినపడినపుడు, సర్జరీ జరిగినపుడు ఎక్కువ సమయం పడుకోవలసి ఉంటుంది. దీనివల్ల మ్యూకస్ ఊపిరితిత్తుల్లోకి చేరి బాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది.

లక్షణాలు
- చలి ఎక్కువగా ఉండటం, దగ్గుతో పాటు కఫం, శ్వాసలో ఇబ్బంది. ్గ ఛాతీలో నొప్పి.

నిర్ధారణ - ఫిజికల్ ఎగ్జామినేషన్ ్గ ఛాతీ ఎక్స్‌రే ్గ రక్తపరీక్షలు

చికిత్స యాంటీ బయోటిక్స్ వాడటం ద్వారా న్యుమోనియా తగ్గించవచ్చు. దగ్గు చాలా రోజుల వరకు ఉన్నా, జ్వరం, నొప్పి వంటి లక్షణాలు త్వరగానే తగ్గుముఖం పడతాయి. వైద్యుని సలహా మేరకు మందులు వాడటం వల్ల త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.

హోమియో మందులు బ్రయోనియా : న్యుమోనియాకు వాడదగిన మందు. రాత్రివేళ పొడిదగ్గు అధికం కావడం, భోజనం చేసిన తరువాత సమస్య ఎక్కువ కావడం, వాంతులు, ఛాతీలో నొప్పి, దగ్గుతో పాటు కఫం, దాహం ఎక్కువ, నాలుక పొడిగా ఉండటం, మలబద్దకం, చిరాకు, కుడి ఊపిరితిత్తిలో నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు వాడదగిన ఔషధం.

ఫాస్పరస్ : గొంతులో నొప్పి, స్వరపేటికలో నొప్పితో సరిగ్గా మాట్లాడలేరు. చల్లగాలికి దగ్గు అధికం, ఛాతీలో నొప్పి, మంట, బరువుగా ఉండటం, ఎడమవైపు పడుకుంటే సమస్య ఎక్కువ కావడం, దగ్గుతో పాటు రక్తం, భయం, జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం, చల్లటి నీరుతాగాలనిపించడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు సూచించదగిన మందు.

స్పాంజియ : వాయుమార్గం పొడిగా ఉండటం, గొంతులో నొప్పి, మంట, పొడిదగ్గు, శ్వాస తీసుకునేటప్పుడు, రాత్రివేళ సమస్య అధికం కావడం, భోజనం తరువాత దగ్గు ఎక్కువ కావడం, ఆస్తమా, పిల్లికూతలు, బలహీనంగా ఉండటం, ఆందోళన వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన హోమియో ఔషధం.

సాంబుకస్ : ఛాతీలో నొప్పి, బరువు, దగ్గు తరచుగా రావడం, శ్వాసలో ఇబ్బంది, రాత్రివేళ సమస్య అధికం, జలుబు, ముక్కు పొడిబారడం, ముఖం నీలంరంగులోకి మారడం, చెమటలు ఎక్కువగా పట్టడం, భయపడే స్వభావం వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు సూచించదగిన మందు.

కాలికార్బ్ : ఛాతీలో నొప్పి, కుడివైపు పడుకున్నప్పుడు సమస్య అధికం, గొంతులో నొప్పి, పొడి దగ్గు, ఉదయం పూట దగ్గు అధికం, పిల్లికూతలు, చిరాకు, భయం, ఆందోళన, శబ్దాలను భరించలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం.

జస్టినియా : పొడిదగ్గు, ఛాతిలో నొప్పి, గొంతులో నొప్పి, దగ్గుతో పాటు తుమ్ములు, శ్వాసలో ఇబ్బంది, తలనొప్పి, ఆహారపదార్థాలు రుచిగా అనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటే ఈ మందు వాడవచ్చు.

ఆర్స్ఆల్బ్ : ఆస్తమా, రాత్రివేళ సమస్య అధికం, ఛాతీలో నొప్పి, మంట, దగ్గు, కఫం, ఊపిరితిత్తులలో నొప్పి, ఎక్కువగా కుడివైపున నొప్పి, పిల్లికూతలు, పొడిదగ్గు, ఆందోళన, దాహం ఎక్కువ తదితర లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ ఔషధం ఉపకరిస్తుంది. డ్రాసిర : పొడిదగ్గు, గొంతులో నొప్పి, దగ్గుతో పాటు కఫము, గొంతులో ఏదో ఉన్నట్టుగా అనిపించడం, దురద, మాట్లాడినపుడు ఆయాసం, శ్వాసలో ఇబ్బంది, బరువు కోల్పోవటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం.


డా. యం. శ్రీకాంత్
ఫోన్ : 9550001133, 9550001199.

Friday, February 11, 2011

ఫిషర్స్‌కు ఆసిడ్ నైట్రికమ్

మలద్వారము దగ్గర చీలిక ఏర్పడడాన్ని ఆనల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల అల్సర్ తయారై దురద, నొప్పి, రక్తంకారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు
- ఎక్కువ కాలం మలబద్దకం లేక విరేచనాలు ఉండటం వల్ల నరాల మీద ఒత్తిడి పెరిగి మలద్వారం చీరుకుపోయి అల్సర్ తయారవుతుంది.

- మలబద్దకం ఉన్నప్పుడు మలవిసర్జన గట్టిగా జరగడం వల్ల చీలికవచ్చే అవకాశం ఉంది. విరేచనాల వల్ల ఎక్కువసార్లు కడగటం వల్ల మలద్వారం ఉబ్బిపోతుంది.

- ఆనల్ క్రిప్ట్‌లో సూక్ష్మజీవులు ప్రవేశించడం వల్ల క్రిప్టైటిస్ వచ్చి చీలిక ఏర్పడి అల్సర్‌గా మారుతుంది.

- కొంతమందిలో ఆనల్ ఫిషర్ నయం కాకుండా చాలా సార్లు దెబ్బతినడం వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది.

- మల విసర్జనలో సరిగా అరగని పదార్థాలు ఉండటం వల్ల మలద్వారం దగ్గర ఉన్న చర్మం చీలుకుపోతుంది.

- ఆనోరెక్టల్ సర్జరీ, ప్రొక్టైటిస్, క్షయ, క్యాన్సర్ వల్ల కూడా ఆనల్ ఫిషర్ వచ్చే అవకాశాలున్నాయి.

లక్షణాలు
- మలద్వారంలో చీలిక

- దురద, నొప్పి, రక్తంకారటం.

- మల విసర్జన తరువాత నొప్పి గంట వరకు ఉండటం.

-ఎర్రటి రక్తం మలంతో కలిసి గానీ, తురువాత గానీ రావటం.

-మలవిసర్జన సమయంలో నొప్పిగా ఉండటం.

- ఆనల్ ఫిషర్ రావడానికి ఆనల్్ ఆబ్సిస్(చీముగడ్డ)కూడా కారణమే.


నిర్ధారణ
మలద్వారం దగ్గర చర్మం వేలాడుతూ ఉంటుంది. అల్సర్ కనిపిస్తూ ఉంటుంది. సిగ్నాయిడ్ స్కోప్, ఆనోస్కోప్, కొలనోస్కోప్ ద్వారా పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.

చికిత్స
యాభైశాతం మందిలో ఫిషర్స్ ఎటువంటి ఆపరేషన్ లేకుండా వాటంతట అవే తగ్గిపోతాయి. మలద్వారం దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవటం, మల విసర్జన తరువాత కాటన్ గుడ్డతో తుడవటం వల్ల ఫిషర్ తొందరగా మానిపోతుంది. ఒకవేళ ఫిషర్ ఎక్కువ రోజులు ఉంటే మానడం కష్టమవుతుంది. సిట్స్ బాత్ (మలద్వారాన్ని ఇరవై నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచడం) వల్ల ఫిషర్ వల్ల వచ్చే సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, సమయానుసారంగా తినడం, సమయానికి మలవిసర్జనకు పోయే అలవాటు చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే ఎనస్తటిక్ ఆయింట్‌మెంట్ పైపూతగా రాసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

హోమియో మందులు
ఆసిడ్ నైట్రికమ్ : ఈ మందు ముఖ్యంగా శ్లేష్మపొర, చర్మం కలిసే దగ్గర సమస్య ఉంటే పనిచేస్తుంది. కుచ్చినట్లుగా నొప్పి, చిరాకు ఎక్కువగా ఉండటం, మలవిసర్జనకు కష్టపడాల్సి రావటం, మలవిసర్జన తరువాత గంటల తరబడి నొప్పి ఉండటం, మలంతో పాటు రక్తం పడుతుండటం, త్వరగా అలసిపోవటం, రాత్రివేళ చలిగానీ, వేడిగానీ ఎక్కువ ఉంటే బాధలు ఎక్కువ కావటం, ప్రయాణం చేస్తున్న సమయంలో ఉపశమనంగా అనిపించటం వంటి లక్షణాలున్న వారికి ఈ మందు ఉపయోగకరంగా ఉంటుంది.

ఆస్కులస్ హిప్ :
ఈ ఔషధం పేగు కింది భాగంలో ఎక్కువగా పనిచేస్తుంది. పైల్స్‌తో పాటు నడుము నొప్పి ఉండటం, రక్తం తక్కువగా పడటం, హెమరాయిడల్ వీన్స్(సిరలు)నిండుగా ఉబ్బిపోయి ఉండటం, మలాశయం దగ్గర చిన్న చిన్న పుల్లలు ఉన్నట్లుగా అనిపించటం, నొప్పి కింది నుంచి పైకి వెళుతున్నట్లు అనిపించటం, నడిచినపుడు, మలవిసర్జన సమయంలో నొప్పి ఎక్కువ కావడం వంటి లక్షణాలున్న వారు వాడదగిన మందు ఇది.

అలోస్ సొకట్రీన :
ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో చక్కగా పనిచేస్తుంది. మలాశయం దగ్గర నొప్పి, రక్తం ఎక్కువగా పడటం, చల్లటి నీటితో కడగినపుడు ఉపశమనంగా అనిపించటం, మలం జిగటగా రావడం, పైల్స్ బయటకు వేళాడుతూ ఉండటం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన ఔషధం.

రటానియా: ఈ మందు ముఖ్యంగా మలాశయం పైన పనిచేస్తుంది. విపరీతమైన వెక్కిళ్లు, మలాశయం దగ్గర నొప్పి, మలవిసర్జన తరువాత నొప్పి కొన్ని గంటల వరకు ఉండటం, మలవిసర్జనకు కష్టపడాల్సి రావడం, మంట, చల్లటి నీటితో కడగటం వల్ల ఉపశమనంగా ఉండటం వంటి లక్షణాలున్న వారికి సూచించదగిన మందు.

మెర్క్‌కార్: మలవిసర్జన సమయంలో తీవ్రమైన బాధ, మలం వేడిగా, రక్తంతో కలిసి రావడం, జిగటగా, దుర్వాసనకూడా ఉండటం, రాత్రి సమయంలో బాధ ఎక్కువగా ఉండటం, కదలకుండా ఉన్నప్పుడు ఉపశమంగా అనిపించడం వంటి లక్షణాలున్నవారు వాడదగిన మందు.

పమోనియా : మలవిసర్జన తరువాత దురద, మంటగా ఉండటం, కాళ్లపైన, పాదాలపైన, మలాశయం వద్ద పుండ్లు తయారవడం, పైల్స్ లేత వంకాయ రంగులో ఉండటం వంటి లక్షణాలున్న వారికి సూచించదగిన మందు.

నక్స్‌వామికా: ఆధునిక జీవనం వల్ల ఈ సమస్య వచ్చినవారికి ఉపయోగపడే మందు. ఎక్కువ సమయం కూర్చుని పని చేసే వారికి ఈ మందు ఇవ్వవచ్చు. మలబద్ధకం, తరచుగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, మలవిసర్జన కొంచెం కొంచెంగా రావటం, దురద, నొప్పి ఎక్కువగా ఉండటం, పైల్స్, ఉదయంపూట బాధ ఎక్కువవడం, నిద్ర పోయినపుడు ఉపశమనంగా అనిపించడం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన మందు.

సల్ఫర్: వేడి పడదు, నీళ్లు అంటే ఇష్టం ఉండదు. చర్మం, వెంట్రుకలు పొడిబారి ఉంటాయి. ఎక్కువ సేపు నిలబడి ఉండలేరు. మలద్వారం వద్ద మంట, దురద ఉంటుంది. పొద్దున లేచిన వెంటనే విరేచనాలు అవుతాయి. పైల్స్ నుంచి రక్తస్రావం, పొడిగా, వెచ్చగా ఉండే వాతావరణంలో ఉపశమనంగా అనిపించటం వంటి లక్షణాలు ఉన్న వారు వాడదగిన మందు.


డా. మురళి అంకిరెడ్డి, హోమియోకేర్ ఇంటర్నేషనల్,
ఫోన్ : 9550001133, 9550001199

Tuesday, February 1, 2011

అవగాహనాలోపం ... సెర్వికల్ క్యాన్సర్ శాపం ....

స్త్రీలలో మాత్రమే వచ్చే వ్యాధి సెర్వికల్ క్యాన్సర్. ఇది హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) వల్ల వస్తుంది. పురుషుల్లో ఈ వైరస్ ఉన్నా ఎటువంటి హాని చేయదు. కానీ వారి ద్వారా స్త్రీలకు సంక్రమిస్తుంది. గర్భాశయ ముఖద్వారానికి వచ్చే ఈ క్యాన్సర్ వేగంగా విస్తరించడానికి అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఈ వ్యాధి గురించి సరియైన అవగాహన లేదు. హెచ్‌పీవీ వైరస్ సోకినపుడు కొన్ని ప్రాథమిక లక్షణాలు బయటపడతాయి. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చేయి దాటిపోతోంది. కొందరు స్త్రీలు గుర్తించినా బయటకు చెప్పుకోలేక క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువగా బయటపడుతోంది.

కారణాలు అనేకం
హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) సోకడం వల్ల యోనికి, గర్భాశయంకు మధ్యన ఉన్న ప్రాంతంలో(గర్భాశయ ముఖద్వారం) క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. జననాంగాల ప్రాంతంలో శుభ్రత పాటించని వారికి, ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు పెట్టుకున్న వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెసీ సమయంలో వేసుకునే కొన్ని రకాల మాత్రల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సెర్వికల్ క్యాన్సర్‌లో squamous cell carcinoma ఎక్కువగా వస్తుంది. 90 శాతం మందిలో ఈ రకమైన క్యాన్సర్ వస్తుంది. మిగతా 10 adenocarcinoma, adenosquamous carcinoma అనే క్యాన్సర్ కనిపిస్తోంది.

రక్తస్రావంతో జాగ్రత్త
వైరస్ శరీరంలో ప్రవేశించినపుడు ప్రాథమిక దశలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఆ తరువాత ఎటువంటి లక్షణాలు ఉండవు. కానీ కొన్ని ఏళ్ల తరువాత క్యాన్సర్‌గా బయటపడుతుంది. మొదటి దశలో నొప్పి ఉండదు. రక్తస్రావం, పీరియడ్స్ ఎక్కువ రోజులు ఉండటం, సంభోగం తరువాత రక్తస్రావం, పీరియడ్స్‌కు, పీరియడ్స్‌కు మధ్య పీరియడ్స్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరువాత దశలో మూత్రంలో, మలంలో రక్తం పడటం, రక్తహీనత. నడుం నొప్పి, కాళ్లనొప్పులు ఉంటాయి. నాలుగో దశలో మూత్ర పిండాలలో వాపు, లివర్ ఎఫెక్ట్ కావడం జరుగుతుంది.

పాప్‌స్మియర్ టెస్ట్
సెర్వికల్ క్యాన్సర్ ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి పాప్‌స్మియర్ టెస్టు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒక ప్రత్యేకమైన పరికరం ద్వారా గర్భాశయ ముఖ ద్వారం నుంచి కొన్ని కణాలు తీసుకుని పరీక్షించడం జరుగుతుంది. పెల్విక్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా సెర్వికల్ నార్మల్‌గా ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. సెర్వికల్ ప్రాంతం నుంచి ముక్క తీసి పరీక్ష(బయాప్సీ)చేయడం ద్వారా కూడా క్యాన్సర్‌ను నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్లయితే ఎంత వరకు వ్యాపించింది తెలుసుకోవడానికి అల్ట్రా సౌండ్ అబ్డామిన్, ఎక్స్‌రే వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

హిస్ట్రెక్టమీ ఆపరేషన్
సెర్వికల్ క్యాన్సర్ సోకినపుడు మెదటి, రెండు దశలలో ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చు. రాడికల్ హిస్ట్రెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా గర్భాశయం, యోనిపైభాగం, అండాశయాలు, పెల్విక్‌నోడ్స్‌ను తొలగించడం జరుగుతుంది. క్యాన్సర్ సోకిన భాగాలను తొలగించడం వల్ల త్వరగా కోలుకుంటారు. మూడు, నాలుగో దశలో గుర్తించినపుడు రేడియేషన్, కీయోథెరపీని ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి బాగా ముదిరినపుడు కీమోథెరపీ ఇవ్వడం ద్వారా మరికొంతకాలం జీవించే అవకాశం కల్పించవచ్చు.

ముందుగా గుర్తిస్తే మేలు
సెర్వికల్ క్యాన్సర్‌లో నాలుగు దశలుంటాయి. మొదటి దశలో సెర్విక్స్ దగ్గరే వైరస్ ప్రభావం ఉంటుంది. రెండవ దశలో కొంత విస్తరిస్తుంది. మూడవ దశలో కొన్ని భాగాలకు, నాలుగవ దశలో శరీరం మొత్తం వైరస్ విస్తరిస్తుంది. మొదటి దశలో గుర్తిస్తే 95 శాతం కంటే ఎక్కువ నయమయ్యే అవకాశాలుండగా, రెండవ దశలో 80 శాతం, మూడవ దశలో 40 శాతం, నాలుగో దశలో 15 శాతం వరకు నయమయ్యే అవకాశాలున్నాయి.

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క మహిళ పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. ఋతుక్రమం ప్రారంభమయినప్పటి నుంచి వివాహం అయ్యేలోగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ప్యూబర్టీ దశలో మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సెర్వికల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. జననాంగాల ప్రాంతంలో శుభ్రత పాటించాలి. సురక్షితమైన లైంగిక సంబంధాలు చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సెర్వికల్ క్యాన్సర్ బారినపడకుండా చూసుకోవచ్చు.


డా. కె. శ్రీకాంత్
సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్టు,
యశోద క్యాన్సర్ ఇనిస్టిట్యూట్,
యశోద హాస్పిటల్, సోమాజిగూడ,హైదరాబాద్,
ఫోన్ : 9849977889