Showing posts with label తులసి. Show all posts
Showing posts with label తులసి. Show all posts

Saturday, November 12, 2011

ఫ్రెష్‌గా ఉండండి ఇలా...

 http://gerry.ws/files/2008/10/beautiful-face-by-tony.jpg
ముఖ సౌందర్యం, వర్చస్సు ఎక్కువగా, శరీర ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటాయి. అయితే ఆరోగ్యం బాగానే ఉన్నా, వాతావరణ కాలుష్యాల వల్ల కూడా కొందరి ముఖం మీద కొన్ని మచ్చలు, మరకలూ ఏర్పడవచ్చు. వీటిని నివారించడంలో తులసి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. కడుపులోకి తీసుకునే తులసి రసం, రక్తశుద్ధికి దివ్యంగా పనిచేస్తుంది. అలాగే, ముఖం మీద లేపనంగా వాడితే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. బ్యాక్టీరియాను నశింపచేసే లక్షణం ఉన్నందున,ఆరోగ్య పరిరక్షణలో అనాదిగా తులసికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం వేళ కాసేపు తులసి ముందు కూర్చుని ఆ వాసనను బలంగా పీలిస్తేనే రక్తశుద్ధి అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అలాంటిది కడుపులోకి నేరుగా ఆ రసాన్ని, లేదా ఆకు ముద్దను తీసుకుంటే ఇక చెప్పేదేముంది!http://www.kacha-stones.com/images/Tulasi1.gif
* ఎండు తులసి ఆకు పొడిని పౌడర్‌లా రోజూ ముఖానికి పట్టిస్తే, ముఖం సౌందర్యవంతంగానూ, కాంతివంతంగానూ మారుతుంది. ఈ పొడి ముఖం మీద ఉండే పలుచనివే కాదు గాఢమైన మచ్చల్ని కూడా తొలగిస్తుంది.

* రోజూ కొన్ని తులసి ఆకుల్ని, నమలి తినేస్తే, రక్త శుద్ధి ఏర్పడుతుంది. అలాగే తులసి పొడికి కొన్ని నీటి చుక్కలు కలిపిగానీ, పచ్చి తులసి ఆకులను నూరి గానీ, ఒక పేస్ట్‌లా ముఖానికి పట్టిస్తే, అక్కడున్న గుంటల్లో నిలిచిపోయిన అతి సూక్ష్మమైన మలినాలు సైతం తొలగిపోయి వర్చస్సు పెరగడంతో పాటు ముఖం, సహజ లావణ్యాన్ని సంతరించుకుంటుంది.

*ముఖం తాజాగా ఉండడానికి , ఏదైనా పాత్రలో కాసిని మంచి నీళ్లు తీసుకుని, అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి. అందులో ఓ పిడికెడు తులసి ఆకులు, పిడికెడు మెంతెం ఆకులు వేసి కాసేపు మరగించాలి. జత్తును టవల్‌తో కట్టేసుకుని ముఖానికి మాత్రమే ఆ ఆవిరి పట్టాలి. కొన్ని నిమిషాల తరువాత చన్నీళ్లతో ముఖం కడిగేసుకుంటే ముఖం తాజాగా మెరిసిపోతుంది.
http://www.dyeli.com/wp-content/uploads/2010/07/face-skin1.jpg
* ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నవారు, నిమ్మరసం లేదా అల్లం రసం కలిపిన తులసి పేస్టును ముఖానికి పట్టించి అది ఎండిపోయిన దాకా అలాగే ఉంచాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మచ్చలు తొలగిపోవ డంతో పాటు ముఖం కాంతి వంతంగా, అందంగా  మారుతుంది.
*తులసి, మెంతి ఆకులతో చేసినడికాక్షన్ రోజూ తీసుకుంటే శరీరంలో నూతనోత్తేజం వస్తుంది.

Tuesday, January 18, 2011

మా మంచి తులసి...

వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో రారాజుగా వెలిగిపోతున్న మొక్క తులసి.. భారతీయ మగువలు ఎంతో పవిత్రంగా కొలిచే ఈ తులసి వంటింటి వైద్యంలో ఎంతో ముఖ్యం కూడా. కఫాన్ని, పైత్యాన్ని తీసివేయడంలో దీనికి మించినది లేదు. అంతేకాదు.. ఇంకా ఎన్నో రకాల వ్యాధులకు, జబ్బులకు మంచి మందు తులసి.

tulsi1
  • జ్ఞాపకశక్తిని మెరుగు పరచడంలో, నోటిసంబంధిత వ్యాధులకు, ఉబ్బసానికి మంచి మందు తులసి. చర్మవ్యాధులకు ఈ ఆకురసము మంచి ఫలితాన్నిస్తుంది.
  • గాయాలకు, దెబ్బలకు, విష జంతువులు కరిచి నపుడు ఈ ఆకు రసాన్ని పూసినా, వాడినా సత్వర ఉపశ మనం కలుగుతుంది.
  • ప్రతిరోజు 6-10 ఆకులు నమిలితే నోటి దుర్వాసన వుండదు. ప్రతి రోజు క్రమంగా పది ఆకులను తిన్నా లేక 1 చెంచా రసం పరగడుపున తాగినా ఆరోగ్యానికి మంచిది.
  • ఆకురసం, కొంచెం తేనె, ఒక చెంచా అల్లం రసం రంగరించి వాడితే జీర్ణకోశ సమస్యలుండవు.
  • తులసి రసంతో కొంచెం మిరియాల చూర్ణాన్ని కలిపి 2 చెంచాలు తింటే గొంతు బొంగురు పోవుటాన్ని, నీటిలో మరిగించి వడగట్టి తీసుకుంటే గొంతు గరగర, జలుబు, దగ్గు ఉన్నపుడు కఫం బయటకు వచ్చేటట్లు చేస్తుంది.
  • దోమ కాటు వలన వచ్చే మలేరియా వ్యాధికి ఇది మంచి ఔషధం.
    tulasi
  • ఇంటి ఆవరణలో ఈ చెట్లుంటే దోమలను పారదోలుతుంది. క్రిమిసంహారిగా కూడా పనిచేస్తుంది.
  • ఆధునిక పరిశోధనలో క్షయవ్యాధికి కారణమయ్యే బేసిల్లస్‌ ట్యూబర్క్యు లోసిన్‌ అను బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టి నశింపజేస్తుందని శాస్త్ర వేత్త లు వెల్లడించారు.
  • పత్రాలలోని సూక్ష్మమైన తైల గ్రంథులల్లోని తైలంలో యూజినాల్‌, యూజినాల్‌ మిథైల్‌, ఈథర్‌, కార్వసిరాల్‌, అను రసా యనాలే సువాసనకు, సూక్ష్మ జీవులను నశించేట్లు చేస్తాయి.
  • తులసి రసం, బెల్లం కలిపి తయారు చేసే తులసిసుధ అనే పానియం రక్తశుద్ధిని, వ్యాధి నిరోధకశక్తిని అభివృద్ది చేస్తుంది.
  • ఈ ఆకుల రసంతో చేసిన టీ జలుబు, దగ్గును, ఉదరకోశ రుగ్మతలకు బాగా పని చేస్తుంది. తులసి వనాలు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయి.

Friday, December 31, 2010

వ్యాధులు - నివారణోపాయాలు

* ఉల్లిబింజర ఆకులు తుంచినప్పుడు వచ్చే రసంలో దూదిని ముంచి చెవిలో పెడితే చెవి పోటు, నొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
* ఆముదం ఆకులను ముద్దగా నూరి తేనెతోకలిపి రోజుకు రెండుసార్లు చొప్పున ఐదు రోజులు వేసుకోవాలి. పెద్ద ఉసిరికాయ సైజులో రెండు గోళీలు ఉదయం, రెండు గోళీలు సాయంత్రం తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* మంచి ఇంగువను నిమ్మరసంతో నూరి కొద్దిగా వేడి చేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గుతుంది.
* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోకచెక్కల మసి- ఈ మూడింటిని కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళ వాపులు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్‌విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.
* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకరకాయలు, నేలతంగేడు పూత, పొడిపత్రి, తిప్పతీగె, ఉసిరికాయలను చూర్ణం చేసి రెండుపూటలా నోట్లో వేసుకొని నీటిని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
* ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగనే్నరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం.
* గుప్పెడు యూకలిప్టస్ ఆకుల్ని దంచి గుజ్జుచేసి నుదుటిమీద అంటించుకొని మెత్తటి గుడ్డతో కట్టుకొని, గంటసేపు పడుకుంటే తలనొప్పి పోతుంది.
* పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
* తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.

-సూర్యలోవరాజు


Friday, November 19, 2010

తులసి పూజ ప్రాశస్త్యమ్‌

tulasi1
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా
య దగ్రే సర్వవేదశ్చ తులసీం త్వా నమామ్యహమ్‌
శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణియైన ‘‘తులసి’’ మొక్క మూలంలో సర్వతీర్థాలు, మధ్యభాగమందు సమస్త దేవతలు, తులసిమొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువై వున్న తులసీ మాతకు ముందుగా నమస్కరించుకుని, అంతటి పూజ్యనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర- తులసి ప్రాశస్త్యాన్ని గూర్చి, మన పురాణాలలో ఎన్నో కథలు కానవస్తున్నాయి. వాటిలో ఒక గాథను సమీక్షించుకుందాం!
‘‘బ్రహ్మవైవర్తపురాణం’’లో గల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది. ధర్మధ్వజుడు, మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతియైన కుమార్తె కలిగింది. వారు ఆ బిడ్డకు బృంద అను పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి. ఆమెకు వివాహ వయస్సు రాగానే శ్రీహరిని వివాహమాడ తలచి బదరికాశ్రమము చేరి బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ దర్శనమిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుమనగా ‘నేను రాధా శాపముతో నున్న రుక్మిణిని, నాకు శ్రీకృష్ణుడే భర్తగా కావాలని వరమీయమ’ని ప్రార్థించినది.
అందుకు బ్రహ్మ! నీ కోరిక తప్పక నెరవేరగలదు. కాని! ముందుగా గోలోక నివాసి సుదాముడే నీకు భర్త కాగలడు. అనంతరమే నీవు కోరిన వాడు నీకు పతి అవుతాడని వరమిచ్చి అంతర్థానమ య్యాడు.

tulasiఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుదాముడు పుష్కరకాలము శాప కారణంగా భూలోకంలో శంఖచూడుడై, జన్మించి తపమాచరించ సాగెను. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అంత శంఖచూడుచు ‘‘లక్ష్మి భూలోకమున పుట్టినదట! నాకామెతో వివాహము చేయించమ’’ని వేడుకొనెను. బ్రహ్మ ‘తథాస్తు’ అని పలికి ఆమె బదరికాశ్రమంలో ఉన్నది. ఆమె నీకు తప్పక లభ్యం కాగలదు అని యంతర్థాన మందెను. అనంతరం శంఖచూడుడు- బృంద వాద ప్రతివాదాల ను గమనించి వారికి మరల బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టాలు నెరవేరేందుకు వైభవముగా వివాహము జరిపించాడు.ఇక శంఖచూడునకు లక్ష్మీ అంశతో ఉన్న భార్య లభ్యమయ్యేసరికి! అష్టైశ్వర్యాలతో తులతూగుతూ, అతిశయం పెంచుకుని స్వర్గాధిపత్యము పొందగోరి దేవరాజ్యాన్ని కొల్లగొట్టి, దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయటమే కాకుండా, పరమేశ్వరుని చెంతకేగి, శివా! నీ భార్య సుందరాంగి, ఆమెను నాకు వశ్యురాలును చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగెను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి ‘‘శివా! వీడు ఆజేయుడగుటకు కారణం ఈతని భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించెదను. నీవు వీనిని వధించుము’’ అని యుక్తి చెప్పెను.

అనంతరం మాయా శంఖచూడుని వేషము ధరించిన శ్రీహరిని చూసి బృంద తన భర్తే వచ్చాడని భ్రమించి, అతనికి సర్వోపచారాలు చేసి శ్రీహరి చెంతకు చేరగానే! ఆమె పాతివ్రత్యం భగ్నం కావటం గ్రహించి శివుడు శంఖచూడుని సంహరించగా అతడు దేహమును విడచి ‘‘సుదాముడై’’ గోలోకమునకు వెళ్ళాడు. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని ‘‘శిలారూపమందుదువుగాక’’ అని శపించగా, విష్ణువు తిరిగి ఆమెను నీవు వృక్షమగదువుగాక అని శపించెను. ఆ విధంగా శ్రీహరి గండకీనదిలో సాలగ్రామ శిలగాపుట్టి, బృంద తులసీ వృక్షమైపోయి ఇద్దరూ ప్రపంచం చేత పూజలందుకుంటున్నట్టు బ్రహ్మవైవర్త పురాణగాథ ద్వారా విదతమవుతోంది.
ఒకసారి పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామిని చెంతకు చేర్చుకుని
‘‘పుత్రా! సకల వృక్షములలోన తులసి మొక్కయే పూజ్యమైన క్ష్మారుహంబు దాని పత్రములును దాని పుష్పములును బ్రాణ సమములగును అచ్యుతునకు’’ అని చెప్పాడు.

అంతేకాక వృక్షాలన్నిటిలో తులసి శ్రేష్ఠమైనది. శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైంది. తులసిపూజ, తులసీ స్తోత్రం చదవడం, తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున జల్లుకోవడం. తులసీవనాన్ని పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించటం ఎంతో పుణ్యప్రదమైనవి. గోదాదేవి తులసివనంలోనే అయోనిజగా విష్ణుచిత్తునింట వెలసి శ్రీరంగనాధుని ఇల్లాలయింది.
శ్లో వశిష్ఠాది ముస్తోమైః పూజితో తులసీవనే
తదా ప్రభృతి యద్విష్ణూః బ్రతిజ్ఞాం కృతవాన్‌ ప్రభుః
తస్మిన్‌ తులస్యాంతు యః పూజాంకురుతే నర
సర్వపాప వినిర్ముక్తః మమసాయుజ్య మాప్నుయాత్‌
వశిష్ఠాది మునిగణంతో ఎన్నో విధాలుగా స్తోత్రపూర్వకంగా శ్రీహరి తులసీవనమందు పూజలందుకొని తన్ను కార్తీక శుద్ధద్వాదశి నాడు విశేషించి ఎవరు పూజచేస్తారో అట్టివారి సమస్త పాపాలు అగ్నిలో పడిన మిడతలు వలె భస్మమై వారు తప్పక నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసెనట!
శ్లో తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్ఛినః
యదిచ్ఛేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యంబ్రాహ్మణైస్సహ
విష్ణోః ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకథా
ద్వాదశ్యాం శ్రవణాత్తస్యాః పునర్జన్మ న విద్యతే
విష్ణు సాన్నిధ్యం కోరి విష్ణు దేవునకు ఏమాత్రమైనా ప్రీతి చేయాలని తలచేవారు తులసీ వ్రతమహత్య్మము తప్పక వినాలి. అందునా! క్షీరాబ్ధిద్వాదశి రోజున తులసి కథ వినువార్కి, చదువువారికి పూర్వజన్మ కృతమైన దుఃఖములన్నియు తొలగిపోయి విష్ణులోకాన్ని పొందుతారు అని శంకరుడు తులసి కొనియాడినట్లు తెలుస్తోంది. అలాంటి తులసీ బృందావన ంలో ఉసిరిమొక్కతో కలిపి తులసీధాత్రి సమేత శ్రీమన్నారాయణుని కార్తీక ద్వాదశినాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొన్నారు. పైగా తులసీ దళాలకు నిర్మాల్యదోషం పూజలో ఉండదని కూడా చెప్పారు.

కనుక హిందూ మతంలో తులసి ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్థానాన్ని పొందింది. తులసి మొక్క హిందువులకు పూజనీయమైంది. అందుకే హిందువులు ప్రతి ఇంటా తులసి మొక్క ను కోటలో పెంచి పూజించటాన్ని చూస్తూ ఉంటాం. ఇక పట్టణవాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని, చిన్న చిన్న కుండీల్లోనో, డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు. తులసి ఉన్న ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది.

ఇక ఈ తులసిని వైద్య పరంగా చూస్తే ఆయుర్వేద శాస్త్రంలో సప్తతులసి-భరతవాసి అంటూ తులసిని ఏడు విధాలుగా వివరించారు. అవి 1. కృష్ణ తులసి, 2, లక్ష్మీ తులసి, 3, రామతులసి, 4. నేల తులసి, 5. అడవి తులసి, 6. మరువ తులసి, 7. రుద్ర జడ తులసిగా వివరిస్తారు. వైద్యపరంగా అవన్నీ ఎన్నో అమోఘమైన ఔషధగుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతోంది. ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు (కోటలోవికాదు) విడిగా పెంచుకున్న మొక్కల నుండి నమిలి మింగితే వారికి బుద్ధి శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని, ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్తారు. ఇక దాని కాండముతో తయారు చేసిన తులసి మాలకు ఇటు ఆధ్యాత్మికపరంగా అటు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయట!
కనుక ప్రతి క్షీరాబ్ధిద్వాదశి వ్రతాన్ని ఆచరించి ఇటు ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆరోగ్య భాగ్యాన్ని సర్వులూ పొందవచ్చు!

సత్యనారాయణ వ్రత..

కార్తీక మాసంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి పుణ్య వ్రతాన్ని లక్షలాది కుటుంబాల్లో తప్పనిసరిగా జరిపిస్తారు. ఈ పుణ్యదినాలలో ఈ వ్రతం ఆచరించడం వల్ల సర్వ భోగభాగ్యాలు శ్రీ సత్యనారాయణ స్వామి కటాక్షంగా లభిస్తాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆంధ్ర ప్రాంతీయులకంటే తెలంగాణా ప్రాంతంలో ఈ వ్రతాచరణ ఒక విధివిధాన మవ్వడం, ఆచరించే విధానంలో ఉండే పద్ధతులు ప్రత్యేకంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో శ్రీ కేదారేశ్వరస్వామి వారి వ్రతాన్ని ఈ మాసంలోనే జరపడం మరో విశేషం. ఉత్తర భారత దేశంలో ఈ మాసంలో బిల్వపత్ర వ్రతాన్ని జరిపిస్తారు. ఇంటింటా లక్షలాది మారేడు దళాలతో ఈ మాసం పవిత్రమౌతుంది. శక్తి ఉన్నవారు స్వర్ణ బిల్వపత్రాలను చేయించి తొమ్మిది రోజులు శివసన్నిధిలో ఉంచి బ్రాహ్మణోత్తములకు లేదా వృద్ధ ముత్తయిదువులకు దానమిచ్చి బిల్వాష్టకమును పారాయణ చేస్తారు.

ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ దానాలు చేసినా, వ్రతాలు చేసినా కార్తీక వైభోగం కార్తీక వైభోగమే! ఒక్క బిల్వాన్ని శివుడికి అర్పిస్తే చాలు! జన్మ ధన్యమౌతుంది. ఒక పొద్దు ఉపవాసముంటే చా లు! కైలాసవాసం ప్రాప్తిస్తుంది. ఒక్క దీపాన్ని దానమిస్తే చాలు! జీవితం ఐశ్వర్యమయమౌతుంది ఇలా అనేక నమ్మకాలతో మనస్సు పవిత్రంగా పరమేశ్వర సేవలో లగ్నమౌతుంది.

కొరతలేని జీవనానికి కార్తీకమాసంలో పుణ్యవ్రతాలను మంగళప్రదంగా ఆచరించడం ఆనవాయితీ. శివతత్త్వాన్ని గృహంలో ప్రతిష్టించి, కార్తీక పురాణ కథలను పదిమంది ముందు పఠించి, భక్తికి ప్రాధాన్యత ఇస్తూ అర్థనారీశ్వర చైతన్యాన్ని హృదయంలో నింపుకుంటార భక్తులు. ఆ ప్రార్థనా శక్తి ఆవిర్భవింపచేసే మహోతేజస్సు శివం....శివం అంటూ హృదయాన్ని ప్రకాశింపచేస్తుంది.
- డా వి.జి.శర్మ