వాళ్లది 'బ్రెడ్డూ కాదు ఫుడ్డూ కాదు'
అమెరికాలో జనం ఏం తింటారు? ఏం వండుకుంటారు? ఏయే పంటలు పండిస్తారు...?
ఆ విషయాలన్నీ మనకెందుకు అంటా వాటి గురించి నేను ఆలోచించటమే కాక మిమ్మల్ని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి మీ బుర్రలెందుకు చెడగొట్టాలి అంటారా? ఎందుకంటే, రాబోయే పది, ఇరవై సంవత్సరాల్లో మన భారతదేశం కూడా అమెరికాలాగే తయారవ్వబోతోంది కాబట్టి! మనమందరం కూడా అమెరికన్ల ఆహారపు అలవాట్లను అలవర్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి. అందుకే మనం అమెరికా ఆహారం, దాని పూర్వాపరాల గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిదిఅంటున్నారు ఉమాశంకరి. చిత్తూరు జిల్లాలోని వెంకట్రామాపురంలో రైతుమహిళగాను, ఆహార వ్యవసాయ అంశాల మీద కార్యకర్తగానూ పని చేస్తున్నారామె. ఆమె చెప్పిన విశేషాలే ....
ఈ రోజుల్లో ఏం వండుకుందాం, ఏం తిందాం అన్నది మన ఇండ్లలో సైతం అంత తేలికైన విషయం కాదు. మనం రోజూ తినే తిండిలో అన్నం, పప్పు, కూర, పెరుగు వంటివి మాత్రమే ఉండకపోవచ్చు. నార్త్ ఇండియన్ తందూరీ రోటీలు ఉండొచ్చు, బర్గర్లు, పిజ్జాలు, నూడుల్స్ ఉండొచ్చు. లేదా మనకు నోరు తిరగని మరేవో విదేశీ వంటకాలు కూడా ఉండొచ్చు. వీటన్నిటినీ ఇప్పుడు పట్టణాలలో పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న అనేకానేక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. వెరైటీగా, ఫ్యాషన్‌గా ఉండాలని ఈ రకమైన విదేశీ వంటల్ని పెళ్లిళ్లలో, పార్టీల్లో సైతం వడ్డించడం ఇప్పుడు పరిపాటైంది. మిగతా ప్రపంచంలో ఫాస్ట్‌ఫుడ్ మార్కెట్ ఏటా 5 శాతం వృద్ధి చెందుతుంటే మనదేశంలో అది దాదాపు 40 శాతం పెరుగుతుండడం గమనార్హం.
పాశ్చాత్యుల నుంచి, అమెరికన్ల నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి-వాళ్లు పని పట్ల చూపే శ్రద్ధ, శారీరక శ్రమ పట్ల గౌరవం, సాహసాల పట్ల ఆసక్తి మొదలైనవి. కాని ఒక రైతుగా నేను అనుకునేదేంటంటే ఆహార వ్యవసాయ రంగాల్లో గుడ్డిగా పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే అవుతుంది. అందుకే పాశ్చాత్యుల ఆహార, వ్యవసాయ పద్ధతులను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముందు అసలు మనుషులు ఏం తింటారు, వారి ఆహార అవసరాలేంటి అనే విషయాలు చూద్దాం.
మానవపరిణామ సిద్దాంతం ప్రకారం మనషులు శాకాహారులు. తర్వాత తర్వాత ఇటు మొక్కలను అటు జంతువులను కూడా తినడం నేర్చుకున్నాం. అంతే కాదు.. వండడం, ఆ వంటలను రుచిగాను సునాయాసంగానూ అరిగేలా చేసుకోవడం నేర్చుకున్నాం. జంతువుల మాదిరిగా ఆకలి తీర్చుకోవడానికే కాకుండా బుద్ధిపూర్వకంగా, అనుభవ పూర్వకంగా ఏం తినాలి, ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోగలిగాము. ఏం తినాలి, ఎలా తయారు చేసుకోవాలనే విషయపరిజ్ఞానమే మనకు పాకశాస్త్రాన్ని అందించింది. అంతే కాదు ఆహార సంబంధిత మరో జ్ఞానం వ్యవసాయ శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది. పాత వ్యవసాయ పద్ధతుల్లో ప్రకృతి నుంచి తీసుకోవటం మళ్లీ ప్రకృతిలో కలిపేయటం అనేది ఒక ముఖ్య అంశం. దీని వల్ల 'చెత్త' లేదా 'పనికిరాని గడ్డి, గాదం, మిగులు' అనే ప్రశ్నే రాదు. అవన్నీ కూడా వ్యవసాయంలో విలువైన పెట్టుబడి వస్తువులయ్యాయి.
సాంప్రదాయ వ్యవసాయ శాస్త్త్రం శతాబ్దాల అనుభవ ప్రయోగాల ఆధారిత విద్య, జ్ఞానం. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇట్లాంటి విద్యని 'అశాస్త్రీయం' అని, వ్యవసాయ పని నైపుణ్యం లేని అసాంకేతిక పని అని భావించడం జరుగుతున్నది. అట్లాగే వంట, ఆహార పద్ధతులు కూడా ఈ రకమైన అనుభవ ప్రయోగాధారిత విద్య, జ్ఞానాలే. దీన్ని చిన్నచిన్న మార్పులతో కుటుంబాల అవసరాన్ని బట్టి, సామాజిక సంప్రదాయాల్ని బట్టి, పండుగల్ని బట్టి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలను బట్టి... తమకు చాలా ఇష్టమైన పనిగా మలుచుకున్నారు. ప్రతి సమాజం తమతమ అవసరాలను బట్టి అందుబాటులో ఉండే తిండిని అనేక రకాలుగా తీసుకుంటోంది. రోజూ తినాల్సినవి, పండగ రోజుల్లో తినాల్సినవి, జబ్బు పడ్డప్పుడు తినాల్సినవి, గర్భవతులు తినాల్సినవి, పిల్లలు తినాల్సినవి, ఉపవాసాలు, ప్రయాణాలప్పుడు తినాల్సినవి... అలాగే ఆకులు, కాయలు, పండ్లు, చివరికి చెట్టు కాండం, వేర్లు కూడా ఉపయోగించడం, వైద్యానికి వాడుకోవడం అంతా కూడా ఒక పారంపర్య జ్ఞాన సముపార్జన. ఎవరూ నేర్పకుండానే కొత్త తరాలు పాత తరాల నుండి వీటిని గ్రహిస్తాయి. భారతదేశంలో ఇప్పుడున్న జ్ఞానం జిల్లా జిల్లాది. గ్రామ గ్రామానిది. అది ఒక అలిఖిత భాండాగారం.
ఈ పరిస్థితి పారిశ్రామికీకరణ అనంతరం మారుతూ వస్తున్నది. సాధారణంగా ప్రజలు స్థానికంగా దొరికే వాటిని వండుకుని తినేవారు. మాంసాన్ని చాలా తక్కువగా తినేవాళ్లు. ఎక్కువ భాగం శాకాహారమే తినేవారు. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఇదే రకమైన ఆహార అలవాట్లు ఉండేవి. కానీ ఈ మధ్య మాంసం, తీపి పదార్ధాలు తినడం పెరిగిపోయింది.
మిగిలేది పదిశాతమే...
మాంసం కోసం మనం పెంచే జంతువులకు ఆహారం రూపంలో మనం ఇస్తున్న పోషకాలలో 90 శాతం ఆయా జంతువుల శారీరక అవసరాలకి, ఎముకలకు, చర్మానికి, ఇతరత్రా మనకు ఉపయోగం లేని వాటికే పోతోంది. మిగిలిన 10 శాతం మాత్రమే మనకు మాంసంగా లభ్యమవుతుంది. కాని మొక్కలు సూర్యుని నుండి, ప్రకృతి నుండి శక్తిని గ్రహించి ఆ శక్తిని పోషకాల రూపంలో మనకి నేరుగా అందిస్తాయి. ప్రధానంగా మాంసం తినడమనేది ఒక హంగు ఆర్భాటం. ధనికులకు మాత్రమే సాధ్యమైనది. సమాజం అభివృద్ధి చెందుతున్నకొద్దీ జనం ఎక్కువగా మాంసాహారం, తీపి పదార్ధాలు తింటున్నారు. పెరుగుతున్న మాంసాహారఅవసరాలకు సరిపడా ఆయా జంతువులను, పక్షులను పెంచడానికి మళ్లీ అంత మొత్తంలో మొక్కలను, పంటలను పెంచాల్సిన అవసరం ఏర్పడుతున్నది. మన శాకాహార, మాంసాహార అవసరాలకు, జంతువుల శాకాహార మాంసాహార అవసరాలకు కలిపి మనం పంటలని పండించాల్సిన, జంతువుల్ని పెంచాల్సిన అదనపు భారం భూమిపై పడుతున్నది.
విడగొట్టి...కలుపుతారు
మైఖెల్ పొలాన్ అనే అమెరికా పరిశీలకుడి మాటల్లో... "మన సమాజాలు ప్రస్తుతం రెండు జబ్బులతో బాధ పడుతున్నాయి. అవే నియోఫోబియా, నియోఫీలియా- మొదటిది కొత్త రకాలపై భయం, రెండోది కొత్తవాటిపై వ్యామోహం. అమెరికాలో ఈ పరిస్థితి మరింత దారుణం. ఎందుకంటే అమెరికాలో ఉన్న రకరకాల దేశస్తులు వారివారి ఆహార వ్యవసాయ పద్ధతులను తీసుకొచ్చి అక్కడి స్థానిక పద్ధతులను తుడిచిపెట్టడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైపోయింది. అందుకే ప్రస్తుతం అమెరికాలో మెక్సికన్, ఐరిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, ఇథియోపియన్, ఆఫ్రికన్, చైనీస్, జపనీస్, థాయ్...కాక ఈ మధ్య కాలంలో వచ్చి చేరిన ఇండియన్ వంటలు, హోటళ్లు కనపడతాయి.''
అమెరికన్ సూపర్ మార్కెట్లలో రకరకాల ఆహార పదార్ధాలే కాదు, వాటితో పాటు పోషక విలువల, క్యాలరీల పట్టికలు కూడా కనబడతాయి. కొవ్వు పదార్ధాలు, ట్రాన్స్ ఫ్యాట్స్, పిండిపదార్ధాలు, ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు, యాంటి-ఆక్సిడెంట్లు, షుగర్ ఫ్రీ, కెఫిన్ ఫ్రీ, ఫ్యాట్ ఫ్రీ... చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టులుంటాయి. ఆ దేశంలో మొదటగా ఆహార పదార్థాలను విడగొట్టి మళ్లీ వాటిని రకరకాల కాంబినేషన్లలో చేర్చి, కూర్చుతారు. వాటికి రంగుల్ని, కృత్రిమ రసాయనాల్ని, విటమిన్లని, పోషకాలని కూడా చేర్చడం జరుగుతుంది. ఇవన్నీ వింటుంటే తల తిరిగిపోవట్లేదూ? "ఈ విడగొట్టడం మళ్లీ కూర్చడం అనే ప్రక్రియలో అమెరికన్లు అసలైన ఆహారాన్ని మర్చిపోతున్నారు, ఆహారం లాంటి వస్తువులను తింటున్నార''ని మైఖెల్ పొలాన్ అంటున్నారు. పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా? ఇంకొంచెం తరచి చూస్తే కాని ప్రస్తుత అమెరికన్ల ఆహార, వ్యవసాయ పద్దతులు అర్థం కావు.
ఆరుసార్లు తింటారు
ఏం తింటారో చూసేముందు ఎలా తింటారో కూడా చూద్దాం. అమెరికన్లు అసలు ఇంట్లో వంట చేయటమనేదే తక్కువ. వాళ్లు తినే ఆహారమంతా కూడా ముందే వండి, తినటానికి సిద్ధంగా ఉండేదే. సూపర్ మార్కెట్ల నుంచి ప్యాకెట్లలో దొరికే ఆహారం తెచ్చుకొని, ఫ్రిజ్‌లో పెట్టుకొని, తినేముందు మైక్రోవేవ్ ఒవెన్‌లో వేడి చేసుకుని తినటమే వాళ్లు చేసే పని. చాలా సందర్భాల్లో అక్కడి ప్రజలు ఒంటరిగానే తింటారు. అప్పుడప్పుడూ కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసినా ఒకే ఆహారం మాత్రం తీసుకోరు. నాన్న కొవ్వు తక్కువుండే ఒమేగా 3 ఎక్కువ ఉండేవి తింటే అమ్మేమో సలాడ్ తింటుంది. పిల్లల్లో ఒకరు తక్కువ క్యాలరీలున్న చేపలు తింటే ఇంకొకరు ఎక్కువ కొవ్వు ఉన్న చికెన్ ఫ్రై తింటారు. ఇలా ఎవరి ఆహారం వారిదే.
ఈ తినడం కూడా ఎక్కువ భాగం కార్లలోనే జరుగుతుంది. అందుకే కప్పులు, ట్రేలు, బాటిల్స్ పెట్టుకొనడానికి వీలుగా కార్లు తయారు చేస్తారు. కార్లలో ఆహారం నిలవ ఉంచుకోవడానికి చిన్న ఫ్రిజ్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమెరికాలో కారు నడుపుతూ తింటూ తాగుతూ కనబడే వాళ్లెంత మందో! ఒకసారి నేను ఒకాయన కారు నడుపుతూ మామిడిపండు తినడం చూశాను. ఆఫీసుల్లో కూడా ఎప్పుడూ చిరుతిళ్లు తింటుంటారు వాళ్లు. పొలాన్ మాటల్లో అయితే సగటు అమెరికన్లు రోజుకు ఆరు సార్లు తింటారు. మూడు ఫుల్ మీల్స్, రెండు మూడు ఫలహారాలు. సూపర్ మార్కెట్ల నిండా తిండి పొంగి పొర్లుతూ కనిపిస్తుంది. కప్పులు, గ్లాసులు అన్నీ సూపర్ సైజుల్లో కనిసిస్తుంటే స్థూలకాయం మహమ్మారిలా వ్యాపించడంలో ఆశ్చర్యమేముంది?
కార్న్ అండ్ కార్ కంట్రీ
అమెరికాని 'కార్న్ అండ్ కార్ కంట్రీ' అంటారు. ఎందుకంటే ఆ దేశంలో కార్లెంత ఎక్కువో మొక్కజొన్న పంట కూడా అంతే ఎక్కువగా పండిస్తారు. వాళ్ల ప్రధాన పంట మొక్కజొన్నే. అందుకే వాళ్లు మొక్కజొన్నను ఎక్కువగా తింటారు. వాళ్ళు తినే బ్రెడ్డులో ఎక్కువ శాతం గోధుమే ఉంటుంది. మరి ఈ మొక్కజొన్నను ఏ రూపంలో తింటున్నారు? మాంసం ద్వారా. ఆశ్చర్యంగా ఉన్నా నిజం అదే.
అమెరికా ఏటా 10 బిలియన్ల మొక్కజొన్న బుషల్స్ (25 కేజీ సంచి)ను పండిస్తుంది. ఇందులో 70 శాతం పశువులకి, కోళ్ళకి, చేపలకి ఆహారంగా వాడతారు. మిగతా దాంతో అనేక ఉత్పత్తులు తయారవుతాయి. మొక్కజొన్నల్లోని పసుపు పచ్చని పై పొరతో విటమిన్లు, పోషక మందులు, వంటనూనె, సిట్రిక్ ఆసిడ్, లాక్టిక్ ఆసిడ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, హెచ్ఎఫ్సిఎస్ (హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్) తయారు చేస్తారు. 19 శాతం మొక్కజొన్న వీటి తయారీకే వెళ్తుంది. వీటన్నిటినీ చాలారకాల అమెరికన్ వంటల్లో వాడతారు. అందుకే ఒక అమెరికన్ బయాలజిస్టు "ఉత్తర అమెరికా వాళ్ళందరం మొక్కజొన్నకి కాళ్ళు మొలిచినట్టు ఉండే మనుషులం'' అని అంటారు. ఈ మధ్య మొక్కజొన్న నుండి కార్లకు ఇంధనం కూడా తయారుచేస్తున్నారు. ఇలా ఇంధనంగా మారుతున్న మొక్కజొన్న 330 మిలియన్ల జనాభాకు ఒక సంవత్సరం పాటు ఆహారంగా ఉపయోగించవచ్చునని ఎర్త్ పాలసీ డైరెక్టర్ లెస్పర్ బ్రౌన్ అన్నారు.
మొక్కజొన్న తరువాత ముఖ్యమైన పంట సోయాబీన్. అక్కడ సంవత్సరానికి 2.8 బిలియన్ బుషల్స్ సోయాబీన్ పండుతుంది. దీన్నుండి వంటనూనె, సోయా పిండితో చేసిన సోయామీల్ తయారవుతాయి. ఆ దేశంలో వాడే వంటనూనెలో 80 శాతం సోయానూనే. ఈ నూనెను పారిశ్రామిక అవసరాలకు వాడతారుకూడా. పశువుల దాణాలో కూడా సోయా పిండిని (మీల్) వాడతారు. అందుకే మొక్కజొన్న, సోయాలను నేరుగా తినకపోయినా మాంసం, నూనె, మిగతా ఆహార పదార్థాల (ప్రాసెస్డ్ ఫుడ్) ద్వారా తింటూ ఉంటారు వాళ్లు.
రసాయనాలు మింగితే పోలా!
ప్రతి దానిపైన పోషక విలువల పట్టిక ఉంటుందని ముందే చెప్పాను కదా! ఉదాహరణకు బ్రెడ్ తీసుకుందాం. మామూలుగా బ్రెడ్ తయారీకి ఏమి కావాలి? పిండి, ఈస్ట్, నీరు, చిటికెడు ఉప్పు. కాని ఇప్పుడు అమెరికాలో దొరికే బ్రెడ్డులో ఏమేమి ఉంటాయో మైఖెల్ పొలాన్ మాటల్లో చూద్దాం...'సారా లీస్' అనే పేరుతో మార్కెట్లో లభ్యమయ్యే 'సాఫ్ట్ అండ్ స్మూత్ హోల్‌గ్రెయిన్ వైట్ బ్రెడ్'లో ఉండే పదార్థాల పట్టిక ఈ విధంగా ఉంటుంది.
పోషకాలతో కూర్చిన, బ్లీచ్ చేసిన గోధుమ లేదా బార్లీ పిండి, నియాసిన్, ఇనుము, లియామిన్, మోనో నైట్రేట్, రిబోఫ్లోవిన్, ఫోలిక్ యాసిడ్, నీరు, గోధుమ, వరిపిండి, హెచ్ఎఫ్సిఎస్, పాలు విరగ్గొట్టి అందులోంచి తెల్లపదార్థాన్ని తీసేస్తే వచ్చే నీరు, గోధుమ బంక, ఈస్ట్, సెల్యులోజ్-ఇన్ని ఉంటాయి. ఇవేకాక కొంత మోతాదులో తేనె, కాల్షియం సల్ఫేట్, సోయా, పత్తిగింజనూనె, ఉప్పు, వెన్న, మోనో, డై గ్లిసరైడ్స్, ఆస్కార్బిక్ ఆసిడ్, ఎంజైమ్స్, ఆజో డైకార్బినమైడ్, గౌర్‌గమ్, కాల్షియమ్ ప్రొపైనేట్, తొమ్మిది రకాల ప్రిజర్వేటివ్స్, డిస్పిల్డ్ వినెగర్, ఈస్ట్ న్యూట్రియంట్స్ అయిన మోనో కాల్షియమ్ ఫాస్పేట్, కాల్షియమ్ సల్ఫేట్, కార్న్ స్టార్చ్, రంగుకోసం బీటా కారోటిన్, విటమిన్ డి3, సోయా లెసిథిన్, సోయాపిండి. ఎన్నున్నాయో చూడండి.
అందుకే "సారీ, సారా లీ గారూ. మీరు తయారుచేసేది బ్రెడ్డూ కాదు ఫుడ్డూ కాద''ని పొలీన్ అంటారు.
పోషకాలే విషపదార్ధాలైతే...
ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా తీసుకునే బ్రేక్ ఫాస్ట్ 'ప్యాకేజ్డ్ సిరీల్స్'తో పాటు పాలు. ఈ మధ్య కాలంలో ఇవి తినడం ఫ్యాషనైపోయింది. అందుకే వాటి గురించి తెలుసుకుందాం.
సిరీల్ పేరుతో డబ్బాల్లో లభ్యమయ్యే ఆహార పదార్థాలను 'ఎక్స్‌ట్రూజన్' అనే పద్ధతిలో తయారుచేస్తారు. ఈ పద్ధతిలో ధాన్యాన్ని అత్యధిక వేడికి, ఒత్తిడికి గురిచేస్తారు. తర్వాత వాటిని రకరకాల సైజుల్లో కత్తిరిస్తారు, కొన్ని పేలాల్లా ఉబ్బి ఉంటే కొన్ని నూనె పంచదార అద్దబడి ఉంటాయి. కొన్ని కరకరలాడే అటుకుల్లా ఉంటాయి. పాలల్లో వేసినా మెత్తబడక కరకరలాడడం వీటి ప్రత్యేకత. పాల్ స్పిట్ అనే ప్రఖ్యాతి గాంచిన పోషక శాస్త్రజ్ఞుడు ఈ పద్ధతిని నిశితంగా విమర్శిస్తూ చెప్పేదేమిటంటే... అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడిల మూలాన ధాన్యంలో ఉండే పోషకాలన్నీ నశిస్తాయి. అంతేకాక వాటిలోని ప్రొటీన్లు విషపదార్థంగా మారుతాయి. అయినా ఇట్లాంటి సిరీల్స్‌నే అమెరికన్లు ప్రతి ఉదయం పనిగట్టుకుని తింటారు. హెల్త్ఫుడ్ స్టోర్స్‌లో దొరికే సిరీల్స్ కూడా ఇలాంటివే అని న్యూట్రిషన్ జర్నలిస్ట్ శాలీ ఫాలోన్ చెపుతున్నారు.
ఆ పాలవల్ల గుండెజబ్బులొస్తున్నాయట
పాలు మంచి పౌష్టికాహారమే. అయితే ఆ పాలని అనేక రకాలుగా ప్రాసెసింగ్ చేస్తారక్కడ. మొదటగా 'సెంట్రిఫ్యూజ్' అనే పద్ధతిలో పాలలోని ప్రొటీన్‌ను, కొవ్వును, నీటిని వేరు చేస్తారు. కొవ్వును ఐస్‌క్రీం కంపెనీలకు అమ్మి, మిగిలిన దాంట్లో పాలపొడిని కలిపి దానిని 'పాశ్చురైజేషన్' చేస్తారు. అంటే ఎక్కువ వేడి, వెంటనే బాగా చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా అందులోని,సూక్ష్మజీవులను చంపేయడమనే ప్రక్రియ.
ఇక్కడ మనం 'పాలపొడి'ని వాళ్లు ఎలా తయారుచేస్తారో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తాగే పాకెట్ పాలన్నీ కూడా పాలపొడితో కూడినవే. ఎక్కువ వత్తిడితో ఒక చిన్న రంధ్రం లోంచి పాలను గాలిలోకి పిచికారీ చేయడం ద్వారా పాలపొడి తయారవుతుంది. అయితే ఈ క్రమంలో అందులో ఉన్న కొవ్వు గాలిలోని నైట్రేట్స్‌ను కలుపుకుని ఆక్సిడైజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ శరీరానికి మంచిదే కాని ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇంకా తొందరగా మూసేస్తుందని, గుండె జబ్బులకి, రక్తనాళాల జబ్బులకు కారణమౌతుందని శాలీ ఫాలోన్ చెప్తున్నారు. తక్కువ కొవ్వుండే పాలు గుండె జబ్బులకు మంచిదని వాటిని వాడుతుంటే నిజానికి వాటివల్లే గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయని పరిశోధనలు చెపుతున్నాయి.
చికెన్‌లో కూడా అంతే...
'మాక్ డొనాల్డ్స్' కంపెనీ నడిపే హోటల్స్‌లో మాక్ నగ్గెట్స్ అనే చికెన్ వడ్డిస్తారు. ఇందులో ఏమేమి ఉంటాయో మైఖెల్ పొలాన్ చెపుతున్నారు... "మాక్ నగ్గెట్‌లో మొక్కజొన్న నుంచి సేకరించిన 13 రకాల పదార్థాలుంటాయి. మొక్కజొన్నని తిన్న కోళుతో సహా మోడిఫైడ్ కార్న్ స్టార్చ్‌ను రుబ్బిన కోడి మాంసాన్ని వాడతారు. మోనో, ట్రై-డై గ్లిసరైడ్ లను కొవ్వును నీటిని కలవకుండా ఉంచడానికి, చికెన్ బ్రాత్ అంటే చికెన్‌ను ఉడకబెట్టిన నీటిని సువాసన కోసం ఉంచుతారు. పసుపురంగు మొక్కజొన్న పిండిని మొక్కజొన్న నూనెతో చేసిన వనస్పతి కూడా కలుపుతారు. మాంసం నిలువ ఉంచడానికి సిట్రిక్ ఆమ్లాన్ని కలుపుతారు. ఇవికాక డెక్స్ట్రోస్, లెసిథిన్, మరికొన్ని రసాయనాలు కూడా కలుపుతారు.
కొన్ని రసాయనాలు చికెన్‌ను కొన్ని నెలల పాటు కుళ్ళకుండా, చెడిపోకుండా ఉంచుతాయి. అవి సోడియం అల్యూమినియమ్ ఫాస్ఫేట్, మోనో కాల్షియమ్ ఫాస్ఫేట్, సోడియమ్ యాసిడ్ పైరో ఫాస్పేట్, కాల్షియమ్ లాక్టేట్. చికెన్ ముక్కలపై నురుగు రాకుండా ఉంచడానికి 'యాంటి ఫోమింగ్ ఏజెంట్స్' అయిన డి మిథైల్ పాలిసైలాక్సిన్‌ను వంటనూనెలో కలిపి వాడతారు. దీనివల్ల క్యాన్సర్ వస్తుందని, శరీరంలో ట్యూమర్లకు దారితీస్తుందని, పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తుందని గుర్తించారు కూడా. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన టెర్షియరీ బ్యుటైల్ హైడ్రో క్వినైన్ (టిబిహెచ్ఆర్)అనే యాంటీ ఆక్సిడెంట్ ను కూడా వాడతారు దీన్లో. దీన్ని పెట్రోలియం నుంచి ఉత్పత్తి చేస్తారు. దీన్ని నగ్గెట్ పైన చల్లడం వల్ల చికెన్ 'ఫ్రెష్'గా ఉంటుంది. చాలా తక్కువ మోతాదులో వాడతారు కాని అయినా ఒక గ్రాము టిబిహెచ్ఆర్ తీసుకోవడం వల్ల వాంతులు, చెవుల్లో హోరు, మైకం, గాబరా, కళ్ళు తిరగడం, పడిపోవడం లాంటివి జరుగుతాయి. ఐదు గ్రాముల టిబిహెచ్ఆర్‌తో ఒక మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇదంతా తెలుసుకున్న తరువాత కూడా చికెన్ నగ్గెట్ ఎలా తింటాం?
అమెరికన్ సూపర్ మార్కెట్లలో రకరకాల పండ్ల రసాలు లభిస్తాయి. క్యారెట్, క్యాబేజీ, స్ట్రాబెర్రీ, బత్తాయి, నిమ్మ, కొబ్బరి నీళ్లు వాటిలో కొన్ని. బత్తాయి పండ్ల రసం కూడా స్వచ్ఛమైంది కాదని తేలుతోంది. బత్తాయి పంటపై అధిక మోతాదులో పురుగుమందులను పిచికారి చేస్తారు. రసం తీసేటప్పుడు వాటిని తోలుతో సహా పెద్దపెద్ద మెషీన్లలో పిండుతారు కాబట్టి పురుగు మందుల సారం కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. రసం చెడిపోకుండా ఉండడం కోసం వేడి చేసి అందులో యాసిడ్‌ని కలిపి చిక్కదనం తీసుకురావడానికి సోయా ప్రొటీన్‌ను, విటమిన్లు, మినరల్స్ కూడా చేర్చి... పాకెట్లు లేదా బాటిళ్ళలో నింపుతారు. ఆరెంజ్ జ్యూస్ తాగడానికి ఇంత ప్రయాస అవసరమా? ఇంట్లోనే ఒకటో, రెండో ఆరెంజ్‌ల రసం తీసుకుంటే పోలా!
...అందుకే సేంద్రీయమే గతి
ఇవన్నీ తెలిశాక-ఈ మధ్య అమెరికాలో ఒక పెద్ద ఉద్యమం మొదలైంది. రసాయన మందుల్లేకుండా పండిన పంటలను, స్థానికంగా లభ్యమయ్యే వాటిని, అతిగా ప్రాసెసింగ్ కాని ఆహార పదార్థాలనే ఎక్కువమంది కోరుకుంటున్నారు. దాంతో సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారానికి డిమాండ్ పెరిగింది. అక్కడ రెండు రకాలుగా ఈ ఉద్యమం జరుగుతోంది. మొదటి గ్రూపు పెద్ద పెద్ద కంపెనీలు. వాళ్ళకి ఉన్న వేలాది ఎకరాల్లో కొంత భాగం మందుల్లేని సేద్యం చేసి, పెద్ద ట్రక్కుల్లో రవాణా చేస్తున్నారు. వీటిని వ్యతిరేకిస్తూ రెండవ గ్రూపు చిన్నచిన్న పొలాల్లో రసాయన మందుల్లేకుండా సేద్యం చేస్తూ దగ్గర్లో ఉన్న మార్కెట్లకు, చిన్నచిన్న అంగళ్లకు, హోటళ్లకు సరఫరా చేస్తోంది.
ఇదే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆశ. ఈ ఉద్యమం విస్తృతమవ్వాలని కోరుకుందాం.
వ్యాసకర్త ఇ-మెయిల్: umanarendranath@yahoo.co.in
మొబైల్: 99897 98493

అనువాదం : సత్యలక్ష్మి
No comments:
Post a Comment