Tuesday, December 14, 2010

మగాడు * లైంగిక సమస్య *

పద్ధెనిమిదేళ్ల తరుణ్‌కి మనసులో గూడుకట్టుకుపోతోంది దిగులు. చదువు సాగడం లేదు. తనకు అంగస్తంభనలోపం వచ్చిందేమో అని భయం. ఆ దిగులుతో లేకపోతే... ఆ బెంగ నుంచి బయటకు వస్తే... టాప్ ర్యాంకు ఖాయం. నలభై ఏళ్ల శ్రీనివాస్‌కు ఒకటే బెంగ. భార్యకు ముఖం చూపించుకోలేకపోతున్నాడు. కారణం... పార్ట్‌నర్ దగ్గర వైఫల్యం. అరవై ఐదేళ్ల వెంకటేశ్వరరావుకు తీవ్ర నిస్పృహ. షుగర్ ఉందని చెప్పినా కలగనంతటి నిరాశ.  అందరిసమస్య ఒక్కటే... అంగస్తంభనవైఫల్యం! అందరి కోరికా ఒక్కటే... ‘మగాడు’ అనిపించుకోవడం. భయాలు తొలగి ‘మగాడు’ కావడం ఎలాగో, అదెంత సులభమో చెప్పేదే... ఈ కథనం.

అంగస్తంభన లోపాలు అందరిలోనూ సహజంగా కనిపించే సమస్య. 90 శాతం కేసుల్లో ఎలాంటి మందులు వాడనక్కర్లేకుండా... ఎలాంటి చికిత్స లేకుండానే తగ్గే సమస్య ఇది.

పురుషాంగం... నిర్మాణం : పురుషాంగంలో చర్మం కింద ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. లోపల్నించి చూస్తే ఒకటి మూత్రం రావడానికి మూత్రాశయం నుంచి వచ్చే ట్యూబ్. దీన్ని యురెథ్రా అంటారు. స్ఖలనం సమయంలో వీర్యం కూడా ఇందులోంచే వస్తుంది. ఇది పురుషాంగం మధ్యలో ఉంటుంది. దీనికి అటూ, ఇటూ రెండు వైపులా రెండు భాగాలుంటాయి. ఈ రెండిటినీ ‘కార్పోరా కావర్నోజా’ అంటారు. ఈ రెండు విభాగాల్లోకి రక్తనాళాల ద్వారా రక్తం వేగంగా ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించిన రక్తం వెనక్కిపోకుండా సిరలు మూసుకుపోయి, పురుషాంగం స్తంభిస్తుంది.

టెస్టోస్టెరాన్... అంగస్తంభన : పురుషాంగం స్తంభన కోసం ఉపయోగపడే ఒకే ఒక హార్మోన్ టెస్టోస్టెరాన్. ఈ హార్మోన్ ప్రభావం వల్ల అంగం పెరుగుతుంది. అయితే ఇది కేవలం పిల్లలు మొదలుకొని యుక్తవయసు వరకే జరిగే ప్రక్రియ. టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ కేవలం చిన్నపిల్లల్లో సర్జరీ సమయంలో లేదా యుక్తవయసు దాటినవాళ్లలో క్రీమ్ లేదా పేస్ట్ లేదా ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి చికిత్స చేస్తారు. అయితే... టెస్టోస్టెరాన్ తగ్గినవాళ్లలో ఇది ఎంత మోతాదులో తగ్గిందో ముందుగా తెలుసుకుని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని ఇవ్వాలి. ఇక యుక్తవయసుకు వచ్చిన వాళ్లలో ఈ హార్మోన్ అంత తేలికగా తగ్గదు. ఇక వృద్ధాప్యంలో వేర్వేరు సమస్యల కోసం రోజుకు 5 నుంచి 10 మాత్రలు వేసుకునేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. వీటి వల్ల కూడా అంగస్తంభన తగ్గవచ్చు.

వీళ్లు కూడా గుండె పనిచేసే విధానం బాగానే ఉంటే...సిల్డినాఫిల్, వర్డినాఫిల్, టెడలాఫిల్ మందులు వాడవచ్చు. కాకపోతే వాళ్లతో కార్డియాలజీ ఫిట్‌నెస్ పరీక్ష తప్పనిసరిగా అవసరం. గుండెనొప్పికి నైట్రేట్స్ మందులు వాడేవారు సిల్డినాఫిల్ మందును వాడకూడదు. ఇలా మందులు వాడకూడని వారిలో, పనిచేయని వారికి రెండో దశ చికిత్సగా ఇంజెక్షన్ ఇస్తారు. పెపావరిన్, ప్రోస్టాగ్లాండిన్ అనే ఇంజెక్షన్‌లను అంగంలోకి ఇచ్చినప్పుడు అంగస్తంభన జరుగుతుంది. ఇలా జరుగుతోందా లేదా అన్నది తెలుసుకోడానికి పైప్ టెస్ట్ చేస్తారు. అంటే రోగికి యూరాలజిస్ట్ ఈ ఇంజెక్షన్‌ను అంగానికి ఇచ్చి 15 నిమిషాల తర్వాత అంగస్తంభన ఏ మేరకు అయ్యింది, రక్తం ఎంత వేగంగా పంపవుతోంది అన్న విషయాలను డాప్లర్ అల్ట్రాసౌండ్ పెనిస్ అనే పరీక్ష ద్వారా కనుక్కుంటారు.

ఇంజెక్షన్స్ కూడా పనిచేయకపోతే కొన్ని రకాల సర్జరీలు చేయాల్సి ఉంటుంది. ఇవి రెండు రకాలు. మొదటిది అంగాన్ని ఎప్పుడూ స్టిఫ్‌గా ఉంచుతుంది. రెండోదాంట్లో అవసరమైనప్పుడే అంగస్తంభన వచ్చేలా చేస్తారు. అయితే అంగస్తంభన లోపం ఉన్న వారిలో మందులు, ఇంజెక్షన్లు, మరే ప్రక్రియలు పనిచేయనప్పుడు, చిట్టచివరి ఆప్షన్‌గా మాత్రమే ఈ సర్జరీలు చేస్తారని గుర్తుంచుకోవాలి.

పొడవుపై అపోహలివి...
చాలామంది పురుషాంగం సైజ్ గురించి బాధపడుతుంటారు. చలికాలంలో, అంగస్తంభన జరగని సమయంలో అది చాలా చిన్నగా ఉందంటూ బాధపడుతుంటారు. సాధారణంగా అబ్బాయి పుట్టినప్పటినుంచి 20 ఏళ్ల వయసు వచ్చేవరకు మాత్రమే పురుషాంగం పెరుగుతుంది. 18 ఏళ్ల వయసు వచ్చాక ఎత్తు పెరగడం ఆగినట్లుగానే పురుషాంగం పెరుగుదల కూడా ఒక స్థాయికి చేరుతుంది. చాలా అరుదుగా ఎవరిలోనైనా హార్మోన్లలోపం విపరీతంగా ఉంటే వాళ్లలో అంగం చిన్నదిగా ఉండవచ్చు. కానీ... ఇలాంటి పరిస్థితి చాలా చాలా అరుదు.

పురుషాంగం సాధారణ పరిమాణం
గడ్డాలు, మీసాలు సాధారణంగా ఉండి, సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు అంగస్తంభన కలుగుతుంటే అంగం సైజ్ గురించి ఆందోళన అక్కర్లేదు. సాధారణంగా అంగం 7 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అంగస్తంభన జరిగినప్పుడు ఇది 11 సెంటీమీటర్ల నుంచి 17 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కాబట్టి పురుషాంగం ఈ సైజ్‌లో ఉంటే ఇక నిడివి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే చాలామంది ఈ సైజ్ ఉన్నా తమది చాలా చిన్నగా ఉందని బాధపడుతున్నారు. ఈ సైజ్ ఉన్నట్లయితే అది నార్మల్ సైజ్ అని గుర్తించాలి.

ఎక్సర్‌సైజ్‌లతో స్తంభన సాధించవచ్చా?
ఎక్సర్‌సైజ్‌లతో అంగం నిడివిని పెంచడం అసాధ్యం. చాలామంది జెల్‌కింగ్ అనే ఎక్సర్‌సైజ్ ద్వారా అంగం పొడవును పెంచడం సాధ్యమేనని చెబుతుంటారు. జెల్‌కింగ్ ఎక్సర్‌సైజ్‌లో అంగాన్ని పైకీ, కిందకీ సాగదీస్తూ, వేడినీళ్లలో ఉంచడం వల్ల అంగం పొడవవుతుందని చెబుతుంటారు. పురుషాంగం నిర్మాణం గురించి తెలుసుకుంటే అక్కడ కండరం ఏదీ ఉండదనీ, సాధారణ ఎక్సర్‌సైజ్‌లో కండరం పెరిగినట్లు లేదా గట్టిపడేట్లుగా ఇక్కడ సాధ్యం కాదని తెలుస్తుంది.

నరాలు పైకి తేలి ఉంటే...
చాలామంది అంగం మీద కనిపించే నరాల (రక్తనాళాల) గురించి ఆందోళన పడుతుంటారు. అంగస్తంభన కలిగించే నరాలకు, వీటికి అస్సలు సంబంధం లేదు. నిజానికి అంగస్తంభన కలిగించే నరాలు బయటకు కనిపించవు. మనకు చర్మంపై నరాలు తేలి ఉండటం అన్నది బలహీనత కానట్లే... అంగం మీద నరాలు పెద్దగా కనిపించడం కూడా బలహీనత కాదు. అంగంపై కనిపించే నరాలు కేవలం పురుషాంగంపై ఉండే చర్మానికి రక్తప్రసరణకోసం ఉపయోగపడేవే. చేతులపై కనిపించే నరాలు వృద్ధాప్యాన్ని సూచించనట్లే... ఇలా కనిపించే నరాలు బలహీనతకు చిహ్నం కాదు.

కారణాలు
పుట్టుకతో హార్మోన్ లోపాలు ఉండటం.

పుట్టినప్పుడు రెండు వృషణాలు ఒకటి రెండు ఏళ్ల తర్వాత కూడా సంచిలోకి రాకపోతే అవి వృద్ధి చెందక టెస్టోస్టెరాన్ లోపం కలిగి అంగస్తంభనలోపాలు రావచ్చు.

సాధారణంగా యుక్తవయసులో వచ్చే అంగస్తంభనలోపాలు 99% మానసిక సమస్యలే. సరైన అవగాహన లేక - హస్తప్రయోగం వల్ల వచ్చే బలహీనత అని, భాగస్వామిని సంతృప్తిపరచలేకపోతామనే భయంతో, ఆత్మవిశ్వాసం లేక ఆత్మన్యూనతకు గురికావడం తప్పితే శారీరకంగా అంగంలో లోపం గాని, హార్మోన్లలోపం గాని చాలా చాలా అరుదు.

ఇక మధ్య వయసులో ఉన్నవాళ్లకు సెక్స్ రొటీన్‌గా మారి, వృత్తిపరంగా, ఆర్థికంగా రోజూ ఉండే మానసిక ఒత్తిళ్లు, పార్ట్‌నర్‌తో విభేదాలు... వీటివల్ల అంగస్తంభన తగ్గవచ్చు.

అతిగా సిగరెట్లు తాగడం, ఆల్కహాల్ మితిమీరి తీసుకోవడం, విపరీతంగా బరువు పెరగడంలాంటి కారణాలతోనూ, కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో రక్తప్రసరణ సరిగా జరగక అంగస్తంభన లోపాలు రావచ్చు.

చేయాల్సినదేమిటి...
మానసిక కారణాలతో అంగస్తంభన లోపాలు వస్తే సెక్సువల్ కౌన్సెలింగ్ చేయడం ప్రధాన చికిత్స.

మధ్యవయసు వారికి లిపిడ్ ప్రొఫైల్, హార్మోన్ టెస్ట్‌లు, ఈసీజీ, టీఎంటీ వంటి పరీక్షలు ముందుగా చేయాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌తో పాటు ఈ వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయాలి.


శారీరక, మానసిక ఒత్తిళ్లను చాలా తేలికగా తీసుకుని యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించాలి.


పార్ట్‌నర్ పట్ల ప్రేమగా ఉండాలి.


ఒకవేళ ఇవన్నీ పనిచేయకపోతే కొత్తగా పెళ్లయినవాళ్లు, మధ్యవయస్కుల్లో సిల్డినాఫిల్, వర్డినాఫిల్, టెడలాఫిల్ వంటి సెక్స్‌ను ప్రేరేపించే మందులు వాడవచ్చు. ఇవి చాలా సురక్షితం. ఇవి వాడటం వల్ల అడిక్షన్ వస్తుందని, వాడకపోతే మళ్లీ సెక్స్ పూర్తిగా తగ్గుతుందనే భయం అవసరం లేదు. కాకపోతే శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకుని స్వాభావికంగా సెక్స్ చేయడమే చాలా మంచిది.


ఇక వృద్ధాప్యంలో వచ్చే సెక్స్ సమస్యలకు ప్రధానంగా శారీరక సమస్యలే కారణం. అంటే... షుగర్, బీపీ, దమ్ము, ఆయాసం వంటివి ప్రధాన కారణాలు. మన సమాజంలో 60 ఏళ్లు పైబడిన వాళ్లలో మహిళల్లో సెక్స్ కోరికలు సహజంగా తక్కువగా ఉండటం కూడా పురుషులకు ఇబ్బంది కలిగించవచ్చు. బీపీ ఎక్కువగా ఉన్నవాళ్లలో దాన్ని నియంత్రణలో ఉంచేందుకు వాడే చాలా మందులు అంగస్తంభనలోపాన్ని కలిగిస్తాయి. ఉదా: అటెన్‌లాల్ (బీటా బ్లాకర్) వంటి మందులు అంగస్తంభనను దెబ్బతీస్తాయి. అప్పుడు డాక్టర్లను సంప్రదించి బీపీ మందులు మార్చాల్సి వస్తుంది.

No comments: