Tuesday, January 18, 2011

జీవన శైలి సమస్యలకు చికిత్స

ఆధునిక జీవన శైలి శరీర వ్యవస్థను నడిపించే వాత, పిత్త, కఫాల సమతుల్యతను దెబ్బ తీస్తోంది. ఫలితంగా పిన్న వయసులోనే అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు మొదలవుతున్నాయి. వీటికి తోడు నానాటికి పెరిగిపోతున్న మానసిక ఒత్తిళ్ల కారణంగా వాత దోషం పెరిగి నాడీ సంబంధమైన వ్యాధులు అధికమవుతున్నాయి. అందుకే నాడీ సంబంధిత వ్యాధుల మీద దృష్టి సారిస్తున్నారు ఆధునిక ఆయుర్వేద వైద్యులు.
ఈ కాలంలో చాలా ఎక్కువ మంది జబ్బుచేయగానే వైద్యుల్ని సంప్రదిస్తున్నారు. కానీ, చాలా వ్యాధులు ఎన్ని మందులు వాడినా తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తున్నాయి. కారణం వ్యాధి మూలాలను తొలగించే వైద్యచికిత్సలు అందకపోవడమే. ఈ నిజాన్ని గ్రహించిన వారంతా వ్యాధిమూలాలను తొలగించే ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. శరీరం వ్యాధిగ్రస్థం కావడానికి మౌలికంగా వాత,పిత్త, కఫాలనే మూడుగుణాలు అస్తవ్యస్తం కావడమే ప్రధాన కార ణం.

ఈ మూడింటినీ తిరిగి సమతుల్య స్థితికి తేవడం ఒక్కటే సిసలైన చికిత్స అవుతుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి మిగతా ఎన్ని వైద్య చికిత్సలు చేసినా వృథాయే. గత కాలంలో వైద్యులు ఈ వివరాలను మరీ అంత లోతుగా రోగికి చెప్పేవారు కాదు. కేవలం వైద్యుని మీద ఉండే నమ్మకం మీదే వారు చికిత్స తీసుకునే వారు. ఇప్పుడు అలా కాదు. వ్యాధి మూలాలను వాటిని తొలగించే ఆయుర్వేద చికిత్సా విధాలను పూర్తిగా వివరించనిదే ఎవరూ నమ్మడం లేదు. అందుకే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడాన్ని తమ విధిగా భావిస్తున్నారు.

నాడీ వ్యవస్థే పునాది

ఏ పనిచేయాలన్నా నాడీ వ్యవస్థలో ప్రాథమికంగా అందుకు అవసరమైన శక్తి (యాక్షన్ పొటెన్షియల్) ఉండాలి. ఆ శక్తికి శరీరంలోని ఏడు «ధాతువులూ సక్రమంగా పనిచేయాలి. ఏదైనా ధాతువులోకి శక్తి వచ్చి చేరడానికి ధాతువుకు బయట ఉన్న సోడియం లోనికి వచ్చేస్తుంది. ధాతువులోపల ఉన్న పొటాషియం బయటికి వెళ్లిపోతుంది. ఈ మార్పిడితో మనిషి తన చర్యల్ని సక్రమంగా నిర్వహించగలుగుతాడు. శరీరంలో నిరంతరంగా జరిగే ఈ ప్రక్రియనే వాతం అంటారు.

ఈ వాతంలో దోషం ఏర్పడినప్పుడు నాడీ వ్యవస్థ అంతా కుంటుపడుతుంది. నిద్రలేమి, మూర్ఛ, పక్షవాతం, పంచేంద్రియాలు సరిగా పనిచేయకపోవడం వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. పైకి కనిపించే ఈ లక్షణాలనైతే ఇతర వైద్యవిధానాలు గుర్తిస్తున్నాయి. కానీ, అందుకు కారణమైన మూలాల్లోకి వెళ్లడం లేదు.

రక్తనాళాల్లో కొవ్వు, లేదా కొలెస్ట్రాల్ అడ్డుపడిందీ అని తెలియగానే దాన్ని శస్త్ర చికిత్సతో తీసివేయాలంటున్నారే తప్ప ఆ సమస్య రావడానికి గల అసలు కారణాలను గమనించడం లేదు. ఆయుర్వేదం మాత్రం ఆ అంశం మీదే ఎక్కువగా దృష్టిపెడుతుంది. ప్రత్యేకించి మానసిక ఒత్తిళ్ల కారణంగా నాడీ సంబంధ వ్యాధులు పెరిగిపోతున్నాయి. నాడీ వ్యవస్థ చక్కబడనిదే శరీరంలోని ఏ వ్యా«ధీ పూర్తిగా పోదు. అందుకే ఆధునిక ఆయుర్వేద వైద్యులు వాత గుణదోషాన్ని తొలగించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

జీర్ణాశయం చిక్కులు

జీర్ణక్రియకు తోడ్పడే అంశ మే పిత్తం. పిత్తం అగ్నిలాంటిది. ఈ అగ్ని రక్తంలో ఉంటుంది. సహజంగా శరీరంలోని ప్రతి ధాతువుకూ, ప్రతికణానికీ రక్తం, రక్తం ద్వారా వచ్చే ఆక్సిజన్ కావాలి. అయితే, రక్తంలో పిత్తం ఉంటూ ఆప్రక్రియ సజావుగా జరిగేలా చేస్తుంది. శరీరంలోని ప్రతి ధాతువునూ, ప్రతి కణాన్నీ ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పిత్తమే తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియకే కాకుండా జీర్ణమైనవి శ్రోతస్సుల్లోకి వెళ్లడానికి, ప్రతిధాతువుకూ శక్తి అందడానికీ, వ్యర్థ పదార్థాల విసర్జనకూ తోడ్పడుతుంది.

నిజానికి శరీరాన్ని ఒక పరిపూర్ణ స్థితిలో ఉంచడంలో పిత్తం ఒక కీలక భూమికను నిర్వహిస్తుంది. కాకపోతే, ఆధునికుల్లో శరీర శ్రమ లేకపోవడం వల్ల ఈ అగ్ని అవసరమైన స్థాయిలో ఉండడం లేదు. ఆ అగ్నిని పెంచే మందులు ఇస్తూనే రోగి జీవన శైలి మార్పు కోసం నొక్కి చెప్పడం ఆయుర్వేదంలో ఒక ప్రధాన అంశం.

కఫం మాటేమిటి ?

శరీరంలో రరరకాల ద్రవాలు ఉంటాయి. అలాగే శరీరంలోని ప్రతికణంలోనూ ద్రవం ఉంటుంది. శరీరానికి కావలసిన ఈ ద్రవాలన్నింటిని సమతుల్యంగా ఉంచడం కఫమే చేస్తుంది. ద్రవాలు కొరవడితే శరీరం పొడిబారిపోతుంది. జీవక్రియలన్నీ మందగిస్తాయి. అందుకే క ఫాన్ని సమతుల్యంగా ఉంచడాన్ని ఆయుర్వేదం ఒక ముఖ్య అంశంగా పరిగణిస్తుంది. వ్యాధి నుంచి విముక్తున్ని చేయడం ఒక్కటే కాదు. ఆరోగ్యవంతుడు జీవితాంతం ఆరోగ్యంగా ఎలా ఉండాలో కూడా ఆయుర్వేదం చెబుతుంది.


డాక్టర్ ఎన్ సత్యప్రసాద్
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల
ఎర్రగడ్డ, హైదరాబాద్
మొబైల్: 9848683848

No comments: