Wednesday, January 26, 2011

వాతాన్ని తగ్గించే విషగర్భతైలం

ఆయుర్వేద వైద్య విధానంలో విషద్రవాలను కడుపులోకి అలాగే చర్మ మర్ధనానికి కూడా ఉపయోగిస్తారు. అంటే కొన్ని రకాల మూలికలు, మరికొన్ని రకాల ఖనిజ రసాయనాలను తీసుకుంటారు. ఎక్కువ సంఖ్యలోనూ, ఎక్కువ మోతాదులోనూ అలాగే ఎక్కువ విషలక్షణాలు ఉన్న మూలికలను తీసుకుని తయారు చేసే తైలాన్ని " మహా విషగర్భ తైలం'' అంటారు.

తక్కువ సంఖ్యలోనూ, తక్కువ మోతాదులోనూ అలాగే తక్కువ విషలక్షణాలు ఉన్న మూలికలను వినియోగించి తయారు చేసే తైలాన్ని " లఘు విషగర్భ తైలం'' అంటారు. తైలం తయారీకి మూలికలు, ఖనిజ రసాయనాలు కలిపిన ఒక ముద్దను తయారు చే సుకుని అందుకు నాలుగు రెట్లు నువ్వుల నూనె తీసుకుంటారు. ఆ తరువాత నూనెకు నాలుగు రెట్లు 16 భాగాల ద్రవాంశం కోసం ముందు కషాయాన్ని తయారు చేసుకుంటారు.


మహా విషగర్భ తైలం

ఈ తైలం తయారు చేసుకోవడానికి ఉమ్మెత్త విత్తులు, వావిలి విత్తులు, చేదు సొరకాయ విత్తులు, గలిజేరు వేర్లు, ఆముదం విత్తులు, అశ్వగంధ, చిత్రమూలం, మునగ పట్ట, కాకమాచీ, లాంగలీ దుంప, వేపపట్ట, వెర్రిపుచ్చ వేర్లు, దశమూలాలు, శతావరీ, సారిబా, ముండీ, విదారీకంద, స్నుహీ, అర్క, కర్కాటక శృంగి, గన్నేరు వేర్లు, కాకజంఘ వేర్లు, ఉత్తరేణు వేర్లు, బలా, అతిబలా, నాగబలా, మహాబలా, అడ్డసరం, తిప్పతీగె, ప్రసారిణీ మొదలైన మూలికలకు నీరు చేర్చి కషాయం సిద్ధం చేసుకుంటారు.

అలాగే విషముష్టి (శుద్ధి చేయనివి), శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, రాస్నా, కోష్టు, హరితాలకం, తుంగముస్తలు, దేవదారు, వత్సనాభి, యవక్షారం,సర్జక్షారం, పంచలవణాలు, మైల తుత్తం, కాయఫలం, పాఠా, భారంగీ, నవసారం, వెర్రిపుచ్చ, జవాసా, జీరక మూలికలను చూర్ణం చేసుకుని, తడిపి ముద్ద చేస్తారు. తైలపాక వి«ధి ప్రకారం నువ్వుల నూనెను కూడా తీసుకుంటారు.

పైన తెలిపిన అన్ని ద్రవాలను తగిన పాత్రలో కలిపి పొయ్యి పైన ఉంచుతారు. మూలికల ముద్ధ మాడిపోకుండా, కషాయ ద్రవం ఇగిరిపోయి తైలాంశం మాత్రమే మిగిలేంతవరకు ఉడికించి తైలాన్ని జాగ్రత్తగా తయారు చేస్తారు.
ఉపయోగాలు
-ఈ తైలాన్ని చర్మం పైన మర్ధనకే ఉపయోగిస్తారు. ప్రధానంగా బాగా నొప్పి కలిగించే వాత వ్యాధుల్లో అంటే ఆమవాతం, సంధివాతం, కటివాతం, అర్థాంగ వాతం, గృధ్రసీ వాతం, దండాపతానకం వంటి సమస్యలకు ఈ తైలాన్ని వాడతారు.
- దీర్ఘకాలికంగా పక్షవాతం ఉన్నవారిలో కాళ్లూ చేతులు బిగుసుకుపోయి ఉంటాయి. వీరికి ఫిజియోథెరపీ కష్టంగా ఉంటుంది. ఈ స్థితిలో ఈ తైలంతో రోజూ మర్ధన చేస్తే ఆ సమస్య తొలగిపోతుంది.
-వాత వ్యాధుల కారణంగా శరీరం బిగుసుకుపోయే గుణం చలికాలం మరింత ఎక్కువవుతుంది. ఈ స్థితిని ఈ తైలం నివారిస్తుంది. అయితే ఎండాకాలం ఈ తైలాన్ని వాడకపోవడం మంచిది. అలాగే ఒంటిపైన మంటగా, పొగలుగా ఉన్న వారు కూడా ఈ తైలాన్ని వాడకూడదు.
- నొప్పిని తగ్గించే గుణం ఉండడం వల్ల ఈ తైలాన్ని చెవినొప్పికి చుక్కల మందుగా కూడా వాడవచ్చు. అలాగే వినికిడి లోపం, చెవిలో శబ్ధాలు రావడం వంటివి కూడా ఈ తైలంతో తగ్గుతాయి. అయితే ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
లఘు విషగర్భ తైలం

లఘు అనే పదం లేకుండా చాలా మంది కేవలం విషగర్భ తైలం అని కూడా పిలుస్తారు. ఈ తైలం తయారీకి అవసరమైన ద్రవం కోసం ఈసబ్గోల్ కషాయం, గన్నేరు వేర్లు క షాయం, ఉమ్మెత్త స్వరసం, నిర్గుండీ స్వరసం, జటామాంసీ కషాయం, ఇవన్నీ కలిపి తీసుకుంటారు.

మూలికల ముద్దకోసం ఉమ్మెత్త విత్తులు, కోష్టు, ప్రియంగు పూలు, వత్సనాభి, పిచ్చి కుసుమ వేళ్లు, రాస్నా, గన్నేరు వేర్లు, మాల్కంగినీ విత్తులు, మిరియాలు, దంతీ, జటామాంసీ, చిత్రమూలం, పచ్చ ఆవాలు, దేవదారు, పసుపు, కస్తూరి పసుపు, ఆముదం వేర్లు, లక్షా, త్రిఫలా, మంజిష్ఠా చూర్ణాలను సమానంగతా తీసుకుంటారు. వీటన్నిటినీ తైలపాక నిష్పత్తిలో నువ్వుల నూనె చేర్చి తైలం మిగిలేలా ఉడికిస్తారు.

దీని వల్ల కలిగే ప్రయోజనాలన్నీ మహా విషగర్భ తైలం లాగే ఉంటాయి. కాకపోతే తీక్షణత తక్కువగా ఉంటుంది. అందువల్ల సున్నితులకు ఇది ఉత్తమం. పైగా వేడి వాతావరణంలోనూ ఈ తైలాన్ని వాడవచ్చు.

విషముష్టి తైలం:

ఈ తైలం తయారీకి ప్రత్యేకించి విషముష్టి గింజలు మాత్రమే తీసుకుంటారు. దీనికి జొన్న కలి (కాంజికం) చేర్చి కషాయం తయారు చేస్తారు. ముద్ద కోసం విషముష్టి గింజల పొడినే వాడతారు. నువ్వుల నూనెతో పాటు ఆముదం కూడా జతచేస్తారు. అన్నిటినీ తైలపాక నిష్పత్తిలో కలిపి తైలం మిగిలేలా ఉడికిస్తారు. దీని ఉపయోగాలు విషగర్భ తైలంలాగే ఉంటాయి.


డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల,
హైదరాబాద్,
ఫోన్: 9848750720.

No comments: